1. దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకపోతే, గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి.
2. దొబ్బను దేవుడంతటి వాడు (దేవుడే).
3. దొబ్బనేర్చు కుక్క దుత్తలు మోచునా?
4. దొమ్మలన్నిటిలోనూ మిడిదొమ్మ మిండడు (దొమ్మ=పశురోగము)
5. దొమ్మతగిలి మన పశువులు రెండు చచ్చినవంటే, మనవాళ్ళవి ఎన్ని చచ్చినవని అడిగినాడట.
6. దొరకని పూలు దేవునికర్పణం.
7. దొరకు పండుకునే మంచంలేకపోతే దాసీదానికి పట్టుపరుపా?
8. దొరసానికి వల్లే దొరకకపోతే తొత్తుకు తొగరు చీరా?
9. దొరికితే దొంగ, దొరకకపోతే దొర.
10. దొరికిన సొమ్ముకు దొంగవుతాడా?
11. దొరకు తొంగను మంచం లేదు, బంటుకు పట్టుపరుపట.
12. దొరను పేద అనరాదు, ఎద్దును సాధువు అనరాదు.
13. దొరబిడ్డ అయినా ఒకని ఆలే.
14. దొరల చిత్తం, చెట్లనీడ నిలకడలేనివి.
15. దొరలు ఇచ్చిన పాల కన్నా, ధరణి ఇచ్చిన పాలు మేలు.
16. దొరసానికి దుప్పటిలేదు, తొత్తుకు తొగరు చీరట.
17. దొరాల తగులుకొంటున్నావు, ఏమిస్తావో దొరా, అంటే- నీ మనసు మెప్పించి తలకేదో పాత (పాతగుడ్డ) సంపాదించుకోవాలను కొన్నానమ్మా అన్నాడట.
18. దొరువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూపి బేరమాడినట్లు (దొరువు= తవ్విన నీటి గుంట).
19. దొరే దొంగైతే బంట్రోతు కన్నగాడగును.
20. దొలుపుడు ముద్దకు నలుపుడు కారం (దొలుపుడూ=దొర్లు, (గుండ్రని)).
దో
21. దోచపండు నెట్టుబ్రోచు ఇనుపకట్టు.
22. దోచుకొనిపోయిన వాడు దొర, దొరికినవాడు దొంగ.
23. దోత్రం పెద్దదయితే గోత్రం పెద్దదగునా?
24. దోనె చేయబోయి సోల చేసాడట.
25. దోమలు తగ్గితే చేమలు ఊరును.
26. దోర కజ్జం, రామానుజం పొడి.
27. దోవను పోయేదెవరయ్యా అంటే, దొబ్బులు తినే నేనయ్యా అన్నట్లు.
28. దోవను పోయేదొకడు, దొబ్బులు (దొబ్బలు) తినేదొకడు.
29. దోవలో కూర్చుండి దొబ్బలు తిన్నట్లు.
30. దోసకాయలు తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఒకటే.
దౌ
31. దౌలతున దిరిగినా గులాము గులామే (దౌలతు=సంపద).
32. దౌర్భాగ్య దామోదరుడు (నిర్భాగ్య దామోదరుడు).
ద్ర
33. ద్రవ్యం దాచినవాడికి తెలుసు లెక్క వ్రాసినవాడికి తెలుసు.
34. ద్రావిడ ప్రాణాయామం.
35. ద్వారపూడి పచ్చెపువాడు.
ద్వి
36. ద్విపదకావ్యం ముదిలంజ దొడ్డికంత.
ధ
37. ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును.
38. ధనము లెచటికేగు, దానేఘు నెచటికి?
39. ధనపతి సఖుడైనా శివుడు బిచ్చమెత్తవలసి వచ్చింది.
40. ధనానికి దాపరికం (గుట్టు) సేద్యానికి వెల్లడి (రట్టు).
41. ధనికిని చెఱకుపంట, దరిద్రునికి నువ్వు పంట.
42. ధనియాలజాతి (చెప్పుతో రాసి బద్దలు చేస్తేగాని మొలవవు- భయానగానీ పనిచేయరు అని).
43. ధరకు దొర ఎవడు?
44. ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ.
45. ధరించేదే శాటి, వరించేదే బోటి.
46. ధర్మం దరిబేసి నడిగితే ఇచ్చునా? తన్నుక చచ్చునుగాని.
47. ధర్మపురిలో దొంగిలించబోతూ, ధార్వాదనుండి వంగుని పోయాడట.
48. ధర్మానికి దండుగ లేదు, వెట్టికి పైసా లేదు.
49. ధర్మానికి దట్టీ ఇస్తే, ఇంటివెనుకకు పోయి మూరవేసిందట.
50. ధర్మానికి పోతే కర్మం చుట్టుకొన్నదట.
51. ధర్మోదకాలలో రాని పితురుడు తర్పణాలలో వచ్చినట్లు.
ధా
52. ధారలేని తిండి దయ్యపు తిండిరా.
53. ధారోష్టం, అమృతోత్తమం, దాచినమగడా! వేరుండుమన్నట్లు.
ధీ
54. ధీరుడయినా కావాలి, దీనుడయినా కావాలి.
ధూ
55. ధూపం వేస్తే పాపం పోతుంది.
ధై
56. ధైర్యలక్ష్మి-ధనలక్ష్మి.
57. ధైర్యంలేని రాజు, యోచనలేని మంత్రి.
ధ్వ
58. ధ్వంసం నారాయణుడు కమతం చేస్తే, పాలికి పందుం- పల్లేరు కాయలు.
59. ధ్వంస పారాయణం దంతు మంట.
న
60. నంగతుంగ నీళ్ళకు పోతే, నీళ్ళన్నీ ఒక రేవుకు వచ్చాయిట.
61. నంగనాచి చీర నడివీధిలో ఊడిందట (నంగనాచి=ఏమీ ఎరుగనట్లు నటించుట).
62. నంగనాచి- తుంగబుఱ్ఱ (తుంగకు బుఱ్ఱ ఏర్పడదు).
63. నంగనాచి- వంగముల్లు.
64. నంగనాచులు శరణనగానే అనంగుడు ఙ్ఞానోపదేశం చేయునా?
65. నంగి వంగలు మేస్తుంటే, నారికేళాలు దూడలు మేసినవట (నంగి=దూడ కలిగిన ఆవు).
66. నంగీ! నమిలి మింగవే అంటే, ఉడికిన చేపలు కరుస్తవి అన్నదట. (నంగి=నంగనాచి, మాటలు వచ్చిరానట్లు ముక్కుతో మాట్లాడేవాడు).
67. నందనవనంలో కుందుగడ్డి పెరుగవచ్చు.
68. నందనవనంలో నాగుబాముండటం మృగనాభికి పిప్పితగిలినట్లు.
69. నందరాయని భాగ్యము నక్కలకూ కుక్కలకూ.
70. నందనమ్మలు బాగాపండితే, నారాయణుని చూచినట్లే.
71. నంది అంటే నందే, పంది అంటే పందే (పట్టుదల).
72. నందిని చేయబోయి పందిని చేసినట్లు.
73. నందిని పంది, పందిని నందిని చేయగలవాడు.
74. నంది వంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేయవా?
75. నంద్యాలవారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
76. నంబి కవిత్వం, తంబళ్ళ జోస్యం.
77. నంబి పెట్టినదే ప్రసాదం.
78. నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.
79. నంబివాడు ఎదురైనా, నాగుబాము ఎదురైనా కలిసిరాదు.
80. నంబి వారికి, తంబళి వారికి ఒకటే కుంచకోల అన్నట్లు.
81. నంబీ! నంబీ! నా పెండ్లికేమి సహాయం చేస్తావంటే, నీ పెండ్లికి నేను ఎదురు రాను పో అన్నాడట.
82. నంబీ, నంబీ, నీ పుణ్యాన పెండ్లయిందంటే, నేనేమి చేసినాననగా, తరలి పోయేవేళ, తమరు ఎదురుపడకపోవటమే అన్నాడట.
83. నక్క ఎక్కడ? నాగ(క)లోక మెక్కడ?
84. నక్క ఒకచోట ఊలవేసి, ఇంకొకచోట గౌరీకల్యాణము పాడునా?
85. నక్క కడుపున సింగము పుట్టునా?
86. నక్కకు నవ్వు-ఎండ్రకాయకు గండం.
87. నక్కకూత నాకలోకం ముట్టునా?
88. నక్క కూసి నాశం తెచ్చు.
89. నక్క కూసి పిల్లలకు దోవచూపు.
90. నక్కకొమ్ము తొక్కి వచ్చినాడు (అదృష్టవంతు డనుట).
91. నక్క చావ గొఱ్ఱె లేడ్చునా?
92. నక్కజిత్తులన్నీ (తంతులన్నీ) నావద్ద ఉండగా తప్పించుకు(క) పోయెరా తాబేటిబుఱ్ఱ అన్నదట.
93. నక్కజిత్తులు నారాయణు డెఱుగు.
94. నక్కతోక పట్టుకొని నాకలోక మెక్కినట్లు.
95. నక్క నడుము తొక్కి వచ్చినాడు (అదృష్టమనుట).
96. నక్క నారాయణునికైనా నామం పెడుతుంది.
97. నక్క నారాయణు డెక్కడనో, తోకనారాయణు డక్కడనే.
98. నక్కను చూచిన వాడెల్లా వేటగాడే.
99. నక్క పీనుగును పీకును గానీ బ్రతికిన జంతువు పైకి పోదు.
100. నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు, ఇంత గాలివాన ఎన్నడూ చూడలేదు అన్నదిట.
No comments:
Post a Comment