Friday, May 27, 2011

సామెతలు 51

1. నవరత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లలన్నీ ఒకచోట.
2. నవాబుతల బోడితల అయితే, నా తలగూడా బోడి అని వితంతు విఱ్ఱవీగిందట.
3. నవాబు పొట్టా, తాములపాకుల కట్టా తడుపుతూ ఉండవలె.
4. నవాబెంత దరిద్రుడో, పులి అంత సాధువు.
5. నవ్వలేని వారిని నమ్మరాదు.
6. నవ్వితే ఊడే ముక్కు తుమ్మితే ఉంటుందా?
7. నవ్విన ఊళ్ళే నగరాలవుతాయి.
8. నవ్విన నాపచేనే పండుతుంది. (నాపచేను= నాము అనగా పైరుకోసిన తర్వాత కొయ్యకాలునుండి ఎదిగిన కర్రలు. నాము ఎదిగిన చేను నాపచేను).
9. నవ్వుతూ కోసిన ముక్కు ఏడ్చినా రాదు.
10. నవ్వు నాలుగందాల (నానందాల) చెరువు.
11. నవ్వులతోటలో నాగులు తిరుగును.
12. నవ్వే ఆడుదాన్నీ, ఏడ్చే మగవణ్ణి నమ్మరాదు.
13. నవ్వేవారి ముందు జారిపడినట్లు.
14. నష్టపడినా భ్రష్టు కారాదు.


నా


15. నాంచారమ్మ వంట, నక్షత్రదర్శనము ఒక్కమారే (ఆలస్యమగునని).
16. నా ఇంటికి నేను పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామాలు అన్నట్టు.
17. నాకిన్ని గంజినీళ్ళు పోస్తావా, నీ కాకలి కాకుండా మందిస్తానన్నాడట. (మంత్రం చెపుతాను అన్నట్లు).
18. నాకు ఆయుష్యమస్తు, నాకు ఆరోగ్యమస్తు అని దీవించుకొన్నట్లు.
19. నాకు తెలియకుండా నంబికిష్టయ్యకు కనికెడు (కమికెడు) జుట్టా?
20. నా పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా?
21. నాకు బెబ్బెబ్బే అంటే, నీకు బెబ్బెబ్బే, నీ అబ్బకు బెబ్బెబ్బే అన్నాడట.
22. నాకులకు లోక భయమేల?
23. నాకు లేక నాకుతుంటే, నీకు నైవేద్యమా?
24. నాకు లేక నాకుతుంటే, నీకెక్కడ దెత్తునే దేకులాడి.
25. నాకు లేక నాకుతుంటే, మూతులు నాకను వచ్చావా?
26. నా కూడు, నా కల్యాట్లు నాకు తప్పవు (కల్యాట్లు= అగసాట్లు, కష్టాలు).
27. నాకు నాపిల్లకూ నూరేండ్లాయుస్సు, నా పెనిమిటికి లోకంతో పాటు.
28. నాకూ లేదు, నీకూ లేదు, ఊరుకో దేవరా.
29. నాకు సిగ్గులేదు, రేపు వచ్చే అమావాస్యకూ సిగ్గు (ఎగ్గు) లేదు.
30. నాకే కుక్కకు, లింగమేమి? పానపట్టమేమి?
31. నా కోడీ, కుంపటీ లేకపోతే ఎట్లా తెల్లవారుతుందో - ఎట్లా నిప్పు దొరుకుతుందో చూస్తాను అందిట ఒక అవ్వ.
32. నాగరికం లేని మాట, నాలుకపై తీట.
33. నాగలిఉన్న ఊళ్ళో ఆకలి చేరదు.
34. నాగలి మంచిది కాకపోతే, ఎడ్లేమి చేస్తాయి?
35. నా గర్భదానం నేనున్నట్లే జరపండి, నాకు రానుతీరిక లేదు అన్నాడట.
36. నాగసముద్రం పిల్ల, నగారు మీద పుల్ల.
37. నాగుబాము చిన్నదనవద్దు, పాలివాడు సన్నమనవద్దు.
38. నా చెయ్యి నొస్తున్నది, నీ చేతితో మొత్తుకో అన్నట్లు.
39. నా చెవులూ కంసాలే కుట్టాడు.
40. నా చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నాడట వైద్యుడు. (చేతివాసి లేని వైద్యుని మాట).
41. నాజూకు నక్కలు దేకితే, నెరసిన గడ్డం కుక్కలు పీకినవి.
42. నాత్యం త్రొక్కిన కాలు, రోసి రోటిక్రింద పెట్టినా ఊరుకోదట.
43. నాడు ఉంటే నవాబుసాహెబు, అన్నముంటే అమీరు సాహెబు, చస్తే పీరు సాహెబు.
44. నాడు కట్టాలేదు, నేడు చింతాలేదు.
45. నాడు నులువబడా లేదు, నేడు ఎత్తుబడా లేదు.
46. నాడుపోయి, నేడొస్తివా మగడా! నా తప్పేమి చెప్పు?
47. నాడు లెంచేవారేగానీ, గోడు చూచేవారు లేరు.
48. నాడు వ్రాసినవాడు నేడు చెఱపి మళ్ళీవ్రాస్తాడా? (నుదుటివ్రాత).
49. నాతి బలము నాలుకపైన.
50. నాథుడులేని రాజ్యం నానా దారులు.
51. నాదగ్గర ధనమున్నంతవరకు నన్ను అందరూ ' అన్నా ' అని పిలిచినారు.
52. నాదముంటే గంట, వాదముంటే తంట.
53. నాదయలో నీ గంజి త్రాగు అన్నట్లు.
54. నాదికాదు, నా అత్త సొమ్ము అన్నట్లు.
55. నాదుక్కటీ, నారెడ్డివి (మారెడ్డోరివి) కలిసి నూటొక్క ఎద్దన్నట్లు (ఇతనిది ఒకటే).
