Wednesday, May 18, 2011

సామెతలు 50


1. నక్క బోయిన వెనుక బొక్క కొట్టుకొన్నట్లు.
2. నక్క ముదిరితే వఱడు, తొండ ముదిరితే ఊసరవెల్లి.
3. నక్క రేలకాయ తినినట్లు.
4. నక్కలలో నక్కగా నటించవలె.
5. నక్కలు బొక్కలు వెదకును, తక్కిన నాలంజకొడుకు తప్పేవెదకున్.
6. నక్కలు మరవలు పారితే కుక్కలు కూటికొల్లవు.
7. నక్కలెరుగని బొక్కలు, నాగులెరుగని కోవ(మ)లు (పుట్టలు) గలవా? (కోవలు=పుట్టల శిఖరాలు).
8. నక్క వచ్చి కుక్కతోక సవరించినట్లు.
9. నక్కవాత మున్ను గొట్టినాడు (చావక బ్రతికినాడనుట).
10. నక్క వినయము! కొంగ జపము.
11. నక్కా! నక్కా! నా నామం చూడు, తిరిగి చూస్తే తిరుమణి చూడు.
12. నగ(గి)రి పేదా? ఉప్పు చేదా?
13. నక్షత్రాలు శాశ్వతజ్యోతులైనా చీకటి పడినప్పుడే వెలిగేది.
14. నగిరికి ఎంతైనా పెడతాడు కానీ,పెద్దకోడలికి కూడుబెట్టను ఏడుస్తాడు.
15. నగుబాట్ల పెండ్లికి నాడే నాగవల్లి.
16. నలుగు ముదిరితే తెగులు.
17. నట్టింట ఉండి నా భాగ్యమంటే, ఉట్టిమీదు నుంచి ఊడి పడుతుందా?
18. నట్టేట పుట్టిముంచినట్లు (మునిగినట్లు) (పుట్టి=పేళ్ళతో చేసిన గుండ్రని బుట్టవంటి చిన్న పడవ).
19. నట్టేటిలో చేయి విడిచినట్లు.
20. నట్టేటిలో పడ్డ సొమ్ము నట్టింటికి వచ్చినట్లు.
21. నడిచే కొద్ది డొంక, పెట్టే కొద్ది కుదురు.
22. నడిచే దారిలో గడ్డి మొలవదు.
23. నడిచేవాడే పడేది.
24. నడమంత్రపు దాసరి పొద్దుమాన మెరుగడు.
25. నడమంత్రపు వైష్ణవానికి నామాలు మెండు.
26. నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.
27. నడమంత్రపు సిరి, నరంమీది పుండు భరింపరానివి.
28. నడమంత్రాన సిరివస్తే, నడిరేయి గొడుగు పట్టమన్నాడట.
29. నడవంగా నడవంగా పైగుడ్డే బరువైనట్లు.
30. నడవడికలు చక్కబెట్టేది నాటకము.
31. నడవలేనమ్మకు నాలుగు పక్కలా సవారి.
32. నడిస్తే మార్గాయాసం, తింటే భుక్తాయాసం- తిమ్మావధానికి.
33. నడుమ దిరిగే కుంటెనగాడికి చెన్నపట్నం రైలుబండి.
34. నడుమ దిరిగే కుంటెనగాడికి  కందూరు, కఫాయి (కైపు) సార.
35. నడుము మినిగేదాకానే చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.
36. నత్తగుల్లలన్నీ ఒక రేవున, ముత్యపుచిప్పలన్నీ ఒక రేవున (చేరును).
37. నత్తగుల్లలో ముత్యాలు పుట్టునా?
38. నత్తి నాలిగింటి కర్ధం.
39. నది నాల్గామడ ఉండగా, చీరవిప్పి చేతపట్టు కున్నదట.
40. ననకూడి నార తలకెక్కినట్లు.
41. నన్ను ఎఱిగినవాడు లేకపోతే, నా బడాయి చూడమన్నట్లు.
42. నన్ను కొడితే కొట్టావుగానీ, మా బావను కొట్టు చూస్తాం అన్నట్లు.
43. నన్ను చూస్తే, నిన్ను కాస్తా.
44. నన్ను నేనే ఎఱుగను, నేను నిన్నేమి ఎఱుగుదును?
45. నన్ను పెంచితే, నిన్ను ముంచుతా.
46. నన్ను ముట్టుకోకు నా మాల కాకి.
47. నపుంసకుని చెంతనా నవలా సరసం?
48. నపుంసకుని చేతికి రంభ దొరికినట్లు.
49. నమలక, మింగక నానవేసినట్లు.
50. నమాజు చేయబోతే మసీదు మీద పడ్డట్లు.
