Friday, October 29, 2010

సామెతలు-11

1. ఎండు పండు లేకుండా ఉంటుందా?
2. ఎండు మామిడి టెంకలు ఒళ్ళో పెట్టుకొని, ఎవరి త్రాడు తెంప వచ్చావోయి వీరన్నా అన్నదిట.
3. ఎంత ఉన్నవాడైనా ఒక్కసారి ఒకే ముద్ద మింగగలడు.
4. ఎంత ఉప్పుతింటే అంత దాహం.
5. ఎంత కఱవు ఐనా పులి పూరీ మేస్తుందా?
6. ఎంత చెట్టు కంత గాలి.
7. ఎంత చెట్టు కంత పాటు.
8. ఎంత చేసినా ఎడమచేతి కడియం కుద(దు)వే.
9. ఎంత దరిగిన మిరియాలు జొన్నలు సరిపోవే?
10. ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు.
11. ఎంత దయో దాసులపై అన్నట్లు.
12. ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే.
13. ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే.
14. ఎంతపెద్ద చెట్టు ఎక్కినా ముడ్డి నేలనే చూస్తుంది.
15. ఎంత పెద్దవారికైనా ముడ్డి పీతికంపే.
16. ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక.
17. ఎంత పొద్దుండగా లేచినా తుమ్మగుంటవద్దనే తెల్లారుతుంది.
18. ఎంత పొద్దుకాడ లేచినా చింతగుంటపాలెం దగ్గరే తెల్లవారుతుంది.
19. ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే.
20. ఎంత ప్రాప్తో అంత ఫలం
21. ఎంతమంచి కత్తి అయినా తన పిడిని గంటు చేయదు.
22. ఎంత మంచి గొల్లకయినా వేపకాయంత వెఱ్ఱిలేకపోలేదు.
23. ఎంత మంచి పంది అయినా అమేధ్యం (అశుద్ధం) తినక మానదు.
24. ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడుట.
25. ఎంతలావు మొగుడైనా ఆడదానికి లోకువే.
26. ఎంతవారలైనా కాంత దాసులే.
27. ఎంత వెలుగుకు అంత చీకటి.
28. ఎంత సంపదో అంత ఆపద.
29. ఎంత స్వామి ప్రసాదమైతే మాత్రం, ఇంత చేదా?
30. ఎందరో మహానుభావులు (వ్యంగ్యంగా కూడ ప్రయోగం).
31. ఎందరో మహానుభావులు, వారందరికి వందన మన్నారు.
32. ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా? అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడుట.
33. ఎందుకు పుట్టావు ఏకా అంటే, ఎదుటివాళ్ళని వెక్కిరించటానికే అన్నదిట.
34. ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమమైన వాళ్ళను వెక్కిరించను అన్నదిట.
35. ఎందునైనా ముఖరాసి (జన్మరాశి) బాగుండాలన్నారు.
36. ఎందుకొచ్చినావే ఎల్లమ్మా అంటే, అందుకు కాదులే అగ్గికొచ్చాను అన్నదిట.
37. ఎందులో పుట్టిన పురుగు అందులోనే చస్తుంది (బ్రతుకుతుంది).
38. ఎందులో పెట్టినా ఎడారే.
39. ఎక్కగా ఎక్కగా పొడవు.
40. ఎక్కడ ఉన్నావే కంబళీ అంటే, వేసిన చోటనే గొంగళీ అన్నదిట.
41. ఎక్కడ కడితేనేమి, మన మందలో ఈనితే చాలు.
42. ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది.
43. ఎక్కడైనా బావ అనుకానీ వంగతోటలో (కాడ) బావా అనకు.
44. ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు.
45. ఎక్కడ నుంచి వస్తున్నావోయ్ నత్తాయనా అంటే, రె రెడ్డొరించిను నుంచోయ్ చోయ్ న నంగాయనా అన్నాడట.
46. ఎక్కడమేసినా మనింట్లో పాలిస్తే చాలు.
47. ఎక్కడా దొరక్కపోతే అక్కమొగుడే గతి.
48. ఎక్కడాలేకపోతే అక్క మొగుడే దిక్కు.
49. ఎక్కడీకిపోతావు విధవమ్మా అంటే, వెంటవస్తాను పదవమ్మా అన్నదిట.
50. ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు.
51. ఎక్కడీకిపోయినా కర్మం ఎదురుగుండానే వస్తుంది.
52. ఎక్కడిదక్కడె ఉంచి ఎల్లమ్మ ఇల్లలికి నట్లు.
53. ఎక్కడిదిరా ఈ పెత్తనం? అంటే, మూలనుంటే నెత్తిన వేసుకున్నా అన్నాడట.
54. ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది (పారుతుంది).
55. ఎక్కమంటే ఎద్దుకు కోపం, దిగమంటే కుంటికి కోపం.
56. ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు.
57. ఎక్కి కాయపట్టిచూసి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.
58. ఎక్కిరించబోయి వెలకిత్తలా (వెల్లికింతలా) పడ్డట్లు.
59. ఎక్కువగా తిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్టి చిరుగవు.
60. ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం.
61. ఎక్కువయిన సొమ్ము బ్రహ్మలకిత్తునా? బట్లకిత్తునా?
62. ఎగతాళి అంటే ఏడువ వస్తాడు, కోడిగ మంటే కొట్టవస్తాడు.
63. ఎగతాళి చేసేవారిముందు జారిపడినట్లు.
64. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య.
65. ఎగవేసే వాడి ఇల్లెక్కడా? అంటే ఊరికడపట అన్నట్లు.
66. ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు.
67. ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి.
68. ఎగిరే ఎద్దే గంత మోసేది.
69. ఎగరబోయి బోర్లపడి, ఊరు అచ్చివచ్చిందికాదు అన్నాడట.
70. ఎగ్గును అనక, వినక, కనక కవి కావ్యం వ్రాయలేడు.
71. ఎచ్చులకు (డంబములకు) ఏటపోతును కోస్తే, ఒళ్ళంతా బొచ్చు అయ్యింది.
72. ఎచ్చులకు ఏలేశ్వరంపోతే పక్కతోలు కుక్కలెత్తుకు పోయినవి.
73. ఎచ్చులకు వేటపాలెంపోతే, తన్ని తలగుడ్ద తీసుకున్నారట..
74. ఎచ్చులకు ఏమారం పోతే, తన్ని తలగుడ్ద పెరుక్కున్నారుట.
75. ఎట్లా (ఎట్లాంటి)చిరుబోణికైనా వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
76. ఎట్లా వచ్చిందో అట్లే పోతుంది, తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది.
77. ఏడదిడ్డమంటే, పెడదిడ్డ మన్నట్లు.
78. ఎడపిల్ల ఏరాలితో సమానం.
79. ఎడమచేత్తో చేసింది కుడిచేత్తో అనుభవించవలె.
80. ఎడ్డెమంటే, తెడ్డెమన్నట్లు.
81. ఎతలున్నమ్మకు కతలు రావు.
82. ఎత్తివచ్చిన కాపురానికి ఏకాలూనినా ఒకటే.
83. ఎత్తుకున్న చంకనుండదు, దించిన దిగువనుండదు. (బిడ్డ)
84. ఎత్తుక తిన్నవాణ్ణి పొత్తులో పెట్టుకుంటే, అంతాతీసి బొంతలోపెట్టుకున్నాడుట.
85. ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు.
86. ఎత్తుకొని తిన్న బోలె ఎదురుగా వస్తే, చంకనున్న బోలె సలాంచేసిందిట.
87. ఎత్తుబడిన గొడ్డు పులికి జడుస్తుందా?
88. ఎత్తుభారపు పెళ్ళికి ఏకాలుపెట్టినా ఒకతే. (ఎత్తుభారం=వ్యర్ధమైన, పనికి మాలిన).
89. ఎత్తుభారం మొత్తుకోళ్ళు.
90. ఎత్తుమరిగిన బిడ్డ, వెలుగుదాటే గొడ్డు ఏమిచేసినా వినవు.
91. ఎత్తువారి బిడ్డ. (ఎవరిచంకనున్న వారిమాట వినును).
92. ఎత్తెత్తి అడుగు వేస్తే పుల్లాకు మీద పడిందిట.
93. ఎత్తెత్తిపోసినా ఇత్తడి బంగారమగునే?
94. ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే.
95. ఎదలో కత్తెర నాలుకలో బెల్లం.
96. ఎదిగినదానిని వెంటేసుకు తిరిగినట్లు.
97. ఎదుట అన్నది మాటా, ఎదాన్న పెట్టినది వాత.
98. ఎదుట ఉన్నవాడు పెండ్లికొడుకు.
99. ఎదుట బ్రాహ్మడు లేకపోతే వెయ్యి యఙ్ఞాలు చెయ్యవచ్చు.
100. ఎదుట లేకుంటే ఎదలో ఉండదు.

1 comment:

Audisesha Reddy said...

మీ సామెతల బ్లాగు చూశాను. అద్భుతమైన సేకరణ.