Saturday, September 24, 2011

సామెతలు 71


1. మంగలంబుచేయి మంగలి హీనుడా?
2. మంగలములోని పేలాల వలె.
3. మంగలికత్తికి మాకులు తెగునా?
4. మంగలికత్తి వాయిని (వాదరను) నాలికతో నాకినట్లు.
5. మంగలి కొండోజి మేలు మంత్రులకంటెన్.
6. మంగలి గొరిగి నేర్చుకుంటే, వైద్యుడు చంపి నేర్చుకుంటాడు.
7. మంగలిని చూచి ఎద్దు కాలు కుంటిందట.
8. మంగలిపని అనుకున్నావా తడిపి దిగ గొరగడానికి? (ఎగ గొరగడానికి?)
9. మంగలి పాత, చాకలి కొత్త.
10. మంగలివాని కత్తికి తన చేతిలోనూ విశ్రాంతి ఉండదు, ఇతరుల చేతిలోనూ విశ్రాంతి ఉండదు.
11. మంగలివాని దిబ్బ తవ్వేకొద్దీ బొచ్చే.
12. మంగలివాళ్ళ పెళ్ళికి మఱొక దెబ్బ (డోలు).
13. మంగళోళ్ళ ఇంటెనక బొచ్చుదిబ్బకాక మరేముంటుంది?
14. మంగళగిరి మూల మాడంత మబ్బు ఏలితే ఈమని జంపనల్లో ఈతలు మోతలు.
15. మంగళవారం నాడు మండెలు వేయకూడదు.
16. మంచము అల్లలేని మగవాడు - మజ్జిగ చిలకలేని ఆడది.
17. మంచము కోళ్ళకు, మాతామహులకు ముడివేసినట్లు.
18. మంచ మున్నంతవరకు కాళ్ళు చాచుకోవాల.
19. మంచ మున్న దగ్గఱే నీళ్ళాడమన్నట్లు.
20. మంచముపై ముసుగులు, మనసులో విసుగులు.
21. మంచముపై ఉన్నంతసేపు మగడు, కిందకి దిగితే యముడు.
22. మంచ మెక్కిన మీదట మర్యాదలేల?
23. మంచమెక్కి వరుస లడిగినట్లు.
24. మంచమెక్కి వావి తడవినట్లు.
25. మంచి ఉల్లిగడ్డకు మంచి బొడ్డు.
26. మంచికాలానికి మామిళ్ళు, చెడుకాలానికి చింతలు (కాయుట).
27. పంచి పగడాలు చూపి, మాయ పగడాలు అమ్మినట్లు.
28. మంచికి పోతే చెడ్డ ఎదురైనట్లు.
29. మంచికి పోతే మంచినీళ్ళు కూడా పుట్టవు.
30. మంచి కొంచమైనా చాలు, విత్తనం చిన్నదైనా చాలు.
31. మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగాలేకుంటే మావాడు చేశాడనుకో.
32. మంచిగొడ్డు కొక దెబ్బ, మంచి మనిషి కొక మాట.
33. మంచిచెడ్డలు దేవును కుడి ఎడమ చేతులు.
34. మంచిచెడ్డలు పడుగు పేకలు.
35. మంచి చేసిన ముంగికి ముప్పు వచ్చినట్లు.
36. మంచి దున్నపోతయినా మందకొడి ఎద్దుకు సరిరాదు.
37. మంచినోరు చేదు మింగినట్లు.
38. మంచి పెంపు, చెడ్ద లోతు అన్ని దేశాలలో అన్ని జాతులలో సమానం.
39. మంచి ప్రాణానికి మండలం వఱకు భయం లేదు (మండలం=40 దినాలు).
40. మంచి మంగలైనా, ఎగ గొరిగితే మంటే.
41. మంచి మంచి ముహూర్తాలు మీఇంట్లోనూనా? మాచకమ్మ సమర్తలు మాఇంట్లోనూనా?
42. మంచి మంచి వారంతా మడుగులో మునిగితే, కోణంగిదాసరి కోనేటిలో మునిగెనట.
43. మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.
44. మంచివాడు మంచివాడంటే, మంచమంతా ఏరిగి పెట్టినాడట.
45. మంచివాడు మంచివాడంటే, మంచమంతా కంతలు చేసినాడట.
46. మంచివాడు మంచివాడంటే, మంచమెక్కి గంతులు వేశాడట.
47. మంచివాడు మంచివాడంటే, మదురెక్కి ఉచ్చ పొశాడట.
48. మంచివాడైనందుకు మరణమే శిక్ష.
49. మంచివాని కొకమాట, మొరకు కొక వ్రే(ఏ)టు.
50. మంచివాని చావు మరణంలో తెలుస్తుంది.
51. మంచివాని గుణం మాంసం దగ్గఱ, సత్యవంతుడి గుణం చావు దగ్గఱ తెలుస్తుంది.
52. మంచివానికి మాటే మందు.
53. మంచివాని దగ్గఱకు మంచివారిని పంపినారు, నీదగ్గరకు నన్ను పంపినారు.
54. మంచు కుంచాల కొలిచినట్లు.
55. మంచుకు పెట్టిన పందిళ్ళు ముసారాకు అగునా?
56. మంచుకు వేసిన పందిళ్ళు వాన కాగునా?
57. మంజులాలాపము లేని కావ్యము, విలాసములేని వధూటి.
58. మంటి ఎద్దయినా మా ఎద్దే గెలవాలి.
59. మంటిదేవునికి మజ్జనమే సాక్షి.
60. మంటిపనికైనా ఇంతివాడే వెళ్ళాలి.
61. మంటిలో మానెడు, ఇంటిలో పుట్టెడు.
62. మంత్రం చెప్పను మల్లుభట్లు, తినేదానికి తిప్పంభట్లు.
63. మంత్రం లేని తీర్థం మరి బుక్కెడు.
64. మంత్రం లేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు.
65. మంత్రంలో పసలేకపోయినా తుంపర్లకు తక్కువ లేదు.
66. మంత్రజలము కంటే మంగలి జల మెచ్చు.
67. మంత్రసాని తనానికి ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి.
68. మంత్రసాని దెప్పులు, అత్తగారి సాధింపులు.
69. మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు, బిడ్డ వచ్చినా పట్టాల, పియ్య వచ్చినా పట్టాల.
70. మంత్రసాని ముందట మర్మం దాచినట్లు.
71. మంత్రాలబువ్వ కడుపులోనికిపోతే యంత్రాలు చేయిస్తుంది, యంత్రాలున్న బువ్వ కడుపులోనికి పోతే తంత్రాలు చేయిస్తుంది.
72. మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా?
73. మంత్రాలు తక్కువ, తుంపరు లెక్కువ.
74. మందగుది ఎద్దు నడక, నత్తిమాటలు - మొదటసాగవు.
75. మందబలం చూచి కుక్క మొరుగుతుంది.
76. మందలింపు బెడిస్తే ముప్పు.
77. మందికి చెప్పానుగానీ మనకు చెప్పానా?
78. మందిని ముంచి మసీదు కట్టినట్లు.
79. మంది పలుచనైతే, గంజి చిక్కన అవుతుంది.
80. మంది మాటవిని మనువుపోతే, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది.
81. మంది యెక్కువయితే (మోపయితే) మజ్జిగ పలుచన.
82. మంది యెక్కువయితే 9లావయితే) మఠానికి చేటు.
83. మందు పథ్యం, మాటకు సత్యం.
84. మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు.
85. మందుగానీ మాకు లేదు గానీ కూర్చువా డొక్కడే కొదువ.
86. మందుమాకిడి గండమాల మాంపగలేడు చక్కచేయగలడే నక్కమొర (గండమాల=మెడచుట్టు మేహగ్రంధులు లేచు వ్యాధి).
87. మందూ లేదు గుండూ లేదు, తుపాకీ పట్టుక కాల్చమన్నట్లు.
88. మందైనా కావాలి, ముండైనా కావాలి.
89. మకరందపానంబు మధుకరాలికిగాక జోరీగలు జుఱ్ఱగలవా?
90. మకురాంకు కేళికోర్చిన ముకురానన మల్లయుద్ధమున కెట్లు ఓపు.
91. మక్కాకు పోయి కుక్క (బొచ్చు) మలం తెచ్చినట్లు.
92. మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.
93. మక్కువపడి ముక్కాలిపీటా చేయించుకుంటే, డోరియాకోక కత్తిరించుక పోయిందట.
94. మగడు విడిచిన ముండ, మబ్బు విడిచిన ఎండ.
95. ముఖాపంచకము సదా వంచకము.
96. మగడు ఒల్లనమ్మను మారీ ఒల్లదు.
97. మగడు చచ్చిన తర్వాత ముండకు బుద్ధివచ్చినట్లు.
98. మగడు లేని మనువున్నదా?
99. మగడు చిన్నకాగానే ముండమోపితనం తప్పునా?
100. మగడు నబాబైనా బూబమ్మకు కుట్టుపోగులే (కాడలే).

Saturday, September 17, 2011

సామెతలు 70


1. బోడితలకు బొండు (బొద్దు) మల్లెలు ముడిచినట్లు.
2. బోడితలకు, బొటనివేలికి ముడి పెట్టినట్లు.
3. బోడి పెత్తనం - కోడి కునుకు (ఎంతోకాలం సాగవనుట).
4. బోడి పెత్తనం - తంబళ్ళ దొరతనం.
5. బోడినెత్తిన టెంకాయ కొట్టినట్లు.
6. బోడిమాను గాలికి మిండడు.
7. బోడిముండకు తలసుళ్ళు వెదకినట్లు.
8. బోడెద్దుకు పోట్లు మప్పినట్లు (మరపినట్లు).
9. బోదనం కొట్టితే రాజసం పండును.
10. బోనులో పడ్డ సింహం వలె.
11. బోయవాది కొక్కడే ప్రభువా/ బోగందానికి ఒక్కడే మగడా?
12. బోలెడు తిట్లయినా బొక్కెడు కొఱ్ఱలు కావు.
13. బోసినోటివానికి పేలపిండి ప్రీతి.
14. బోసిపంతికి దోకెడు నూనె, ఎట్లా తెత్తును ఏగాని?


బ్ర


15. బ్రతకని బిడ్డ బారెడు.
16. బ్రతికి ఉంటే బలుసాకు ఏరుకొని తినవచ్చు.
17. బ్రతికి బావగారిని, చెడి స్నేహితుని చేరాలి.
18. బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది.
19. బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాము, బయట ఎవరు లేకుండా చూడమన్నాడట.
20. బ్రతికిన బ్రతుక్కి భగవద్గీత పారాయణమా?
21. బ్రతుకలేని వాడా బడి పెట్టుకోరా!
22. బ్రతుకలేని వాడు బడిపంతులైనట్లు.
23. బ్రతుకుటకు తినవలెను గానీ తినుటకై బ్రతుకరాదు.
24. బ్రతుకు లెన్నాళ్ళు? భాగ్యాలెన్నాళ్ళు?
25. బ్రమిసి బాపనయ్యని పోతే, శుక్రవారం చూపరా దన్నాడట.
26. బ్రహ్మంవంతి గురువుంటే సిద్ధయ్యవంటి శిష్యుడు ఉండనే ఉంటాడు.
27. బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు (రిమ్మ=పిచ్చి).
28. బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా, లంజ ముదిరినా పనికిరాదు.
29. బ్రహ్మచారి శతమర్కటః
30. బ్రహ్మఙ్ఞానులవారు వచ్చారు, పట్టుబట్టలు భద్రం.
31. బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొదువా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదువా?
32. బ్రహ్మయాలితాడు పంది రేవున దెంచ.
33. బ్రహ్మ వ్రాసిన వ్రాత చెఱిపేవాడు లేడు (తప్పునా?)
34. బ్రహ్మ వ్రాసిన వ్రాలుకు ఏడువనా? రాగుల సంకటికి ఏడువనా?




బ్రా


35. బ్రాహ్మడా! బ్రాహ్మడా! నీ ఆచారమెంత? అంటే నీటికొద్ది అన్నాడట.
36. బ్రాహ్మడికీ బఱ్ఱెగొడ్డుకి చలేమిటి?
37. బ్రాహ్మణింటిలో పుట్టితి, భట్టింటిలో పెరిగితి, కోమటింటిలో చస్తి.
38. బ్రాహ్మణ పాలేరుతనం చేస్తావా? పల్లకీ ఎక్కుతావా? అంటే పల్లకి ఎక్కితే ఒళ్ళు కదులుతుంది, బ్రాహ్మణ పాలేరుతనమే చేస్తాను అన్నాడట.
39. బ్రాహ్మణ సేద్యం - శూద్రతర్పణం (సంతర్పణ).
40. బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా పసరము వంటిపూట పడ్డా మానెడు.
41. బ్రాహ్మణుని చేయి (నోరు) ఏనుగు తొండము ఊరుకోవు.
42. బ్రాహ్మణుని మీద సంధ్య, కోమటిమీద అప్పు నిలువవు.
43. బ్రాహ్మణులలో చిన్నకు బేస్తలలో పెద్దకు అవస్థలు.




44. భంగు(గి) తాగేవానికి హంగుగాళ్ళు పదిమంది.
45. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు.
46. భక్తిలేని పూజ,  పత్రి చేటు. (బత్తిలేని పూజ పత్తిచేటు).
47. భక్తివచ్చినా పట్టలేరు, పగ వచ్చినా పట్టలేరు.
48. భగవంతా నాకేం చింత అంటే, పొద్దున్నే లేస్తే పొట్టదే చింత.
49. భగవద్గీత పుచ్చుకుంటారా అంటే, కడుపు నిండింది ఇంక తినలేను అన్నాడట.
50. భటుడు వెంటలేక ప్రభుడు శోభింపడు.
51. భట్టాచార్యుల వట్టలు కాగానే తిరుచూర్ణపు బుఱ్ఱలగునా?
52. భజన చేయువాడు భక్తుండు కాడయా.
53. భయంగల బల్లి, బావచాటుకు పోయి బుఱ్ఱుమంది.
54. భయంగల మరదలు బావముందు బుఱ్ఱుమందట.
55. భయపడి పరుగెత్తేవానికి వారశూల అడ్డమా?
56. భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి.
57. భయానికి తగినట్లు కోట కట్టుకోవలె.
58. భరణీకార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
59. భరణీకార్తెలో చల్లిన నువ్వుచేను కాయకు బరిగెడు గింజలు.
60. భరణి కురిస్తే ధరణి పండును.
61. భరణిలో పుడితే ధరణి ఏలును.
62. భరణిలో (ఎండలకు) బండలు పగులును, రోహిణిలో రోళ్ళు పగులును.
63. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి రాజ్యం.
64. భరతుడు పట్నం - రాముడి రాజ్యము.
65. భర్త బడాయి భార్య మీదనే.
66. భర్త లోకం తన లోకం, కొడుకు లోకం పరలోకం.
67. భర్త వర్తనంబే సతికి గ్రాహ్యం.


భా


68. భాంచేదు దేవుడికి మాదర్ చోద్ పత్రి.
69. భాగీరథీ పిచ్చుగుంతమీద పారినట్లు.
70. భాగ్యముంటే బంగారం తింటారా?
71. భాగ్యవశముగాని బ్రతుకులు లేవయా.
72. భాగ్యహీనునకు ఫలము లభించునా?
73. భానునరయ దివ్వెపట్టి వెదకురీతి.
74. భామల వలపు వేముల తియ్యదనము లేవు.
75. భారంలేని బావ చస్తే, దూలం పడ్డా దుఃఖం లేదు.
76. భారం పైన పడినప్పుడే బరువు తెలిసేది.
77. భార్య అనుకూలవతి అయితే సుఖి అగును, లేకుంటే వేదాంతి అగును.
78. భార్యచేతి పంచభక్ష్య పరమాన్నం కన్నా, తల్లి చేతి తవిటిరొట్టె మేలు.
79. భార్య మాట బ్రతుకు బాట.
80. భావాయ పున్నమకు పరగళ్ళు పచ్చబడతాయి.
81. భాస్కరాచార్య్ల (భాష్యకారుల) వెంట్రుకలైతే మాత్రం, వీనకు తంతు లవతవా?
82. భాషకు తగిన వేషముండాలి.
83. భాషలెల్ల వేరు పరతత్వమొక్కటే.


భి


84. బిక్షం బిడబిడా అంటే, దొంతులు లొడాలొడా అన్నాయట.
85. భిక్షాధికారైనా కావాలి, లక్షాధికారైనా కావాలి.


భూ


86. భూతాలకు బుద్ధిలేదు, నరునకు బద్ధం లేదు.
87. భూదేవి అల్పసంతోషి, కాస్త కఱ్ఱుతో గిలిగింత (చక్కిలగిలి) పెట్టగానే నిండుపంటతో కలకల లాడుతుంది.
88. భూమి కొత్త అయితే భోక్తలు కొత్తా?
89. భూమి కొత్తదైన భూమేలు కొత్తవా?
90. భూమిని చూర్ణం చేస్తే, పట్టెడెరువే పుట్టెడు పండిస్తుంది.
91. భూనిని రాజుని కాచుకున్నవాడు చెడడు.
92. భూములిచ్చినట్లు భూపతు లీయగలరా?


భో


93. భోగములకెల్లను నెచ్చెలి జవ్వనంబు.
94. భోగాపురం బొల్లి మేఘాలు అక్షయపాత్ర కనుగ్రహమా?
95. భోజనం చేసిన వానికి అన్నంపెట్ట వేడుక, బోడితలవానికి వెంట్రుక వేడుక.
96. భోజనానికి నేను, మా బొప్పడు, లెక్క చెప్పను నేనొక్కడనే అన్నాడట.
97. భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు.
98. భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకొని వస్తానన్నట్లు.
99. భోజునివంటి రాజుంటే, కాళిదాసువంటి కవి ఉండనే ఉంటాడు.


భ్ర


100. భ్రమరంబు తనరూపు క్రిముల కిచ్చినరితి.

Saturday, September 10, 2011

సామెతలు 69


1. బిడ్డలేని ముద్దు, వానలేని వరద.
2. బిడ్డ వచ్చినవేళ, గొడ్డూ వచ్చినవేళ. (బిడ్డ=కోడలు).
3. బిడ్డసంగతి మీగాళ్ళ వాపే తెలుపుతుంది.
4. బిడ్డలుగల తండ్రు లెందరో ఉన్నారుగానీ, తండ్రిగల బిడ్డలు చాలా తక్కువ.
5. బిత్తరి బిడ్దను కంటే, ఎలుక ఎత్తుకపోయి వెన్నుకుప్పలో (వెన్నుగాడిలో) పెట్టిందట.
6. బియ్యం దంచినదానికి బొక్కిందే దక్కుట.
7. బియ్యం దంచినమ్మకు బొక్కిందే కూలి.
8. బియ్యపు బస్తాలు పోతుంటే లేదుగానీ, చవిటి చేటలకు వచ్చిందా?


బీ


9. బీడున కురిసిన వాన - అడవిన కాచిన వెన్నెల.
10. బీదకూటికి బిక్క దేవుడు.
11. బీదలకేల బోగుగుడి పెద్దరికము, పెట్టబీరము? (బోగుబడి=వితరణలేని వ్యయంతో సంసారి తిరులేనివాడు; పెట్టబీరము=స్త్రీల (పెంటి) పౌరుషము).
12. బీద బలిసి బందికా డయినట్లు.
13. బీదమొగంవాడా! నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడంటే, మొద్దుమొగంవాడా మొన్ననే అయ్యింది అన్నాడట.
14. బీదవాడు బిచ్చపువానికి లోకువ.
15. బీదవానికి మాట ఈరాదు, కలిగినవానికి చోటు ఈరాదు.


బు


16. బుక్కెడు తిన్నమ్మ బూరుగు (బూరగ) మ్రాను, చారెడు తిన్నమ్మ చెక్కపేడు.
17. బుగతోరింట్లో పెళ్ళి, బుగ్గలు తిప్పకు మల్లి.
18. బుచ్చిరెడ్డి అనె భూతానికి రామిరెడ్డి అనే రక్షరేకు (రేఖ).
19. బుట్టలో పామువలె (కుండలో పామువలె).
20. బుడ్డ ఎంతపెద్దదైనా ముక్కాలుపీట కాదు, బడ్డు ఆయుధం కాదు.
21. బుడ్డకు, భూతానికి ఒకే మంత్రమా?
22. బుడ్డగోచి కన్నా మించిన దారిద్ర్యంలేదు, చావుకన్నా మించిన కష్టం లేదు.
23. బుడ్డది చిక్కినా కష్టమే, బలిసినా కష్టమే. (బుడ్డది=మరుగుజ్జుది)
24. బుడ్డను నమ్మి ఏటిలో దిగినట్లు.
25. బుడ్డోడి మంత్రము, బూడిదలో ఉచ్చ ఒకటి.
26. బుధవారం పుట్టినదున్న భూమిని దున్నినా, తొక్కినా పొంగి పొంగి పండుతుంది.
27. బుధవారమ్నాడు పులిగూడా బయలుదేరదు (బయటకి తలబెట్టదు).
28. బుద్ధిగల (బుద్ధిమంతుల) జుట్టు భుజాలు దాటదట.
29. బుద్ధి సెప్పువాడు గుద్దిన మేలయా.
30. బుద్ధి భూములేలా లంటే, కర్మ (రాత) గాడిదలను కాస్తానంటుంది.
31. బుద్ధి భూములేలుతుంటే అదృష్టం అడుక్కతింటున్నది.
32. బుద్ధిమంతుడని సద్ది కడితే, బొండ్రాయి దగ్గఱనే భోంచేసినాడట.
33. బుద్ధి మరలకున్న రద్దె కెక్కును.
34. బురదగుంటలో పంది వెలె.
35. బురద మెచ్చే పంది పన్నీరు మెచ్చునా?
36. బురదలో దిగబడ్డ ఏనుగును బొంతకాకి అయినా పొడుస్తుంది.
37. బులుపు తీరినగాని వలపు తీరదు.
38. బుఱ్ఱుపిట్ట ఏడుగాండ్ల ఎద్దులను నిలిపేసినట్లు (నిలవేసినట్లు) (బుఱ్ఱుపిట్ట=చిన్నపిట్ట).


బూ


39. బూకటికి బుద్ధిలేదు, వేకటికి సిగ్గులేదు.
40. బూచీలకు బెదరునా బుగుడూరు సంత.
41. బూటకానికి బుడ్డ దిగితే, ఆవిలిస్తే అవిసిపోయిందట.
42. బూటాలకం దాసరికి బుఱ్ఱనిండా నామాలే. (మధ్య వైష్ణవునికి నామములు పెద్ద).
43. బూడిదలో చేసిన (పోసిన) హోమం వలె.
44. బూడిదలో పోసిన పన్నీరు బుడబుడ (వలె).
45. బూతులేకున్న నీతి లేదు.
46. బూనాచి మాటలు బూడిదకు కూడా రావు.
47. బూబులు నాకుతుంటే నవాబుకు నాట్యాలా?
48. బూబులే నాకుతుంటే పీర్లకు మహానైవేద్యమా?
49. బూరుగ చెట్టంత పొడవుగా ఎదిగినా చిలుకకు ఫలవృత్తి కలుగబోదు.
50. బూరె దర్శనం బువ్వ కోసమే.
51. బూరు(ర)గ పండును నమ్ముకొనిన చిలుకకు దూదే దక్కినట్లు.
52. బూర్లెగంప కాడ పొర్లు దండాలు.


బె


53. బెండ్లు మునిగి గుండ్లు తేలినట్లు.
54. బెడసి ముందుకు పడడు, జడిసి వెనక్కు పడడు.
55. బెత్తలకు బేడల చారు, మాయింటిలో చింతగుగ్గిళ్ళు.
56. బెద(ది)రించి బెండకాయ పులుసు పోసినట్లు.
57. బెదరించి బెదరించి బెల్లపు కుండకు తూటు పొడిచిందట.
58. బెల్లం అని అరచేత వ్రాసి నాకిన తీపగునా?
59. బెల్లమున్న చోటే ఈగలు ముసిరేది.
60. బెల్లపు పిళ్ళారికి ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.
61. బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం.
62. బెల్లపు వినాయకుని ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.
63. బెల్లమని అరచేత వ్రాసి నాకితే నోటికి తీపి కలుగునా?
64. బెల్లము ఉందని మోచేతిదాకా నాకినట్లు.
65. బెల్లము ఉండా అంటే అల్లము ఉంది అన్నట్లు.
66. బెల్లము ఉన్నంతసేపే ఈగలు ముసిరేది.
67. బెల్లము కొట్టిన గుండ్రాయి వలె.
68. బెల్లము పారవేసి చెయ్యి నాకినట్లు.
69. బెల్లము వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ.
70. బెస్త పెగ్గెలు - ఊబమగని విరదాళ్ళు (విరదాళ్ళు=వీరత్రాళ్ళు).


బే


71. బేగడరాగం మీగడతో సమానం.


బొ


72. బొంక నేర్చి, ఱంకు నేర్వాల.
73. బొంకరా గురవా అంటే, గురజాల దోమలు గురిగింజ లంతేసి అన్నాడట.
74. బొంకరా బొంకరా పోలుగా అంటే, ఎద్దు గిట్టలో ఏడు చావిడాలు (చవిడాలు) అన్నాడట. (చవిడాలు=తాటిఆకు చేపలు ఎండబెట్టిన సముద్రపు చేపలు).
75. బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంటేసి అన్నాడట.
76. బొంగలు తిన్న నోరు, ఆడిపోసుకున్న నోరు ఊరుకోవు.
77. బొంగు లొట్టయినా, క(గ)ణుపు గట్టి.
78. బొండు (బొద్దు) మల్లెలు బోడిముండ కెందుకు?
79. బొంత కుట్టుకున్నవాడు కప్పుకోలేడా?
80. బొందల కుంటకు నల్లేరు మోసినట్లు.
81. బొక్కలో (బొరియలో) నిద్రబోయే నక్క కలలో తనవాతబడే కోళ్ళను లెక్కబెట్టుకొన్నట్లు.
82. బొక్కలో పిల్ల, డొక్కలో పిల్ల.
83. బొక్కినలో కొఱకంచు వలె.
84. బొగ్గు పాలుగడుగ పోవునా నైల్యంబు.
85. బొగ్గులకై కల్పతరువు పొడిచినట్లు.
86. బొగ్గులలో మాణిక్యం వలె.
87. బొగ్గులలో రామచిలుక వలె.
88. బొచ్చు కాలిస్తే బొగ్గులగునా? (బూడిద అగునా?)
89. బొటనివేలికి సున్నమైన దేమయా? అంటే, బోర్ల పడినానులే అన్నాడట.
90. బొట్టి కట్టితేగానీ ముండ మోయదు.
91. బొట్టు పసే గానీ బోనం పస లేదు.
92. బొట్టుబొట్లాకొండ, బోనీలకొండ. నెమిలమ్మ గ్రుడ్లయితే నేనెరుగనమ్మ.
93. బొద్దాకు తింటే బుద్ధి పెరుగునన్నట్లు.
94. బొమ్మకు మ్రొక్కినా నమ్మక ముండవలె.


బో


95. బోగంవీధి ఈటుబోయిందంటే కోమట్లంతా గోచులు సర్దుకున్నారట.
96. బోగంవీధి కొల్లబోయిందంటే, సన్నాసులు గోచులు విప్పుకొని బయలుదేరినారట.
97. బోగందాని చళ్లకు, సంత సొరకాయకు గోటిగాట్లు ఎక్కువ.
98. బోగందాని తల్లు చస్తే అందఱూ పరామర్శించే వాళ్ళేగానీ, బోగందే చస్తే తొంగిచూచేవాళ్ళుండరు.
99. బోగముదాని వలపు, బొగ్గు తెలుపు లేదు.
100. బోటికి నీటూ - కూటికి చాటు.

Monday, September 5, 2011

సామెతలు 68


1. బఱక సేద్యం - తురక నేస్తం.
2. బఱ్ఱె పెంట తిన్నా, పాలు కంపు కొట్టవు.
3. బఱ్ఱెకొమ్ము అంటే, ఇఱ్ఱి కొమ్ము అన్నట్లు.
4. బఱ్ఱెకో బాంచ, గుఱ్ఱానికో సైను (బంచె= బానిస; సైను= మాలీషు చేసేవాడు).
5. బఱ్ఱె చవలం, బందె ముచ్చెవలం.
6. బఱ్ఱ్ ఎచస్తే పాడి బయట పడుతుంది.
7. బఱ్ఱె-దూడ ఉండగా గుఱక గుంజకు వస్తుందా? (గుఱక=పశురోగం).
8. బఱ్ఱెదూడ వద్ద, పాత అప్పులవాడి వద్ద ఉండరాదు.
9. బఱ్ఱె పాతిక, బందె ముప్పాతిక.
10. బఱ్ఱె పిల్లికాలు తొక్కితే, పిల్లి ఎలుకపై మీసాలు దువ్వుందట (కళ్ళెఱ్ఱ జేసిందట).
11. బఱ్ఱె పిల్లకు బనారసు చీర
12. బఱ్ఱెలు తినని కూరగాయలు బాపలకు దాన మన్నట్లు.
13. బలం ఉడిగినా, పంత ముడగరాదు.
14. బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చచ్చినట్లు.
15. బలవంతాన పిల్లనిస్తామంటే, కులమేమి? గోత్రమేమి అని అడిగినాడట.
16. బలవంతుడు సొమ్ముగాక బాపడి సొమ్మా? (సొత్తా).
17. బలవంతుని చెయ్యి పడితే, బావి ఐనా చూసుకోవాలి, చంక అయినా చేరాలి.
18. బలవంతపు మాఘస్నానం.
19. బలవంతపు బ్రాహ్మణార్థం.
20. బలిజ చుట్టంకాడు, బడ్డు అయుధం కాదు.
21. బలిజ పుట్టుక పుట్టవలె, బతాయిబుడ్డి కొట్టవలె.
22. బలిజవారి పెండ్లికి జుట్టుతో సహా ఎరువు.
23. బలిజల విత్తము పట్టెదాసరి పాలు, గొల్ల విత్తము పిచ్చుగుంత పాలు.
24. బలిమిలేని వేళలో పంతం చెల్లదు.
25. బలిస్తే గోకి చంపుతారు, చిక్కితే నాకి చంపుతారు.
26. బలుసు పండితే గొలుసుల్లా కంకులు (వరి).
27. బలుసు లేని తద్దినము, బులుసు లేని యఙ్ఞమున్ను లేవు (బలుసు=ఒక ఆకుకూర; బులుసు=బులుసు పాపయ్య, బులుసు అచ్చయ్య శాస్త్రులు వేదవేదాంత వేత్త, విశ్రుతులు).
28. బల్లి పలికిందని బావ పక్కలో చేరిందట.
29. బసవ దేవునికి బడితె పూజ.
30. బహుతిండి బహునాశనం అన్నారు.
31. బహు నాయకము, బాల నాయకము, స్త్రీ నాయకము (చెడుపు).


బా


32. బాంచెను వెంకటమ్మా అనాలి కాలం తప్పినప్పుడు.
33. బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు.
34. బాగైన సొమ్ములెన్ని ఉన్నా మంగళసూత్రమగునా?
35. బజారు రంకుకు పంచాయతీ చెప్పు లంజలు వీరమాతలైరి.
36. బాజాల సందడిలో మంగళ సూత్రాన్ని మరచారట.
37. బాడి(డు)గ గుఱ్ఱానికి సుడులు పట్టిచూచినట్లు.
38. బాతాకానీ వానికి బారనా, నాకూ బారనానేనా? (బారనా=పన్నెండణాలు).
39. బాదరాయణ సంభందం.
40. బాదేపల్లి సేట్లు, లెక్కలు చూస్తే తూట్లు.
41. బాధకొక కాలము, భాగ్యాని కొక కాలము.
42. బాపనవాడి కొలువు, తెల్లగుఱ్ఱపు కొలువు కష్టం.
43. బాపన వావి బందవావి.
44. బాపన సేద్యం బడుగుల నష్టం.
45. బాపన సేద్యం బత్తెం చేటు, కాపుల చదువులు కాసులు చేటు.
46. బాపన సేద్యం బ్రతకటానికీ కాదు, బ్రతికించటానికీ కాదు.
47. బాపన సేద్యం - బాల వైద్యం.
48. బాపనోళ్ళ కోపం - వరిగడ్డి శాకం.
49. బాపలలో చిన్న, బేస్తలలో పెద్ద.
50. బాపలు తప్పినా వేపలు తప్పవు, వేపలు తప్పినా ఏరువాక పున్నమ తప్పదు.
51. బాబుకు లేక బఱ్ఱెతో ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పెళ్ళో అని అఖోరించాడట.
52. బారకల్ల మీద బట్ట పడ్డట్టు.
53. బారకావడివలె పడ్డావు, నీవెవడురా, మా ఇంటి దేవరకు మ్రొక్కను?
54. బారతకతలోన బాలరాజొకడు కుంబకర్నునిబట్టి (కుత్త) గుద్దసించిన వైనం తెలియదా అన్నాడట.
55. బారు బంగాళా, కొంప దివాళా.
56. బారెడు చుట్టు అయినా బాటన పొమ్మన్నారు.
57. బాల పొంగు - పాలపొంగు.
58. బాలల తుమ్ము, బాలెంత తుమ్ము మంచివి.
59. బాల వాక్కు(వాక్యం) బ్రహ్మ వాక్కు(వాక్యం).
60. బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు.
61. బావకు మరదలు పిల్లపై ఆశ.
62. బావమరిదికంటే మించిన బంధువు లేడు.
63. బావమరిది బ్రతుక గోరును, దాయాది చావ గోరును.
64. బావమరుల ప్రక్కన కూర్చోవటం ఎట్లా అని, దూరంగాపోయి తురకోడి పక్కన కూర్చున్నదట -కొత్త పెండ్లికూతురు.
65. బావలేని కోడలు బహుభాగ్యశాలి, మరి(ఱ)ది లేని కోడలి మరీమంచిది.
66. బావా! అని చూడబోతే, రావా అని కొంగుపట్టుకున్నాడట.
67. బావా! నీభార్య ముండమోసిందంటే, మొఱ్ఱో అని ఏడ్చాడట.
68. బావా బావా అంటే పక్కలోకి రమ్మనాడట.
69. బావికింద దిన్ని బ్రతికినవాడు, చెఱువుకింద దున్ని చెడినవాడు లేడు.
70. బావి తప్పినవాడు, బడిం దిరిగినవాడు ఒకటే.
71. బావి త్రవ్వగా భూతం బయట పడినట్లు.
72. బావిలో ఏరిగేవాడికంటే బావిపక్కన (అంచున) ఏరిగేవాడు మేలు.
73. బావిలోతు చూడగలంగాని, మనిషి మనసులోతు చూడగలమా?
74. బావిలోని కప్పకు, గానుగ ఎద్దుకు అవే లోకాలు.
75. బావురుపిల్లికి చిలుకపై మొగమాటమా?
76. బాషికం మొదలు భజంత్రీల వరకు బదులుతో పెండ్లి జరిపినట్లు.
77. బాస(బావి) బిస తప్పిలే పట్టరా తంగేళ్ళు.
78. బాహ్య ధార్మికుడు, అంతరంగిక పిశాచము.


బి


79. బిగువులేని కచ్చ, బీగములేని ఇల్లు.
80. బిగువైన ఎద్దుకే బిగువైన సేద్యం.
81. బిచ్చం బిడబిడ, కుండలు లొడలొడ.
82. బిచ్చగాణ్ణి పొమ్మన్నా అత్త చెప్పాలి, కోడలు పంపాలి.
83. బిచ్చగాని గుడిసె, మా అక్క చూచి మురిసె.
84. బిచ్చపు కూటికి పేదరికమా?
85. బిచ్చపు కూటికి శనేశ్వరం అడ్డం పడ్డట్లు.
86. బిచ్చము వేయకున్న మానె, కుక్కని కట్టివేయమన్నట్లు.
87. బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా వల్లెవాటు తప్పలేదు.
88. బిచ్చానికి వచ్చినవాడు, అచ్చంగా కాకపోయినా ఆ పూటకు చుట్టమే.
89. బిడుగుచెడ్డ ముండ చీటికి ముగ్గు పెట్టిందంట.
90. బిడ్డయినా పడ్డయినా పుట్టాక విడిచిపెడతామా?
91. బిడ్డ ఎదిగితే కుండ ఎదుగుతుంది (వంటకుండను పెద్దది చేయాలనుట).
92. బిడ్డ చచ్చినా తొట్లమర్లు ఉడుగలేదు.
93. బిడ్డ చచ్చినా పీతికంపు (పురిటికంపు) పోలేదు.
94. బిడ్డ చచ్చినా బారసాల బాగా జరిగింది.
95. బిడ్దను దించి లోతు చూసినట్లు.
96. బిడ్డ, పాము కఱచి చచ్చి ఏడుస్తుంటే, విషపురుగులం - మా జోలికివస్తే కరవక మానుతామా - అన్నదట అప్పుడే బయటపడిన ఏలికపాము.
97. బిడ్డ బావిలో పడ్డాడంటే చద్దికూడు తినివస్తానన్నాడట.
98. బిడ్డ ముద్దయితే పియ్యి ముద్దవుతుందా?
99. బిడ్డలను కన్నమ్మా, బిక్షము పెట్టినమ్మా చెడరు.
100. బిడ్డలేని ఇంటికి ఆవుదూడ ముద్దు, ఏమీలేని ఇంటికి ఎనుముదూడ ముద్దు.