Monday, November 15, 2010

సామెతలు-17

1. కక్కూర్తి మొగుడు కడుపునొప్పి బాధ ఎరుగడు.
2. కక్కూర్తి పడ్డా కడుపు నిండాల.
3. కక్కూర్తి పడ్డా సుఖం దక్కాలి.
4. కచ్చితానికి కాసులు, ఉచితానికి ఊళ్ళు.
5. కటకట ఉన్న ఇంట కలిమి ఉండదు.
6. కటకటా అనే ఇంట కట్ట బట్టా, తిన తిండి ఉండవు.
7. కటికవానికి కత్తి అందించినట్లు.
8. కట్టకింద కఱ్ఱలాడితే, మాలదాని పిఱ్ఱ లాడుతాయి.
9. కట్టనిలువని చెరువు గడియలోపలనిండు, బ్రతుకలేని బిడ్డ బారెడుండు.
10. కట్టిన ఇంటికి వంకరలు (వణుకులు) చెప్పేవారు వెయ్యిమంది.
11. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.
12. కట్టిన ఇంటికి కణుకులు మెండు.
13. కట్టినవానికొక ఇల్లైతే, అద్దెకున్నవాని కన్నీ ఇండ్లే.
14. కట్టిన వారు ఒకరైతే, కాపురం చేసేది ఇంకొకరు.
15. కట్టివేసిన బఱ్ఱెకు కావలి కాచినట్లు.
16. కట్టుకున్న ఆపే, పెట్టుకున్న ఆమే ఉండగా, ఎదురుపడ్డ ఆపె ఎండిపోయిందట.
17. కట్టుకున్న పెండ్లామే చేయవలె, కన్న తల్లే చెయవలె.
18. కట్టుకున్న మొగుడు, పెట్టెనున్న నగలు.
19. కట్టుకున్న వాడికంటే, పెట్టుకున్న వాడిమీదనే ప్రేమ.
20. కట్టుచీర లేనినాడు పట్టుచీర బయటకు వస్తుంది.
21. కట్టులేని ఊరు, గట్టులేని చెరువు.
22. కట్టె గొడ్డలిలో దూరి, కులానికి చేటు దెచ్చు.
23. కట్టె దేవుని దగ్గర, కన్ను లంజ పైన.
24. కట్టెలు ఆటని ఇంట్లో కనకము కూడా ఆటదు (ఆట= ఆగు, నిలుచు).
25. కట్టెలు తేరా తిమ్మా అంటే, కడుపునొస్తదే అమ్మా అన్నట్లు.
26. కట్టెలోన నగ్ని పుట్టిన విధమున.
27. కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.
28. కట్టేయస్వాహా, కంపాయస్వాహా, నీకూ నాకూ చెరి సగాయస్వాహా.
29. కట్టెలేదు, కంపలేదు, కాచీపోయా నీళ్ళూ లేవు, పదవోయి అల్లుడా బావి గట్టుకు.
30. కట్టేవాడు అవివేకి, ఇంట్లో బాడిగకు ఉండేవాడు వివేకి.
31. కట్టేవి కాషాయాలు దూరేవు దొమ్మరి గుడిశలు.
32. కఠినచిత్తు మనసు కరిగింపగారాదు.
33. కఠినమైనా కన్నతల్లి, వట్టిదైనా వరికూడు.
34. కడగా ఉన్న గొడ్డలిని కాలిమీద వేసుకున్నట్లు.
35. కడాగా పోయే శనేశ్వరుడా మా ఇంటిదాకా వచ్చి మరీ పొమ్మన్నట్టు.
36. కడచి బ్రతికిన దెవ్వరు?
37. కడచి బ్రతికినామని గంతులు వేయరాదు.
38. కడచినదానికి వగచిన లాభమేమి?
39. కడజాతికానీ, కాసులు కలవాడే రాజు.
40. కడపటి మడివాని కటారిపోటు కంటే, ఎదుటి మడివాని ఏకుపోటు మేలు.
41. కడలిలో ఉప్పుకు, అడవిలో ఉసిరికకు లోకువా?
42. కడవంత గుమ్మడికాయైనా, కత్తిపీటకు లోకువే.
43. కడవ వెళ్ళి కడముంతలో దూరినట్లు.
44. కడివెడు పాలకు ఒక్క మజ్జిగ బొట్టు.
45. కడ వేరు మిగిలినా గరిక చిగర్చక మానదు.
46. కడి అంటే నోరు తెరచి, కళ్ళెమంటే మూసినట్లు.
47. కడి గండం కాచును, వత్తి మిత్తి కాచును.
48. కడిగిన మొగముంటే ఎందుకైనా మంచిది.
49. కడియాలవారు వచ్చారు అంటే కడియాలు కావాలా అన్నడుట.
50. కడుగు తాగినవాని కడుపేమి నిండురా? (కడుగు=కుడితి, బియ్యం కడిగిన నీరు).
51. కడుగు త్రగిన కాకి కఱ్ఱని కూయదా?
52. కడుపా కళ్లేపల్లి చెరువా?
53. కడుపా కొల్లేరు మడుగా?
54. కడుపా చెరువా?
55. కడుపుకాలి ఏడుస్తుంటే, మనవర్తి ఏమిస్తావు అన్నదిట.
56. కడుపుకు పెట్టిందే కన్నతల్లి.
57. కడుపు కూటి కేడిస్తే, ఇంకొకత్తి కొప్పుపూల కేడ్చిందట.
58. కడుపు చించుకుంటే పేగులు కాళ్ళమీద పడును.
59. కడుపు చించుకున్నా గారడి విద్యే అన్నట్లు.
60. కడుపు చేసినవాడే కాయము, పిప్పళ్ళు తెస్తాడు (కాయము=తినబెట్టే మందు).
61. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండినమ్మ తినక మానదు.
62. కడుపున పుట్టిన బిడ్ద- కొంగున కట్టిన రూక.
63. కడుపు నిండితే కడవలు మోయు, లేకపోతే పగులవేయు.
64. కడుపు నిండినవానికి గారెలు కనరు.
65. కడుపు రాతిలోని కప్పకు కలుగదా?
66. కడుపులో కాపాడినవాడు కాలాన కాపాడడా?
67. కడుపులో తిప్పందే కక్కొస్తుందా?
68. కడూపులో ఎట్లాఉంటే, కాపురమలా ఉంటుంది.
69. కడుపులో చల్ల కదలకుండా.
70. కడుపులో మంట కానరాని మంట.
71. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా?
72. కడుపులో లేని ప్రేమ కావాలంటే వస్తుందా?
73. కడుపు వస్తే కనే తీరవలెను.
74. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.
75. కతకు కాళ్ళు, ముంతకు చెవులు కల్పించినట్లు.
76. కలతమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పులకూటి మొగుడు అమ్ముకతిన్నాడు.
77. కత్తి తీసి కంపలో వేసి, ఏకుతీసి పొడుచుకుంటానన్నాడట.
78. కత్తిపీటకు పళ్ళు పులుస్తాయా?
79. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.
80. కత్తిమీద సాము కడతేరబోదయా.
81. కత్తిమీద సాము కానివాడికైనా తగదు.
82. కత్తిమీది సాము, కొత్తి మీది కూడు.
83 కత్తి మెత్తన, అత్త మంచి లేదు.
84. కత్తు కలిస్తే పొత్తు కలుస్తుంది.
85. కత్తెరలో వాన కనకపు పంట. (కత్తెర= కృత్తిక కార్తె).
86. కత్తేస్తావా? బత్తేస్తావా? అన్నట్లు.
87. కథ అడ్డంగా తిరిగింది.
88. కథ కంచికి, మనమింటికి.
89. కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు.
90. కదళి మింగువాడు గరళంబు మ్రింగునా?
91. కదిపితే కందిరీగల తెట్టు.
92. కదిలిస్తే గచ్చపొద.
93. కదుటిలో పడదు, దిండులోనూ పడదు.
94. కదురు కవ్వము ఆడితే కఱవే లేదు.
95. కనక తరుణు లాసలేని సంసారులు కలలోనైనా కలరా?
96. కనపడినప్పుడల్లా దండాలు పెడతావెందుకు? అంటే చేతులు ఊరకే ఉండి ఏంచేస్తాయిలే అన్నడట.
97. కని గుడ్డి, విని చెవుడు.
98. కని పెంచినవాడు కాలుజారినట్లు.
99. కనిపెంచిన నాడు కొడుకులు గానీ, కోడాళ్ళు వచ్చాక కొడుకులా?
100. కనుక్కున్నానండోయ్ కంబట్లో వెంట్రుకలు అన్నట్లు.

No comments: