Saturday, November 20, 2010

సామెతలు 19

1. కఱ్ఱ విరగకుండా, పామూ చావకుండా కొట్టు.
2. కఱ్ఱికుక్క కపిలగోవు అవుతుందా?
3. కఱ్ఱు అరిగితేగాని, గరిసె విఱగదు.
4. కఱ్ఱు అరిగితేనే కాపు బ్రతుకు.
5. కఱ్ఱుగొట్టిన గంపెడు సూదులు.
6. కలక వేసిన చేప వలకు రాకుండాపోతుందా? (కలక వేయు=నీటిపై ఎగిరిపడు).
7. కలకాలం బ్రతికినా కాటికి పోక తప్పదు.
8. కలకాలం బ్రతికే బ్రతుకులు, కుడికాలు పెట్టవే కూతురా అన్నట్లు.
9. కలకాలపు దొంగ ఒకనాడు దొరకును.
10. కలగక ఆడుమాట లయకాలునినైనా శమింపచేయును.
11. కలగన్న చోటికి గంపనెత్తినట్లు.
12. కలబంద ఎండు, కోడలి కొత్త లేదు.
13. కలలో మూత్రం తాగినట్లు వస్తే, ఎవరితో చెప్పుకోను?
14. కలలో కనిపించిన లంకెబిందెలు రాకపోయినా, పెరికి పెరికి పరువంతా నీళ్ళచాయ మాత్రం అయ్యింది. (నీళ్ళచాయ=చేబొంట్లకు, దొడ్డికి).
15. కలలో కాంత నీటిలో నీడతో సమానం.
16. కలలో జరిగింది ఇలలో జరుగదు.
17. కలలోని కౌగిలికి కడుపులొస్తాయా?
18. కలలో భోగం కలతోనే సరి.
19. కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు.
20. కలిగింది తినేసి, కట్టుకున్నది విప్పేసి వెళ్ళమన్నట్లు.
21. కలిగి ఉంటేనే కామితఫలములు కలిగేది.
22. కలిగి ఉన్నవాడు రాజ్యాన్ని సున్నానికి తీసుకుంట అన్నట్లు.
23. కలిగి తిననేర నివ్వదు గంపకమ్మ.
24. కలిగితే కాళ్ళు ముయ్యా, లేకపోతే మోకాళ్ళు ముయ్యా.
25. కలిగినది చెపితే కంట్లో పుల్ల పెట్టినట్లు.
26. కలిగినమ్మ గాదె తీసేప్పటికి లేనివాని ప్రాణంపోయింది.
27. కలిగినమ్మ గాడిదతో పోతే అదొక వ్రతం, లేనమ్మ మొగుడితో పోతే మోహం (గుల).
28. కలిగినమ్మ ఱంకు, కాషాయ బొంకు.
29. కలిగిన మాత్రం తిని, కరణం గారి కమతం చేయమన్నట్లు.
30. కలిగినయ్య కలిగినవాడికే పెడతాడు, లేనయ్యా కలిగిన వారికే పెడతాడు.
31. కలిగినవానికి అందఱూ చుట్టాలే.
32. కలిగిన వారింట కడగొట్టు కోడలయే కంటే, పేదవారింట పెద్దకోడలయ్యేది మేలు.
33. కలిగిన వారి కోడలు కులుకు మానదు.
34. కలిగెరా కయ్యం, దింపరా గంప.
35. కలిపి కొట్టరా కావేటిరంగ (కస్తూరిరంగ).
36. కలిపోసి పెట్టినా ఉట్టివంకే చూపు.
37. కలిమి ఉన్నంతసేపు బలగం, కండ ఉన్నంతసేపు మిండడు.
38. కలిమికి పొంగరాదు, లేమికి కుంగరాదు.
39. కలిమి లేకుంటే కులం గవ్వ చేయదు.
40. కలిమి లేములు, కావడి కుండలు.
41. కలిమి వచ్చిన తలుపు మూసినట్లు.
42. కలిసివచ్చే కాలానికి నట్టింటికే కుందేలు వస్తుంది.
43. కలిసివచ్చే కాలానికి కుందేలు వంటింటికి వస్తుంది.
44 కలిసివచ్చే కాలానికి నడిచివచ్చే పిల్లలు (పుడతారు).
45. కలుపుతీతకు తిల్లిక కావలేనా? (తిల్లిక=దీపం).
46. కలిపు తీయని మడి, దేవుడులేని గుడి.
47. కలుపు తీయువాడు కోత కోయడు.
48. కలుపు తీయువానికి కసవే మిగులుతుంది.
49. కలుపు తీసేవాడు కండ్లకు రానీ, కోతకోసేవాడు గోటికి రానీ, అంతలో మా అమ్మ అంపమని రానీ! (ఆడపడుచు కోరిక).
50. కల్పతరువు క్రింద గచ్చ చెట్లున్నట్లు.
51. కల్పవృక్షం క్రింద గచ్చపొదలున్నట్లు.
52. కల్పవృక్షం దగ్గరకువెళ్ళి, కాయలడిగినట్లు.
53. కల్పవృక్ష్ మెంచి, కలివి చెట్లెంచుట.
54. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు.
55. కల్యాణానికి ఒకడువస్తే, కన్నం వెసేదానికి ఇంకొకరు వస్తారు.
56. కల్లం దగ్గర కరణీకం, కంచందగ్గర రెడ్డిరికం.
57. కల్లాకపటం లేనివారికి కష్టలు తప్పవు.
58. కల్ల పసిడికి కాంతి మెండు.
59. కల్ల పడికి కఱకులు మెండు.
60. కల్లమున్న చోటికే కంకి పోవును.
61. కల్లరి నాలిక కోడెత్రాచు కోర వంటిది.
62. కల్లలాడి కడుపు పల్లము నింపుకొన నేల?
63. కల్లుకుండ కాడిదే కయ్యం, జుట్టు ఊడిపోయేదే దెయ్యం.
64. కల్లు లొట్టెడి త్రాగి కైపెక్కి వదరిన శాస్త్రవాది కాడు.
65. కల్లరికి మంచి ఙ్ఞాపక శక్తి అవసరం.
66. కల్తీ విత్తనం వెల్తీ గాదెలు.
67. కళాసు బ్రతుకు గాలివానతో సరి.
68. కళ్ళం (కల్లం) పళ్ళెం పెద్దవిగా ఉండాలి.
69. కళ్ళం వెళ్ళిన తరువాత కంది గుగ్గిళ్ళు.
70. కళ్ళుకానని పెళ్ళికూతురు, కమతగాని వెంటపోయిందట.
71. కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దంటుంది.
72. కళ్ళు రెండున్నా కనిపించే వస్తువొక్కటే.
73. కళ్ళూ కలిగినప్పుడే చళ్ళువస్తే, మదపుటేనుగును మంచానికి కట్టేద్దును, నీదాకా రానిద్దునా అన్నదట.
74. కవికి కంసాలికి సీసం తేలిక.
75. కవితకు మెప్పు, కాంతకు కొప్పు.
76. కవి యను నామంబు నీరుకాకికి లేదా?
77. కవిత నేర్పు యతి కూర్పే తెలుపుతుంది.
78. కవిత్వం గడ్డి అనుకొని గాడిదలన్నీ పడి మేయసాగినవట.
79. కవిలి (కలే) చెట్లు కాస్తే, కారు (రెండవ పైరు) వరి పండుతుంది.
80. కవిలి (కలే) చెట్లు పండితే కఱ(రు)వు తప్పదు.
81. కవ్వం కదురు తిరిగిన ఇంట కరువు లేదు.
82. కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగులబెట్టినట్లు.
83. కష్టపడి సుఖపడమన్నారు.
84. కష్టసంపాదనము, ఇష్టభోజనము.
85. కష్టాలు కలకాలం కాపురముండవు.
86. కష్టలు నిన్ను కష్టపెట్టేవరకు నీవుగా వాటిని కలయబెట్టకు.
87. కష్టలు మానవులకు కాక మానులకా?
88. కసవులేనుదే పశువులేదు, పశువులేనిదే పెంటలేదు, పెంటలేనిదే వంట లేదు.
89. కరువులో పనసకాయ తరిగినట్లు.
90. కసిపోనమ్మ మసిపూసుకున్నదట.
91. కసాయివాడికి కత్తి అందించినట్లు.
92. కసువుకు పోరా కమ్మా అంటే, కడుపునొప్పే నా అమ్మా; బొచ్చె ఎత్తుకరా బొమ్మ అంటే అట్లా చెప్పవే నా యత్తా అన్నాడుట.
93. కస్తూరీ నలుపే, తెలకపిండీ నలుపే.


కా


94. కాంచనం కర్మ విమోచనం.
95. కాంతల భ్రమలు కనుగట్టు మాయలు.
96. కాంతా కనకం కాశ్యపులే కయ్యాలకు మూలం. (కాశ్యపి=భూమి)
97. కాకరకాయకు కంతలు (గంట్లు) ఎన్ని? అంటే, ములగ కాయకు ముండ్లెన్నీ? అన్నాడట.
98. కాకరబీకర కాకు జాతారే? అంటే దూబగుంటకు దూదేకను జాతారే అన్నాడట ఇంకో దూదేకుల సాహేబు. (ఉరుదు వచ్చిరాని దూదేకులవారి సంభాషణ).
99. కాకి కఱ్ఱుమన్న కడుపాయె వదినా; కత్తవ బావికి పోతే కరిగిపోయె వదినా! (కత్తవ = ఏటికి కట్టిన అడ్డకొమ్మ (కట్ట)).
100. కాకి కఱ్ఱుమంటే, మొగుణ్ణి అప్పా అనెనట.

No comments: