Thursday, October 21, 2010

సామెతలు-8

1. ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
2. ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
3. ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
4. ఈ ముడ్డి ఇట్లాంటి ఏర్లను ఎన్ని చూడలేదంటే, ఈ ఏరు ఇట్లాంటి ముడ్లను ఎన్నిటిని చూడలేదు అన్నట్లు. (కప్ప ఎగిరితే నీటిమీద అలిగి ముడ్డి కడుక్కోకుండ వచ్చిన వాడు అని, అనిపించుకొన్న మాట.)
5. ఈ మొహానికా సేరు పసుపు?
6. ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
7. ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
8. ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
9. ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది.
10. ఈవేళ చస్తే రేపటికి రెండు.
11. ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).


12. ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
13. ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
14. ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
15. ఉంటే అమీరు లేదా పకీరు.
16. ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
17. ఉంటే ఊరు, లేదా పాడు.
18. ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
19. ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
20. ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
21. ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
22. ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.
23. ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
24. ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.
25. ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
26. ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.
27. ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.
28. ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
29. ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
30. ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
31. ఉండ్రాళ్ళు ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకు ఒక మొగుడేనా?
32. ఉండృఆళ్ళు పిండివంటా కాదు, ఊదర ధాన్యమూ కాదు.
33. ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?
34. ఉగ్గుతో చేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదు.
35. ఉచితానికి ఊళ్ళు, లెక్కలకి కాసులు.
36. ఉ(చ్చ)కుండ ఉట్టికెత్తి నేతికుండ నేలను బెట్టినట్లు.
37. ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు.
38. ఉచ్చపోసి గొరిగించారు అంటే ఎన్ని ముంతలు అన్నట్టు.
39. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?
40. ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.
41. ఉట్టికి చట్టికి రెంతికి చెడ్డట్టు.
42. ఉట్టిమీద కూడు, ఊరిమీద నిద్ర.
43. ఉట్టిమీద వెన్న పెట్టుకొని ఊరంతా నెయ్యికి దేవులాడినట్లు.
44. ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకున్నట్లు.
45. ఉడికిన మెతుకులు తిని ఊళ్ళో ఉండేవాణ్ణి, నాకు ఎవరితో ఏమి పని ఉంది?
46. ఉడికినా తంతా ఉడకకపోయినా తంతా అన్నట్లు.
47. ఉడుత ఊపులకు కాయలు రాలునా?
48. ఉడుత ఊపులకు మాకులు ఊగునా?
49. ఉడుత ఊపులకు ఏపులు ఊగునా?
50. ఉడుము కొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నదట.
51. ఉడుముని చంకలో పెట్టుకొని ఊళ్ళో ప్రవేశించినట్లు.
52. ఉడుముపోతే పోయింది నా చెయ్యి వస్తే చాలు.
53. ఉడుములలో తల, పాములలో తోక.
54. ఉతికే వానికే గానీ చాకలి ఉతకడు.
55. ఉత్తకుండకు ఊపులెక్కువ.
56. ఉత్తదొడ్డుకు అరపులు మెండు.
57. ఉత్తచెవికన్నా చెవ్వాకు (ఒక ఆభరణం) చెవి మేలు.
58. ఉత్త చేతులతో మూర వేసినట్టు.
59. ఉత్త పుణ్యానికి మొత్తుక సచ్చిందంట.
60. ఉత్తమమైన ఇల్లాలు ఊరేగి వెళ్ళితే, ఉత్తరేణి కాలి ఊళ్ళన్ని కాలిపోయినవట.
61. ఉత్తముండ కన్నా అత్తముండమేలు.
62. ఉత్తముండ వచ్చి అత్తముండని 'ధూత్ ' అన్నదిట.
63. ఉత్తముల మహిమ నీరుకొలది తామర(వంటిది).
64. ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా కురవక-కరవక మానవు.
65. ఉత్తర ఉరిమినా, రాజు పాడితప్పినా, చెదల పురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
66. ఉత్తరచూచి ఎత్తర గంప, విశాఖ చూసి విడవర కొంప.
67. ఉత్తర పదను, ఉలవకు అదను.
68. ఉత్తరపు వాకిలి ఇల్లు ఊరకే ఇచ్చినా వద్దు.
69. ఉత్తరలో ఊడ్చేకంటే, గట్లమీద కూచోని ఏడ్చేది మేలు.
70. ఉత్తరలో చల్లిన పైరు, కత్తెరలో నరికిన కొయ్య.
71. ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు.
72. ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకో అన్నట్లు.
73. ఉద్దత్తులమధ్య పేదలకుంద తరమే?
74. ఉద్దర(అప్పు, ఊరికే వస్తే ) అయితే ఊళ్ళుకొంటరు. నగదు ఐతే నశ్యం కూడా కొనరు.
75. ఉద్దర ఐతే నాకిద్దరు అన్నాడుట.
76. ఉద్దర సొమ్ము దుడ్డుకు పంచేరు.
77. ఉద్దరసొమ్ము నిద్దుర చేటు.
78. ఉద్ధరిణెడు నీళు ఉంగరపు వేలు దర్భ.
79. ఉద్యోగం గట్టిపడుతుంది, ఉన్న పుస్తె తేవే!
80. ఉద్యోగం పురుష లక్షణం, అదిపోతే అవలక్షణం.
81. ఉద్యోగం పురుష లక్షణం, గొడ్డలితేరా నిట్రాడు తెగనరుకుదాం.
82. ఉద్యోగికి ఒక ఊరులేదు, ముష్టివానికి ఒక ఇల్లు లేదు.
83. ఉద్యోగికి దూరభూమిలేదు.
84. ఉన్న అమ్మ గాదె (పాతర) తీసేప్పటికి లేని అమ్మ ప్రాణం లేచిపోయింది.
85. ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు.
86. ఉన్న ఊరువాడికి వెలుతురు భయం, పొరుగూరివాడికి నీడ(ళ్ల) భయం.
87. ఉన్న ఊరు కన్నతల్లి వంటిది.
88. ఉన్నది అంతా ఉండగా, ఊపాధ్యాయులవారి భార్య సమర్తాడిందిట.
89. ఉన్నది ఉండగా, ఉయ్యూరిమీద మేడూరు వచ్చిపడ్డట్టు.
90. ఉన్నది ఉలవకట్టె, పోయింది పొలికట్టె.
91. ఉన్నది ఒక్క కూతురు, ఊరంతా అల్లుళ్ళు.
92. ఉన్నది ఒక్క బిడ్డ, ఊరంతా మొగుళ్ళు.
93. ఉన్న ఒక్కమెతుకు కాస్తా గంజిలో పోయినట్లు.
94. ఉన్నదున్నట్లు చెప్పమంటె, తిన్నదేమి చేసేనూ- అన్నదట లంజ.
95. ఉన్నదిపోదు లేనిది రాదు.
96. ఉన్నదిపోయే ఉంచుకున్నదీ పోయె.
97. ఉన్ననాడు ఉగాది పండుగ, లేని నాడు కాముని పండుగ.
98. ఉన్నమాట అంటే, ఉండే ఊరు అచ్చిరాదు.
99. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ.
100. ఉన్న మాట అంటే ఊరికే చేటు.

1 comment:

manzari said...

చాలా చక్కటి సేకరణ డి.ఎస్ గారు. జాతీయాలు కూడా సేకరించండి. ఆల్ ద బెస్ట్ సార్.