1. ఏడుపులో ఏడుపు ఎడమచేయి చూపెట్టు అన్నట్లు.
2. ఏడుమనువులు పెళ్ళైనా ఏకులరాట్నం తప్పలేదు.
3. ఏడుమాటలు మాట్లాడినా, ఏడు అడుగులు నడిచినా గుణం తెలుస్తుంది.
4. ఏడు మారినా, ఈడు ముదిరినా ఏమీమారదు ఈ లోకంలో.
5. ఏడుమాసికాల చీర, ఎదురు బాసింగాల రవిక, జరుగుతూ జరుగుతూ నేను సారె కట్టుక వచ్చినాను.
6. ఏడుమెతుకులు తింటే ఏనుగంత సత్తువ.
7. ఏడుసార్లు పాసిన చేల్లో పండిన కంకితో ఏడుగుర్ని చంపవచ్చు.
8. ఏడుస్తావు ఏమి ఎలుకా? అంటే నా బాధ నీకే మెఱుక అన్నదిట.
9. ఏడుస్తున్న వాణ్ణి దాని(న)మ్మకాయలు కావాలా అంటే, దానికాయలే కావాలి అన్నాడుట.
10. ఏడుస్తూన్నావెందుకు బ్రాహ్మడా? అంటే ఒకనాడు నామొగం నవ్వి చచ్చిందా అన్నాడట.
11. ఏడుస్తూ ఏరువాక సాగిస్తే, కాడిమోకు దొంగలు దోచుకుపోయారుట.
12. ఏడూళ్ళు తిరిగినా, ఎఱ్ఱకఱ్ఱిదాన్ని కొనమన్నారు.
13. ఏడ్చి ఎంకటసామీ అనిపించుకొన్నట్లు.
14. ఏడ్చి మొహం కడుకున్నట్లు.
15. ఏడ్చేదాని ఎడమచేతి కిందా కుట్టెవాని కుడిచేతికిందా కూర్చోరాదు.
16. ఏడ్చేదాని బిడ్డకు అరటిపండ్లు చూపినట్లు.
17. ఏడ్చేదాని బిడ్డను ఆమే కనవలెను అన్నట్లు.
18. ఏడ్చేదాని మొగుడు వస్తే, ఏకు వడికే దాని మొగుడూ వస్తాడు.
19. ఏడ్చేదాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు.
20. ఏతానులో పీలిక ఆ తానుకు చెందినట్లు.
21. ఏతాము ఎంతవంగినా తిరిగి లేచేదానికే కదా.
22. ఏతాము పాటకు ఎదురులేదు.
23. ఏదారి అంటే గోదారి అన్నట్లు.
24. ఏది పట్టినా దెయ్యం పట్టినట్లు.
25. ఏదీకాని వేళ గేదె ఈనినట్లు.
26. ఏ దేముడు వరమిచ్చినా పెనిమిటిలేనిదే పిల్లలు పుట్టరు.
27. ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి ఉండేది మేలు.
28. ఏనుగ ఎక్కినవాడు, దొడ్డికంత దూరగలడా?
29. ఏనుగు ఎత్తిపడితే (చతికిలపడితే) ఏనుగే లేవాలికానీ ఎవరు లేవతీయగలరు?
30. ఏనుగు ఎత్తుబడినా గుఱ్ఱమంత ఎత్తు.
31. ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు, చీమ ఒళ్ళు చీమకు బరువు.
32. ఏనుగకు ఎలక్కాయలు లొటలొట.
33. ఏనుగకు ఒక సీమ, గుఱ్ఱానికొక ఊరు, బఱ్ఱెకొక బానిస.
34. ఏనుగకు కాలువిరగటం, దోమకు రెక్కవిరగటం సమము.
35. ఏనుగకు సీళ్ళు చూపినట్లు (సిడి=అంకుశం).
36. ఏనుగ తన నెత్తిన తానే మన్ను పోసుకున్నట్లు.
37. ఏనుగ తొండము, యావ బట్టిన ముండ ఊరుకోవు.
38. ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
39. ఏనుగుది ఎందరు కుడిస్తే తరుగుతుంది?
40. ఏనుగునైనా ఎంటితో కట్తవచ్చు (ఎంటి=గడ్డిపరకలతో నేసిన త్రాడు).
41. ఏనుగును ఇచ్చి అంకుశం దాచినట్లు.
42. ఏనుగును ఎక్కినవాడు, కుక్క కూతకు జడియడు.
43. ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు.
44. ఏనుగును తెచ్చి ఏకులబుట్టలోపెట్టి అది తన నెత్తిన పెట్టి, తనను ఎత్తుకోమన్నట్లు.
45. ఏనుగునేక్కి రంకుకు పోయినట్లు.
46. ఏనుగు పురుడోసుకొన్నట్లు.
47. ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటవి.
48. ఏనుగు పోయేదారి ఎరుగడుగానీ, దోమలు పోయేదారిలో తొంగున్నాడు.
49. ఏనుగు బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి.
50. ఏనుగు మదిస్తే నెత్తిన మన్ను పోసుకుంటుంది.
51. ఏనుగు మింగిన వెలగపండువలె (కరిమింగిన వెలగపండు).
52. ఏనుగు మీద ఎండ కాసినట్లు.
53. ఏనుగుమీద దోమ (ఈగ) వాలినట్లు.
54. ఏనుగుమీద పొయేవాణ్ణి సున్నమడిగినట్లు.
55. ఏనుగు మోత, ఏనుగు మేత.
56. ఏనుగు రొంపిలో కూరుకుపోతే కాకికి కూడా లోకువే.
57. ఏనుగులను అప్పుగా ఇస్తున్నారంటే, రెండు తోలుకొని వచ్చి కట్టివేయమన్నాడట.
58. ఏనుగులెగిరిపోతుంటే దోమలొక లెక్కా?
59. ఏనుగులు ఏట కొట్టుకొనిపోతుంటే, పిల్లి పాటి రేవడిగిందట.
60. ఏనుగులు ఏట గ్రుంకితే నక్క పాటిరేవడగ వచ్చిందట.
61. ఏనుగులు మింగిన ఎల్లమ్మకు పీనుగలు పిప్పళ్ళు.
62. ఏపట్లా చావకపోతే బాపట్లకు పంపండి.
63. ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.
64. ఏపుట్టలో ఏ పామో? ఏ గుళ్ళో ఏ మహత్యమో.
65. ఏ పూజ తప్పినా పొట్ట[పూజ తప్పదు.
66. ఏబ్రాసికి పని ఎక్కువ, లోభికి ఖర్చెక్కువ.
67. ఏబ్రాసి పెళ్ళికెడుతూ ఉంటే ఏకులరాట్నం ఎదురయిందట.
68. ఏమండీ కరణం గారు గోతిలో పడ్డారే? అంటే, కాదు మషాకత్తు చేస్తున్నా అన్నాడట.
69. ఏమందలో కట్టినా మన మందలో ఈనితే సరి.
70. ఏమయ్యా మా వారు బాగున్నారా? అంటే, అమ్మా బాగానే ఉన్నారు; విత్తనాలు వడ్లు తింటున్నారు, దాపుడు బట్టలు కడుతున్నారు ఆన్నడట.
71. ఏమి అప్పాజీ అంటే కాలం కొద్ది రాయాజీ అన్నట్లు.
72. ఏమిచేసి బ్రతుకుతున్నావమ్మా? అంటే నోరుచేసుకు బ్రతుకుతున్నా బిడ్డా అన్నదిట.
73. ఏంచేస్తున్నావురా? అంటే ఒలకపోసి ఎత్తుకుంటున్నా అన్నట్లు.
74. ఏమిట్రా మేనమామ ముడ్డిలో కట్టె పెడతావు? అంటే, చిన్నాయన అనుకున్నాను అన్నడట.
75. ఏమిపెట్టుక తిన్నావు? అంటే, ఆకలెట్టుక తిన్నానందిట.
76. ఏమిరా వెఱ్ఱిమొగమా? అంటే, ఏమి చిన్నాయనా అన్నాడట.
77. ఏమి పోలిసెట్టి? అంటే, ఎప్పటి మొత్తుకోళ్ళే అన్నడట.
78. ఏమిరా కోటా? అంటే, ఎప్పటిదే ఆట అన్నడట.
79. ఏమీ ఎరుగనోడు ఏకాశిన చస్తే అన్నీ తెలిసినోడు అమావాశ్యనాడు చచ్చాడట.
80. ఏమీ ఎరుగని ఎల్లి పాయె, దొంతులేస్తే దొల్లిపోయె.
81. ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట.
82. ఏమీ తోచకపోతే ఎక్కిరించాడట.
83. ఏమీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట.
84. ఏమీ లేదంటగానీ ఎల్లుండి పెండ్లంట.
85. ఏమీ దొరకనమ్మకు ఏగాణి దొరికితే ఎందులో పెట్టనే ఎంకాయమ్మా అన్నదిట.
86. ఏమీలేనమ్మకు ఏడ్పులు శృంగారం.
87. ఏమీ లేనమ్మకు ఏతులు లావు, ఉన్నమ్మకు ఆశలు లావు (ఏతులు=ఎచ్చులు, డంబాలు).
88. ఏమీ లేనిదానికి ఏతులు లావు, స్వాములవారికి జడలు లావు.
89. ఏమే వాడి దగ్గర పడుకున్నావు? అంటే, అంత పెద్దమనిషి చెయ్యిపట్టుకుంటే కాదనే దెట్లా? అన్నదిట.
90. ఏమోయి నీకూతురలా తిరుగుతున్నది? అంటే, అలవాటుపడిన ముండను అట్లానే పోనీస్తూ అన్నాడట.
91. ఏమోయి సెట్టి ఏట్లో కొట్టుకుపోతున్నావు? అంటే గడ్డిమోపు అమ్మటానికి అన్నాడట.
92. ఏమోయి నారాయణా, విధవగమనా అంటే, అది చిన్ననాటి మాట ఊరుకో అన్నాడట. (వి=పక్షి, ధవుడు=భర్త, విధవగమన=పక్షిపై పయనించేవాడు, నారాయణుడు).
93. ఏ యీకలపక్షి ఆ గుంపులో చేరుతుంది.
94. ఏ ఎండ కా గొడుగు పట్టినట్లు.
95. ఏ రాజ్యానికి ఏ రాజో అన్నట్లు.
96. ఏ రాయి ఐతేనేమి పండ్లు ఊడగొట్టుకోవటానికి.
97. ఏరుక తినే వాడి వెంబడి గీరుక తినేవాడు పడ్డాడుట.
98. ఏరుకుని తినే పక్షికి ముక్కున ముల్లు విరిగినట్లు.
99. ఏరూరి వ్యవసాయం ఊండూరి వైద్యం.
100. ఏరువస్తే వాన వెలుస్తుంది.
No comments:
Post a Comment