Monday, November 1, 2010

సామెతలు-12

1. ఎదురింటి పొయ్యిమండితే, తన పొయ్యిలో నీళ్ళుపోసుకొన్నట్లు.
2. ఎదుటివారి సొమ్ము ఎల్లవారికీ తీపు.
3. ఎదురుగుండా అద్దముంటే ఎక్కిరించుకో బుద్దవుతుంది.
4. ఎదురు తిరిగిన కుక్కను ఏదీ కరువలేదు.
5. ఎదురు తిరిగిన కుక్కా ఏదుపంది ఒకటే.
6. ఎదురుపడినవాడే నా మొగుడన్నట్లు.
7. ఎదురుపెట్టి కుదురు కొట్టించుకొన్నట్లు.
8. ఎదురుపెట్టి చదరంగ మాడినట్లు.
9. ఎద్దు అంత కుప్పయితే ఏడు పుట్ల చోళ్ళు (సజ్జలు, రాగులు).
10. ఎద్దు అడుగులో ఏడు గింజలుపడితే పైరు పలుచన.
11. ఎద్దు (దున్న) ఈనిందంటే గాటా కట్టేయమన్నట్లు.
12. ఎద్దు ఉన్నవాడికి బుద్ది ఉండదు, బుద్ది ఉన్నవాడికి ఎద్దు ఉండదు.
13. ఎద్దు ఎండకులాగా, దున్నపోదు నీడకు లాగా.
14. ఎద్దునెక్కున తీరుకాదు, సద్ది తిన్న నోరు కాదు.
15. ఎద్దునెక్కున వాడే లింగడు, గద్దెనెక్కిన వాడే రంగడు.
16. ఎద్దు ఏమెరుగురా అటుకుల రుచి, గాడిదేమెరుగురా గంధపు పొడి వాసన.
17. ఎద్దుకాలిలో ముల్లంత లేకపోయినా, ఏడూళ్ళ పెత్తనానికి తక్కువ లేదు.
18. ఎద్దుకు ఎనుబోతుకు లంకె వేసినట్లు.
19. ఎద్దుకు కొబ్బరికాయ ఇస్తే ఏమి చేస్తుంది?
20. ఎద్దుకు చొప్పవేసి ఆవుని పాలివ్వ మన్నట్లు.
21. ఎద్దుకు తూలాలని ఉంది, గంతకు పడాలనీ ఉంది.
22. ఎద్దుకెగవేయ, బఱ్ఱెకు సగవేయ.
23. ఎద్దుకేమి తెలుసు అటుకుల చవి (రుచి).
24. ఎద్దుకొద్ది సేద్యం, సద్ది కొద్దీ పయనం.
25. ఎద్దు కొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు.
26. ఎద్దుగా ఏడది బ్రతికేకంటే ఆబోతుగా (ఇరు) ఆరునెలలే చాలు.
27. ఎద్దు చచ్చినా వాత బాగా పడింది.
28. ఎద్దు చేనుమేసిపోతే గాడిదకు చెవులుకోసినట్లు.
29. ఎద్దు తన్నుతుందని గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.
30. ఎద్దు తన్నుతుందని గుఱ్ఱంచాటు చేరినట్లు.
31. ఎద్దుతో వ్యవసాయం, ఆలితో సంసారం.
32. ఎద్దుని అడిగా గంత కట్టేది?
33. ఎద్దును కొద్దిలో కొనరాదు, బట్టను భారీలో కొనరాదు.
34. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడ్పుచూస్తే ఏడ్పు వస్తుంది.
35. ఎద్దును ముద్దుపెట్టబోతే, ఎడమకాలితో తన్నింది.
36. ఎద్దునోటికి చొప్ప అందించినట్లు.
37. ఎద్దున్న వాడి వ్యవసాయం చూడు, మంది ఉన్నవాడి మారుబలం చూడు.
38. ఎద్దు పుండు కాకికి ముద్దా?
39. ఎద్దుపుండు కాకికి రుచి.
40. ఎద్దు పొడుస్తుందని తన్నే గుర్రం చాటున చేరినట్లు.
41. ఎద్దు బీదదయితే చేను బీద.
42. ఎద్దు మంచిదైతే వేరూరికి పోతుందా?
43. ఎద్దు మోసినంత, గోనె పట్తినంత.
44. ఎద్దురొమ్ములో ముల్లుకఱ్ఱ పొడిచినట్లు.
45. ఎద్దులవెంటనే తాళ్ళు.
46. ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.
47. ఎద్దులు కాసినందుకు, ముద్దలు మింగినందుకు సరిపోయిందిపో అన్నాడట.
48. ఎద్దులు చేయును, గుఱ్ఱాలు మొయ్యను (మేయును).
49. ఎద్దులెప్పటివేగానీ గోనెలుమాత్రం కొత్తవి.
50. ఎద్దువలే ఉన్నావే తేలుమంత్రం తెలియదా?
51. ఎద్దువలే కుక్కనుపెంచి రెడ్డి తానే (ఆలుమొగలు తామే) మొరిగినాడ(ర)ట.
52. ఎద్దువలే తిని మొద్దువలే నిద్రపోయినట్లు.
53. ఎద్దయినా ఏడాదికి నేర్చును, మొద్దు ముప్పై ఏళ్ళయినా నేర్వడు.
54. ఎనుబోతు పేదల యశముగోరు.
55. ఎనుబోతు బలిసి ఏనుగవలెనున్న భ్రమరములకు మదప్రాప్తి లేదు.
56. ఎనుబోతుమీద వానకురిసినట్లు.
57. ఎనుము గొప్పదయినా ఏనుగును బోలునా?
58. ఎనుము ముసలి, ఏనాది ముసలి లేవు.
59. ఎనుముకు మేతవేసి ఆవుని పితికినట్లు.
60. ఎన్నడూ గానని మొగానికి ఇప్పపూత బెల్లమంట.
61. ఎన్నడులేని కల్మి కల్గెనా వెన్నున కద్దమడుగు, కొనవేళ్ళకు ముచ్చెలు తొడుగు.
62. ఎన్నడూ ఎక్కని రెడ్డి గుఱ్ఱమెక్కితే వెనుక ముందయిందట.
63. ఎన్నడూ ఎఱుగని వానిని ఎద్దుల బేరానికి పంపితే ఎఱ్ఱెద్దుకు ఎనభై, నల్లెద్దుకు నలభై అన్నడట.
64. ఎన్నడు దొరకనమ్మకు ఏగాణి దొరికితే, ఏడు ముళ్ళు వేసిందట.
65. ఎన్నడూ నా మొగుడు 'ఎల్లి, ఎల్లి,' అనలేదుగానీ ఇల్లు కాలిననాడు ఎల్లి ఎల్లి అన్నాడు.
66. ఎన్ని పూటులేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.
67. ఎన్నిబూతులైనా పిడికెడు కొఱ్ఱలతో సరికావు.
68. ఎన్ని ముట్టుపాతలైతే ఒక కట్టుకోక అవుతుంది?
69. ఎన్ని విద్యలైనా కులవిద్యకు సాటిరావు.
70. ఎన్ని సూదులైతే ఒక గడ్డపారగానూ?
71. ఎన్నో వ్రణాలు కొసానుగానీ నా వ్రణమంత తీపులేదు అన్నాడుట.
72. ఎప్పుడూ ఎరగనోడు ఏతాము తొక్కితే ఏటా ఆరుబారల అప్పు.
73. ఎప్పుడూ పెట్టే నాలుగూపెట్టి (చీవాట్లు)కొఱ్ఱలచేట బయటపెట్టు అన్నాడుట.
74. ఎప్పుడూ యోచిస్తుండేవాడు అభాగ్యుడు, ఎన్నడూ యోచించనివాడు అవివేకి.
75. ఎప్పటి అమ్మకు నిప్పటే గతి. (నిప్పటి=అరిసె).
76. ఎముక కొరికే కుక్క ఇనుము కొరుకునా?
77. ఎముకలేని నాలుక ఎత్లాతిప్పినా తిరుగుతుంది.
78. ఎరవుల కంచమని ఎదో పెట్టుకు తిన్నట్లు.
79. ఎరువుల సొమ్ములు బరువుచేటు, తియ్యను పెట్టను తీపులచేటు, దానిలో ఒకటిపోతే అప్పుల చేటు.
80. ఎరువు ఉంటే, వెఱ్ఱివాడూ సేద్యగాడే.
81. ఎరువును నమ్మి బొంతను పొయ్యిలో పెట్టుకున్నట్లు.
82. ఎరువుపెట్టిన పొలము, ఏలుబడి అయిన కోడలు.
83. ఎరువులేని పైరు, పరువులేని రైతు.
84. ఎరువులేని పొలము, వేగంలేని ఏరు.
85. ఎరువులేని సేద్యం కరువుదేవతకు వాద్యం.
86. ఎరువు వేయగానే (ఊసర) క్షేత్రం ఫలించునా?
87. ఎరువు స్థిరం కాదు బరువు తేలిక కాదు.
88. ఎరువూ వెంపలిస్తే ఎదిగిందే పైరు.
89. ఎఱిగి ఎఱిగి చేసిన పాపం, ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవలె.
90. ఎఱుక తేలిన (ఏలిన) ఏడుఘడియలకు వాన.
91. ఎఱ్ఱకోమటిని, నల్ల బ్రాహ్మణుడిని నమ్మరాదు.
92. ఎఱ్ఱమాదిగను, నల్ల బాపని నమ్మరాదు.
93. ఎఱ్ఱని ఆకాశానికి బఱ్ఱున వానలు.
94. ఎఱ్ఱనేలవంట ఒకనాటి వంట.
95. ఎలమఱ్ఱుకు ఎద్దునివ్వరాదు, పామఱ్ఱుకు పడుచునివ్వరాదు.
96. ఎలుక ఎప్పుడూ తన దిక్కుకే తవ్వుకుంటుంది.
97. ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి కనికరిస్తుందా?
98. ఎలుక ఏట్లోపోతేనేమి? పులి బోనున పడితేనేమి.
99. ఎలుకకు పిల్లి సాక్షి (సాక్ష్యం).
100. ఎలుక చావుకు పిల్లి మూర్చ పోతుందా?

No comments: