Saturday, October 2, 2010

సామెతలు-4

1. అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.
2. అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.
3. అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.
4. అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.
5. అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ అన్నడుట.
6. అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
7. అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.
8. అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
9. అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.
10. అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?
11. అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!
12. అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
13. అవ్వా కావాలి బువ్వా కావాలి.
14. అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.
15. అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.
16. అసత్యమాడుట పిరికిపందల గుణం.
17. అసలుకంటే వడ్డి ముద్దు.
18. అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
19. అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.
20. అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.
21. అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
22. అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
23. అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
24. అసూయ ముందు, ఆడది వెనుక.
25. అస్తమానం అరచే పిల్లి ఎలుక పట్టలేదు.
26. 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
27. 'ఆఁ' అంటె ఆరునెలలు.
28. 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
29. ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
30. ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
31. ఆ ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.
32. ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
33. ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.
34. ఆకలని రెండు చేతులతో తింటారా?
35. ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
36. ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.
37. ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
38. ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
39. ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
40. ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
41. ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
42. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
43. ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
44. ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
45. ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
46. ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
47. ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.
48. ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
49. ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.
50. ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
51. ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.
52. ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
53. ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.
54. ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
55. ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.
56. ఆడబిడ్డ అర్థ మొగుడు.
57. ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
58. ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
59. ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
60. ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
61. ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
62. ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
63. ఆడింది ఆట, పాడింది పాట.
64. ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
65. ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
66. ఆ తండ్రి కొడుకు కాదా?
67. ఆ తానులోదే ఈ పీలిక.
68. ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
69. ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
70. ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
71. ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
72. ఆదిలోనే హంసపాది (దు).
73. ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
74. ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
75. ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
76. ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
77. ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
78. ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
79. ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
80. ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
81. ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
82. ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
83. ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
84. ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
85. ఆరాటమే గానీ పోరాటం లేదు.
86. అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే  దొడ్డి   అంతా పొట్టు.
87. ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
88. ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
89. ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
90. ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
91. ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
92. ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
93. ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
94. ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
95. ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
96. ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
97. ఆలపాటి  కవిత్వం ,   అందులో పైత్యం
98. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
99. ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
100. ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.

1 comment:

jaggampeta said...

భలే ఉన్నాయీ