56. నాదెంత గడ్డం, ఉమ్మి పూసి గొరగ మన్నాడట.
57. నా దెబ్బ గోలకొండ అబ్బా అన్నట్లు.
58. నానబాలు పట్టమ్మా అంటే, ఏచేని సజ్జలు అన్నదట.
59. నానాకూళ్ళవాళ్ళు నాయుళ్ళు అయినట్లు.
60. నానాటికి తీసికట్టు నాగంభొట్టు.
61. నానారుచులు పారితే నాలుకమీద కొఱివి పెట్టుకొన్నట్లుంది.
62. నానిన భూమి నవధాన్యాలు పండును.
63. నా నోట్లో (నీవు) వేలు పెట్టు, నీకంట్లో (నేను) వేలు పెడతానన్నట్లు.
64. నాన్చి నాన్చి వేస్తివో, నా కొంప తీస్తివో.
65. నాన్పుడుగాడు నా పెండ్లికి నేనూ వెళ్ళాలా? అన్నట్లు.
66. నాపప్పు కలిసిందంతా నేనే తింటాను.
67. నా పాతివ్రత్యం నా మొదటి పెనిమిటికి తెలుసు.
68. నాపాపము నాతోనుంటే శ్రీపతిబిరుదమునకేమి బ్రతుకు?
69. నా పెండ్లాన్ని లేవదీసుకు పోతేపోయినాడుకానీ పదిమందిలో ఉసే అంటాడేమో అను భయంగా ఉన్నదన్నాడుట.
70. నా పెండ్లి సగమైన దంటే, ఎట్లానయ్యా అంటే, నేను పెండ్లికొడుకుగా సిద్ధంగా ఉన్నాను; మిగతా సగానికి పెండ్లికూతురే కావాలన్నాడట.
71. నాభిలో పుట్టిన పురుగు నాభిలోనే పెరుగును.
72. నామము నియమము చేటు.
73. నామనుము నమ్మకంలేదు, మా అమ్మను రాట్నం అమ్మబాక (వద్దు) మను.
74. నామము హెచ్చిన కామము తగ్గునా?
75. నా మాట నమ్మింది నల్లకుక్క, ఏమాఱిపోయింది ఎఱ్ఱి(ఱ్ఱ)కుక్క.
76. నామాట నమ్ముకోకు, నాలుగెడ్లమ్ముకోకు.
77. నామాల వారేగానీ నీమాల (నియమాల) వారుగారు.
78. నాముందఱ బానెడు గంజా?
79. నామొగనికి నాపైని ప్రాణం, నాకు తెచ్చెర మెడకు ఊనం (ఉరి).
80. నా మొగుడికి నిలకడలేదంటే, మాయమ్మ ఏకులరాట్నం, అమ్మవద్దని చెప్పిపంపింది-అన్నది.
81. నాయనకు పెండ్లి సంబడం, అమ్మకు సవతి సంకటం.
82. నాయనమ్మ ఏంచేస్తొంది? అంటే, ఒలకపోసి ఎత్తుకుంటోంది అన్నట్లు.
83. నాయారాలంటే, ఏకులొడికి పోషిస్తాను అన్నదట.
84. నారతడప అని పారవేస్తే, నాగుబామై కఱచిందట.
85. నారికి రెండెల్లలు, తల్లికి రెండు పిల్లలు.
86. నారి తెగినా నారి తెగినా అతకటం కష్టం. (నారి=వింటి అల్లెత్రాడు, స్త్రీ).
87. నారు, నీరు, నోరు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక్కటే.
88. నారు పోసిన వాడు నీరు పోయక మానడు.
89. నారే నరునకు రత్నము.
90. నాలిముచ్చు వాణ్ణి, నీళ్ళునమిలేవాణ్ణి నమ్మరాదు.
91. నాలుక ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరుగగలడు.
92. నాలుక కటువు, ఎద మెత్తన.
93. నాలుక తీపి, లోన (అంగిట) విషము.
94. నాలుక తేనె, మనసు విషము.
95. నాలుక దాటితే నరకము.
96. నాలుకలో నారాయణ, చంకలో చురకత్తి.
97. నాలుకా! నాలుకా! (నా) వీపుకు దెబ్బలు తేకే.
98. నాలుగు ఈతలు ఈనేసరికి నక్క నాంచారి అయ్యింది.
99. నాలుగు ఈతల పీత పాతాళగంగ అయ్యింది.
100. నాలుగు ఏర్లు కుక్కకు తడుపుతడుపే (గతుకు నీళ్ళే).