51. నమిలేవాడికన్నా, మింగే వాడే ఘనుడు.
52. నమ్మించి గొంతుకోసినట్లు.
53. నమ్మితి రామన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా అన్నట్లు.
54. నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ణి చేస్తానన్నట్లు.
55. నమ్మిన ఇమ్ము, నమ్మకున్న అమ్ము.
56. నమ్మిన ఎనుము పోతు అయ్యిందట.
57. నమ్మి నడివీధిలో వేసిన వారెవరు?
58. నమ్మి నానబోస్తే, పులిసి బూరటిల్లిందట.
59. నయముంటే భయమేమి?
60. నయము నష్టకారి, భయము భాగ్యకారి.
61. నయాన పాలు తాగరు, భయాన విషమైనా తాగుతారు.
62. నయాన కానిపని భయాన అవుతుంది.
63. నరంవంటి వాడికి జ్వరం వస్తే, చేయి చూచినవాడు బ్రతుకడు.
64. నరకములో కరుణ లేదు, నాకంలో మరణం లేదు.
65. నరకములో నారాయణుడుండునా?
66. నరకానికి నవద్వారాలు, నాకానికి ఒకటే.
67. నరాలు లేని నాలుక నానావిధాల పలుకుతుంది.
68. నరుకలేని బంటు, కత్తి చుఱుకు లేదన్నట్లు.
69. నరునకు నరుడు, తరువుకు వేరు సహాయం (అండ).
70. నరునికి నాలు గంశలు.
71. నరునికి సుద్దంబద్దంలేదు, గుంజుగుంజు నడేటిలోనికి- అన్నదట మొసలి.
72. నర్మదలో మునిగినా కర్మం తప్పదు.
73. నలపాకము, భీమపాకము. (మగవాడు చేసే వంట)
74. నలసారము, సంసారము.
75. నలిగి ఉన్నప్పుడు తొలిగి ఉండమన్నారు.
76. నలుగురితో చావు పెండ్లితో సమానం.
77. నలుగురితో పాటు నారాయణా! కులముతో పాటు గోవిందా.
78. నలుగురు చేతులువేస్తే గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారు.
79. నలుగురి తరవాత పుడితే నట్టిల్లు బంగారమవుతుంది, ముగ్గురి తర్వాత పుట్టితే ముయ్య మూకుడుండదు.
80. నలుగురు నడిచే దారిన నాచుగూడా మొలవదు81. నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట.
82. నలుగురు నవ్వినట్లే ఉంది, నామాట కుదిరినట్లే ఉంది.
83. నలుపు నాలుగు వంకరలు తెలుపుతుంది, ఎఱుపు ఏడువంకరలు దాస్తుంది.
84. నలుపు నారాయణమూర్తి.
85. నలుపు సరుకులో (రంగులో) నాణ్యము లేదా?
86. నల్లంబి దురాయి పెట్టితే నిలుస్తుందా? (నల్లంబి= ఒక చిన్న నల్లపిట్ట, దురాయి=ఆంక్ష, ఆక).
87. నల్లావు పాలైనా తెల్లనే.
88. నల్ల కోడికైనా తెల్లగుడ్డే.
89. నల్ల చీరలు కట్టినవాళ్ళంతా నా పెళ్ళాలే అన్నట్లు.
90. నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు (అనుకునేంత అమాయకుడు).
91. నల్లనేలకు నువ్వులు, ఎఱ్ఱనేలకు కందులు.
92. నల్లబాపడు నాభికంటే విషము.
93. నల్ల బాపనయ్యను ఎఱ్ఱ మాదిగను నమ్మరాదు.
94. నల్లనివాడికి నాభిలో విషము.
95. నల్ల రేగడిలో చల్లినా తెల్లజొన్నలే పండేది.
96. నల్లికాటు, నారి పోటు.
97. నల్లిని గూర్చి మంచానికి పెట్లు. (కించిత్తు నల్లిగరచిన మంచమునకు పెట్లువచ్చు).
98. నల్లులకు వెఱచి ఇల్లు విడచినట్లు.
99. నల్లేరుమీద బండి పోయినట్లు.(సులభమని).
100. నవరత్నములుండినా నరరత్న (నారీరత్నము) ముండవలె.

No comments: