1. పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు.
2. పగటి మాషాజీకి (మషాల్జి) అనుమతి ఎవరిచ్చారు? అంటే, నా ఆముదపు చేను ఇచ్చింది అన్నాడట (మషాజి=దీపములు దివిటీలు పట్టేవాడు).
3. పగడములేని ఇల్లు, జగడము లేని ఇల్లు ఉండవు.
4. పగతో పొరుగిల్లు కాల్చవచ్చును గానీ, తన ఇల్లు కాపాడ తరముగాదు.
5. పగపట్టిన త్రాచు కాటు వేయక మానుతుందా?
6. పగలు ఎండ, రేయి చీకటి, ఎప్పుడు దున్నుతావే దిన్నపోతా?
7. పగలు కొంగులాగితే చీ! అంటే రాత్రి చీకటిలో కన్ను గీటాడట.
8. పగలు చస్తే వాతికి లేదు (వాతబియ్యం), రాత్రికి చస్తే దీపానికి లేదు.
9. పగలు చెయ్యూపితే రానిది (ఆడుది) రాత్రి కన్నుగీటితే వస్తుందా?
10. పగలు చూస్తే రాత్రి కలలో వస్తుంది అన్నట్లు.
11. పగలు దాని గుణం చూసి, రాత్రి దాని వెంట వెళ్ళాలి.
12. పగలు నిద్ర పనిచేటు, మాపు జాగారణపై చేటు.
13. పగలు పక్కచూచి మాట్లాడు, రాత్రి అదీ మాట్లాడవద్దు.
14. పగలు పప్పేసిన పయ్యెందుకు పగులు పెండ్లామా? నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడుదు పెండ్లామా? (పై= శరీర పై భాగము, వీపు).
15. పగలు పాతరలుండవు (పగలు=స్పర్ధలు, విరోధాలు).
16. పగలు ఉపస్థ వెడల్పు, రాత్రి నీళ్ళు వెడల్పు.
17. పగలు బట్టలే కంపించకున్న రాత్రి గొఱ్ఱెలు కనిపిస్తాయా?
18. పగలు చత్వారి, రాత్రి రేజీకటి.
19. పగలెల్లా బారెడు నేసినాను, దివ్వె తేవే దిగనేస్తాను అన్నదట.
20. పగవాణ్ణి పంచాంగ మడిగితే, మధ్యహ్నానికి మరణ మన్నాడట.
21. పగవాని ఇంట ఫది బిచ్చాలు పోయినా పోయినవేను.
22. పగవారిని చెరబట్టక ముద్దాడవత్తురా?
23. పచ్చగా ఉంటే పారాడేది, వెచ్చగా ఉంటే వెళ్ళిపోయేది.
24. పచ్చగా ఉన్నవాళ్ళకు, ఎదుటివారి వెచ్చన తెలియదు.
25. పచ్చగా ఉన్న దగ్గఱ మేసి, వెచ్చగా ఉన్నదగ్గఱ పండు.
26. పచ్చడ మున్నంత కాళ్ళు చాచు.
27. పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచి ఎక్కడికీ పోదు.
28. పచ్చని పైకము గుఱ్ఱము చచ్చినదాకానే.
29. పచ్చని వరహా కంటే, పుచ్చిన గింజే మేలు.
30. పచ్చికంకులే దాసరీ, అంటే రాలినకాడికే గోవిందా అన్నాట్ట!
31. పచ్చికంకులోయి దాసరీ అంటే రాలినకాడికే రామార్పణం అన్నాడట.
32. పచ్చికాయ తుంచిన పండవుతుందా?
33. పచ్చికుండలో నీళ్ళుపోయి, నీ పాతివ్రత్యం తెలుస్తుంది అన్నట్లు.
34. పచ్చిపేడను తంతే, పదహారు వక్కలయ్యే ప్రాయం.
35. పచ్చివెలగకాయ గొంతులో పడ్డట్లు.
36. పటేలువారి వడ్లపుణ్యాన్నా, మా యత్త ముడ్డి పుణ్యాన్నా తింటినమ్మా పుల్లటికూర మెతుకులు.
37. పట్టణానికి పోయిన గాడిద, పల్లెకు పోయిన గాడిదని కఱచిందట.
38. పట్టపగలు కన్న మేస్తావేమిరా? అంటే, నా కడుపు కక్కూర్తి నీకేమి తెలుసును? అన్నాదట.
39. పట్టపు రాజు చేపట్టగానే గుడిసేటి ముండకు గుణము రాదు (గుడిసేటి=గుడికి చేటి-దేవదాసి. ఇప్పుడు విడిచినది వ్యభిచారిణి).
40. పట్టినదెల్లా బంగారం, ముట్టినదెల్లా ముత్యం.
41. పట్టినవాడు (పట్టుకొన్నవాడు) తాబేలు అంటే, గట్టునున్నవాడు కుందేలు అన్నట్లు.
42. పట్టినవాడు పక్కి అంటే, గట్టునున్నవాడు జెల్ల అన్నట్లు (పక్కి=చిన్న వెడల్పు చేప, జెల్ల=తేలువలే కుట్టే చిన్నచేప).
43. పట్టినవాడు వరిగపిల్ల అంటే, పట్టనివాడు మట్టపిల్ల అన్నాడట.
44. పట్టినవాడు మట్టగుడిసె అంటే, ఒడ్డునున్నవాడు జల్లపిల్ల అన్నట్లు (మట్టగుడిసె=నల్లటి చిన్న చేప).
45. పట్టిపట్టి పంగనామం పెడితే గోడచాటుకెళ్ళి గోకేసుకున్నాడట.
46. పట్టివిడిచిన ముండకు పటొటాపం జాస్తి.
47. పట్టివిడిచిన ముండ (మొగుడు విడిచిన ముండ) మబ్బు విడిచిన ఎండ.
48. పట్టి విడుచుటకంటే ప్రాణం విడుచుట మేలు.
49. పట్టిసం తీర్ఠానికి పత్తిగింజలంత మామిడిపిందెలు.
50. పట్టు కత్తిరించినట్లు మాట్లాడినా మనసేమో పలుగురాయి.
51. పట్టుకొమ్మను నరుకు కొన్నట్లు.
52. పట్టుగుడ్డకు, భ్రష్టుముండకు అంటులేదు.
53. పట్టుచీర ఎరవిచ్చి, పీటపట్టుక వెంట తిరిగినట్లు.
54. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.
55. పట్టుపట్టు మనేవాళ్ళేగానీ, పట్టేవాళ్ళూ ఒక్కరూ లేరు.
56. పట్టుపుట్టము తొత్తుకు కట్టబెట్టిన పేడమరకలతో పాడుచేయును.
57. పట్టెడు బొట్టుంటే పదిలక్షలు.
58. పటనం దగ్గరకు వచ్చి పల్లెలో రత్నపరీక్ష చేయించినట్లు.
59. పట్నం పోయి పుట్నం గింజ తెచ్చాడన్నట్లు.
60. పఠానులకు నేను బాకీ, ఫకీరులు నాకు బాకీ.
61. పడుచువాని పెండ్లాము ప్రణయిని, నడిప్రాయం వానిభార్య సహధర్మచారిణి, ముసలివాని ఇల్లాలు దాసి.
62. పడతులకు బుద్ధి పెడతల నుండు.
63. పడతుక, వంకాయ, సమూలమధురములు.
64. పడబోయి పూపాన్పుపై పడినట్లు.
65. పడమట క్రుంకిన పొద్దు తూర్పున లేవదా?
66. పడమట కొఱడువేస్తే పాడుగుంటలన్నీ నిండును; తూర్పున వేస్తే తుంగగడ్డి కూడా మొలవదు (కొఱడు, కొఱ్ఱు=ఇంద్ర ధనుస్సు).
67. పడమట కొఱ్ఱుఒడ్డితే (వేస్తే) పందిళ్ళమీద రాజనాలు పండుతాయి.
68. పడమట కొఱ్ఱువేస్తే పాడిఆవు ఱంకె వేస్తుంది.
69. పడమట పావురాపిట్టంత (పూరేడుపిట్టంత) మబ్బు నడీతే, పాతాళందాకా వాన.
70. పడమట మెరిస్తే, పంది అయినా నీళ్ళకు దిగదు.
71. పడమటివీధి అమ్మ సరిగ పెట్టుకుంటే, ఉత్తరవీధి అమ్మ ఉరి పెట్టుకుందట.
72. పడవ ఒడ్డు చేరితే పడవవాని మీద ఒక సొడ్డు.
73. పడిన గోడలు పడ్డట్లుండవు, చెడిన కాపురం చెడి నట్లుండదు.
74. పడిలేస్తే పాతరలోతు తెలుస్తుంది.
75. పడిశము పది రోగాల పెట్టు.
76. పడుకోవడం పాతగోడలలో, కలవరింతలు మిద్దెటిండ్లలో.
77. పడుగు పేకా కలిస్తే గుడ్డ, ఆలుమగడు కలిస్తే ఇల్లు.
78. పడుగూ పేకా గుడ్డకు, మంచి చెడ్డా మనిషికి.
79. పడుచుకొన్న ఇల్లు తుడుచుకు పోతుంది. (పడుచుకొనుట=ఱంకు చేయుట).
80. పడుచుగుంట, కడుపుమంట.
81. పడుచు(తో) పశువులు ఉంటేనే సేద్యం.
82. పడుచుతో సయ్యాట, పాముతో చెలగాటం (చెర్లాట).
83. పడుచు పొందు ఫలం లేదు.
84. పడుచుల కాపురం - చిగురుల మంట.
85. పడుచు సేద్యం పాకానికి రాదు.
86. పడ్డకు, పడుచుకు పలుపు కడితే వెంటపడతారు.
87. పడ్డవారు చెడ్డవారు కాదు.
88. పణ్యారం పట్టు దాసప్పా! అంటే, ఏ చేని సజ్జలు? అన్నాడట. (పణ్యారం= పందేరం, దేవాలయాలలో పంచిపెట్టు ప్రసాదం).
89. పతికి మోహములేని జవ్వనము, పరిమళించని సుమము.
90. పతిభక్తి చూపిస్తాను మొగడా, చెప్పులు తే, నిప్పులు తొక్కుతాను.
91. పత్తికి పది చాళ్ళు, ఆముదాలకు ఆరు చాళ్ళు.
92. పత్తిగింజల గంత కట్టనా బసవన్నా! అంటే ఊహూ అన్నాడట.
93. పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట.
94. పత్రి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద.
95. పత్రిలేని పూజ, పత్రం లేని అప్పు.
96. పథ్యం చెడరాదు, సత్యం తప్పరాదు.
97. పద(దు)ను తప్పినా, అద(దు)ను తప్పినా పన్ను దండుగే.
98. పద(దు)ను పోయిన కత్తి, అద(దు)నుపోయిన సేద్యం.
99. పదము తప్పినా ప్రాస తప్పరాదు.
100. పదమొక బానిస, రాగం ఒక రంభ.
1 comment:
nice collection
Post a Comment