Wednesday, May 18, 2011

సామెతలు 50


1. నక్క బోయిన వెనుక బొక్క కొట్టుకొన్నట్లు.
2. నక్క ముదిరితే వఱడు, తొండ ముదిరితే ఊసరవెల్లి.
3. నక్క రేలకాయ తినినట్లు.
4. నక్కలలో నక్కగా నటించవలె.
5. నక్కలు బొక్కలు వెదకును, తక్కిన నాలంజకొడుకు తప్పేవెదకున్.
6. నక్కలు మరవలు పారితే కుక్కలు కూటికొల్లవు.
7. నక్కలెరుగని బొక్కలు, నాగులెరుగని కోవ(మ)లు (పుట్టలు) గలవా? (కోవలు=పుట్టల శిఖరాలు).
8. నక్క వచ్చి కుక్కతోక సవరించినట్లు.
9. నక్కవాత మున్ను గొట్టినాడు (చావక బ్రతికినాడనుట).
10. నక్క వినయము! కొంగ జపము.
11. నక్కా! నక్కా! నా నామం చూడు, తిరిగి చూస్తే తిరుమణి చూడు.
12. నగ(గి)రి పేదా? ఉప్పు చేదా?
13. నక్షత్రాలు శాశ్వతజ్యోతులైనా చీకటి పడినప్పుడే వెలిగేది.
14. నగిరికి ఎంతైనా పెడతాడు కానీ,పెద్దకోడలికి కూడుబెట్టను ఏడుస్తాడు.
15. నగుబాట్ల పెండ్లికి నాడే నాగవల్లి.
16. నలుగు ముదిరితే తెగులు.
17. నట్టింట ఉండి నా భాగ్యమంటే, ఉట్టిమీదు నుంచి ఊడి పడుతుందా?
18. నట్టేట పుట్టిముంచినట్లు (మునిగినట్లు) (పుట్టి=పేళ్ళతో చేసిన గుండ్రని బుట్టవంటి చిన్న పడవ).
19. నట్టేటిలో చేయి విడిచినట్లు.
20. నట్టేటిలో పడ్డ సొమ్ము నట్టింటికి వచ్చినట్లు.
21. నడిచే కొద్ది డొంక, పెట్టే కొద్ది కుదురు.
22. నడిచే దారిలో గడ్డి మొలవదు.
23. నడిచేవాడే పడేది.
24. నడమంత్రపు దాసరి పొద్దుమాన మెరుగడు.
25. నడమంత్రపు వైష్ణవానికి నామాలు మెండు.
26. నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.
27. నడమంత్రపు సిరి, నరంమీది పుండు భరింపరానివి.
28. నడమంత్రాన సిరివస్తే, నడిరేయి గొడుగు పట్టమన్నాడట.
29. నడవంగా నడవంగా పైగుడ్డే బరువైనట్లు.
30. నడవడికలు చక్కబెట్టేది నాటకము.
31. నడవలేనమ్మకు నాలుగు పక్కలా సవారి.
32. నడిస్తే మార్గాయాసం, తింటే భుక్తాయాసం- తిమ్మావధానికి.
33. నడుమ దిరిగే కుంటెనగాడికి చెన్నపట్నం రైలుబండి.
34. నడుమ దిరిగే కుంటెనగాడికి  కందూరు, కఫాయి (కైపు) సార.
35. నడుము మినిగేదాకానే చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.
36. నత్తగుల్లలన్నీ ఒక రేవున, ముత్యపుచిప్పలన్నీ ఒక రేవున (చేరును).
37. నత్తగుల్లలో ముత్యాలు పుట్టునా?
38. నత్తి నాలిగింటి కర్ధం.
39. నది నాల్గామడ ఉండగా, చీరవిప్పి చేతపట్టు కున్నదట.
40. ననకూడి నార తలకెక్కినట్లు.
41. నన్ను ఎఱిగినవాడు లేకపోతే, నా బడాయి చూడమన్నట్లు.
42. నన్ను కొడితే కొట్టావుగానీ, మా బావను కొట్టు చూస్తాం అన్నట్లు.
43. నన్ను చూస్తే, నిన్ను కాస్తా.
44. నన్ను నేనే ఎఱుగను, నేను నిన్నేమి ఎఱుగుదును?
45. నన్ను పెంచితే, నిన్ను ముంచుతా.
46. నన్ను ముట్టుకోకు నా మాల కాకి.
47. నపుంసకుని చెంతనా నవలా సరసం?
48. నపుంసకుని చేతికి రంభ దొరికినట్లు.
49. నమలక, మింగక నానవేసినట్లు.
50. నమాజు చేయబోతే మసీదు మీద పడ్డట్లు.
51. నమిలేవాడికన్నా, మింగే వాడే ఘనుడు.
52. నమ్మించి గొంతుకోసినట్లు.
53. నమ్మితి రామన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా అన్నట్లు.
54. నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ణి చేస్తానన్నట్లు.
55. నమ్మిన ఇమ్ము, నమ్మకున్న అమ్ము.
56. నమ్మిన ఎనుము పోతు అయ్యిందట.
57. నమ్మి నడివీధిలో వేసిన వారెవరు?
58. నమ్మి నానబోస్తే, పులిసి బూరటిల్లిందట.
59. నయముంటే భయమేమి?
60. నయము నష్టకారి, భయము భాగ్యకారి.
61. నయాన పాలు తాగరు, భయాన విషమైనా తాగుతారు.
62. నయాన కానిపని భయాన అవుతుంది.
63. నరంవంటి వాడికి జ్వరం వస్తే, చేయి చూచినవాడు బ్రతుకడు.
64. నరకములో కరుణ లేదు, నాకంలో మరణం లేదు.
65. నరకములో నారాయణుడుండునా?
66. నరకానికి నవద్వారాలు, నాకానికి ఒకటే.
67. నరాలు లేని నాలుక నానావిధాల పలుకుతుంది.
68. నరుకలేని బంటు, కత్తి చుఱుకు లేదన్నట్లు.
69. నరునకు నరుడు, తరువుకు వేరు సహాయం (అండ).
70. నరునికి నాలు గంశలు.
71. నరునికి సుద్దంబద్దంలేదు, గుంజుగుంజు నడేటిలోనికి- అన్నదట మొసలి.
72. నర్మదలో మునిగినా కర్మం తప్పదు.
73. నలపాకము, భీమపాకము. (మగవాడు చేసే వంట)
74. నలసారము, సంసారము.
75. నలిగి ఉన్నప్పుడు తొలిగి ఉండమన్నారు.
76. నలుగురితో చావు పెండ్లితో సమానం.
77. నలుగురితో పాటు నారాయణా! కులముతో పాటు గోవిందా.
78. నలుగురు చేతులువేస్తే గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారు.
79. నలుగురి తరవాత పుడితే నట్టిల్లు బంగారమవుతుంది, ముగ్గురి తర్వాత పుట్టితే ముయ్య మూకుడుండదు.
80. నలుగురు నడిచే దారిన నాచుగూడా మొలవదు81. నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట.
82. నలుగురు నవ్వినట్లే ఉంది, నామాట కుదిరినట్లే ఉంది.
83. నలుపు నాలుగు వంకరలు తెలుపుతుంది, ఎఱుపు ఏడువంకరలు దాస్తుంది.
84. నలుపు నారాయణమూర్తి.
85. నలుపు సరుకులో (రంగులో) నాణ్యము లేదా?
86. నల్లంబి దురాయి పెట్టితే నిలుస్తుందా? (నల్లంబి= ఒక చిన్న నల్లపిట్ట, దురాయి=ఆంక్ష, ఆక).
87. నల్లావు పాలైనా తెల్లనే.
88. నల్ల కోడికైనా తెల్లగుడ్డే.
89. నల్ల చీరలు కట్టినవాళ్ళంతా నా పెళ్ళాలే అన్నట్లు.
90. నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు (అనుకునేంత అమాయకుడు).
91. నల్లనేలకు నువ్వులు, ఎఱ్ఱనేలకు కందులు.
92. నల్లబాపడు నాభికంటే విషము.
93. నల్ల బాపనయ్యను ఎఱ్ఱ మాదిగను నమ్మరాదు.
94. నల్లనివాడికి నాభిలో విషము.
95. నల్ల రేగడిలో చల్లినా తెల్లజొన్నలే పండేది.
96. నల్లికాటు, నారి పోటు.
97. నల్లిని గూర్చి మంచానికి పెట్లు. (కించిత్తు నల్లిగరచిన మంచమునకు పెట్లువచ్చు).
98. నల్లులకు వెఱచి ఇల్లు విడచినట్లు.
99. నల్లేరుమీద బండి పోయినట్లు.(సులభమని).
100. నవరత్నములుండినా నరరత్న (నారీరత్నము) ముండవలె.

Wednesday, May 11, 2011

సామెతలు 49


1. దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకపోతే, గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి.
2. దొబ్బను దేవుడంతటి వాడు (దేవుడే).
3. దొబ్బనేర్చు కుక్క దుత్తలు మోచునా?
4. దొమ్మలన్నిటిలోనూ మిడిదొమ్మ మిండడు (దొమ్మ=పశురోగము)
5. దొమ్మతగిలి మన పశువులు రెండు చచ్చినవంటే, మనవాళ్ళవి ఎన్ని చచ్చినవని అడిగినాడట.
6. దొరకని పూలు దేవునికర్పణం.
7. దొరకు పండుకునే మంచంలేకపోతే దాసీదానికి పట్టుపరుపా?
8. దొరసానికి వల్లే దొరకకపోతే తొత్తుకు తొగరు చీరా?
9. దొరికితే దొంగ, దొరకకపోతే దొర.
10. దొరికిన సొమ్ముకు దొంగవుతాడా?
11. దొరకు తొంగను మంచం లేదు, బంటుకు పట్టుపరుపట.
12. దొరను పేద అనరాదు, ఎద్దును సాధువు అనరాదు.
13. దొరబిడ్డ అయినా ఒకని ఆలే.
14. దొరల చిత్తం, చెట్లనీడ నిలకడలేనివి.
15. దొరలు ఇచ్చిన పాల కన్నా, ధరణి ఇచ్చిన పాలు మేలు.
16. దొరసానికి దుప్పటిలేదు, తొత్తుకు తొగరు చీరట.
17. దొరాల తగులుకొంటున్నావు, ఏమిస్తావో దొరా, అంటే- నీ మనసు మెప్పించి తలకేదో పాత (పాతగుడ్డ) సంపాదించుకోవాలను కొన్నానమ్మా అన్నాడట.
18. దొరువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూపి బేరమాడినట్లు (దొరువు= తవ్విన నీటి గుంట).
19. దొరే దొంగైతే బంట్రోతు కన్నగాడగును.
20. దొలుపుడు ముద్దకు నలుపుడు కారం (దొలుపుడూ=దొర్లు, (గుండ్రని)).


దో


21. దోచపండు నెట్టుబ్రోచు ఇనుపకట్టు.
22. దోచుకొనిపోయిన వాడు దొర, దొరికినవాడు దొంగ.
23. దోత్రం పెద్దదయితే గోత్రం పెద్దదగునా?
24. దోనె చేయబోయి సోల చేసాడట.
25. దోమలు తగ్గితే చేమలు ఊరును.
26. దోర కజ్జం, రామానుజం పొడి.
27. దోవను పోయేదెవరయ్యా అంటే, దొబ్బులు తినే నేనయ్యా అన్నట్లు.
28. దోవను పోయేదొకడు, దొబ్బులు (దొబ్బలు) తినేదొకడు.
29. దోవలో కూర్చుండి దొబ్బలు తిన్నట్లు.
30. దోసకాయలు తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఒకటే.


దౌ


31. దౌలతున దిరిగినా గులాము గులామే (దౌలతు=సంపద).
32. దౌర్భాగ్య దామోదరుడు (నిర్భాగ్య దామోదరుడు).


ద్ర


33. ద్రవ్యం దాచినవాడికి తెలుసు లెక్క వ్రాసినవాడికి తెలుసు.
34. ద్రావిడ ప్రాణాయామం.
35. ద్వారపూడి పచ్చెపువాడు.


ద్వి


36. ద్విపదకావ్యం ముదిలంజ దొడ్డికంత.




37. ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును.
38. ధనము లెచటికేగు, దానేఘు నెచటికి?
39. ధనపతి సఖుడైనా శివుడు బిచ్చమెత్తవలసి వచ్చింది.
40. ధనానికి దాపరికం (గుట్టు) సేద్యానికి వెల్లడి (రట్టు).
41. ధనికిని చెఱకుపంట, దరిద్రునికి నువ్వు పంట.
42. ధనియాలజాతి (చెప్పుతో రాసి బద్దలు చేస్తేగాని మొలవవు- భయానగానీ పనిచేయరు అని).
43. ధరకు దొర ఎవడు?
44. ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ.
45. ధరించేదే శాటి, వరించేదే బోటి.
46. ధర్మం దరిబేసి నడిగితే ఇచ్చునా? తన్నుక చచ్చునుగాని.
47. ధర్మపురిలో దొంగిలించబోతూ, ధార్వాదనుండి వంగుని పోయాడట.
48. ధర్మానికి దండుగ లేదు, వెట్టికి పైసా లేదు.
49. ధర్మానికి దట్టీ ఇస్తే, ఇంటివెనుకకు పోయి మూరవేసిందట.
50. ధర్మానికి పోతే కర్మం చుట్టుకొన్నదట.
51. ధర్మోదకాలలో రాని పితురుడు తర్పణాలలో వచ్చినట్లు.


ధా


52. ధారలేని తిండి దయ్యపు తిండిరా.
53. ధారోష్టం, అమృతోత్తమం, దాచినమగడా! వేరుండుమన్నట్లు.


ధీ


54. ధీరుడయినా కావాలి, దీనుడయినా కావాలి.


ధూ


55. ధూపం వేస్తే పాపం పోతుంది.


ధై


56. ధైర్యలక్ష్మి-ధనలక్ష్మి.
57. ధైర్యంలేని రాజు, యోచనలేని మంత్రి.


ధ్వ


58. ధ్వంసం నారాయణుడు కమతం చేస్తే, పాలికి పందుం- పల్లేరు కాయలు.
59. ధ్వంస పారాయణం దంతు మంట.




60. నంగతుంగ నీళ్ళకు పోతే, నీళ్ళన్నీ ఒక రేవుకు వచ్చాయిట.
61. నంగనాచి చీర నడివీధిలో ఊడిందట (నంగనాచి=ఏమీ ఎరుగనట్లు నటించుట).
62. నంగనాచి- తుంగబుఱ్ఱ (తుంగకు బుఱ్ఱ ఏర్పడదు).
63. నంగనాచి- వంగముల్లు.
64. నంగనాచులు శరణనగానే అనంగుడు ఙ్ఞానోపదేశం చేయునా?
65. నంగి వంగలు మేస్తుంటే, నారికేళాలు దూడలు మేసినవట (నంగి=దూడ కలిగిన ఆవు).
66. నంగీ! నమిలి మింగవే అంటే, ఉడికిన చేపలు కరుస్తవి అన్నదట. (నంగి=నంగనాచి, మాటలు వచ్చిరానట్లు ముక్కుతో మాట్లాడేవాడు).
67. నందనవనంలో కుందుగడ్డి పెరుగవచ్చు.
68. నందనవనంలో నాగుబాముండటం మృగనాభికి పిప్పితగిలినట్లు.
69. నందరాయని భాగ్యము నక్కలకూ కుక్కలకూ.
70. నందనమ్మలు బాగాపండితే, నారాయణుని చూచినట్లే.
71. నంది అంటే నందే, పంది అంటే పందే (పట్టుదల).
72. నందిని చేయబోయి పందిని చేసినట్లు.
73. నందిని పంది, పందిని నందిని చేయగలవాడు.
74. నంది వంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేయవా?
75. నంద్యాలవారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
76. నంబి కవిత్వం, తంబళ్ళ జోస్యం.
77. నంబి పెట్టినదే ప్రసాదం.
78. నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.
79. నంబివాడు ఎదురైనా, నాగుబాము ఎదురైనా కలిసిరాదు.
80. నంబి వారికి, తంబళి వారికి ఒకటే కుంచకోల అన్నట్లు.
81. నంబీ! నంబీ! నా పెండ్లికేమి సహాయం చేస్తావంటే, నీ పెండ్లికి నేను ఎదురు రాను పో అన్నాడట.
82. నంబీ, నంబీ, నీ పుణ్యాన పెండ్లయిందంటే, నేనేమి చేసినాననగా, తరలి పోయేవేళ, తమరు ఎదురుపడకపోవటమే అన్నాడట.
83. నక్క ఎక్కడ? నాగ(క)లోక మెక్కడ?
84. నక్క ఒకచోట ఊలవేసి, ఇంకొకచోట గౌరీకల్యాణము పాడునా?
85. నక్క కడుపున సింగము పుట్టునా?
86. నక్కకు నవ్వు-ఎండ్రకాయకు గండం.
87. నక్కకూత నాకలోకం ముట్టునా?
88. నక్క కూసి నాశం తెచ్చు.
89. నక్క కూసి పిల్లలకు దోవచూపు.
90. నక్కకొమ్ము తొక్కి వచ్చినాడు (అదృష్టవంతు డనుట).
91. నక్క చావ గొఱ్ఱె లేడ్చునా?
92. నక్కజిత్తులన్నీ (తంతులన్నీ) నావద్ద ఉండగా తప్పించుకు(క) పోయెరా తాబేటిబుఱ్ఱ అన్నదట.
93. నక్కజిత్తులు నారాయణు డెఱుగు.
94. నక్కతోక పట్టుకొని నాకలోక మెక్కినట్లు.
95. నక్క నడుము తొక్కి వచ్చినాడు (అదృష్టమనుట).
96. నక్క నారాయణునికైనా నామం పెడుతుంది.
97. నక్క నారాయణు డెక్కడనో, తోకనారాయణు డక్కడనే.
98. నక్కను చూచిన వాడెల్లా వేటగాడే.
99. నక్క పీనుగును పీకును గానీ బ్రతికిన జంతువు పైకి పోదు.
100. నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు, ఇంత గాలివాన ఎన్నడూ చూడలేదు అన్నదిట.

Thursday, May 5, 2011

సామెతలు 48

1. దున్నిన పొలానికి తాగిన గంజికి సరి.
2. దున్నే అదనులో దూరదేశం పోయి, కోతలకాలంలో కొడవలిపట్ట వచ్చినాడట.
3. దున్నే ఎద్దునే పొడిచేది (ములుకర్రతో).
4. దున్నేవాడు లేక్కచూస్తే నాగలి కూడా మిగలదు.
5. దున్నేవాళ్ళకు వేళ్ళు (లేళ్ళు) చూపించినట్లు.
6. దుప్పి కాలంగాక చిక్కును గానీ కాళ్ళు లేకగాదు.
7. దురదృష్టము ననుభవించ లేనివాడు అదృష్టమును అనుభవించలేడు.
8. దురదృష్టం పదనువాదరగల కత్తివంటిది. పిడిని పట్టుకొనిన ఉపయోగపడును, వాదర పట్టుకొనిన తెగును.
9. దుర్గంధ కుసుమంకంటే, నిర్గంధ కుసుమం మేలు.
10. దువ్వును చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు (దువ్వు=పులి).
11. దుష్టుడు కలహించటమంతా శిష్టులకే మేలు.
12. దుష్టునిచూచి దూరంగా ఉండమన్నారు.
13. దుఃఖమును అణుచుకోగలిగిన వానికంటే సంతోషాన్ని అణచుకోగలిగిన వాడే ఘనుడు.
14. దుఃఖము సుఖమును వెన్నుదన్నే వెన్నాడుచుండును.


దూ


15. దూకుదూకు మనేవాళ్ళేగానీ, దూకే లంజాకొడుకు ఒక్కడూ లేడు.
16. దూ కుడిచినట్టా? దుత్తలో పడ్డట్టా?
17. దూడ కుడిస్తే గానీ ఆవు చేపదు.
18. దూడ కుడిస్తేనే గానీ దుత్త నానదు (తడవదు).
19. దూడ-తల్లి ఉండగా గుంజ అరచిందన్నట్లు.
20. దూడపాలు దుత్తకే సరిపోయె.
21. దూడ పొదుగును కుమ్మితే గానీ ఆవు చేపదు.
22. దూడ మేసి గంటసేపైనా, దురిసెండ్ల నడతమాత్రం పోలేదు.
23. దూడలేని పాడి దుఃఖపు పాడి.
24. దూడ వగచునె భువి తోడేలు చచ్చిన.
25. దూదేకులవాడికి తుంబ తెగులు (తుంబతెగులు=దూది ఏకేటప్పుడు కలిగే చప్పుడు).
26. దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (దూదేకుల సిద్దప్ప= బ్రహ్మంగారి శిష్యులలో మహాజ్ఞాని).
27. దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు.
28. దూబరతిండికి దూండ్లు బతకవు, ఆణి మొద్దుకు ఆండ్లు బతకవు.
29. దూరం గుడికట్టితే (చంద్రుని చుట్టు) దగ్గరవాన, దగ్గర కడితే దూరపువాన.
30. దూరదర్శనితో చూచినకొండ చిన్నదిగా కంపించును, భూతద్దములో చూచిన పెద్దదిగా కంపించును.
31. దూరపు కొండలు నునుపు.
32. దూరపు దండం కోటి లాభం.
33. దూల పెట్టేచోట దుడ్డుకోల పెట్టినట్లు.
34. దూస్తే దోసెడు, ఊడితే హుళక్కి.


దె


35. దెప్పె ఎక్కినట్లు, దేవుడికి మొక్కినట్లు.
36. దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.
37. దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంది.
38. దెసబత్తెలవానికి బరిబత్తలవాడు బావమరిది (దెసెబత్తలు=దిసమొల).


