Saturday, April 16, 2011

సామెతలు 45

1. తెల్లగుర్రపు శారవ, నగిరికొలువు కష్టము (శరవ=(చారవ) చాకిరి).
2. తెల్లగుర్రాన్ని పల్లనం చేసినట్లు (పల్లనం= జీనువేసి సిద్ధపరచుట, మాలీసుచేయుట)
3. తెల్లనివన్నీ పాలా? నల్లనివన్నీ నీళ్ళా?
4. తెల్లబియ్యము, పాటి మానిక.
5. తెల్లవారితే ఎల్లవారమ్మల బ్రతుకు ఒకటే.
6. తెల్లవారిన సంగతి నీకెట్ల తెలిసిందని ఒక రసికుడడిగితే - బయటకి పోవల్సివచ్చింది- అన్నదట పల్నాటి పడుచు, దీపం వెలవెల బారింది- అన్నదట పాకనాటిసీమ వెలయాలు; తాంబూలం అరుచి అయ్యింది - అన్నదట నెల్లూరు నెరజాణ.
7. తెల్లవారి లేచినందుకు దోవ తప్పినందుకు సరి.
8. తెల్లవార్లు సరసాలాడి తేరకంటే, నా మొగుడనుకొంటానుపో అన్నదట (ఱంకుటాలు).
9. తెల్లవార్లూ సరసమాడినా గొల్లవాడే పుట్టె
10. తెల్లవారితే చూడు ఎల్లాయి బతుకు.


తే


11. తేభ్యమెక్కడ తెత్తునయ్యా? తెల్లవారింది. (తేభ్యం=తిండి).
12. తేనె అంతా ఒకచోత తెట్టేంతా ఇంకొకచోట.
13. తేనె ఉన్నచోట ఈగలుంటాయి.
14. తేనెగూర్చియీగ తెరువరులకు నీదె.
15. తేనెటీగ తేనె తెరవరి పాలు.
16. తేనెటీగలకు తీరుబడిలేని పని.
17. తేనె తీసినవాడు చేయి నాకకపోవునా?
18. తేనెతుట్టె పున్నానికి పూజ, అమావాశ్యకు ఆరగింపు.
19. తేనెతుట్టను రేపి, తియ్యని తేనెను వదలిపోదురా?
20. తేనెబోసి పెంచినా ముష్టిచెట్టుకు విషముపోదు.
21. తేనెబోసి పెంచినా వేపకు చేదుపోదు.
22. తేనెలో బడ్డ ఈగవలె.
23. తేరకు దొబ్బరా బూరగబుచ్చన్నా.
24. తేరగాడికేమి తెలుసు తెల్లజొన్న నూగు.
25. తేరగాడికేమి తెలుసు లంజ ముడ్డినొప్పి.
26. తేరగా వచ్చింది తినితిని, మా తమ్ముడూ ఒకడున్నాడన్నట్లు.
27. తేర గుఱ్ఱం, తంగెడు బఱికె.
28. తేరకు వచ్చింది ఊరకే పోతుంది.
29. తేరసొమ్ము, బీరపీచు.
30. తేరుండేదాకానే తిరునాళ్ళు.
31. తేరుతీసిన నాటి తీర్థంవలె.
32. తేలుకు ఎవరు అపకారం చేసినారు?
33. తేలుకుట్టిన దొంగవలె.
34. తేలుకు పెత్తనమిస్తే, తెల్లవార్లు తెగకుట్టిందట.
35. తేలుకు వెరచి పరుగెత్తి, పాముపై బడినట్లు.
36. తేలుచూడిమోసి (పిల్లలగని) చచ్చినట్లు.
37. తేలు తేలండి అని అరిస్తే మొగవాళ్ళని పిలవ్వే అన్నాడట. మీరు మొగవారు కారా అని పెండ్లామంటే, సమయానికి ఙ్ఞాపకం చేశావు, కఱ్ఱ తెమ్మన్నాడట.
38. తేలుమంత్రమైనా రాకున్నా, పాము పదగపై చేయి పెట్టినట్లు.
39. తేలువలే కుట్టిపోయినాదు (కొండెములు చెప్పి).
40. తేలేనమ్మకు తీపులు మెండు.
41. తేళ్ళలో కొండి, పాములలో పడగ (విషం).


తై


42. తైమాసం (రేయి) తెగబారెడు.


తొ


43. తొంగున్న సుంకరీ తలమూట దింపమన్నట్లు.
44. తొండకు వెలుగు సాక్షి (వెలుగు=కంచె).
45. తొండ పరుగు కంపదాకానే.
46. తొండ ముదిరితే ఊసరవెల్లి, గొల్ల ముదిరితే పిళ్ళ.
47. తొందరకు ఆలశ్యం మొగుడు.
48. తొందరగా రమ్మంటే, తిరుగమూత వేసి వస్తానన్నట్లు.
49. తొంభై తొమ్మండుగురు పోగై తోలు తెగగోసినారట.
50. తొక్కలేనమ్మ తొక్కులో నీళ్ళుపోసిందట.
51. తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా అన్నట్లు (పామును).
52. తొడ పలుచనదానికి తూటు పెద్ద.
53. తొట్టిలో ఊచినట్లు, తొడ గిల్లినట్లు.
54. తొట్ల అర్భకుల నూతువు, మరి తోచినట్లు గిల్లుదువు.
55. తొడ పలుచనగు నింతికి నడిగండిగలు పెద్ద.
56. తొడబలం ఉంటే తొంభైమంది ఉన్నట్లు.
57. తొడగిల్లి తొట్ల ఊచినట్లు.
58. తొడిమ ఊడిన పండు పడకుండా ఉంటుందా?
59. తొత్తు కింద తొత్తు, దొప్ప కింద దొప్ప.
60. తొత్తు కింద బడితొత్తు.
61. తొత్తుకు సివమెత్తినా మ్రొక్కక తీరుతుందా?
62. తొత్తుకో మాఱుతొత్తంట.
63. తొత్తుక్క బొల్లిమేక (తొత్తుకొక బొల్లిమేకా?).
64. తొత్తుది నగలెన్ని ఇడిన దొరసానగునా?
65. తొత్తును ఇంటబెట్టి దొరసానిని చెరగొందురా?
66. తొత్తువలే పాటుపడి, దొరవలే తిరుగవలె (తినవలె).
67. తొడరి ఆలినమ్మి తొత్తును గొన్నట్లు.
68. తొఱ్ఱి మెచ్చేది ఉప్పుపిండి.
69. తొఱ్ఱోడు మెచ్చేది ఊరిబిండి (ఊరిబిండి=పచ్చడి).
70. తొలకరిలో చెరువు నిండినా, తొలిచూలు కొడుకుపుట్టినా మేలు.
71. తొలకరి వానలు మొలకలకు తల్లి.
72. తొలి ఏకాదశికి తొలి తాటిపండు.
73. తొలిగండం తప్పితే తొంభై ఏళ్ళ ఆయుస్సు.
74. తొలిచేసిందానికి తల ఎత్తుకోలేకుంటే, వావిలి చెట్టుక్రింద వాడెవడమ్మా?
75. తొలిపెండ్లాం తోటకూర, మలిపెండ్లాం మామిడిపండు, మూడోపెండ్లాం ముంతమామిడిపండు (ముంతమామిడి=జీడిపండు).
76. తొలిపిల్లకు తొంబై అంగీలు, మలిపిల్లకు మారుదొడగ లేదు.
77. తొలి సమర్తకే గూద దిగినట్లు.


తో


78. తోకకు తొంభై, నాకు నలభై అన్నట్లు.
79. తోకతెగిన నక్కవలె.
80. తోక ముడుచుకొన్నట్లు.
81. తోకలేదుగానీ హనుమంతునంత బంటు.
82. తోకలేని గాలిపటం వలె.
83. తోకవడ్లు పంటకు వెన్నుకోత నేస్తం (తోకవడ్లు=ఒకవిధమైన అడవిపంట).
84. తోకవెంట పెరుమాళ్ళు అన్నట్లు.
85. తోకవెంబడి నారాయణా అన్నట్లు.
86. తోచీ తోచనమ్మ తోడికోడలు చెల్లెలి పెండ్లికి పోయిందట.
87. తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే, అదీ తోచనమ్మ ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్ళిందట.
88. తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే చూచీ చూడనట్లు చూశారట.
89. తోటకూరకు చంద్రహారము దెత్తునా?
90. తోటకూర నాడైనా చెప్పనైతినిరా కొడుకా అన్నట్లు.
91. తోట మూడుబారలు, కాయ ఆరుబారలు.
92. తోటలమీద వారికి, పే(పీ)తలమీద బారికి మొగమాట ముండదు.
93. తోడంగ తోడంగ తోడెంగ దొరికె.
94. తోడిపిల్లను తోడేలు వేసుకపోతే, ఆమడపిల్ల కచ్చివచ్చిందట.
95. తోడున్న తొంబదితడవలు.
96. తోడేలును గొఱ్ఱెలను కాయబెట్టినట్లు.
97. తోడులేక వెళ్ళదు రాచపీనుగ (రాచపీనుగ తోడులేనిదే పోదు).
98. తోరణం కట్టగానే పెండ్లి పూర్తి అయినట్లా?
99. తోరణము వీరణము లేని పెండ్లి బాజాలు.
100. తోలు తియ్యకుండానే తొనలు మింగినట్లు.


No comments: