మ
1. మంగలంబుచేయి మంగలి హీనుడా?
2. మంగలములోని పేలాల వలె.
3. మంగలికత్తికి మాకులు తెగునా?
4. మంగలికత్తి వాయిని (వాదరను) నాలికతో నాకినట్లు.
5. మంగలి కొండోజి మేలు మంత్రులకంటెన్.
6. మంగలి గొరిగి నేర్చుకుంటే, వైద్యుడు చంపి నేర్చుకుంటాడు.
7. మంగలిని చూచి ఎద్దు కాలు కుంటిందట.
8. మంగలిపని అనుకున్నావా తడిపి దిగ గొరగడానికి? (ఎగ గొరగడానికి?)
9. మంగలి పాత, చాకలి కొత్త.
10. మంగలివాని కత్తికి తన చేతిలోనూ విశ్రాంతి ఉండదు, ఇతరుల చేతిలోనూ విశ్రాంతి ఉండదు.
11. మంగలివాని దిబ్బ తవ్వేకొద్దీ బొచ్చే.
12. మంగలివాళ్ళ పెళ్ళికి మఱొక దెబ్బ (డోలు).
13. మంగళోళ్ళ ఇంటెనక బొచ్చుదిబ్బకాక మరేముంటుంది?
14. మంగళగిరి మూల మాడంత మబ్బు ఏలితే ఈమని జంపనల్లో ఈతలు మోతలు.
15. మంగళవారం నాడు మండెలు వేయకూడదు.
16. మంచము అల్లలేని మగవాడు - మజ్జిగ చిలకలేని ఆడది.
17. మంచము కోళ్ళకు, మాతామహులకు ముడివేసినట్లు.
18. మంచ మున్నంతవరకు కాళ్ళు చాచుకోవాల.
19. మంచ మున్న దగ్గఱే నీళ్ళాడమన్నట్లు.
20. మంచముపై ముసుగులు, మనసులో విసుగులు.
21. మంచముపై ఉన్నంతసేపు మగడు, కిందకి దిగితే యముడు.
22. మంచ మెక్కిన మీదట మర్యాదలేల?
23. మంచమెక్కి వరుస లడిగినట్లు.
24. మంచమెక్కి వావి తడవినట్లు.
25. మంచి ఉల్లిగడ్డకు మంచి బొడ్డు.
26. మంచికాలానికి మామిళ్ళు, చెడుకాలానికి చింతలు (కాయుట).
27. పంచి పగడాలు చూపి, మాయ పగడాలు అమ్మినట్లు.
28. మంచికి పోతే చెడ్డ ఎదురైనట్లు.
29. మంచికి పోతే మంచినీళ్ళు కూడా పుట్టవు.
30. మంచి కొంచమైనా చాలు, విత్తనం చిన్నదైనా చాలు.
31. మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగాలేకుంటే మావాడు చేశాడనుకో.
32. మంచిగొడ్డు కొక దెబ్బ, మంచి మనిషి కొక మాట.
33. మంచిచెడ్డలు దేవును కుడి ఎడమ చేతులు.
34. మంచిచెడ్డలు పడుగు పేకలు.
35. మంచి చేసిన ముంగికి ముప్పు వచ్చినట్లు.
36. మంచి దున్నపోతయినా మందకొడి ఎద్దుకు సరిరాదు.
37. మంచినోరు చేదు మింగినట్లు.
38. మంచి పెంపు, చెడ్ద లోతు అన్ని దేశాలలో అన్ని జాతులలో సమానం.
39. మంచి ప్రాణానికి మండలం వఱకు భయం లేదు (మండలం=40 దినాలు).
40. మంచి మంగలైనా, ఎగ గొరిగితే మంటే.
41. మంచి మంచి ముహూర్తాలు మీఇంట్లోనూనా? మాచకమ్మ సమర్తలు మాఇంట్లోనూనా?
42. మంచి మంచి వారంతా మడుగులో మునిగితే, కోణంగిదాసరి కోనేటిలో మునిగెనట.
43. మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.
44. మంచివాడు మంచివాడంటే, మంచమంతా ఏరిగి పెట్టినాడట.
45. మంచివాడు మంచివాడంటే, మంచమంతా కంతలు చేసినాడట.
46. మంచివాడు మంచివాడంటే, మంచమెక్కి గంతులు వేశాడట.
47. మంచివాడు మంచివాడంటే, మదురెక్కి ఉచ్చ పొశాడట.
48. మంచివాడైనందుకు మరణమే శిక్ష.
49. మంచివాని కొకమాట, మొరకు కొక వ్రే(ఏ)టు.
50. మంచివాని చావు మరణంలో తెలుస్తుంది.
51. మంచివాని గుణం మాంసం దగ్గఱ, సత్యవంతుడి గుణం చావు దగ్గఱ తెలుస్తుంది.
52. మంచివానికి మాటే మందు.
53. మంచివాని దగ్గఱకు మంచివారిని పంపినారు, నీదగ్గరకు నన్ను పంపినారు.
54. మంచు కుంచాల కొలిచినట్లు.
55. మంచుకు పెట్టిన పందిళ్ళు ముసారాకు అగునా?
56. మంచుకు వేసిన పందిళ్ళు వాన కాగునా?
57. మంజులాలాపము లేని కావ్యము, విలాసములేని వధూటి.
58. మంటి ఎద్దయినా మా ఎద్దే గెలవాలి.
59. మంటిదేవునికి మజ్జనమే సాక్షి.
60. మంటిపనికైనా ఇంతివాడే వెళ్ళాలి.
61. మంటిలో మానెడు, ఇంటిలో పుట్టెడు.
62. మంత్రం చెప్పను మల్లుభట్లు, తినేదానికి తిప్పంభట్లు.
63. మంత్రం లేని తీర్థం మరి బుక్కెడు.
64. మంత్రం లేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు.
65. మంత్రంలో పసలేకపోయినా తుంపర్లకు తక్కువ లేదు.
66. మంత్రజలము కంటే మంగలి జల మెచ్చు.
67. మంత్రసాని తనానికి ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి.
68. మంత్రసాని దెప్పులు, అత్తగారి సాధింపులు.
69. మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు, బిడ్డ వచ్చినా పట్టాల, పియ్య వచ్చినా పట్టాల.
70. మంత్రసాని ముందట మర్మం దాచినట్లు.
71. మంత్రాలబువ్వ కడుపులోనికిపోతే యంత్రాలు చేయిస్తుంది, యంత్రాలున్న బువ్వ కడుపులోనికి పోతే తంత్రాలు చేయిస్తుంది.
72. మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా?
73. మంత్రాలు తక్కువ, తుంపరు లెక్కువ.
74. మందగుది ఎద్దు నడక, నత్తిమాటలు - మొదటసాగవు.
75. మందబలం చూచి కుక్క మొరుగుతుంది.
76. మందలింపు బెడిస్తే ముప్పు.
77. మందికి చెప్పానుగానీ మనకు చెప్పానా?
78. మందిని ముంచి మసీదు కట్టినట్లు.
79. మంది పలుచనైతే, గంజి చిక్కన అవుతుంది.
80. మంది మాటవిని మనువుపోతే, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది.
81. మంది యెక్కువయితే (మోపయితే) మజ్జిగ పలుచన.
82. మంది యెక్కువయితే 9లావయితే) మఠానికి చేటు.
83. మందు పథ్యం, మాటకు సత్యం.
84. మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు.
85. మందుగానీ మాకు లేదు గానీ కూర్చువా డొక్కడే కొదువ.
86. మందుమాకిడి గండమాల మాంపగలేడు చక్కచేయగలడే నక్కమొర (గండమాల=మెడచుట్టు మేహగ్రంధులు లేచు వ్యాధి).
87. మందూ లేదు గుండూ లేదు, తుపాకీ పట్టుక కాల్చమన్నట్లు.
88. మందైనా కావాలి, ముండైనా కావాలి.
89. మకరందపానంబు మధుకరాలికిగాక జోరీగలు జుఱ్ఱగలవా?
90. మకురాంకు కేళికోర్చిన ముకురానన మల్లయుద్ధమున కెట్లు ఓపు.
91. మక్కాకు పోయి కుక్క (బొచ్చు) మలం తెచ్చినట్లు.
92. మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.
93. మక్కువపడి ముక్కాలిపీటా చేయించుకుంటే, డోరియాకోక కత్తిరించుక పోయిందట.
94. మగడు విడిచిన ముండ, మబ్బు విడిచిన ఎండ.
95. ముఖాపంచకము సదా వంచకము.
96. మగడు ఒల్లనమ్మను మారీ ఒల్లదు.
97. మగడు చచ్చిన తర్వాత ముండకు బుద్ధివచ్చినట్లు.
98. మగడు లేని మనువున్నదా?
99. మగడు చిన్నకాగానే ముండమోపితనం తప్పునా?
100. మగడు నబాబైనా బూబమ్మకు కుట్టుపోగులే (కాడలే).
2 comments:
చాలా పరిశోధన చేసిమరీ సామెతలు సేకరించి వ్రాస్తున్నట్లున్నారు. ఎక్కువగా తెలీనివే వున్నాయి. మీ కృషి బహుథా ప్రశంశనీయం. అభినందనలు.
నైస్
awesome
బాగుంది
శశిధర్ గారు చెప్పినది ఒక 100 సార్లు నేను కుడా చెప్పాననుకోండి !
ఎంచేతంటే మీ కృషి అభినందనీయం !
వారి ప్రశంస అక్షర సత్యం
Post a Comment