దే


39. దేవతలకు దుమ్ము, రాక్షసులకు మన్ను.
40. దేవతలు నాశంచెయ్యాలనుకున్న వానికి ముందు పిచ్చి పట్టిస్తారు.
41. దేవర చిత్తం, దాసుడి భాగ్యం.
42. దేవర చిత్తం, దీనుడి భాగ్యం.
43. దేవర సవాసేరు, లింగం సేరు.
44. దేవళం మింగేవాడికి ధ్వజస్తంభం లొటలొట.
45. దేవాంగులలో వా దించరాదు (వా అనే అక్షరం కొట్టివేయరాదు).
46. దేవియున్న గృహము దేవార్చన గృహము.
47. దేవుడని మొక్కితే, దెయ్యమై పట్టుకొన్నట్లు.
48. దేవుడికి ముడుపు, దెయ్యానికి మంత్రం.
49. దేవుడి పట్టుకంటే, దెయ్యపుపట్టు ఎక్కువ.
50. దేవుడీ పెళ్ళికందరూ పెత్తనగండ్లే (పెద్దలే).
51. దేవుడిస్తాడు గానీ వండి వార్చి వాత కొడతాడా?
52. దేవుడు కూరగాయలిస్తే దెయ్యం వంటవాని నిచ్చింది.
53. దేవుడు చెఱుపని ఇల్లు దేవాంగి చెరుపుతాడు.
54. దేవుడు తలిస్తే దెబ్బలకు కొదువా?
55. దేవుడులేని ఊళ్ళో మంచపుకోడే పోతురాజు.
56. దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు.
57. దేవునికి చూపులు, మనకు మేపులు.
58. దేవునితేరు ఈడ్వలేకున్న ధర్మకర్త-నంబినాయాలు బరువైనాడుగానీ దేవుడే అయితే నా వెంట్రుకకు కట్టి లాగనా అన్నడట.
59. దేశమెవ్వరు ఏలుతున్నా, ధాన్యం దంచితేనే బియ్యం అవుతాయి.
60. దేసూరురెడ్ల పొందు (పొత్తు) దయ్యపుపొందు (పొత్తు) (దేసూరు రెడ్లు=రెడ్లలో ఒక శాఖ).
61. దేహము గొడవల కాపురము.


దై


62. దైవబలము కలుగని వేళ కలహించి గొఱ్ఱెకరచు.


దొ


63. దొంగ అండీ అంటే, ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నట్లు.
64. దొంగకుక్కను పుట్టించినవాడే యతిమతం ముండను పుట్టించినాడు.
65. దొంగకు చేను వచ్చి అయితేమాత్రమేమి?
66. దొంగకు తలుపుతీసి, గొరను లేపినట్లు.
67. దొంగకు తేలు కుట్టినట్లు.
68. దొంగకు తోడు, దొరకు సాక్షి.
69. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి.
70. దొంగకు దొరికిందే చాలు.
71. దొంగకు భయము, లంజకు సిగ్గు పనికిరావు.
72. దొంగగొడ్డుకు గుడి కట్టినట్లు.
73. దొంగగొడ్డు మెడను దుడ్డుగట్టినయట్లు.
74. దొంగగొడ్లకు గుదికఱ్ఱలు (కట్లు) కట్టినట్లు.
75. దొంగచేతికి తాళమిచ్చినట్లు (తాళంచెవి).
76. దొంగచేయి దోపన బెడితే, అమావాస్యనాడు అల్లల లాడినట్లు.
77. దొంగతనానికి పోతూ, డోలు చంకన బెట్టుకొని పోయినట్లు.
78. దొంగ(వాని) తల్లికి ఏడువ భయం.
79. దొంగతో కూడా దయ్యం వెంబడే వచ్చును.
80. దొంగను దోస్తే దాదులేదు, ఫిర్యాదు లేదు.
81. దొంగపోటు కంటే, లింగపోటు ఎక్కువ.
82. దొంగపోయి తలారివాని ఎదుట దాగినట్లు.
83. దొంగ మగని భక్తిమీర పూజించగానే మంచిత్రోవ చూపగలడా?
84. దొంగల సొమ్ము దొరలపాలు.
85. దొంగలు తోలిన గొడ్డూ ఏరేవు దాటినా ఒకటే.
86. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినవట.
87. దొంగలూ, దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్లు.
88. దొంగ వస్తాడని ముందు చెప్పిఉంటే సాక్షులను సంపాదించి ఉందునే అన్నాడట.
89. దొంగ వాకిట మంచం వేసినట్లు.
90. దొంగవాడి దృష్టి మూట మీదనే.
91. దొంగవాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే.
92. దొంగ సంగతి దొంగ ఎఱుగును.
93. దొంగిలబోటే మంగలం దొరికిందట.
94. దొంగిలించేంత దొరతనముండగా, అడుక్కతినేటంత అదవతన మేల?
95. దొంతుల కోపని గుదియలుండునా?
96. దొంతులజేరి నాయి దోర్చుగానీ కూర్చునా? (నాయి=కుక్క, దోర్చు=త్రోయు)
97. దొడ్డికిపోయే వాని కొఱకై ఒడ్డుకు పడవ పట్టించినట్లు.
98. దొడ్డినిండా గొడ్లు,ఇంటినిండా బిడ్డలు! ఇంకేమికావాలి ఇరకటానికి?
99. దొడ్డిలో కామధేనువుంటే, గొడ్డును పితుకను కుండను గొంపోయినట్లు.
100. దొడ్డివాకిట, దెయ్యాన్ని తరిమేస్తే, తలవాకిట వచ్చి నిలబడిందట.