Sunday, October 16, 2011

సామెతలు 74


1. మాచకమ్మ సమర్త మఖయితే నేమి? పుబ్బయితే నేమి? మఱి పునర్వసైతే నేని?
2. మాచకమ్మకు మరునింట నాచు మెండు; వంధ్యకు మైథునేచ్చ మెండు.
3. మాచకమ్మకు ముత్యాలసర మదేల?
4. మా చక్కెరతో మీ పొంగ లెందుకు వండాలి?
5. మాచర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.
6. మాటంటే మహరాజుగూడ నిలబడతాడు.
7. మాటకారి నీటుకాడు.
8. మాటకు పడిచస్తాము కానీ, మూటకు పడి చస్తామా?
9. మాటకు ప్రాణము సత్యము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము వ్రాలు.
10. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి.
11. మాటకు మాట తెగులు, నీటికి నాచు (పాచి) తెగులు.
12. మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం.
13. మాటకు ముందు ఏడ్చె మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు.
14. మాటకు సొంపు, పాటకు ఇంపు.
15. మాటగొప్ప చెప్ప మాటలు చాలవు.
16. మాట గొప్ప మానిక పిచ్చ.
17. మాట చుట్టమే గానీ, పూట చుట్టం కాదు.
18. మాట చూదనిదే మనసీయరాదు.
19. మాత మాటకు తప్పు, జోడి నెత్తిన ముప్పు.
20. మాటలకు మల్లి, చేతలకు ఎల్లి.
21. మాటలకు మా ఇంట్లో, మాపటికి మీ ఇంట్లో.
22. మాటలకు ఆ-లకు పేదరికం లేదు.
23. మాటల తేటలు(తీపి) మా ఇంటికాడ, మాపటితిండి మీ ఇంటికాడ.
24. మాటలచేత భూపతులు మన్ననలిత్తురు.
25. మాటలచేత మన్ననలు పొందవచ్చును.
26. మాటలచేత మహాకాళిని నవ్వించవచ్చు.
27. మాటలచేత మహారాజుబిడ్డను మనువు తెచ్చుకోవచ్చు.
28. మాటలచేత మాన్యాలు సంపాదించవచ్చు.
29. మాటలతో మూటలు కొనవచ్చు.
30. మాటల పసేగానీ చేతల పస లేదు.
31. మాటలలోనే మనుబోలువారు పిడూరు దాటినట్లు.
32. మాటలలోపడి మగనిని మఱచినట్లు.
33. మాటల సత్రానికి నాదో పల్లా (నాదొక బస్తా) (పల్లా= ఒక కొలమానిక).
34. మాటలు ఆకులు, చేతలు పండ్లు (కాయలు).
35. మాటలు ఎప్పుడు నిలుపాలనో తెలియనివాడే వదరుబోతు (వాయాడి).
36. మాటలు కోటలు దాటును, కాలు గడప దాటదు.
37. మాటలుచెప్పే మొనగాండ్లేగానీ, పూట బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు.
38. మాటలు తల్లిమాటలు, పెట్టు సవతితల్లి పెట్టు.
39. మాటలు నేరకున్న నవమానము అన్యము మానభంగమున్.
40. మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే ఇసుకో అన్నదట.
41. మాటలు నేర్చినమ్మ ఏడ్చినా ఒక సొంపే (బాగుంటుంది).
42. మాటలు నేర్వలేకపోతే, పూటలు గడువవు.
43. మాటలు పోయినాక, మూటలు పనికిరావు.
44. మాటలు మంచి, చేతలు చెడ్డ.
45. మాటలేగానీ చొరనీదు మాచకమ్మ.
46. మాటలే మంత్రాలు, మాకులే మందులు.
47. మాటలో నీటుంది, మాటలో పోటుంది, మాటలో సూటి ఉంది.
48. మాట వెండి, మౌనం బంగారం.
49. మాటే లేకుంటే చోటే లేదు.
50. మాట్లాడ నేరిస్తే, పోట్లాడరాదు (పోట్లాడ పనిలేదు).
51. మాట్లాడితే మరామేకు (మరచీల).
52. మాట్లాడితే మల్లెలు, కాట్లాడితే కందు(తి)రీగలు.
53. మాట్లాడుతుంటే వచ్చేవి మాటలు, గోరాడుతుంటే వచ్చేవి వెంట్రుకలు (బొచ్చు).
54. మాట్లాడే వానికి వినే వానికి అర్థం కానిదే వేదాంతం.
55. మాడపన్ను కొరకు మహిషంబు నమ్మితి, మడమనూరి వృత్తి మాలవృత్తి.
56. ' మాణవా ధీశర, మణువు నాలికవాడు ' అని సెట్టిగారు పురాణం చదివితే, ' అబ్బో! అంత పెద్ద నాలిక ఎవరికుంది? ' అని ప్రశ్నించగా, ' ఇనుము యిదర్భదేశమున యీరుడికుండెను ' అన్నాడట ఇంకొక శ్రోత.
57. మానిక్యం పోయి, పసిపాత దొరికినట్లు.
58. మాణిక్యానికి మసి పూసినట్లు.
59. మాతకు గజ్జలాడితే, మాదిగకు సివమెత్తుతుంది.(మాత= పెండ్లి లేకుండా జాతరలో సిందువేయు మాదిగ స్త్రీ).
60. మాతాతలు నేతులు తాగారోయి, మా మూతులు వాస్న చూడండొయ్.
61. మాదాకవళమమ్మా! అంటే మా ఇంటాయన నీకు కనుపించలేదా? అన్నదట.
62. మాదిగ మంచానికి కాళ్ళవైపూ ఒకటే, తలవైపూ ఒకటే.
63. మాదిగ మంపు మాపటిదాక, కాపు మంపు కపిల వేళదాక (మంపు=మాంద్యము, మత్తు; కపిల=మోట).
64. మాదిగ మల్లి, కంసాలి ఎల్లి (మల్లి=మళ్ళీ రమ్మనుట; ఎల్లి=రేపు రమ్మనుట).
65. మాదిగవాని బ్రతుకు ముదురుమీద గడ్డి ఒకటే.
66. మాదిగవాని ఆలయినా, మాడే కాలికి చెప్పు లేదు.
67. మాదేవుని సత్యం మాకు తెలియదా?
68. మా దొబ్బే రెడ్డి వచ్చాడు, కోళ్ళ గూటిలో మంచంచేయి అన్నత్లు.
69. మాధవభట్లకు పడిశము ఏటా రెండుమార్లు రావటమూ, వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలుండటము.
70. మాధుకరం వానింటికి ఉపాదానం వాడు పోయినట్లు.
71. మాధ్వులకు భుక్తి, వైష్ణవులకు భక్తి, అద్వైతులకు యుక్తి.
72. మానంది (మహానంది)తిరుణాళ్ళమన్నాయె గాని, ఏట్లో పడుకుంటే నోట్లో చేసిపోయినారు.
73. మానం పోయిన వెనుక ప్రాణ మెందుకు.
74. మానవ సేవే మాధవ సేవ.
75. మానవ జీవితాన్ని పాలించేది విధేగానీ విఙ్ఞానం కాదు.
76. మానవుడు తాను చేసిన పనిముట్టుకే పనిముట్టయి పోతున్నాడు.
77. మానవు లుందరు గానీ, మాటలు ఉండి (నిలచి) పోతవి.
78. మానికకు కరవు లేదు, కోమటికి పరువు లేదు.
79. మానిన పుండును మళ్ళీ రేపినట్లు.
80. మానిన పుండు మళ్ళి సెలపోసినట్లు (సెలపోయు=తిరిగి చీము పోయు).
81. మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంత ఉన్నది వైద్యుడా! అన్నాడట.
82. మానిన పండ్లు మాని కిందనే పడును (రాలును).
83. మాన్పిందే మందు, మాంపినవాడే వెజ్జు.
84. మాన్పిందే మందు, బ్రతికిందే ఊరు.
85. మానుకొద్దీ చెక్కు తీయాలి.
86. మానుగొట్టి మీద ద్రోసికొన్నట్లు.
87. మానుపిల్లి అయినా మట్టిపిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి.
88. మానుమాను దిరుగు మహికోతి కైవడి.
89. మానెడు గింజలకు పనికి బోతే కుంచెడు గింజలు దూడ తినిపోయిందట.
90. మానెడు పిండవచ్చును గానీ, చిట్టెడు తిరిగి ఎక్కించలేము.
91. మానెడు మంటిలో పోసుకుంటే, ఇద్దుము యింటిలో పోసుకుంటారు.
92. మానేదానికి మండేలా? మానని దానికి మందేలా?
93. మా పిల్లవానికి ముప్ఫైరెండు గుణాలున్నవిగానీ, రెండుమాత్రం తక్కువ.
94. మా బావ వామహస్తానికి తోడు చాదస్తం.
95. మాబఱ్ఱె చస్తే చచ్చింది గానీ, పెద్దాయన బఱ్ఱె పాలివ్వకపోతే చాలు.
96. మాబూసాహేబ్ పెండ్లామైతేనేమి? బాబూసాహేబ్ పెండ్లామైతే నేమి? మన ఇంట్లో పాచిపని మతకం లేకుండా చేస్తే చాలు.
97. మామతో కూడా మంచమల్లి, తాతతో కూడ తడక కట్టటానికి వచ్చిందట.
98. మామతో గూడ వేడన్నంతిని, అక్కతో గూడ పైటన్నం తిని, అమ్మతో గూడ అంబలి తాగేవాడు.
99. మామ బంతికి కూర్చొని, అత్తబంతికి లేస్తాడు.
100. మామా ఒక ఇంటి అల్లుడే! అత్తా ఒక ఇంటి కోడలే.

No comments: