Friday, July 22, 2011

సామెతలు 59


1. పానెం పాడైపోయినా, ప్రాణం కుదుట పడదు (పానెం=భూస్థితి).
2. పాంపుచూచి పసరాన్ని కట్టు.
3. పాంపు సెబ్బరైతే, పసరానికీ సెబ్బరే.
4. పాపటం(ణం)పది సేద్యాల పట్తు.
5. పాపటకాయ కొఱక నెంత? యాకపెట్ట నెంత? (పాపటకాయ=వెఱ్ఱిపుచ్చకాయ).
6. పాపటలో వెంట్రుక నెరిస్తే పత్తిత్తు.
7. పాపదోషానికి పోతే, పట్టి చూచినట్లు.
8. పాపభీతికంటె ప్రజాభీతికే వెరుస్తారు.
9. పాపమని పక్కటెముక ఇస్తే, పీక్కోలేక ఫిర్యాదు చేసినట్లు.
10. పాపమని పట్టెడంబలి పోస్తే, ఉప్పులేదని అలిగి పోయినాడట.
11. పాపమని పాతచీర ఇస్తే, గోడ చాటుకు పోయి మూర వేసిందట.
12. పాపమని పాలు పోస్తే, ఉడుకని ఉఱుకులాడిందట.
13. పాపమని పాలు పోస్తే, పలుచనని పారబోసి నాడట.
14. పాపమని పాలు పోస్తే, వద్దని వలకబోసినాడట.
15. పాపలేని ఇంట్లో, తాత తడివెళ్ళాడినట్లు.
16. పాపాలకు భైరవుడు పాపన్న.
17. పాపజాతి నరుడు పరసతి గోరు.
18. పాపి చిరాయువు, సుకృతికి గతాయువు.
19. పాపి పర్వతం బోతే, దీపాలన్ని పెద్దవైనవట.
20. పాపి సముద్రానికి పోతే, అరికాలు తేమ కాలేదట.
21. పాపిసొమ్ము పరులపాలు, ద్రోహిసొమ్ము దొరలపాలు.
22. పామనగ వేరే పరదేశమున లేదు.
23. పామరజనానికి ఎన్నో తలలున్నవి గానీ, ఒకమెడైనా లేదు.
24. పాముకన్నా లేదు పాపిస్టిదగు జీవి.
25. పాము కరచును, అరవ చెరచును.
26. పాముకాటు చీరతో తుడిచిన పోవునా?
27. పాముకాళ్ళు పాముకే ఎఱుక.
28. పాముకు బదనిక చూపినట్లు.
29. పాముకు విషం పండ్లలో, ఙ్ఞాతికి విషం కండ్లలో.
30. పాము చుట్టము: పడగ పగ.
31. పాము చెలిమి, రాజు చెలిమి ఒకటే.
32. పాముతో చెలిమి కత్తితో సాము వంటిది.
33. పాము పగ, తోక చుట్టము.
34. పాము పడగ క్రింద కప్ప ఉన్నట్లు. (సర్పంబు పడగనీడను కప్పవసించినట్లు).
35. పాము మాదిరి కడకు గామైనట్లు.
36. పాములలో మెలగవచ్చునుగానీ సాములలో మెలగటం కష్టం.
37. పాములు లేనివాడు, వానపామును పట్టుకొన్నట్లు.
38. పాము వంటిదానికే విరుగుడుంటే, పంతుల కుండదా?
39. పాము వరటకపోతే, దాని విషం వరటకపోతుందా?
40. పాము చావకుండా, బడితె విరగకుండా.
41. పాయసంలో నెయ్యి ఒలికినట్లు.
42. పారవేసిన పుల్లాకు బండి కల్లైనట్లు.
43. పారిజాతముతో ప్రబ్బిళ్ళు సరితూగునా?
44. పారినవాని పౌరుషం ఎన్నాలనా?
45. పారుబోతు గొడ్డుకు పగ్గం చాటైతే చాలు.
46. పారేనీటికి పాటినలేదు.
47. పారేబంద్లకు కాళ్ళు చాచిన నిలుచునా?
48. పాలకంకు లోయి దాసరీ అంటే రాలిన మట్టుకే గోవిందా అన్నడట.
49. పాల కోసరం పొదుగు కోసినట్లు.
50. పాలకు కాపల, పిల్లికి తోడు.
51. పాలకడలి లంకలో బుట్టినా కొంగకు తిండి నత్తగుల్లలే.
52. పాలతోగూడా విషము పెట్టినట్లు.
53. పాలను చూడనా? విషాన్ని చూడనా?
54. పాలపొంగు - పడుచుపొంగు.
55. పాలపొంగు - మీలపొంగు.
56. పాలలో పంచదార ఒలికినట్లు.
57. పాలలో పడ్డ బల్లివలె.
58. పాలసముద్రంలోని హంస పడియనీటి కాసపడుతుందా?
59. పాలికివచ్చింది పంచామృతము.
60. పాలివాడు చస్తే పారెడు మన్నెక్కువ.
61. పాలివానికి చేసినమేలు - పీనుగకు చేసిన శృంగారం.
62. పాలివారిని చెరచితివో, పాడైతివో.
63. పాలుఇచ్చే బఱ్ఱెను అమ్మి, పైన ఎక్కే దున్నను తెచ్చుకొన్నట్లు.
64. పాలు ఒల్లని పిల్లి ఉన్నడా?
65. పాలు కుడిచి ఱొమ్ము గ్రుద్దినట్లు.
66. పాలు చిక్కనైతే వెన్న వెక్కసము.
67. పాలు పిండగలము గానీ, తిరిగి చంటిలోకి ఎక్కించగలమా?
68. పాలు పిందని గొడ్డు బఱ్ఱెల కదుపులు మెండు.
69. పాలు పిందను బఱ్ఱె పలు మేతలకు పెద్ద.
70. పాలు పొంగడమంతా పొయ్యి పాలుకే.
71. పాలు బోసి పెంచినా పాము కఱవక మానదు.
72. పాలు బోసి పెంచినా పాముకు విషము పోదు.
73. పాలు బోసి పెంచినా ముష్టిచెట్టుకు విషము పోదు.
74. పాలు బోసి పెంచినా వేపకు చేదు పోదు (తీపిరాదు).
75. పాలుమాలితివో, ఆర్చుకొంటివో!
76. పాలేరు దున్నినవాడు అప్పులపాలు.
77. పాలేరువానికి పశువు పోయినా, మారుతల్లి బిడ్డపోయినా దిగులులేదు.
78. పాళ్ళు పన్నెండు, దెబ్బలు చెరి సగం.
79. పావలాకు పడుకుంటే, పందుం బియ్యం బేపి తినిపోయిందట.
80. పావులా సంపాదనగాడికి వరహా లంజ వరుస గాదు.
81. పాసిన కూడు పక్వానికి వస్తుందా?
82. పాసిన కూట్లో కలిపోస్తే పదునుకు వస్తుందా?
83. పాసిన గుమ్మడికాయ బాపనయ్యకు దానం ఇమ్మన్నట్లు.
84. పాసు ముండా! అంటే, పట్టుతల్లి అన్నట్లు.


పి


85. పింగు తెరచిన ఈగలదాడి.
86. పింజారి మందు, లంజ పొందు.
87. పింజారి పితుకులాట, కురువ గుద్దులాట (పింజారి=దూదేకుల, కురువ=గొఱ్ఱెల మేకల పెంచు ఒక జాతి).
88. పిండానికి గతిలేకపోయినా, పెగ్గెలకు లోటులేదు.
89. పిండికి తగ్గ పిడచ.
90. పిండి కొద్దీ నిప్పటి (నిప్పటి=అరిసె).
91. పిండి కొద్ది రొట్టె, తిండికొద్ది పసరం.
92. పిండి గొన్నవానివద్ద రొట్టె గొన్నట్టు.
93. పిండీ బెల్లం ఇచ్చి, పిన్నమా నీ ప్రసాదం అన్నట్లు.
94. పిండి బొమ్మను చేసి పీతమీద కూర్చుండబెడితే, ఆడబిడ్డతనాన అదిరదిరి పడిందట.
95. పిండీ, ప్రోలు లేనిదే పెండ్లవునా?
96. పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది.
97. పిందెలో పండిన పండు.
98. పిక్కలెగేయ బలిసినా దున్న ఏనుగు కాదు.
99. పిచ్చి కుదురింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
100. పిచ్చి కుదిరితేగానీ పెళ్ళికాదు, పెళ్ళి ఐతేగానీ పిచ్చికుదరదు.

1 comment:

Nrahamthulla said...

పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html