Saturday, April 30, 2011

సామెతలు 47

1. దానం చేయ్యని చేయి- కాయలు గాయని చెట్టు.
2. దానము చేసిన ఆవుకు దవడపళ్ళు ఎంచబోకు.
3. దాన మీని వాడు ధన్యుండు కాడయా.
4. దానములేని విత్తము సంతానం లేని స్త్రీ వంటిది, కలుజు (తూము) లేని చెరువు వంటిది.
5. దానాలలోకెల్ల గర్భదా(ధా)నం పుణ్యం.
6. దానాలలోకెల్ల నిదానం శ్రేష్టం.
7. దాన్ని నమ్ముకొని ధర్మవరం పోతే, అదిపోయి బుక్కపట్టణం చేరిందట.
8. దాపున గుడి కట్టితే దూరాన వర్షం (గుడి= చంద్రుని చుట్టు వేసిన వలయం).
9. దాయ కట్టని ఆవు తన్నక మానదు (దాయ=బంధము).
10. దాయాది ఉంటే నిప్పెందుకు?
11. దారికి సుంకం చెల్లించమన్నట్లు.
12. దారిద్ర్యము ఆరవ ఇంద్రియము.
13. దారిద్ర్యము ఐశ్వర్యము తరతమ భేదాలుగల కలుషములు.
14. దారిద్ర్యము నాగరికత సృష్టించినదే.
15. దారిద్ర్యమున నుండి తన పూర్వ సంపద లూరక తలచువాడుత్త వెధవ.
16. దారిద్ర్యానికి సానుపు పంట.
17. దారినపోయే తగులాటాన్ని దాపుకు కొనితెచ్చుకొన్నట్లు.
18. దారినపోయే తద్దినమా! (దరిద్రమా) మా ఇంటికి రా అన్నట్లు
19. దారినపోయే మారెమ్మా! మా ఇంటిదాకా వచ్చిపో అన్నట్లు.
20. దారినపోయ్యే శనిని నా నెత్తిమీదుగా పొమ్మన్నట్లు.
21. దారినపొయ్యే శనేశ్వరాన్ని కొనకొచ్చుకొన్నట్లు.
22. దారిలో దొరికింది ధర్మానికి పోయింది.
23. దాలిగుంటవారు తామరగుంటకు, తామరగుంటవారు దాలిగుంటకు వచ్చినట్లు.
24. దాలిగుంటలో కుక్క మాదిరి.
25. దాష్టికపు ముష్టి (నియోగిది).
26. దాష్టికానికి ధర్మం లేదు, కాయకంటికి చూపులేదు.
27. దాసరికి తగిన పూసలు.
28. దాసరయ్య తప్పు దండంతో సరి.
29. దాసరి తిప్పలు పెరుమాళ్ళ కెఱుక.
30. దాసరి పాటకు ముష్టి ముద(జ)రా.
31. దాసరి పాట్లు దైవాని కెఱుక.
32. దాసరివా జంగానివా అంటే, ముందూరును బట్టి అన్నాడట.
33. దాసి కొడుకైనా, కాసులు కలవాడే రాజేంద్రుడు.
34. దాసికి శిక్ష తలగొరిగింపు, భార్యకు దండన పడక వెలివెత.
35. దాస్యం ప్రతి ఆత్మలో పెరిగే కలుపు మొక్క.
36. దాసుని తప్పు దండముతో సరి.
37. దాక్షారామం భీమన్నలా ఎంత పొడుగు?(భీమేశ్వరాలయంలో లింగము పొడవైనది, రెండంతస్తుల ఆలయం).


ది


38. దింపుడు కళ్ళ మాశ (కడపటి ఆశ).
39. దిక్కులన్నీ ఒక్క దిక్కుకు తెచ్చినట్లు.
40. దిక్కులేని ఇంట్లో దెయ్యాల కాపురం.
41. దిక్కులేని నాడు ఊరికి నక్కే పోతురాజు.
42. దిక్కులేని వారికి దేవుడే దిక్కు.
43. దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి?
44. దిగితే గానీ లోతు తెలియదు.
45. దిగు దిగు మనే నాసవతే గానీ, దిగే నా సవతే లేదు (ఒక సవతి లేదు).
46. దినదినగండం నూరేండ్లాయుస్సు.
47. దినము మంచిదని తెల్లవార్లు దోచినట్లు.
48. దినమూ చచ్చేవానికి ఏడ్చేదెవరు?
49. దినమూ ప్రయాణం చద్దెన్నం చేటు (తినుటేగానీ ప్రయాణం సాగుటలేదు).
50. దినవెచ్చం దివిటి వెలుగు - పూటబత్తెం పుల్ల వెలుగు.
51. దిబ్బాలమ్మకి దీపం పెడితే, పందిమగడు వచ్చి పడదోసిపోయే.
52. దిమాకి ఎక్కినవాడు దిక్కులు చూస్తే, పలాకి ఎక్కినవాడు ప్రక్క చూచినాడట.
53. దివాణంలో దిక్కు లేదు, అంబటిలో ఉప్పు లేదు.
54. దివిటి ముందు దీపం పెట్టినట్లు.
55. దివ్వె తీసిన గూడు వలె.
56. దిసమొలవాడా! కాళ్ళకట్టువాని కప్పు మన్నట్లు.
57. దిసమొల వానికి దిగంబరుడు బట్ట కట్టినట్లు.
58. దిసమొలవాణ్ణి గోచిపాతగాడు బట్ట అడిగినట్లు.


దీ


59. దీపము ఆరినతరువాత దినుసంతా ఒక్కటె.
60. దీప ముండగానే ఇల్లు చక్కవెట్టుకోవలె.
61. దీపముండగానే నిప్పుకు దేవులాడినట్లు.
62. దీపం పేరు చెపితే చీకటి పోతుందా?
63. దీపం ముడ్డికిందనే చీకటి.
64. దీపాన వెలిగించిన దివిటీ పెద్దదైనట్లు.
65. దీపావళికి దీపమంత చలి.
66. దీపావళి వర్షాలు దీపాంతరాలు దాటుతాయి.
67. దీప్తభానుని గని తిమిరంబు నిలుచునా?
68. దీవించువారు ఏండ్లేల ఇస్తారు?


దు 


69. దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు.
70. దుక్కం (దుఃఖం) లేనోడు దూడను గడిచ్చుకొన్నాడట (గడిచ్చు= సంపాదించు).
71. దుక్కంగా పోయి దులువంగ వచ్చు (దులుపుట=ధాన్యం రాల్చుట, కుప్ప నూర్పిళ్ళ సమయం).
72. దుక్కి ఉంటే దిక్కు ఉంది.
73. దుక్కి కొద్దీ పంత, బుద్ది కొద్ది సుఖం
74. దుక్కిగల భూమి, దిక్కుగల మనుజుడు చెడడు.
75. దుక్కి చలువే చలువ - తల్లి పాలే పాలు.
76. దుక్కుటెద్దుకు పంచదార అటుకులు కావలెనా?
77. దుక్కిటెద్దు చావు, పక్కలో పెళ్ళాంచావు వంటిది.
78. దుక్కిటెద్దు దేశాంతరం పోయినట్లు.
79. దుక్కిటెద్దు బుట్టమేపువేళ గాటికి లాగినట్లు.
80. దుక్కిటెద్దు దేశాంతరం వెళ్ళితే పట్టీ దున్నించారట.
81. దుక్కిటెడ్లు పోట్లాడి దూడల కాళ్ళు విరిచినట్లు.
82. దుడ్డూకఱ్ఱా దుడ్డుకఱ్ఱా ఎవరి మాట వింటావే? అంటే, ఎవరిచేతిలో ఉంటే వారిమాట అన్నదిట.
83. దుక్కినాగలి చెక్కే వడ్రంగికి మేడలుకట్టు నేర్పుండునా?
84. దుడ్డుకఱ్ఱ అనగానే బుఱ్ఱ బద్దలవుతుందా?
85. దుడ్డుకు ఒక్కడైనా దూదేకులవాణ్ణి జీతాని కుంచుకోకు.
86. దుడ్డు దుగ్గనిలేని నాబట్ట దువ్వింది దువ్విందే.
87. దుత్తకు పాల రుచి తెలుసునా?
88. దున్నంగపోయి దులపంగ వచ్చు.
89. దున్న ఈనినదంటే, దూడను గాట కట్టి వేయమన్నట్లు.
90. దున్నక చల్లితే కొయ్యక పండును.
91. దున్నని వానికి గుడ్డ ఎందుకు? ఏలనివానికి పెండ్లామెందుకు?
92. దున్నక వేసిన ఆముదాలు, ఆసాది కిచ్చిన అప్పు తిరిగిరావు.
93. దున్న తగిలితే మన్ను ముట్టవలెను.
94. దున్న దగ్గర వీణ వాయించినట్లు.
95. దున్నపోతు తన వీపు తోముకోలేదు, వాడు తోముకోగలడు, అంతే భేదం.
96. దున్నపోతు ఈనిందంటే చెంబుతేరా పాలుపితుకుదా మన్నట్లు.
97. దున్నపోతు మీద వాన కురిసినట్లు.
98. దున్నపోతులా ఉన్నావు తేలుమంత్రం తెలియదా? అన్నాడట.
99. దున్నబోతే దూడలలోను, మేయబోతే పోతులలోను.
100. దున్నలా కష్టపడి దొరలా తినవలె.

Thursday, April 21, 2011

సామెతలు 46


1. తోలు తొబక దిని కుక్క పెద్దపులైందట.
2. తోలు కొరికేవాడు పోతే, బొమికలు నమిలేవాడు వస్తాడు.


తౌ


3. తౌడు తింటు ఒయ్యారమా?
4. తౌడుతిన్నా మూతి తుడుచుకొన్నట్లుండాలి.
5. తౌడు తినేవాడికి మీసాలెగబెట్టే వాడొకడు.


త్రా


6. త్రాగనేరని పిల్లి ఒలకబోసుకున్నదట.
7. త్రాగను గంజిలేదు, తలకు ఆటికలి.
8. త్రాడు చాలదని బావి పూడ్చుకుంటారా?


త్రో


9. త్రోయనేర్చుకున్న కుక్క దొంతులు చేర్చునా? (పేర్చునా?)
10. త్రోవ దొరతన మెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
11. త్రోవలో పెట్టి తొక్కేవురా జాణా అన్నట్లు.

త్యా


12. త్యాగి గానివాని ధర్మ మడుగవచ్చు.




13. దంచలేనమ్మ ఊదూది చూచిందట.
14. దంచినమ్మకు బొక్కిందే కూలి.
15. దంచినమ్మకు బొక్కిందే దక్కినట్లు.
16. దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.
17. దందమయ్యా బాపనయ్యా! అంటే మీతండ్రినాటి పాతబాకీ ఇచ్చిపొమ్మన్నాడట.
18. దండి అమావాశ్యకు వాన తాదు తెంపుకొనిపోతుంది.
19. దండించే దాత లేకుంటే, తమ్ముడు చందప్రచండుడు.
20. దండిపైరు పంటకు పనికిరాదు.
21. దండుకు పోయినవాడి పెళ్ళాం ఎక్కడౌన్నా ముండే (ఏనాటికైనా ముండే).
22. దండుకు మంచాలు వాల్చగలమా?
23. దండుగకు ఒప్పుదురుగానీ, పందగ కొప్పరు.
24. దండుగకు రూపాయిలు, తద్దినానికి కూరలూ దొరకకుండాపోవు.
25. దండగలో పండగ.
26. దండుగైన పెట్టు (ఈవి) ధర్మానికోర్వదు.
27. దండులో గుండు పడితే ఎవనాలి ముంద మోస్తుందో?
28. దండులోని పోతే రెంటిలో ఒకటి (చావో, బ్రతుకో).
29. దండువెడదాము అంటే, వండుక తిని వెడదాము అన్నట్లు.
30. దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు.
31. దంభోళహతికి తరువొక ఎదురా?
32. దగ్గఱకు పిలిచి దాసరీ! నీ కన్ను లొట్ట అన్నట్లు.
33. దగ్గఱకుపోతే దొగ్గలకూరకైనా కొరగాదు (దొగ్గలి కూర= ముండ్ల తోటకూర వంటిది).
34. దగ్గఱకు వస్తే ఎగ్గులెంచినట్లు.
35. దగ్గఱవాళ్ళకే దగ్గులెక్కువ.
36. దగ్గితే నిలవని ముక్కు, తుమ్మితే నిలుస్తుందా?
37. దగ్గుతూపోతే శొంఠి కూడా ప్రియము.
38. దగ్గు సిగ్గు దాచినా దాగవు.
39. దగ్గేవాని దగ్గర డొక్కలు ఎగురవేసినట్లు.
40. దత్తతమీది ప్రేమ- దాయాది మీద ప్రేమ.
41. దప్పికి నెయ్యిత్రాగినట్లు.
42. దప్పిగొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.
43. దప్పికి నీళ్ళీక తరిమి నాతడు ఇష్టన్న మివ్వగలడా?
44. దబ్బుర పాటకు తలత్రిప్పుటలు మెండు.
45. దమ్మున్న దాడి పొమ్మన్న పోదు
46. దమ్మిడీ ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు.
47. దమ్మిడీ కల్లుకు 9తాగి) ఊరంతా గెంతులు.
48. దమ్మిడీ పెళ్ళికి ఏగాని భోగం మేళం.
49. దమ్మిడీ పెళ్ళికి రూపాయి బాణాసంచా.
50. దమ్మిడీ ముండకి ఏగాణి క్షవరం.
51. దయగల దేవరా! నామగని వెదకి వానిని పట్టు, నన్ను పట్టకు.
52. దయగల మొగుడు దండుకుపోతూ, రోలుతీసి రొమ్మున వేళాడవేసి పోయాడట.
53. దయతలచి దాహ మిస్తే, ఊళ్ళోకెళ్ళి ఉడుకు అన్నట్లు.
54. దయ తుఱ్ఱుమంటే, నెత్తి చుఱ్ఱుమంటుంది.
55. దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.
56. దయ దండిది, గుణం మొండిది.
57. దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే, ఊరకున్నా తప్పే.
58. దయ్యం బెదిరికి వరమిచ్చు.
59. ద్వయపు కంతికి పేలగింజ పెద్ద.
60. దయ్యము కొట్టనూ, బిడ్డ బ్రతకనూనా?
61. దయ్యము పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి.
62. దయ్యాలతో నెయ్యాలు చేసినట్లు.
63. య్యాల ముందర బిడ్డలు బ్రతుకుతారా?
64. దరిద్రాన్నయినా ఏడేండ్లు దాచిపెట్టితే అక్కరకు రావచ్చు.
65. దరిద్రానికి దైవ కొండాటకం.
66. దరిద్రానికి మాట లెచ్చు, తద్దినానికి కూర లెచ్చు.
67. దరిద్రుడికి ఏరేవు వెళ్ళినా ముళ్ళపరిగే.
68. దరిద్రుడికి పిల్లలెక్కువ.
69. దరిద్రుడికి సద్ది కట్టి ఇస్తే, ఊరివెలుపల కుంటకాడనే భోంచేసి పోయినాడట.
70. దరిద్రుడి చేనికి వడగండ్ల వాన.
71. దరిద్రుడీ సంగీతానికి భూమ్యాకాశాలే తాళపు చిప్పలు.
72. దరిద్రుడు తల కడుగబోతే వడగండ్ల వాన వచ్చిందట (కురిసిందట).
73. దరిద్రునికి దైవమే తోడు.
74. దరిలేని బావి, వితరణలేని ఈవి.
75. దర్శనంబులారు దైవంబు ఒకటి.
76. దర్శనంబులు వేరు దైవమౌనొకటి.
77. దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం.
78. దలారికి దండుగ భయం - మశీదుకు దొంగ భయం లేదు.
79. దలాలుకోరు వాడు కందూరు చేస్తే తిన్నవరకు నమ్మకం ఉండదు. (దలాలు కోరు= మాట నమ్మిక లేని వాడు, కందూరు= ఉరుసు).
80. దశకొద్దీ దొరికాడు దిసమొల మొగుడు.
81. దశకొద్దీ దొరికాడు పుసికళ్ళ మొగుడు.
82. దశకొద్దీ మొగుడు, దానం కొద్దీ బిడ్డలు.
83. దశ దానాలకు తోటకూర కట్ట (మట్ట).
84. దశవస్తే దిశ కుదురుతుంది (వాస్తు).
85. దశా! దశా! రావే అంటే దరిద్రాన్ని పిలవ మన్నదట.
86. దవడ రేగినా దబ్బర రేగినా నిలవవు.
87. దక్షిణపు కొమ్ము హెచ్చు ఐతే ధాన్యపు ధర హెచ్చు, ఉత్తరపు కొమ్ము హెచ్చు అయితే ఉప్పుధర హెచ్చు (నెలవంకకు).


దా


88. దాగబోయి, తలారి ఇంట్లో దూరినట్లు.
89. దాగబోయి తలారి ఎదుట దూకిట్లు.
90. దాగబోయిన చోట దెయ్యాలు పట్టుకొన్నట్లు.
91. దాచినాను మగడా! వేరుండ మన్నట్లు.
92. దాడిగుఱ్ఱం మాదిరి దౌడి తీసి దడిలో దూరినాడట.
93. దాణాకు నోరు తెరిచి, కళ్ళానికి (కళ్ళెమునకు) నోరు మూసినట్లు.
94. దాణాకొద్ది లద్ది
95. దాణా దండుగే గానీ, దమ్మిడీ పనికాదు.
96. దాతలిచ్చిన పాలుకంటే, ధరణి (ధారుణి) ఇచ్చిన పాలు మేలు.
97. దాతలు లేక కాదు మాకు వ్రాత లేక.
98. దాత లేని ఊరు దెయ్యాల పేటరా.
99. దాది ఱొమ్ము దూది పాంపుగ.
100. దానం చేయకున్నా, దక్షిణం తలజేసి పండాలి.

Saturday, April 16, 2011

సామెతలు 45

1. తెల్లగుర్రపు శారవ, నగిరికొలువు కష్టము (శరవ=(చారవ) చాకిరి).
2. తెల్లగుర్రాన్ని పల్లనం చేసినట్లు (పల్లనం= జీనువేసి సిద్ధపరచుట, మాలీసుచేయుట)
3. తెల్లనివన్నీ పాలా? నల్లనివన్నీ నీళ్ళా?
4. తెల్లబియ్యము, పాటి మానిక.
5. తెల్లవారితే ఎల్లవారమ్మల బ్రతుకు ఒకటే.
6. తెల్లవారిన సంగతి నీకెట్ల తెలిసిందని ఒక రసికుడడిగితే - బయటకి పోవల్సివచ్చింది- అన్నదట పల్నాటి పడుచు, దీపం వెలవెల బారింది- అన్నదట పాకనాటిసీమ వెలయాలు; తాంబూలం అరుచి అయ్యింది - అన్నదట నెల్లూరు నెరజాణ.
7. తెల్లవారి లేచినందుకు దోవ తప్పినందుకు సరి.
8. తెల్లవార్లు సరసాలాడి తేరకంటే, నా మొగుడనుకొంటానుపో అన్నదట (ఱంకుటాలు).
9. తెల్లవార్లూ సరసమాడినా గొల్లవాడే పుట్టె
10. తెల్లవారితే చూడు ఎల్లాయి బతుకు.


తే


11. తేభ్యమెక్కడ తెత్తునయ్యా? తెల్లవారింది. (తేభ్యం=తిండి).
12. తేనె అంతా ఒకచోత తెట్టేంతా ఇంకొకచోట.
13. తేనె ఉన్నచోట ఈగలుంటాయి.
14. తేనెగూర్చియీగ తెరువరులకు నీదె.
15. తేనెటీగ తేనె తెరవరి పాలు.
16. తేనెటీగలకు తీరుబడిలేని పని.
17. తేనె తీసినవాడు చేయి నాకకపోవునా?
18. తేనెతుట్టె పున్నానికి పూజ, అమావాశ్యకు ఆరగింపు.
19. తేనెతుట్టను రేపి, తియ్యని తేనెను వదలిపోదురా?
20. తేనెబోసి పెంచినా ముష్టిచెట్టుకు విషముపోదు.
21. తేనెబోసి పెంచినా వేపకు చేదుపోదు.
22. తేనెలో బడ్డ ఈగవలె.
23. తేరకు దొబ్బరా బూరగబుచ్చన్నా.
24. తేరగాడికేమి తెలుసు తెల్లజొన్న నూగు.
25. తేరగాడికేమి తెలుసు లంజ ముడ్డినొప్పి.
26. తేరగా వచ్చింది తినితిని, మా తమ్ముడూ ఒకడున్నాడన్నట్లు.
27. తేర గుఱ్ఱం, తంగెడు బఱికె.
28. తేరకు వచ్చింది ఊరకే పోతుంది.
29. తేరసొమ్ము, బీరపీచు.
30. తేరుండేదాకానే తిరునాళ్ళు.
31. తేరుతీసిన నాటి తీర్థంవలె.
32. తేలుకు ఎవరు అపకారం చేసినారు?
33. తేలుకుట్టిన దొంగవలె.
34. తేలుకు పెత్తనమిస్తే, తెల్లవార్లు తెగకుట్టిందట.
35. తేలుకు వెరచి పరుగెత్తి, పాముపై బడినట్లు.
36. తేలుచూడిమోసి (పిల్లలగని) చచ్చినట్లు.
37. తేలు తేలండి అని అరిస్తే మొగవాళ్ళని పిలవ్వే అన్నాడట. మీరు మొగవారు కారా అని పెండ్లామంటే, సమయానికి ఙ్ఞాపకం చేశావు, కఱ్ఱ తెమ్మన్నాడట.
38. తేలుమంత్రమైనా రాకున్నా, పాము పదగపై చేయి పెట్టినట్లు.
39. తేలువలే కుట్టిపోయినాదు (కొండెములు చెప్పి).
40. తేలేనమ్మకు తీపులు మెండు.
41. తేళ్ళలో కొండి, పాములలో పడగ (విషం).


తై


42. తైమాసం (రేయి) తెగబారెడు.


తొ


43. తొంగున్న సుంకరీ తలమూట దింపమన్నట్లు.
44. తొండకు వెలుగు సాక్షి (వెలుగు=కంచె).
45. తొండ పరుగు కంపదాకానే.
46. తొండ ముదిరితే ఊసరవెల్లి, గొల్ల ముదిరితే పిళ్ళ.
47. తొందరకు ఆలశ్యం మొగుడు.
48. తొందరగా రమ్మంటే, తిరుగమూత వేసి వస్తానన్నట్లు.
49. తొంభై తొమ్మండుగురు పోగై తోలు తెగగోసినారట.
50. తొక్కలేనమ్మ తొక్కులో నీళ్ళుపోసిందట.
51. తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా అన్నట్లు (పామును).
52. తొడ పలుచనదానికి తూటు పెద్ద.
53. తొట్టిలో ఊచినట్లు, తొడ గిల్లినట్లు.
54. తొట్ల అర్భకుల నూతువు, మరి తోచినట్లు గిల్లుదువు.
55. తొడ పలుచనగు నింతికి నడిగండిగలు పెద్ద.
56. తొడబలం ఉంటే తొంభైమంది ఉన్నట్లు.
57. తొడగిల్లి తొట్ల ఊచినట్లు.
58. తొడిమ ఊడిన పండు పడకుండా ఉంటుందా?
59. తొత్తు కింద తొత్తు, దొప్ప కింద దొప్ప.
60. తొత్తు కింద బడితొత్తు.
61. తొత్తుకు సివమెత్తినా మ్రొక్కక తీరుతుందా?
62. తొత్తుకో మాఱుతొత్తంట.
63. తొత్తుక్క బొల్లిమేక (తొత్తుకొక బొల్లిమేకా?).
64. తొత్తుది నగలెన్ని ఇడిన దొరసానగునా?
65. తొత్తును ఇంటబెట్టి దొరసానిని చెరగొందురా?
66. తొత్తువలే పాటుపడి, దొరవలే తిరుగవలె (తినవలె).
67. తొడరి ఆలినమ్మి తొత్తును గొన్నట్లు.
68. తొఱ్ఱి మెచ్చేది ఉప్పుపిండి.
69. తొఱ్ఱోడు మెచ్చేది ఊరిబిండి (ఊరిబిండి=పచ్చడి).
70. తొలకరిలో చెరువు నిండినా, తొలిచూలు కొడుకుపుట్టినా మేలు.
71. తొలకరి వానలు మొలకలకు తల్లి.
72. తొలి ఏకాదశికి తొలి తాటిపండు.
73. తొలిగండం తప్పితే తొంభై ఏళ్ళ ఆయుస్సు.
74. తొలిచేసిందానికి తల ఎత్తుకోలేకుంటే, వావిలి చెట్టుక్రింద వాడెవడమ్మా?
75. తొలిపెండ్లాం తోటకూర, మలిపెండ్లాం మామిడిపండు, మూడోపెండ్లాం ముంతమామిడిపండు (ముంతమామిడి=జీడిపండు).
76. తొలిపిల్లకు తొంబై అంగీలు, మలిపిల్లకు మారుదొడగ లేదు.
77. తొలి సమర్తకే గూద దిగినట్లు.


తో


78. తోకకు తొంభై, నాకు నలభై అన్నట్లు.
79. తోకతెగిన నక్కవలె.
80. తోక ముడుచుకొన్నట్లు.
81. తోకలేదుగానీ హనుమంతునంత బంటు.
82. తోకలేని గాలిపటం వలె.
83. తోకవడ్లు పంటకు వెన్నుకోత నేస్తం (తోకవడ్లు=ఒకవిధమైన అడవిపంట).
84. తోకవెంట పెరుమాళ్ళు అన్నట్లు.
85. తోకవెంబడి నారాయణా అన్నట్లు.
86. తోచీ తోచనమ్మ తోడికోడలు చెల్లెలి పెండ్లికి పోయిందట.
87. తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే, అదీ తోచనమ్మ ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్ళిందట.
88. తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే చూచీ చూడనట్లు చూశారట.
89. తోటకూరకు చంద్రహారము దెత్తునా?
90. తోటకూర నాడైనా చెప్పనైతినిరా కొడుకా అన్నట్లు.
91. తోట మూడుబారలు, కాయ ఆరుబారలు.
92. తోటలమీద వారికి, పే(పీ)తలమీద బారికి మొగమాట ముండదు.
93. తోడంగ తోడంగ తోడెంగ దొరికె.
94. తోడిపిల్లను తోడేలు వేసుకపోతే, ఆమడపిల్ల కచ్చివచ్చిందట.
95. తోడున్న తొంబదితడవలు.
96. తోడేలును గొఱ్ఱెలను కాయబెట్టినట్లు.
97. తోడులేక వెళ్ళదు రాచపీనుగ (రాచపీనుగ తోడులేనిదే పోదు).
98. తోరణం కట్టగానే పెండ్లి పూర్తి అయినట్లా?
99. తోరణము వీరణము లేని పెండ్లి బాజాలు.
100. తోలు తియ్యకుండానే తొనలు మింగినట్లు.


Saturday, April 9, 2011

సామెతలు 44


1. తీరోటి (తీరైన) మొగమని తిరిపానికి బోతే, తడవిచూసాడట.
2. తీర్థము స్వార్థము కలసివచ్చినట్లు.
3. తీర్థయాత్రతోడ దివ్యుండు కాడయా.
4. తీసినవారు బాగానే ఉంటారు, తీయించుకున్నవారూ బాగానే ఉంటారు, ఎదురైనవారికి తగులుతుంది ఎదురుమిత్తి.


తు


5. తుంగభద్రలో మునుగను తాతం భట్టాఙ్ఞా?
6. తింగలో పిత్తితేమీ? తూటాకులో పిత్తితేమి?
7. తుంటిమీద కొడితే నోటిపళ్ళు రాలాయట.
8. తుప్పరల వస్తేగానీ మంత్రాల పసలేదు.
9. తుట్టెపురుగు రెక్కలు వచ్చినా, ముసలివాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గాలుండవు.
10. తుడుము కాడి(డ) నుంచి దేవతార్చనదాకా ఒకటే మాట (తుడుము=నగారా).
11. తుడుము మొదలు దేవతార్చనదాకా ఒకేమాట (మంత్రం).
12. తుదను దండుగనిడి మొదలుచెడు నరుండు.
13. తుది దాకునే లోక విరుద్ద వృత్తముల్
14. తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు.
15. తుమ్మ ఉన్నచోటునే కమ్మ ఉండును.
16. తుమ్మగుంతలో ఇచ్చి పోగొట్టుకొన్నవాడు, దండిగుంటలో ఇచ్చి రాబట్టుకున్నవాడు.
17. తుమ్మతోపుల్లో కొత్తకోలాటం.
18. తుమ్మ దుడ్డువలె, కాపు కదురువలె.
19. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది?
20. తుమ్ముకు తమ్ముడులేడు గానీ, ఆవలింతకు అన్న ఉన్నాడు.
21. తుమ్ము తమ్ముడై చెప్పు.
22. తుమ్మెదలాడితే వాన తప్పదు.
23. తురక ఎంత గొప్పవాడైనా, ఇంతికి పేరు లేదు, తలకు జుట్టులేదు, మొలకు తాడు లేదు.
24. తురక కరక భేదికారులే, మొదటిది దగ్గరకు వస్తే చాలు, రెండోది లోపలికి పోవాల.
25. తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా? 
26. తురక దెయ్యము మంత్రించినట్లు.
27. తురక దాసరికి ఈత మజ్జిగ.
28. తురక మెచ్చు, గాడిద తన్ను సంకటమే.
29. తురకలలో మంచి ఎవరంటే, తల్లి కడుపులో ఉన్నవాడు, గోరీలో ఉన్నవాడు.
30. తురకల సేద్యం, పెరికల పాలు. (పెరిక= విశాఖ ప్రంతంలో ఒక జాతి).
31. తురకలు తప్పించుకుంటే ఈదులలో, మేకలు తప్పించుకుంటే తుమ్మలలో (ఈదులు=ఈత చెట్ల తోపులు).
32. తురకలు లేణు ఊళ్ళో దూదేలులవాడే ముల్లా.
33. తురకలవాడకు గంగిరెద్దు పోతే, కోసుకొని తిన్నారట.
34. తురకవీధిని సన్యాసి భిక్ష వలె.
35. తురక వీఢిలో విప్రునికి పాదపూజ చేసిఏమి? చేయకేమి?
36. తురకా దూదేకుల పొత్తులో మురిగీ మర్దార్.
37. తురకా (బ)మరకా తిరగేసి నరకా.
38. తురాయి పెట్తినవాడి కొలువు, పరాయివాడి పాంపు.
39. తులము నాలికకు తొంభై రుచులు.
40. తులసి కడుపున దురదగొండి పుట్టినట్లు.
41. తులసికోటలో ఉమ్మేసినా వేమిరా? అంటే, యఙ్ఞవేదిక అనుకున్నాను అన్నాడట.
42. తులసివనంలో గంజాయి మొక్కవలె.
43. తులువనోటికి ఉలవపప్పు.
44. తువ్వన వేసిన ఎఱువు, బాపనికి పోసిన నెయ్యి (తువ్వ=ఇసకతెర, ఎర్రనేల).
45. తుళ్ళే ఎద్దే గోనె మోసేది.


తూ


46. ' తూ ' అంటే బలా అన్నదంట.
47. తూగి ముందుకు పడడు, తాగి వెనుకకు పడడు.
48. తూట్లు మూసి తూములు తెరచినట్లు.
49. తూనీగలాడితే తూమెడు వర్షం (వాన).
50. తూమెడువడ్లు తూర్పార(న) బట్టేటప్పటికి ఏదుమువడ్లు ఎలుకలు తినిపోయినవి.
51. తూర సందులేదు, తోడ నొకడోలు.
52. తూరిన డేగేటు (వేటు), విడిచిన కోలేటు (కోల) తప్పవు (తూరుట=ఆకాశం నుండి భూమికి మహావేగంతో దిగి హటాత్తుగా పైబడి మరల ఎగిరిపోవుట).
53. తూరిన గుద్ద దెబ్బ, నీతిపట్తు పులిదెబ్బ తప్పవు.
54. తూరుపు తలాపి (తలదాపి) దున్నపోతు గూడా పెట్టదు.
55. తూరుపు తొమ్మిది, పడమట పది.
56. తూర్పున ఇంద్రధనుస్సు, దూరాన వర్షం.
57. తూర్పున ఇంద్రధనుస్సు వేస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనస్సు వేస్తే బండమీదను పశువులను కట్టాలి.
58. తూర్పున కొఱ్ఱువేస్తే దుక్కిటెద్దు ఱంకె వేస్తుంది (కొఱ్ఱు=ఇంద్రధనుస్సు).
59. తూర్పున తెరవేసింది, తుంగభద్రలో దొడ్డికట్టరా గొల్లోడా. (తెర=వరదగూడు).
60. తూర్పున ధనస్సు వేస్తే, తుంగగడ్డకూడా తడవదు, పరమట వేస్తే పల్లాలన్నీ (పెంటగుంటలన్నీ) నిండుతవి.
61. తూర్పున వరదగూడు వేస్తే, తుంగపోచయినా తడవదు.


తృ


62. తృణము మేరువు, మేరువు తృణము.


తె


63. తెంపులతాళ్ళు, చిల్లుల కడవ.
64. తెగబలిసిన ఆబోతెద్దు తా నెక్కదు, ఇంకొకదానిని ఎక్కనీయదు.
65. తెగించి దానంచేస్తాను తేరా పిడికెడు డాళ్ళు అన్నట్లు.
66. తెగించినదానికి సగుడు మోకాలిబంటి.
67. తెగించినవాడికి తెడ్డేలింగం, విదిచినదానికి వీరేశలింగం.
68. తెగితే లింగడు ఱాయి (శివలింగము స్థానభ్రష్టమైతే రాయితో సమానం అనుట).
69. తెగిన చేను తేమ నోర్చును.
70. తెగిన వ్రేలికి సున్నంగూడా పెట్టడు.
71. తెగువదారికి తేలు కుట్టితే తెల్లవార్లు కోడి కూసిందట.
72. తెగువ దేవేంద్ర పదవి.
73. తెగేదాకా బిగించకూడదు (లాగరాదు).
74. తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా ! లేకుంటే ఊరకుండు లోకనాయక.
75. తెచ్చుకొన్న చద్ది, తెచ్చుకొన్నవాడిని తిననిస్తే, మన కమ్మతన మెందుకు కాల్చనా?
76. తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు.
77. తెడ్డు ఉండగా చేతితో తాకనేల?
78. తెడ్డు ఏదీ? అంటే కొయ్య ఏదీ? అన్నట్లు.
79. తెడ్డుకేమి తెలుసు కూరల రుచి.
80. తెడ్డు నాకి, వ్రతం చెడకొట్టుకున్నట్లు.
81. తెనుగు తేట, అరవం అధ్వాన్నం.
82. తెరవాటు గాడు కట్టిన బట్టాలాగి మానభంగమని మానునా?
83. తెర్లు వదలిన జీదలు వదులుతాయి.
84. తెలకపిండి తిన్న కుక్క తోకాడించక మానదు.
85. తెలగాన్యపు టెక్కు, నియోగపు నిక్కు (నియోగినిక్కు).
86. తెలిక వానికి నువ్వు వండినట్లు.
87. తెలియని దెయ్యమికన్నా, తెలిసిన దెయ్యం మేలు.
88. తెలిసినవారు ఎదురైతే మనిషి పండ్లికిలిస్తాడు, గుఱ్ఱం సకిలిస్తుంది.
89. తెలివి ఒకరి అబ్బసొమ్మా తోటసుబ్బమ్మా?
90. తెలివి ఒకరి సొమ్మా గొల్ల గురవమ్మా?
91. తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట ఉంది.
92. తెలివి మూలం, తెచ్చెర ఘోరం.
93. తెలివిగలిగిన పెండ్లాం తెల్లవారిన తరవాత ఏడ్చిందట.
94. తెలివిగలిగిన వాళ్ళాను తెలివిగలవాళ్ళ దగ్గరకు పంపి నన్ను నీ దగ్గరికి పంపినారు.
95. తెలివితక్కువ, ఆకలెక్కువ.
96. తెలివిలేని పట్టుదల, పొయ్యిలో ఇమడని నిప్పు, కళ్ళెంలేని గుఱ్ఱం.
97. తెలిసి తెలిసి బొందను పడ్డట్టు.
98. తెలిసినవానికి తెలకపిండి, తెలియనివానికి గానుగ పిండి.
99. తెలిసినవారికి ముందరనే ఉంది మోక్షం.
100. తెలిసేవరకు బ్రహ్మవిద్య, తెలిసిన తర్వాత కూసివిద్య.