Friday, July 29, 2011

సామెతలు 61


1. పిల్లి పట్టిన ఈరువు వలె (ఈరువు=మాంసం)
2. పిల్లి బ్రహ్మణుడు, పీట ముత్తైదువ.
3. పిల్లి ముడ్డిలో మల్లెపందిరి.
4. పిల్లి లేనప్పుడే కలుగులోనుండి ఎలుకలు బయటకు వచ్చి గంతులేసేది.
5. పిల్లి లేని పిసిని, వానలేని వరద.
6. పిల్లి వలస త్రిప్పినట్లు (పిల్లలను).
7. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?


పీ


8. పీకుడుగానికి బియ్యపురొట్టె, మూతి కడుగ నేతిబొట్టు.
9. పీకులాట పెండ్లికిపోయి, పిల్లా నేను సగమై వచ్చినా మన్నదటా.
10. పీటకు పిఱ్ఱకు వైరం.
11. పీటకోడుకు పసిపిల్లలకు చలిలేదు.
12. పీట పగిలేటట్లు, మొలత్రాడు తెగేటట్లు తింటేనే ప్రీతైన తిండి.
13. పీతాంబరము కట్టినమ్మ పీట చంకనే పెట్టాలి.
14. పీనుగ ఎక్కడో గద్దలూ అక్కడే.
15. పీనుగకు చేసిన జాగారం - గొడ్డావుకు వేసిన ఆహారం.
16. పీనుగకు చేసిన శృంగారం - నగరికి చేసిన కొలువు.
17. పీనుగను పొడిచిన బల్లెమువాడు.
18. పీనుగమీద పిండాకుడు అన్నట్లు.
19. పీయి తినెడి కాకి పితరుండు ఎట్లౌను?
20. పీయి తినే వాడింటికి చుట్టంపోతే, ఏరిగినదాకా తన్నినాడట.
21. పీరుసాహేబు పింగు నాకుతుంటే అల్లీసాహేబుకు బెల్లమట.
22. పీర్ల పండుగకు గోకులాష్టమికి ఏమి సంబంధము?
23. పీర్లు బచ్చాని కేడిస్తే, ముల్లా పంచదార కేడ్చినాడట.


పు


24. పుంగనూరు సంస్థానం (వెఱ్ఱిబోగలది -అని).
25. పుంజం పెట్టితే బట్ట, లంచం పెట్టితే పని.
26. పుంజు కూతనుండి ప్రొద్దెరిగిన యట్లు.
27. పుంజులూరు శ్రోత్రియందారు (యతిమతం).
28. పుంటికూత తిన్నా పుట్టిల్లు, పాయసం తిన్నా పరాయిగడ్డ.
29. పుంటికూరలో పుడక రుచి, మాంసంలో (చిగిరెపు) ఎముక రుచి.
30. పుండంత మానింది, చేటంత ఉంది.
41. పుండు ఒక చోట, మందు ఇంకొక చోట.
42. పుండుకు పుల్ల మొగుడు.
43. పుండున్న వ్రేలికే పుల్ల తగులుతుంది.
44. పుండు పొడిచే కాకికి ఎద్దునొప్పి తెలుస్తుందా?
45. పుండు మానినా బెండు మానదు (బెండు=మచ్చ).
46. పుండు మీద కారం చల్లినట్లు.
47. పుండు మీద కొరవి పెట్టినట్లు.
48. పుండు మీదకు నూనె లేదంటే, బూరెలొండవే పెళ్ళామా అన్నట్లు.
49. పుక్కిటి పురాణాలతో ప్రొద్దుపుచ్చే (పొట్టబోసికొనే) వాడు పురాణాలు చెప్పగలడా?
50. పుచ్చకాయల (గుమ్మడికాయల) దొంగా అంటే, భుజాలు తడుముకొన్నట్లు.
51. పుచ్చిన మిరియాలకైనా జొన్నలు సరిరావు.
52. పుచ్చిన విత్తులు చచ్చినా మొలువవు.
53. పుచ్చుకున్నప్పుడు పుత్రుడు పుట్టినంత సంతోషం, ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినంత దుఃఖం.
54. పుచ్చు వంకాయలు, బాపని బయ్యాలు.
55. పుట్టంగ పురుడు, పెరగంగ పెళ్ళి.
56. పుట్టకు ధ్వనెత్తితే పుట్టెడు, మొగుడికి ధ్యాసెత్తితే పుట్టెడు.
57. పుట్టని బిడ్డకు (పిల్లకు) పూసలు కుట్టినట్లు.
58. పుట్టపై బాదిన పాము చస్తుందా?
59. పుట్టనివాడు, గిట్టనివాడు, గోడబొమ్మలో ఉన్నవాడే (ద్రావిడులలో మహాత్ముడు).
60. పుట్టమన్ను ఎరువైతే పుట్లకొద్ది పంట.
61. పుట్టమీద తేలుకుట్టినా నాగుబాము కరచినట్లే.
62. పుట్టమీద గొట్ట భుజంగంబు చచ్చునా?
63. పుట్టలో చేయిపెట్టితే కుట్టక మానుతుందా?
64. పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?
65. పుట్టల్లో తారికాడేది ఎవరంటే అంజీకివచ్చిన అంకడు అన్నాడట (అంజి=గ్రామ సముదాయక కార్యములకు గ్రామస్థులందరు వంతుల ప్రకారం పంపినవారు చేసేపని).
66. పుట్టించినవాడు పూరి మేపడా?
67. పుట్టిచచ్చినా పుత్రుడే మేలు.
68. పుట్టినదానికి పెట్టిందే సాక్షి (పూర్వజన్మలో దానంచేసింది).
69. పుట్టిననాటి (పుట్టుకతో వచ్చిన) గుణం పుడకలతో గానీ పోదు.
70. పుట్టిననాటి గుణం పులిఆకులలో వేసినా పోదు.
71. పుట్టిననాటి పుల్లగాడే మొగుడా?
72. పుట్టినప్పుడే గిట్టేవ్రాత వ్రాసినాడు.
73. పుట్టిన పిల్లలు బువ్వ కేడిస్తే, అవ్వ మొగుడికేడ్చిందట.
74. పుట్టిన బిడ్డ బువ్వకేడిస్తే, కడుపులో బిడ్డ శనగలు కావాలన్నదట.
75. పూట్టిన బిడ్డల్లా చచ్చేదానికంటే మగడే చచ్చేది మేలు.
76. పుట్టినవాడు గిట్టకపోడు (మానడు).
77. పుట్టినవానికి తమ్ముడు, పుట్టేవానికి అన్న.
78. పుట్టిని చిట్టితో గొలిచినట్లు.
79. పుట్టినిల్లు ఏకాదశి, మెట్టినిల్లు గోకులాష్టమి.
80. పుట్టినిల్లు పుణ్యలోకం, మెట్టినిల్లు ఆరళ్ళలోకం.
81. పుట్టుకకో గుణము, పుఱ్ఱెకో బుద్ధి.
82. పుట్టుకచూస్తే గరుత్మంతుడు, గుణం చూస్తే పీతిరిగద్ద.
83. పుట్తుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగానీ పోదు.
84. పుట్టుచాయే గానీ పెట్టుచాయ వచ్చునా? (నిలుచునా?)
85. పుట్టుట గిట్టుటకొఱకే, పెఱుగుట విఱుగుటకొఱకే, ధరతగ్గుట హెచ్చుట కొఱకే.
86. పుట్టునత్తా? పెట్టునత్తా? (నత్తి).
87. పుట్టు వాసనా? పెట్టు వాసనా?
88. పుట్టు శాగలేనిది పెట్టు శాగ ఎం ప్రయోజనం? (శాగ=చేవ)
89. పుట్టు శాస్త్రులా? పెట్టుశాస్త్రులా?
90. పుట్టెడు అప్పు గడ్డపార మింగినట్లు.
91. పుట్టెడు అప్పయినా కాయవచ్చునుగానీ పుప్పి(పిప్పి) మాటలు ఎవడుపడతాడు?
92. పుట్టెడు ఆముదము రాసుకొని పొర్లాడినా, అంటేదే అంటుతుంది, అంటంది అంటదు.
93. పుట్టెడు నువ్వుల్లో పడ్డా అతికేవే అతుకుతవి.
94. పుడుతూ పుత్రులు, పెరుగుతూ శత్రువులు.
95. పుడుతూ సోదరులు, పెరుగుతూ దాయాదులు.
96. పుణ్యం కలిగిన మగని చేసుకుంటే, పూసలలోనికొక రుబ్బుడురాయి.
97. పుణ్యంకొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డ.
98. పుణ్యంకొద్ది పురుషుడు, విత్తంకొద్దీ వైభవము.
99. పుణ్యం పుట్టెడు, పురుగులు తట్టెడు.
100. పుణ్యానికంటే మా చిన్నాయనను తోలుకొస్తాను అన్నట్లు.

Tuesday, July 26, 2011

సామెతలు 60


1. పిచ్చివాడికి లోకమంతా పిచ్చే!
2. పిచ్చివానికి పింగుమీదనే ఆలాపన
3. పిచ్చివాని చేతి రాయి తగిల్తే తగులుతుంది, తప్పితే తప్పుతుంది.
4. పిచ్చివానికి పిల్లనిస్తే వేలుబెట్టి ఎడం జేసినాడట.
5. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.
6. పిచ్చుకకుంటుమీద భాగీరథి వచ్చినట్లు.
7. పిచ్చుగుంటవాని పెండ్లి ఎంత? వైభవమెంత? (పెడాకు లెంత?)
8. పిట్టకు పట్టే దెంత?
9. పిట్ట కొంచము కూత ఘనము.
10. పిట్టపిడుగున మీయింటిలో విందుకు చస్తావు, బిల్లపిడుగున మాయింటిలో చావకు.
11. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.
12. పిఠాపుతం వెళ్ళి పిడతెడు నీళ్ళు తెచ్చినట్లు.
13. పిడక పొగకే సిగమెక్కితే, గుగ్గిలం పొగ కెట్లూగవలె?
14. పిడకలు తీసుకరారా సువ్వా అంటే, నా పిక్కలు నొచ్చె అవ్వా అన్నాడట.
15. పిడతలో నూనె పిడతలోనే ఉండాలి, బిడ్డలు బీరగింజల్లా ఉండాలి.
16. పిడికెడు బిచ్చం పెట్టలేనాతడు అడిగిందంతా యిచ్చునా?
17. పిడుగుకు గొడుగు అడ్డమా?
18. పిడుగుకు, బియ్యానికి ఒకటె మంత్రమా?
19. పిడుగుకు, బుడ్డకు ఒకటే మంత్రమా?
20. పిడుగు దాకిన పిదప కొరవి చూడినట్లు (కాల్చినట్లు).
21. పిడుగుకు వారశూలా?
22. పిడుగు పడినవాని కొఱవిని చూసినట్లు.
23. పిడుగుపాటుకు టొప్పి (టోపి) యాగునా?
24. పిడుగు బాఱిన డొంకవలె పెంపడగి.
25. పిడుగు పడితే తలనొప్పి యాగునే?
26. పిత్త సత్తువలేదు పాసనాలకు మందట.
27. పిత్తి కంచం (నేల) గోకినట్లు.
28. పిత్తి, పిల్ల నెందుకు కొడతావమ్మా! మళ్ళీవచ్చి నా నెత్తి కొట్టగలవు.
29. పిత్తిన ముత్తయిదువలె.
30. పిత్తి పీట నేలకు రాసినట్లు.
31. పితు పిత్తు మంటే బియ్యానికి సరిసరి అన్నదట.
32. పిత్తులకు దడిసి పప్పు వండటం మానివేసినట్లు.
33. పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు.
34. పిన్న చేతదివ్వె పెద్దగా వెలుగదా?
35. పిన్నమ్మ పెట్టకపోయినా, పోయకపోయినా నా మీద భలే ప్రాణం.
36. పినతల్లి పెట్టు - పిచ్చిదాని ఒట్టు.
37. పిఱికి బంటుకు తుమ్మాస్తి.
38. పిఱికి వాని బింకం పిసరులో ఇంకు.
39. పిఱికి వారికే పిడికెడంత మీసాలు.
40. పిఱ్ఱమీద కొడితే ఫిర్యాదు లేదు.
41. పిఱ్ఱల చప్పుడేగానీ దారి జరుగలేదు.
42. పిఱ్ఱలు చూచి పీట వేసినట్లు.
43. పిఱ్ఱలు చూచి పీట వెయ్యి, ముఖం చూచి బొట్టు పెట్టు.
44. పిల(లు)వకుండా పోయినప్పుడు, గెంటకుండా పొమ్మనటమే కట్నం.
45. పిలవని పేరంటము, చెప్పని ఒక్క పొద్దు.
46. పిలవని పేరంటానికి వెళితే పీటకోళ్ళ దెబ్బ.
47. పిలిచి పిల్లనిస్తా మంటే, కులం (తక్కువ) లేత అన్నట్లు.
48. పిలిచి పిల్లనిస్తా మంటే, మెల్ల అన్నాడట.
49. పిలిచి పెద్దపులికి పేరంటం పెట్టినట్లు.
50. పిలిచేవారుంటే బిగిశేవారు శానామంది.
51. పిలిస్తే పలుకుతుంది కరవు-రాయలసీమలో, పిలవకుండానే పలుకుతుంది అనంతపురంలో.
52. పిలిస్తే బిగిస్తే సరికాని, వస్తే వాడి అబ్బతరమా?
53. పిలువని పేరంటము, వలవని చెలిమి వంటిది.
54. పిల్ల ఉన్నమ్మకు పిడికెడు చోటెక్కువ.
55. పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ.
56. పిల్లకాకి కేమి తెలుసు వింటిలిదబ్బ యేటు (వింటిలిదబ్బ = ఉండేలు దబ్బ).
57. పిల్లకాయలకు, పీటకోళ్ళకు చలిలేదు.
58. పిల్లకు ఏమిపెట్టి పంపినారు శాస్త్రిగారు అంటే- పేదవాళ్ళము ఏమి పెట్టగలము? మీబోటి మహరాజులైతే వేలుబెట్టి పంపుతారు అన్నాడట.
59. పిల్ల కుదిరినా కుదరకపోయినా వచ్చే నెలలో పెండ్లి నిజమన్నాడట.
60. పిల్లకు సొమ్ము పెట్టిచూడు, గోడకు సున్నము కొట్టి చూడు.
61. పిల్ల గలవాడు పిల్ల కేడిస్తే, కాతిగలవాడు కాసు కేడ్చాడట.
62. పిల్ల చచ్చినా పురిటికంపు (పీతికంపు) పోలేదు.
63. పిల్ల నిచ్చిన చోటికి, పీతిరిదొడ్డీకి పోక తప్పుతుందా?
64. పిల్ల నిచ్చినవాడు ఈగ, పుచ్చుకున్న వాడు పులి.
65. పిల్ల పిడికెడు, గూను గంపెడు.
66. పిల్ల పుట్టకముందే కుల్లగుట్టినట్లు.
67. పిల్ల పుట్టగానే పాలు పడ్డట్లు.
68. పిల్ల పెత్తనం, పల్లెటూరి సావాసం.
69. పిల్ల బావిలో పడ్డదిరా అంటే, ఉండు! అంబలి తాగివస్తానన్నట్లు.
70. పిల్లని గిల్లి పైన పప్పర గొట్టినట్లు.
71. పిల్ల పిచ్చుకంత, పింగు మద్దెలంత.
72. పిల్ల ముడ్డి గిల్లి (ఉయ్యాల ఊచినట్లు) జోలపాడినట్లు.
73. పిల్ల ముద్దుగానీ పియ్య ముద్దా?
74. పిల్లలున్న వాడికి, పసులున్నవాడికి సిగ్గుండరాదు.
75. పిల్లలు లేని ఇంట్లో తాత తడుము లాడినట్లు.
76. పిల్లలు లేని ఇంట్లో ముసలోడు దోగాడిండంట (దోగాడట).
77. పిల్లలు లేనిది ఇల్లు కాదు, పిట్టలు లేనిది తోపు కాదు.
78. పిల్ల వాడని పక్కలో వేసుకుంటె, పెద్దోడు (పెద్దవాడు) కొట్టినట్లు కొట్టినాడని (మేనత్త మాట).
79. పిల్లవాడు మూలా నక్షత్రంలో పుడితే, మూల పీకివేసుకుపోతాడట.
80. పిల్లవానికి పీట వేసి, పిల్లకు చేట వేసినట్లు.
81. పిల్లా పిలగానికి పెళ్ళిచేస్తే, ఎలేసి (వెలివేసి) ఎడం చేశాడట.
82. పిల్లా! పిల్లా! నువ్వుల చెట్టుకు నూనె ఎక్కడిదంటే, మాఅమ్మ తొలి సమర్తకీ, మలి సమర్తకీ ఎక్కడున్నావు అందట.
83. పిల్లా! పిల్లా! పెట్టనిస్తావా? అని రావూరు రసికు డడిగితే, నీకు అమ్మనయ్యా అన్నదట నెల్లూరి నెరజాణ.
84. పిల్లా! నీదేమిపోతుంది? మా యమ్మకు కాసేపు కోడలు కాలేవా? అన్నాడట.
85. పిల్లి ఉట్టిచేరులు తెంచగలదు గానీ పాలకుండ పడకుండా (పట్ట)చేయగలదా?
86. పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు రాగోరును.
87. పిల్లి కండ్లుమూసుకొని పాలుతాగుతు, ఎవరూ తన్ను చూడలేదని ఎంచుకొన్నదట.
88. పిల్లికి ఎలుక సాక్ష్యం.
89. పిల్లిగూడా బిక్షం పెట్టదు.
90. పిల్లికి చెలగాటం (చెర్లాటం) ఎలుకకు ప్రాణసంకటం.
91. పిల్లి నెత్తిన వెన్న (పేరిననెయ్యి) బెట్టినట్లు.
92. పిల్లికి రొయ్యలమొలతాడు కట్టినట్లు.
93. పిల్లికి మెడలో రొయ్యలు గట్టినట్లు (అందక వదలలేక బాధ పడుట).
94. పిల్లి గుడ్డిది అని ఎలుక ముడ్డి చూపిందట.
95. పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకదు.
96. పిల్లి తోక ఎద్దు ముట్టితే, ఎలుక దిక్కు ఎఱ్ఱగించి చూచిందట.
97. పిల్లితోక (కాలు) బఱ్ఱెతొక్కితే, ఎలుకమీద మీసాలు దువ్విందట.
98. పిల్లిని చంకలో పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు.
99. పిల్లిని చంపిన పాపం నీది, బెల్లంతిన్న పాపం నాది.
100. పిల్లిని చంపిన పాపం నీకు, బెల్లమీయని పాపం నాకు.

Friday, July 22, 2011

సామెతలు 59


1. పానెం పాడైపోయినా, ప్రాణం కుదుట పడదు (పానెం=భూస్థితి).
2. పాంపుచూచి పసరాన్ని కట్టు.
3. పాంపు సెబ్బరైతే, పసరానికీ సెబ్బరే.
4. పాపటం(ణం)పది సేద్యాల పట్తు.
5. పాపటకాయ కొఱక నెంత? యాకపెట్ట నెంత? (పాపటకాయ=వెఱ్ఱిపుచ్చకాయ).
6. పాపటలో వెంట్రుక నెరిస్తే పత్తిత్తు.
7. పాపదోషానికి పోతే, పట్టి చూచినట్లు.
8. పాపభీతికంటె ప్రజాభీతికే వెరుస్తారు.
9. పాపమని పక్కటెముక ఇస్తే, పీక్కోలేక ఫిర్యాదు చేసినట్లు.
10. పాపమని పట్టెడంబలి పోస్తే, ఉప్పులేదని అలిగి పోయినాడట.
11. పాపమని పాతచీర ఇస్తే, గోడ చాటుకు పోయి మూర వేసిందట.
12. పాపమని పాలు పోస్తే, ఉడుకని ఉఱుకులాడిందట.
13. పాపమని పాలు పోస్తే, పలుచనని పారబోసి నాడట.
14. పాపమని పాలు పోస్తే, వద్దని వలకబోసినాడట.
15. పాపలేని ఇంట్లో, తాత తడివెళ్ళాడినట్లు.
16. పాపాలకు భైరవుడు పాపన్న.
17. పాపజాతి నరుడు పరసతి గోరు.
18. పాపి చిరాయువు, సుకృతికి గతాయువు.
19. పాపి పర్వతం బోతే, దీపాలన్ని పెద్దవైనవట.
20. పాపి సముద్రానికి పోతే, అరికాలు తేమ కాలేదట.
21. పాపిసొమ్ము పరులపాలు, ద్రోహిసొమ్ము దొరలపాలు.
22. పామనగ వేరే పరదేశమున లేదు.
23. పామరజనానికి ఎన్నో తలలున్నవి గానీ, ఒకమెడైనా లేదు.
24. పాముకన్నా లేదు పాపిస్టిదగు జీవి.
25. పాము కరచును, అరవ చెరచును.
26. పాముకాటు చీరతో తుడిచిన పోవునా?
27. పాముకాళ్ళు పాముకే ఎఱుక.
28. పాముకు బదనిక చూపినట్లు.
29. పాముకు విషం పండ్లలో, ఙ్ఞాతికి విషం కండ్లలో.
30. పాము చుట్టము: పడగ పగ.
31. పాము చెలిమి, రాజు చెలిమి ఒకటే.
32. పాముతో చెలిమి కత్తితో సాము వంటిది.
33. పాము పగ, తోక చుట్టము.
34. పాము పడగ క్రింద కప్ప ఉన్నట్లు. (సర్పంబు పడగనీడను కప్పవసించినట్లు).
35. పాము మాదిరి కడకు గామైనట్లు.
36. పాములలో మెలగవచ్చునుగానీ సాములలో మెలగటం కష్టం.
37. పాములు లేనివాడు, వానపామును పట్టుకొన్నట్లు.
38. పాము వంటిదానికే విరుగుడుంటే, పంతుల కుండదా?
39. పాము వరటకపోతే, దాని విషం వరటకపోతుందా?
40. పాము చావకుండా, బడితె విరగకుండా.
41. పాయసంలో నెయ్యి ఒలికినట్లు.
42. పారవేసిన పుల్లాకు బండి కల్లైనట్లు.
43. పారిజాతముతో ప్రబ్బిళ్ళు సరితూగునా?
44. పారినవాని పౌరుషం ఎన్నాలనా?
45. పారుబోతు గొడ్డుకు పగ్గం చాటైతే చాలు.
46. పారేనీటికి పాటినలేదు.
47. పారేబంద్లకు కాళ్ళు చాచిన నిలుచునా?
48. పాలకంకు లోయి దాసరీ అంటే రాలిన మట్టుకే గోవిందా అన్నడట.
49. పాల కోసరం పొదుగు కోసినట్లు.
50. పాలకు కాపల, పిల్లికి తోడు.
51. పాలకడలి లంకలో బుట్టినా కొంగకు తిండి నత్తగుల్లలే.
52. పాలతోగూడా విషము పెట్టినట్లు.
53. పాలను చూడనా? విషాన్ని చూడనా?
54. పాలపొంగు - పడుచుపొంగు.
55. పాలపొంగు - మీలపొంగు.
56. పాలలో పంచదార ఒలికినట్లు.
57. పాలలో పడ్డ బల్లివలె.
58. పాలసముద్రంలోని హంస పడియనీటి కాసపడుతుందా?
59. పాలికివచ్చింది పంచామృతము.
60. పాలివాడు చస్తే పారెడు మన్నెక్కువ.
61. పాలివానికి చేసినమేలు - పీనుగకు చేసిన శృంగారం.
62. పాలివారిని చెరచితివో, పాడైతివో.
63. పాలుఇచ్చే బఱ్ఱెను అమ్మి, పైన ఎక్కే దున్నను తెచ్చుకొన్నట్లు.
64. పాలు ఒల్లని పిల్లి ఉన్నడా?
65. పాలు కుడిచి ఱొమ్ము గ్రుద్దినట్లు.
66. పాలు చిక్కనైతే వెన్న వెక్కసము.
67. పాలు పిండగలము గానీ, తిరిగి చంటిలోకి ఎక్కించగలమా?
68. పాలు పిందని గొడ్డు బఱ్ఱెల కదుపులు మెండు.
69. పాలు పిందను బఱ్ఱె పలు మేతలకు పెద్ద.
70. పాలు పొంగడమంతా పొయ్యి పాలుకే.
71. పాలు బోసి పెంచినా పాము కఱవక మానదు.
72. పాలు బోసి పెంచినా పాముకు విషము పోదు.
73. పాలు బోసి పెంచినా ముష్టిచెట్టుకు విషము పోదు.
74. పాలు బోసి పెంచినా వేపకు చేదు పోదు (తీపిరాదు).
75. పాలుమాలితివో, ఆర్చుకొంటివో!
76. పాలేరు దున్నినవాడు అప్పులపాలు.
77. పాలేరువానికి పశువు పోయినా, మారుతల్లి బిడ్డపోయినా దిగులులేదు.
78. పాళ్ళు పన్నెండు, దెబ్బలు చెరి సగం.
79. పావలాకు పడుకుంటే, పందుం బియ్యం బేపి తినిపోయిందట.
80. పావులా సంపాదనగాడికి వరహా లంజ వరుస గాదు.
81. పాసిన కూడు పక్వానికి వస్తుందా?
82. పాసిన కూట్లో కలిపోస్తే పదునుకు వస్తుందా?
83. పాసిన గుమ్మడికాయ బాపనయ్యకు దానం ఇమ్మన్నట్లు.
84. పాసు ముండా! అంటే, పట్టుతల్లి అన్నట్లు.


పి


85. పింగు తెరచిన ఈగలదాడి.
86. పింజారి మందు, లంజ పొందు.
87. పింజారి పితుకులాట, కురువ గుద్దులాట (పింజారి=దూదేకుల, కురువ=గొఱ్ఱెల మేకల పెంచు ఒక జాతి).
88. పిండానికి గతిలేకపోయినా, పెగ్గెలకు లోటులేదు.
89. పిండికి తగ్గ పిడచ.
90. పిండి కొద్దీ నిప్పటి (నిప్పటి=అరిసె).
91. పిండి కొద్ది రొట్టె, తిండికొద్ది పసరం.
92. పిండి గొన్నవానివద్ద రొట్టె గొన్నట్టు.
93. పిండీ బెల్లం ఇచ్చి, పిన్నమా నీ ప్రసాదం అన్నట్లు.
94. పిండి బొమ్మను చేసి పీతమీద కూర్చుండబెడితే, ఆడబిడ్డతనాన అదిరదిరి పడిందట.
95. పిండీ, ప్రోలు లేనిదే పెండ్లవునా?
96. పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది.
97. పిందెలో పండిన పండు.
98. పిక్కలెగేయ బలిసినా దున్న ఏనుగు కాదు.
99. పిచ్చి కుదురింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
100. పిచ్చి కుదిరితేగానీ పెళ్ళికాదు, పెళ్ళి ఐతేగానీ పిచ్చికుదరదు.

Monday, July 18, 2011

సామెతలు 58

1. పలుచన పాతళ్ళు కోరు, ఒత్తు వాముల గోరు.
2. పలుచని గొడ్డు పాలెక్కువ, పిండని ఆవుకు పొదుగెక్కువ.
3. పలుదని పైరు పాతరలు నింపు.
4. పలుపు దీసుకొని కొట్టరా మొగుడా, పదాలు పాడుతా నన్నదిట.
5. పలువతో సరసము ప్రాణ హాని.
6. పలువురు నడచిన తెరువే పదిలమైనది.
7. పలువురు నడిచిన తెరువున పులుమొలవదు, మొలిచెనేని పొదలదు.
8. పల్నాటిలో పోకకు పుట్టెడు దొరికితే, ఆ పోక దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.
9. పల్లం వైపుకే నీళ్ళు పారేది.
10. పల్లము దున్నినవాడు పల్లకి ఎక్కుతాడు.
11. పల్లమునకు ఏడు దిక్కులు, మెఱకకు నాలుగు దిక్కులు.
12. పల్లాన్న పోయినా ఏనుగే, మిట్టన పోయినా ఏనుగే.
13. పల్లికమ్మ (పలకమ్మ) గడిస్తే, తల్లితో కలుస్తాను.
14. పల్లెటూరికి పదిదారులు (డొంకలు).
15. పల్లెతిరిగినా ఏడేచీరలు, పట్నం తిరిగినా ఏడేచీరలు.
16. పల్లెదాని దగ్గర పొలుసుకంపు అన్నట్లు (చేపలకంపు).
17. పశువుల పాలు మేపును బట్టి.
18. పశువుల రొచ్చు గుంట, పంటకాపు గచ్చు పాతర.
19. పశువులు కాచేవాడు పనిబాట కక్కఱకు రాడు.
20. పశువులు జస్తే బొరగలు వాలినట్లు (బొరగలు=రాబంధులు).
21. పశువులు, శిశువులు గానరసం బెరిగినట్లు.
22. పశువు వచ్చిన వేళ, పడుచు వచ్చిన వేళ.
23. పస చెడి అత్తింట పడియుండుట రోత.
24. పసరం ఒంటిపూట పడ్డా, బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా మానెడు.
25. పసరం పంజైతే పసులకాపరి తప్పు.
26. పసిపిల్లలు, త్రాగుబోతులు నిజం చెబుతారు.
27. పసిమిరోగపు తొత్తుకు మిసిమి మెండు.
28. పసరం లేత, పైరు ముదురు.
29. పసిపిల్లకు పాలకుండకు దృష్టి తగలకుండా చూడాలి.
30. పసిరికలవాని కండ్లకు లోకమంతా పచ్చనే (పసిరికలు=కామెర్లు).
31. పసుపు ఇదిగో అంటే ముసుగు ఇదిగో అన్నట్లు.
32. పసుపు కుంకుమ కోసం పదామడలైనా పరుగెత్తాల.
33. పసుపుకొమ్ము పెట్టని కోమటి పట్టణమంతా చూరవదిలాడట (వసారమంతా కొల్ల లిచ్చాడట)(చూర=కొల్ల).
34. పసుపూ బొట్టు పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్ళక, పెంకు పట్టుకొని పులుసుకు వెళ్ళిందట.
35. పసుపేమే? అంటే పెండ్లి; ముసుగేమే? అంటే ముండ అన్నట్లు.
36. పక్షిమీద గురిపెట్టి పందిని ఏసినట్లు (కొట్టినట్లు).


పా


37. పాండవులవారి సంపాదన ధుర్యోధనులవారి పిండాకూళ్ళకు సరి
38. పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహంకారమున్నది. వివేకానికి తనకేమి తెలియదన్న వినమ్రత ఉన్నది.
39. పాకనాటి పతివ్రత లాగ.
40. పాకలపాటివారి రణకొమ్మువలె.
41. పాకాల చెరువు జూచి, ఆ నీళ్ళన్నీ తానే దున్నాలని దున్నపోతు గుండె పదిలి చచ్చిందట.
42. పాకీదానితో సరసం కంటే, అత్తరుసాహేబుతో కలహం మేలు.
43. పాగా, పంచకట్టు చూచి భద్రిరాజు వనుకున్నానే! వీర్రాజువటోయి పేర్రాజా.
44. పాచికూట్లో కలిపోస్తే పదునుకు వచ్చునా?
45. పాచిపండ్ల దాసరికి కూటిమీదనే ఆలాపన.
46. పాచిపండ్ల వాడు పేర్చి పెడితే, బంగారు పండ్ల వాడు బరుక్కతిన్నాడట.
47. పాచిపెత్తనం పల్లెలో పది గడియలు. (పలుదోముకోకుండానే పెత్తనాలు చేస్తారు).
48. పాచిముండ పర్వతం బోతే (శ్రీశైలం) ఎక్కనూ దిగనూ దప్ప ఏమీ మిగలలేదట.
49. పాచిముఖాన ఎప్పుడైతేనేం భూపాళాలు చదవటానికి.
50. పాచ్చాసాహేబు కూతురైనా, పెండ్లికొడుక్కి పెండ్లామే.
51. పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం.
52. పాటిమీద దేవరకు కూటిమీదనే ఆలాపన.
53. పాటిమీది వ్యవసాయం కూటికైనా రాదు.
54. పాటు కలిగితే కూటికి కొదువా?
55. పాటుకు కోడెదూడ, కూటికి పాడిదూడ (పాటుకు=పనికి).
56. పాటు చేతగానివాడు మాటలకు మొనగాడు.
57. పాట్లెల్లా పట్టేడు కూటి కొరకే.
58. పాడగా పాడగా పాట, మూల్గగా మూల్గగా రోగం.
59. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి.
60. పాడి ఆవును దానం చేసి, పాలు తాను పితుక్కొన్నట్లు.
61. పాడికి పంట తమ్ముదు.
62. పాడికి పసిబిడ్డలకు దిష్టి (దృష్టిదోషం) ఉండదు.
63. పాడికుండ పగులకొట్టు కొనినట్లు.
64. పాడి గుట్టు-పంట రట్టు.
65. పాడితో పంట ఓపదు.
66. పాడి దాచవలె, పంట పొగడవలె.
67. పాడి పసరము, చంటిబిడ్డ ఒకటి.
68. పాడి లేని ఇల్లు, పాడుబడ్డ బీడు.
69. పాడి లేని ఇల్లు, పేడ లేని చేను.
70. పాడి లేని గొడ్డు, బిడ్డ లేని ఆలు.
71. పాడు ఊరిలో పొగిడేవారు లేరు, నాకు నేనే పొగుడుకుంటానని అనుకున్నట్లు.
72. పాడు ఊరికి మంచపుకోడే పోతురాజు.
73. పాడు గోడకైనా పూత చక్కన, కోతి ముండకైనా రాత చక్కన.
74. పాడుబడిన ఊరికి నక్క తలారి.
75. పాడుబడిన ఇంట్లో పంజులు ఎత్తినట్లు (పంజులు=దివిటీలు).
76. పాణి యాహార కబళంబు పారవైచి, కర్పూరము నాకు పినవెర్రికూన.
77. పాత ఒక రోత, కొత్త ఒక వింత.
78. పాతగుడ్డ కుట్టు నూలు చేటు.
79. పాడుగోడకు పూత చక్కన, పాతముండకు కోక చక్కన.
80. పాత చుట్టం- పాత చింతకాయ పచ్చడి.
81. పాతచేటకు పూత అందం (పూత=అలుకుట)
82. పాతతంగెడు పూవు పండగనాటికైనా పనికివస్తుంది.
83. పాతది పనికిరాదు, కొత్తది కొరగాదు.
84. పాతపని పట్టకురా! పల్లెకు దొంగవి కాకురా.
85. పాతబావి నీరు, మేకలపాడి రోత (ప్రాకొన్న నూతి ఉదకము, మేకలపాడియును రోత).
86. పాతముండ కలవరిస్తే, కొత్తముంకు దయ్యం పట్టినట్లు.
87. పాతముండ లందఱూ పోగై, కొత్తముండ తాడు తెంచినట్లు.
88. పాతరలో పడ్డ కుక్క తీయబోతే కరవ వచ్చినట్లు.
89. పాత రోత, కొత్త వింత.
90. పాత లంజ కెప్పుడు భయము లేదు.
91. పాత లంజ వీరమాత అయినట్లు.
92. పాతిక కోతి ముప్పాతిక బెల్లం తిన్నదట.
93. పాతిక గల అమ్మకు పాతిపెట్ట-లేవదియ్య (పాతిక=పావు).
94. పాతిక వట్టం, పరక లాభం (వట్టం=అడితి, కమీషను).
95. పాతూరు బుల్లివెంకమ్మ మొగుడు అన్నట్లు.
96. పాత్ర మెఱిగి దానము, గోత్ర మెఱిగి బిడ్డని ఇవ్వవలె.
97. పాత్ర మెఱిగి దానము, క్షేత్ర మెఱిగి విత్తనము.
98. పాదపానికి పండ్లు బరువా?
99. పానకంలో పుడక వలె.
100. పానకంలో పుడక, పంచదారలో కట్టె.

Saturday, July 16, 2011

సామెతలు 57

1. పదలం నూలుపాగాలేనిది పంతులుకాడు.
2. పది ఆమడల వర్షంతో పరగడ గుఱ్ఱం పరుగెత్తలేదు.
3. ఫది పణాలకన్నా ఫది ఎకరాలు మేలు.
4. పది భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా?
5. పదిమంది కలవాడు పంద అయినా సేద్యం చేస్తాడు.
6. పదిమంది కలవానిదే పాటు.
7. పదిమంది చేరిన పని పాడు.
8. పదిమందితో చావు పెండ్లితో సమానం.
9. పదిమంది నడిచింది బాట, పదిమంది పలికింది మాట.
10. పదిమందిలో పడ్డ పాము చావక పోతుందా?
11. పదియవనాటి ముత్తైదువ వలె (పసుపు కుంకుమ తీసిన తరువాత).
12. పదిరాళ్ళు వేస్తే ఒకరాయైనా తగులదా?
13. పది వేస్తే పచ్చిపులుసు, లేకపోతే పాడుపులుసు.
14. పదురురాడుమాట పాడియై ధర చెల్లు, ఒక్కడాడుమాట ఎక్క దెందు.
15. పద్మరాగాల గనిలో గాజుపెంకులుంటాయా? (అన్నట్లు).
16. పద్మాసం వేసి కూర్చుండగానే పరమాన్నం వడ్డిస్తారా?
17. పద్మినీరతివేడ్క పాంచాలుండుగాక షండుడు తెలుయగలడా?
18. పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నట్లు.
19. పనసపండు తెచ్చి పళ్ళేంలో పెడితే, తినలేని బ్రాహ్మణుడు దిక్కుదిక్కులు చూసాడట.
20. పనసపండ్లలో మామిడిపండ్ల రసముండునా?
21. పనాపాటా, పండుకో మగుడా అన్నదట.
22. పనాపాటా పెండ్లామా అంటే, పండుకొందాం రమ్మన్నదట.
23. పని అంటే నా ఒళ్ళు భారకిస్తుంది, బువ్వ అంటే నా ఒళ్ళు పొంగి వస్తుంది.
24. పనికి పరాకు, తిండికి హుషారు.
25. పనికి పీనుగు, తిండికి ఏనుగు.
26. పనికిమాలు తొత్తు బత్తెంబు చేటయా.
27. పనికి బడుగు, తిండికి పిడుగు.
28. పని గలవాడు పందిరి వేస్తే, కుక్కతోక తగిలి కూలిపోయిందట.
29. పని గలవారింట్లో పైసల ఏట్లాట, పని లేనివారింట్లో పాపోసుల ఏట్లాట.
30. పని చేయనివాడు ఇంటికి దొంగ, పన్నివ్వనివాడు దివాణానికి దొంగ.
31. పని చేయనివానికి ప్రగల్భా లెక్కువ.
32. పని తక్కువ, ప్రాకులాట ఎక్కువ.
33. పని పాతరబెట్టి, గంప జాతరకు పోయినట్లు.
34. పని ముద్దా? పాటు ముద్దా?
35. పని లేక పటేలు ఇంటికి పోతే, పాతగోడకు పూత పెట్టమన్నాడట.
36. పని లేకుంటే పంటకాపింటికి (పంటోళ్ళింటికి) పో, పందిరి గుంజకు గూడా పని చెప్పుతారు.
37. పని లేకుంటే పంటకాపింటికి పోతే, పందిటిగుంజలుగూడా పని చెప్పతవి.
38. పనీ లేదు పాటా లేదు, ఇట్లన్నా మళ్ళు నీ వెంట్రుకలు సరిదీస్తా నన్నట్లు.
39. పనీ లేదు, పాటా లేదు, పట్టత్త! నీకాళ్ళకైనా మొక్కుతాను అన్నట్లు.
40. పనిలేని పాపరాజు ఎంచేస్తున్నాడంటే, కుందేటికొమ్ముకు రేకలు తీస్తున్నడు అన్నట్లు.
41. పని లేని మంగలి పిలిచి తల గొరిగినాడట.
42. పని లేని మంగలి పిల్లితల గొరిగినాడట.
43. పనిలేని మాచకమ్మ పిల్లిపాలు పితికిందట.
44. పని వాడు పందిరివేస్తే, పిచ్చుకలు వచ్చి పడతోసిన వట.
45. పన్నీరుపువ్వును ఏ పేర పిలిచినా సువాసనలనే వెదజల్లుచుండును.
46. పన్నులు (పండ్లు) లేక బెన్నులు పెట్టినారు, పన్నులుంటే పందుం తిననా అన్నట్లు. (బెన్నులు=పెట్టుడు పండ్లు).
47. పన్నెండు ఆమడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యఙ్ఞం చేయిస్తా నన్నాడట.
48. పన్నెండూండ్ల పారుపత్తెం గాడికి పనితీరికే ఉండదు (పారుపత్తెంగాడు=పెత్తనం చేసేవాడు).
49. పప్పుకూటికి పది ఆమడలైనా వెళ్లమన్నారు.
50. పప్పుకూటికి ముందు, వెట్టిమూటకు (చాకిరికి) వెనుక వెళ్ళమన్నారు.
51. పప్పుచారు అడుగడుగుది - పరమాన్నం పైపైది రుచి.
52. పప్పుతో పది కబళాలు తింటే, పులుసెందుకు బుగ్గిలోకా?
53. పప్పు దప్పళానికి నీవు; పాపోసు దెబ్బలకు నేనా?
54. పప్పు పైత్యం, చారు సీత్యం.
55. పప్పు బానలమీది బడబాగ్నులారా, పిండివంటమీది పిడుగులారా, ఏలబుట్టిరి వెలనాటి స్వాములారా?
56. పప్పులు పెట్టి పోరు మాంపినట్లు.
57. పప్పు లేని పులగం, ఉప్పు లేని దప్పళం.
58. పప్పు లేని పెండ్లి, ఉప్పు లేని కూర.
59. పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పేయమంటే, చెప్పువేసి తీసి అత్తకు అంచుకు పెట్టిందట.
60. పప్పు వంటకత్తెను బండిమీద వేస్తే ఎసు(స)రుకు ఎన్ని ముంతలు పెట్టేది? అన్నదట.
61. పప్పు శబ్ధంబునకు ఘృతశబ్ధంబు పరమగునపుడు అపాన వాయువు ఆదేశంబగు.
62. పప్పే పస బాపనులకు, ఉప్పే పస రుచులకెల్ల, ఉవిదలకెల్లన్ కొప్పేపస.
63. పయి బడ్డ మాట, మడిబడ్డ నీళ్ళు పోవు.
64. పయిసా ఇచ్చి, పాపం కొనుక్కొన్నట్లు.
65. పయోముఖ విషకుంభము.
66. పరకాంత లెందరైనను కులకాంతకు సాటిరారు.
67. పరచు గుఱ్ఱపు తోకబట్టి ఈడ్వగ వచ్చు గానీ తప్పించుకోరాదు దాని తన్ను.
68. పరనింద గృహక్ష్యం, యతినింద కులక్షయం.
69. పరమవంధ్యకు పాలుపెరుగు పోయగానే చంటిపాలు కలుగనేర్చునా?
70. పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు.
71. పరమానందయ్యగారి శిష్యుడు
72. పరాయిపిల్ల గాజులు పెడితే పైకానికి చేటు.
73. పరాశికాల బాపనయ్యకు పాముకరిస్తే, మందులేక మరణమైనాడు (పరాశికాల=పరిహాసాల).
74. పరిగేరుకొనేదానికి ఓదె దొరికినట్లు. (పరిగె=పైరుకోసిన చేల్లో జారిపడిన వెన్నులు; ఓదె=పైరుకోసి ఎండుటకు చాళ్ళు చాళ్ళుగా వేసినది, పన).
75. పరిగనేరిన పాతట్లోకి ఆగునా?
76. పరిగేరిన గింజలు కరువు కడ్డం రావు.
77. పరిచయానికి ప్రథమచుంబనానికి మధ్య నున్న కాలాన్ని ఆదర్శ ప్రేమ అంటారు.
78. పరిహాసం పైన వేసుకొని, జాణతనం చేతపట్టుకొని జాతరకు పోయినాడట.
79. పరుగెత్తి పాలు తాగేకన్నా, నిలబడి (నిలుచుండి) నీళ్ళు తాగేది మేలు.
80. పరుగెత్తి పసూలుకాస్తే పొద్దు కూకుతుందా? (కునుకుతుందా?)
81. పరుగెత్తు పందకు కాంతలతోడి చింతయా?
82. పరుగెత్తే పాముకు పాదములు కల్పించుట, అల్లనేరేడుపండ్లను తెల్లచేయుట వంటిది.
83. పరుగెత్తే ఎద్దునే తరిమేది
84. పరుగెత్తే వాణ్ణి చూస్తే, తరిమేవాడికి లోకువ.
85. పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము
86. పరుల సొమ్ము పేలపిండి, తన సొమ్ము దేవుడి సొమ్ము.
87. పరు విచ్చి పరువు తెచ్చుకొ.
88. పరువుకీ, కరువుకీ డబ్బు.
89. పరువు తప్పిన బ్రతుకు రోత, సతికిచాలని పురుషుని బ్రతుకు రోత.
90. పరువులేని నడపీనుగకు ఊరేమి? పాడేమి?
91. పలకమ్మ పున్నానికి పడమటికొమ్మ పూస్తుంది. (పలకమ్మ=పున్నమ, మార్గశిర పూర్ణిమ).
92. పలకమ్మ పున్నానికి పడుగులు పడతాయి.
93. పలుకని వాళ్లతో పదిఊళ్ళ వాళ్ళయినా గెలువలేరు.
94. పలుకు తేనెపట్టు, పిడకిలి కోతిపట్టు.
95. పలుకులేమో పంచదార, నిలువెల్లా బొంకులపుట్ట.
96. పలుకులు బంగారం, గుణము పాలకన్నా పలుచదనము.
97. పలుగాకులకు తల్లి పార్లపల్లి.
98. పలుగాకులకు మేలు లేదు, పంజగొడ్డుకు పాలులేవు (పంజ=గొడ్డుబోతు (పిరికి)).
99. పలుగులు కాల్చి పక్కలో వేసినట్లు.
100. పలుచన పంట వేడుక, ఒత్తు చూపుల వేడుక.

Saturday, July 9, 2011

సామెతలు 56

1. పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు.
2. పగటి మాషాజీకి (మషాల్జి) అనుమతి ఎవరిచ్చారు? అంటే, నా ఆముదపు చేను ఇచ్చింది అన్నాడట (మషాజి=దీపములు దివిటీలు పట్టేవాడు).
3. పగడములేని ఇల్లు, జగడము లేని ఇల్లు ఉండవు.
4. పగతో పొరుగిల్లు కాల్చవచ్చును గానీ, తన ఇల్లు కాపాడ తరముగాదు.
5. పగపట్టిన త్రాచు కాటు వేయక మానుతుందా?
6. పగలు ఎండ, రేయి చీకటి, ఎప్పుడు దున్నుతావే దిన్నపోతా?
7. పగలు కొంగులాగితే చీ! అంటే రాత్రి చీకటిలో కన్ను గీటాడట.
8. పగలు చస్తే వాతికి లేదు (వాతబియ్యం), రాత్రికి చస్తే దీపానికి లేదు.
9. పగలు చెయ్యూపితే రానిది (ఆడుది) రాత్రి కన్నుగీటితే వస్తుందా?
10. పగలు చూస్తే రాత్రి కలలో వస్తుంది అన్నట్లు.
11. పగలు దాని గుణం చూసి, రాత్రి దాని వెంట వెళ్ళాలి.
12. పగలు నిద్ర పనిచేటు, మాపు జాగారణపై చేటు.
13. పగలు పక్కచూచి మాట్లాడు, రాత్రి అదీ మాట్లాడవద్దు.
14. పగలు పప్పేసిన పయ్యెందుకు పగులు పెండ్లామా? నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడుదు పెండ్లామా? (పై= శరీర పై భాగము, వీపు).
15. పగలు పాతరలుండవు (పగలు=స్పర్ధలు, విరోధాలు).
16. పగలు ఉపస్థ వెడల్పు, రాత్రి నీళ్ళు వెడల్పు.
17. పగలు బట్టలే కంపించకున్న రాత్రి గొఱ్ఱెలు కనిపిస్తాయా?
18. పగలు చత్వారి, రాత్రి రేజీకటి.
19. పగలెల్లా బారెడు నేసినాను, దివ్వె తేవే దిగనేస్తాను అన్నదట.
20. పగవాణ్ణి పంచాంగ మడిగితే, మధ్యహ్నానికి మరణ మన్నాడట.
21. పగవాని ఇంట ఫది బిచ్చాలు పోయినా పోయినవేను.
22. పగవారిని చెరబట్టక ముద్దాడవత్తురా?
23. పచ్చగా ఉంటే పారాడేది, వెచ్చగా ఉంటే వెళ్ళిపోయేది.
24. పచ్చగా ఉన్నవాళ్ళకు, ఎదుటివారి వెచ్చన తెలియదు.
25. పచ్చగా ఉన్న దగ్గఱ మేసి, వెచ్చగా ఉన్నదగ్గఱ పండు.
26. పచ్చడ మున్నంత కాళ్ళు చాచు.
27. పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచి ఎక్కడికీ పోదు.
28. పచ్చని పైకము గుఱ్ఱము చచ్చినదాకానే.
29. పచ్చని వరహా కంటే, పుచ్చిన గింజే మేలు.
30. పచ్చికంకులే దాసరీ, అంటే రాలినకాడికే గోవిందా అన్నాట్ట!
31. పచ్చికంకులోయి దాసరీ అంటే రాలినకాడికే రామార్పణం అన్నాడట.
32. పచ్చికాయ తుంచిన పండవుతుందా?
33. పచ్చికుండలో నీళ్ళుపోయి, నీ పాతివ్రత్యం తెలుస్తుంది అన్నట్లు.
34. పచ్చిపేడను తంతే, పదహారు వక్కలయ్యే ప్రాయం.
35. పచ్చివెలగకాయ గొంతులో పడ్డట్లు.
36. పటేలువారి వడ్లపుణ్యాన్నా, మా యత్త ముడ్డి పుణ్యాన్నా తింటినమ్మా పుల్లటికూర మెతుకులు.
37. పట్టణానికి పోయిన గాడిద, పల్లెకు పోయిన గాడిదని కఱచిందట.
38. పట్టపగలు కన్న మేస్తావేమిరా? అంటే, నా కడుపు కక్కూర్తి నీకేమి తెలుసును? అన్నాదట.
39. పట్టపు రాజు చేపట్టగానే గుడిసేటి ముండకు గుణము రాదు (గుడిసేటి=గుడికి చేటి-దేవదాసి. ఇప్పుడు విడిచినది వ్యభిచారిణి).
40. పట్టినదెల్లా బంగారం, ముట్టినదెల్లా ముత్యం.
41. పట్టినవాడు (పట్టుకొన్నవాడు) తాబేలు అంటే, గట్టునున్నవాడు కుందేలు అన్నట్లు.
42. పట్టినవాడు పక్కి అంటే, గట్టునున్నవాడు జెల్ల అన్నట్లు (పక్కి=చిన్న వెడల్పు చేప, జెల్ల=తేలువలే కుట్టే చిన్నచేప).
43. పట్టినవాడు వరిగపిల్ల అంటే, పట్టనివాడు మట్టపిల్ల అన్నాడట.
44. పట్టినవాడు మట్టగుడిసె అంటే, ఒడ్డునున్నవాడు జల్లపిల్ల అన్నట్లు (మట్టగుడిసె=నల్లటి చిన్న చేప).
45. పట్టిపట్టి పంగనామం పెడితే గోడచాటుకెళ్ళి గోకేసుకున్నాడట.
46. పట్టివిడిచిన ముండకు పటొటాపం జాస్తి.
47. పట్టివిడిచిన ముండ (మొగుడు విడిచిన ముండ) మబ్బు విడిచిన ఎండ.
48. పట్టి విడుచుటకంటే ప్రాణం విడుచుట మేలు.
49. పట్టిసం తీర్ఠానికి పత్తిగింజలంత మామిడిపిందెలు.
50. పట్టు కత్తిరించినట్లు మాట్లాడినా మనసేమో పలుగురాయి.
51. పట్టుకొమ్మను నరుకు కొన్నట్లు.
52. పట్టుగుడ్డకు, భ్రష్టుముండకు అంటులేదు.
53. పట్టుచీర ఎరవిచ్చి, పీటపట్టుక వెంట తిరిగినట్లు.
54. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.
55. పట్టుపట్టు మనేవాళ్ళేగానీ, పట్టేవాళ్ళూ ఒక్కరూ లేరు.
56. పట్టుపుట్టము తొత్తుకు కట్టబెట్టిన పేడమరకలతో పాడుచేయును.
57. పట్టెడు బొట్టుంటే పదిలక్షలు.
58. పటనం దగ్గరకు వచ్చి పల్లెలో రత్నపరీక్ష చేయించినట్లు.
59. పట్నం పోయి పుట్నం గింజ తెచ్చాడన్నట్లు.
60. పఠానులకు నేను బాకీ, ఫకీరులు నాకు బాకీ.
61. పడుచువాని పెండ్లాము ప్రణయిని, నడిప్రాయం వానిభార్య సహధర్మచారిణి, ముసలివాని ఇల్లాలు దాసి.
62. పడతులకు బుద్ధి పెడతల నుండు.
63. పడతుక, వంకాయ, సమూలమధురములు.
64. పడబోయి పూపాన్పుపై పడినట్లు.
65. పడమట క్రుంకిన పొద్దు తూర్పున లేవదా?
66. పడమట కొఱడువేస్తే పాడుగుంటలన్నీ నిండును; తూర్పున వేస్తే తుంగగడ్డి కూడా మొలవదు (కొఱడు, కొఱ్ఱు=ఇంద్ర ధనుస్సు).
67. పడమట కొఱ్ఱుఒడ్డితే (వేస్తే) పందిళ్ళమీద రాజనాలు పండుతాయి.
68. పడమట కొఱ్ఱువేస్తే పాడిఆవు ఱంకె వేస్తుంది.
69. పడమట పావురాపిట్టంత (పూరేడుపిట్టంత) మబ్బు నడీతే, పాతాళందాకా వాన.
70. పడమట మెరిస్తే, పంది అయినా నీళ్ళకు దిగదు.
71. పడమటివీధి అమ్మ సరిగ పెట్టుకుంటే, ఉత్తరవీధి అమ్మ ఉరి పెట్టుకుందట.
72. పడవ ఒడ్డు చేరితే పడవవాని మీద ఒక సొడ్డు.
73. పడిన గోడలు పడ్డట్లుండవు, చెడిన కాపురం చెడి నట్లుండదు.
74. పడిలేస్తే పాతరలోతు తెలుస్తుంది.
75. పడిశము పది రోగాల పెట్టు.
76. పడుకోవడం పాతగోడలలో, కలవరింతలు మిద్దెటిండ్లలో.
77. పడుగు పేకా కలిస్తే గుడ్డ, ఆలుమగడు కలిస్తే ఇల్లు.
78. పడుగూ పేకా గుడ్డకు, మంచి చెడ్డా మనిషికి.
79. పడుచుకొన్న ఇల్లు తుడుచుకు పోతుంది. (పడుచుకొనుట=ఱంకు చేయుట).
80. పడుచుగుంట, కడుపుమంట.
81. పడుచు(తో) పశువులు ఉంటేనే సేద్యం.
82. పడుచుతో సయ్యాట, పాముతో చెలగాటం (చెర్లాట).
83. పడుచు పొందు ఫలం లేదు.
84. పడుచుల కాపురం - చిగురుల మంట.
85. పడుచు సేద్యం పాకానికి రాదు.
86. పడ్డకు, పడుచుకు పలుపు కడితే వెంటపడతారు.
87. పడ్డవారు చెడ్డవారు కాదు.
88. పణ్యారం పట్టు దాసప్పా! అంటే, ఏ చేని సజ్జలు? అన్నాడట. (పణ్యారం= పందేరం, దేవాలయాలలో పంచిపెట్టు ప్రసాదం).
89. పతికి మోహములేని జవ్వనము, పరిమళించని సుమము.
90. పతిభక్తి చూపిస్తాను మొగడా, చెప్పులు తే, నిప్పులు తొక్కుతాను.
91. పత్తికి పది చాళ్ళు, ఆముదాలకు ఆరు చాళ్ళు.
92. పత్తిగింజల గంత కట్టనా బసవన్నా! అంటే ఊహూ అన్నాడట.
93. పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట.
94. పత్రి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద.
95. పత్రిలేని పూజ, పత్రం లేని అప్పు.
96. పథ్యం చెడరాదు, సత్యం తప్పరాదు.
97. పద(దు)ను తప్పినా, అద(దు)ను తప్పినా పన్ను దండుగే.
98. పద(దు)ను పోయిన కత్తి, అద(దు)నుపోయిన సేద్యం.
99. పదము తప్పినా ప్రాస తప్పరాదు.
100. పదమొక బానిస, రాగం ఒక రంభ.

Sunday, July 3, 2011

సామెతలు 55

1. నోటి జిగటేగానీ, చేతికి జిగట లేదు.
2. నోటితో లేదనేది చేతితో లేదంటే సరి.
3. నోటిమీద కొడితే పెడతల వాచిందట.
4. నోటి వక్రం గంజి పెడమూట.
5. నోటి పట్టం, గంజి పెడ పూట.
6. నోటిలో చెక్కెర, కడుపులో కత్తెర.
7. నోట్లో నూవుగింజ (అయినా) నానదు.
8. నోట్లో ముద్ద, గూట్లో దీపం (జైనులు దీపం పెట్టేదానికి ముందరే భోజనం చేస్తారనుట).
9. నోట్లో వేలుపెడితే కరవనేరని నంగనాచి.
10. నోరంతా పళ్ళు, ఊరంతా అప్పులు.
11. నోరు అంబాలపు (అప్పాలపు) పండు, చెయ్యి (బ)బులుసు ముల్లు.
12. నోరు ఉంటే ఊరు ఉంటుంది.
13. నోరు ఉంటే పోరు గెలుస్తుంది.
14. నోరు ఉన్న తల గాచును.
15. నోరు ఉన్నవాడిదే రాజ్యం (ఊరు).
16. నోరు కల్లపుట్ట, పేరు హరిశ్చంద్రుడు.
17. నోరు చేసే అఘాయిత్యానికి ముడ్డి ఉంది గనక భరిస్తున్నది.
18. నోరు నవ్వడం, నొసలు వెక్కిరించడం.
19. నోరు పెట్టుకొని గెలవవే ఊర గంగానమ్మ!
20. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
21. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు.
22. నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే ఱాగ (ఱాగ=గయ్యాళి).
23. నోరు మూస్తే నొసలు మాట్లాడినట్లు (వాగినట్లు).
24. నోరు మూస్తే పెడతల మాట్లాడినట్లు.
25. నోరు లేని దయ్యం ఊరు ఆర్పిందట.


న్యా


26. న్యాయ మమ్మువాడు, దోవలు దోచువాడు ఒకటి.
27. న్యాయము చెప్పు నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దఱు పెళ్ళాలే అన్నాడట.
28. న్యాయము తప్పినవానికి ఆచార్య కటాక్ష మెందుకు?


29. పంచపాండవులంటే నాకు తెలియదా? మంచపుకోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
30. పంచమినాడు పల్లకి ఎక్కనూ లేదు, అష్టమి నాడు జోలి పట్టనూ లేదు.
31. పంచశుభం పంచాశుభం.
32. పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా?
33. పంచాగ్ని మధ్య మందున్నట్లు.
34. పంచినవాళ్లకు పళ్ళు నోరు.
35. పంచ కేలరా పత్తి ధర.
36. పంజకు ధైర్యము, కల్లుముంతకు ఎంగిలి లేవు.
37. పంజరం అందంగా ఉంటే, పక్షికి సంతోషమా?
38. పంజరంలో కాకిని పెట్టగానే పంచమస్వరం ఆలపిస్తుందా?
39. పంటకు రాని చేలు, పరిభావ మెరుంగగలేనిని ఆలు.
40. పంటకు పెంట, వంటకు మంట.
41. పంటచేను విడచి పరిగ ఏరినట్లు.
42. పంట పెంటలో ఉన్నది, పాడి పురిలో ఉన్నది.
43. పంటిపాచి పోయిన యింటిహీనం పోతుంది.
44. పండని ఏడు పాటు ఎక్కువ.
45. పండని కోర్కెలే బొంకులు.
46. పండని నేల పందుం కంటే పండే నేల కుంచెడే చాలు.
47. పండని నేల పుట్టెడుకంటే, పండే నేల పందుం చాలు.
48. పండాకును చూచి పసరాకు (పచ్చాకు) నవ్వినట్లు.
49. పండాకు రాలుతుంటే, కొత్తాకు నన వేస్తుంటుంది.
50. పండాకు రాలుతుంటే, పసరాకు నల్లబడుతుంది.
51. పండించేవాడు పస్తుంటే, పరమాత్మకూ పస్తే.
52. పండిత పుత్రుడు శుంఠ.
53. పండితమ్మన్యునకు పాదుకా పట్టాభిషేకం.
54. పండిన దినమే పండుగ.
55. పండినా, ఎండినా పని తప్పదు.
56. పండియు పొల్లు బోయిన పంట.
57. పండు కాయుండగా, కసుగాయ తెంచినట్లు (కోసినట్లు).
58. పండుగ తొలినాడు గుడ్డల కఱవు, పండుగనాడు కూటికఱవు, పండుగ మఱునాడు మజ్జిగ కఱవు.
59. పండుగనాడు కూడా పాత మొగుడేనా? అన్నదట.
60. పండుగనాడు కూడా పాత పెళ్ళామేనా?
61. పండుగ పైన దండుగ.
62. పండుజారి పాలలో పడ్డట్టు.
63. పండు (పండుకొను) పడకకు చెప్పకుండా పోయినాడు.
64. పండుపండిన చెట్టు పట్టంగ నేర్చునా?
65. పండేపంట పైరులోనే తెలుస్తుంది.
66. పండ్ల చెట్టు కింద ముళ్ళకంప ఉన్నట్లు.
67. పండ్లు ఉన్నవానికి పప్పులు లేవు, పప్పులున్నవానికి పండ్లు లేవు.
68. పండ్లు చెట్లకు భారమా?
69. పండ్లూడ గొట్టుకోను ఏరాయైతే నేమి?
70. పండ్లూడిన కుక్క పసరాన్ని కరవదా?
71. పండ్లూడిన కుక్కను పసరమైనా కరచును.
72. పంతులకు కట్నాలు, మాకు పట్నాలు.
73. పంతులు గింతులు, పావుశేరు మెంతులు, ఎగరేసి కొడితే ఏడు గంతులు.
74. పంతులు పెండ్లాము మెంతులులేక, గంతులు వేసిందట.
75. పంది ఎంత బలిసినా నంది కాదు.
76. పందికి పారులేదు, తవిదకు తప్పులేదు.
77. పందికేమి తెలుసురా పన్నీరు వాసన?
78. పంది కేలరా పన్నీరు బుడ్డి.
79. పందికొక్కును పాతరలో పెడితే ఊరుకుంటుందా?
80. పందికొక్కు మీద బండికల్లు (చక్రం) పడ్డట్టు.
81. పందిగా పదేళ్ళు బ్రతికేకన్నా నందిగా నాలుగేండ్లు (బతికేది మేలు) బతికితే చాలు.
82. పందిని పొడిచినవాడే బంటు.
83. పంది పందిగూడి పడుగదా రొంపిలో.
84. పంది పాత అప్పులు తీరుస్తుంది, కోడి కొత్త అప్పులు తీరుస్తుంది.
85. పందిపై ఎక్కి పీతికి రోస్తే ఎట్లా?
86. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
87. పందిమాదిరి కుక్కను మేపి, దొంగలొస్తే ఆలుమగలే అరచినారట.
88. పందిరి ఇల్లు కాదు, పరదేశి మొగుడు కాదు.
89. పందిరి పడి చచ్చినవారు, ఇల్లు పడి బ్రతికినవారు లేరు.
90. పందిరే పర్వతము, ఇల్లే ఇంద్రలోకము.
91. పందిలాగా కని, పరగళ్ళమ్మ పాలు చేసినట్లు.
92. పందిళ్ళు పైన పరువు లెత్తనా?
93. పందులు తినేవాని పక్కనే ఏనుగులు గుటకేసే వాడుంటాడు.
94. పందుము తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాదశే!
95. పక పక నవ్వేవాడు, గబగబ అరచేవాడు కపటమెఱుగరు.
96. పకీర్లను కొట్టి పఠానులకు పెట్టినట్లు.
97. పక్క ఇంటి పోరు పండుగంత వేడుక.
98. పక్కవాటుగా నడిచే ఎండ్రకాయను చక్కగా నడిచేట్లు ఎవ్వరు చేయగలరు?
99. పక్కలో బల్లెము.
100. పగ గలిగి బ్రతకటం, పామున్న ఇంట్లో పడుకోవటం ఒక్కటే.