Sunday, October 2, 2011

సామెతలు 72


1. మగడు శయ్యకు పిలిచిన రాని మగువ, మిండడు వలుకులమిట్ట కీడ్చినా పోవును (వలుకులమిట్ట=వల్లకాడు).
2. మగని చుట్టాలు చెప్పులు ముంగిట విడిస్తే. ఆలిచుట్టాలు అరపరమటింట్లో విడుస్తారు.
3. మగని తిట్టినాపె, మరదిని మన్నించునా?
4. మగనిసొమ్ము తిని, మిండని పాట పాడినట్లు.
5. మగ బయిసి లేని మీసమెందుకంటే, ఎరువు నీళ్ళు లేకుండా అట్టే ఎదిగే వాటికి నేనేమి చేసేది అన్నాడట.
6. మగవాడు తిరుగక చెడును, ఆడది తిరిగి చెడును.
7. మగవాని పెండ్లా? ఆడదాని పెండ్లా? అంటే, అదేమో నాకు తెలియదు, గాడిపొయ్యిదగ్గర కాస్త వేస్తే గతికి వచ్చినాను అన్నాడట.
8. మగవాని బ్రతుకు చిప్పనిండ మెతుకు, ఆడదాని బ్రతుకు గంజిలో మెతుకు.
9. మొగాళ్ళ మెరుగులు మొగాలపైనే కనిపిస్తవి.
10. మగ్గం గుంతలో పాముంది, మగాళ్ళుంటే పిలవ్వే అన్నాడట.
11. మగ్గాని కొకరాయి మరవకుండా పట్టండి.
12. మాఘకు మానికంత చెట్టయితే, కార్తీకానికి కడవముంతంత గుమ్మడికాయ.
13. మాఘ తిమిరితే మదరుమీద కఱ్ఱైనా పండును (తిమురు=ఉఱమక మెఱయు).
14. మాఘపుబ్బలు వరపయితే, మహత్తర క్షామం.
15. మాఘపుబ్బలు వరపయితే,మీఅన్నసేద్యం, నాసేద్యం మన్నే.
16. మాఘలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి.
17. మాఘలో పుట్టి, పుబ్బలో మాడినట్లు (గిట్టినట్లు).
18. మాఘలో మానెడు చల్లుటకంటె ఆశ్లేషలో అడ్డెడు చల్లుట మేలు.
19. మాఘలో మానెడు, పుబ్బలో పుట్టెడు.
20. మచ్చనాలుక వానికి మాట నిలకడలేదు.
21. మచ్చాలు (మత్యాలు) దినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి? అన్నాడట.
22. మజ్జిగకు వచ్చి బఱ్ఱెను బేరమాడినట్లు.
23. మజ్జిగకు వచ్చి, ముంత దాచినట్లు.
24. మట్టికుండలో ఉంటే మనోవ్యాధి, తోలుపొట్టలో ఉంటే తోచి ఉంటుంది.
25. మట్టిగడ్డలో కప్ప కూస్తే ఒక జాములో వాన.
26. మట్టిగుఱ్ఱాన్ని నమ్మి, ఏట్లో దిగినట్లు.
27. మట్టిగోడ కడితే రొంపే.
28. మట్టు మీరు మాటకు మారు లేదు.
29. మట్టేద్దయినా మా ఎద్దే మంచిది.
30. మడత కుడుములు, శేషపాంపులు.
31. మడికి గట్టు, ఇంటికి గుట్టు.
32. మడికి గట్టు, మాటకు గుట్టు.
33. మడికి మంద, చేనుకు ఎరువు.
34. మడిచారుమీద మనుపోయ, అటికెడు చారు బోర్ల పోయెనే.
35. మడి దున్ని మనినవాడు, చేను చేసి చెడినవాడు లేడు.(మడీ=మాగాణి; చేను=మెట్ట).
36. మడి దున్ని మహారాజైనవాడు, చేనుదున్ని చెడ్డవాడు లేడు.
37. మడిన పడ్డనీరు, పైపడ్డ దెబ్బ పోవు.
38. మడిమల్లేసి బిదాణం పీకేసి సరువ కోసేసి.(బిదాణం=తులసికోట; సరువ=బిందె; చెరవ=చేదుటకు ఉపయోగించునది).
39. మడి బీదకాదు, రైతు పేద గాని.
40. మడుగు చీరకు మసి తాకినట్లు (మడుగు=చలువచేసి మడతపెట్టిన గుడ్డ).
41. మడ్డిముండకు మల్లెపూలిస్తే, మడిచి ముడ్డికింద పెట్టుకున్నదట.
42. మణిని మణితో కోయవలె (వజ్రం వజ్రాన్ని భేదిస్తుంది).
43. మణుం గొట్టగా మాసం చిక్కినాడు.
44. మణుగు సగము, మైలా సగమే.
45. మణులు చెక్కిన సంకెళ్ళ వలె.
46. మతి ఎంతో గతి అంత.
47. మతిమరపువాడు నీళ్ళచాయకు (చెంబొట్లకు) పోయినచోట ముడ్డి మరచివచ్చినాడట.
48. మతిమరుపుల వానికి ముల్లిరుపుల వాడు.
49. మతిమరుపులో నీళ్ళలో బడి, ఈదను మరచిపోయినాడట.
50. మతిమీద మన్ను పోతు, ఉప్పుకు పోయి నిప్పు తెత్తు.
51. మతి లేనమ్మకు గతిలేని మగడు.
52. మతి లేని మాట - శృతిలేని పాట.
53. మతిలెన్ని చెప్పినా మంకుబుద్ధి మానదు.
54. మతు లెన్ని చెప్పినా మామపక్కనే గానీ తొంగోనన్నదట (పడుకుంటా నన్నదట).
55. మదికాశ ఘటింపని మోవి, గుత్తలంజల పరమైన దీవి.
56. మదిలోన నొకటి, మాటలాడు టొకటి.
57. మదురుమీది పిల్లి వాటము (వలె, మాదిరి) (సమయానుకూలంగా అటొ ఇటో దూకును).
58. మదురు వారమడియైనా కావలె, మాటకారి మగడైనా కావలె (వార =ఎడము, ప్రక్కన).
59. మద్దులు మునిగి పార, వెంపళ్ళు తమకెంత బంటి యన్నట్లు.
60. మద్దికాయలు మాటిడ్డ మాడ్కి.
61. మద్దిమాను చేల్లో ఎద్దులు మేస్తే, మాముద్దలు మానునా?
62. మద్దెల తాళగతులు దెలియకనే మర్ధించుట సుఖమా?
63. మద్దెల బోయి రోలుతో మొరబెట్టుకొన్నట్లు.
64. మద్దెలలోని ఎలుక వలె.
65. మద్యపానం చేయను మడిగుడ్డ కావలెనా?
66. మద్యపాయికి అనరాని మాట లేదు.
67. మధ్యవైష్ణవుడు నామములకు పెద్ద.
68. మనకు పులి భయం, పులికి మన భయం.
69. మన గుమ్మడికాయలు మంచివైతే, బజార్లో ఎందుకు దొర్లుతుంటాయి?
70. మన చల్ల మనమే పలుచన చేసుకుంటామా? (అనుకుంటామా?)
71. మనదికాని పట్నం మహాపట్నం.
72. మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుంటుందా?
73. మన నువ్వులలో నూనె లేకపోతే, గానుగవాణ్ణి అంటే ఏమిలాభం?
74. మన బంగారం మంచిదైతే, కంసాలి ఏమిచేయగలడు?
75. మన మెఱుగని చెవులకు మద్దికాయలా?
76. మనసిచ్చీ మనసివ్వక (మనసురాక) మనువుకుబోతే నిలుచున్నట్లే నిద్రవచ్చిందట.
77. మనసుకు నచ్చినవాడు మగడుగానీ మంగళసూత్రం కట్టగానే మగడుగాడు.
78. మనసు విరిగితే అతుక్కోవచ్చునిగానీ కుండపగిలితే అతుకరాదు.
79. మనసుంటే మార్గముంటుంది.
80. మనసు కుదిరితే మల్లి, మనసు కుదరకుంటే ఎల్లి.
81. మనసు దిద్దరాదు మహిమీద నెవనికి.
82. మనసు మండిగెలు చేసుకుంటే గోధుమ లేవడిస్తాడు?
83. మనసు మహామేరువు దాటును, కాలు కందకం దాటదు (గడప దాటలేదు).
84. మనసున నాటిన మాటలు చెరపలేరు.
85. మనసునిల్ప శక్తిలేకపోతే మంచివిరుల పూజేమి చేయును?
86. మనసులేని మనువు వలె.
87. మనసులేనివాని మంత్రంబు లేలయా?
88. మనసులోని వెతకు మందు లేదు.
89. మనసులోని మర్మం చాటుకొనే మానవుడు మాతలు నేర్చినాడు.
90. మనసులోని మర్మం నీళ్ళలోని లోతు ఎరుగలేరు.
91. మనసులోని మర్మం ముఖమే వెల్లడించును.
92. మనసు విరిగెనేని మరియంట నేర్చునా?
93. మనసెఱుగని కల్లా, ఒళ్ళెరుగని సివమా? (ఉండవనుట).
94. మనసో మామగారి తద్దినమో అన్నారు.
95. మనస్సుకు మనస్సే సాక్షి.
96. మనస్సులో ఎంత ఉంటే, సోదెలో అంతే వస్తుంది.
97. మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రములేల?
98. మన ఉన్న ప్రాణాన్ని మంట గలిపినట్లు.
99. మనిషి ఉన్ననాడు మజ్జిగ లేదు, ఒలికమీద కట్టివేయను పాడిఆవు (ఒలికి=స్మశానము).
100. మనిషి కాటుకు మందులేదు.