Saturday, August 6, 2011

సామెతలు 62

1. పుణ్యానికి పట్టేడిస్తే (పుట్టెడాళ్ళిస్తే) పిచ్చకుంచమని పారబోసినాడట.
2. పుణ్యానికి పుట్టినదే సాక్షి, బావికి నీళ్ళే సాక్షి.
3. పుణ్యానికి పోతే పాప మెదురు వచ్చిందట.
4. పుతపుతల మారెమ్మకు పొడికూడే కానీ గడ్డకూడు రాదు.
5. పుత్తికి పురచేయి లోకువైనట్లు.
6. పుత్రసంతతిలేని పురుషుని కలిము కలహంసలేని కలనువంటిది.
7. పుత్రుడై వేధింతునా? శత్రుడనై వేధింతునా? పేరులేని దెయ్యమునై వేధింతునా?
8. పుదుచ్చెరిలో వీధులు సక్రమమే గానీ, బుద్ధులు వక్రం.
9. పునర్వసు, పుష్యాలకు పూరేడు అడుగైనా తదవదు (పూరేడు(లు)= కముజు జాతి అడవిపిట్ట).
10. పునశ్చరణమే అపవాదానికి పెంపు.
11. పునుగు చట్టము పిండినట్లు.
12. పున్నమినాటి పురుషుడు, అమావాశ్యనాటి ఆడబడుచు.
13. పున్నమ్మ పెళ్ళికి చంద్రుడుదయించినట్లు.
14. పున్నానికి పూజ, అమావాశ్య కారగింపు (తేనెతుట్టె).
15. పున్నెపుచింతల పులుసు, పొగాకిత్తుల పొగుసు.
16. పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా గుబ్బచ్చి చెట్టుకింద నానదు.
17. పుబ్బ కెరలితే, భూతం కెరలినట్టు.
18. పుబ్బ రేగినా బూతు రేగినా నిలువవు.
19. పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు.
20. పుబ్బలో చల్లేది మబ్బుతో మొత్తుకొనేది.
21. పుబ్బలో పుట్టి, మఖలో మాడినట్లు.
22. పుబ్బలో పుట్టెడుకంటే, మఖలో పానెడు మేలు.
23. పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలలో అడ్డెడు చల్లేది మేలు.
24. పురాణంలో ఏమి చెప్పినారే అంటే, అక్కడా నీమొగాననే మొద్దులు బెట్ట (నిప్పులుబోయ) మన్నారన్నదట పెండ్లాము.
25. పురాణంలోని వంకాయలు పులుసులోకి రావు.
26. పురాణం విన్నప్పుడు పుట్టెడు బుద్ధులు, అవతలపోతే అదవ (అపర) బుద్ధులు.
27. పురిటాలికి పుట్టెడైనా చాలదు (ఆకలి ఎక్కువట).
28. పురిటిలోనే కాటేరి సంధించినట్లు (స్త్రీలు రక్త స్రవంవల్ల గుడ్డలు ఈడ్చే వ్యాధి).
29. పురిటిపిల్లకు చమురులేదు, పూర్ణపుబూరెలు (కడుములు) వండుకుందామా అన్నట్లు.
30. పురిటిలోనే సంధి కొట్టినట్లు.
31. పురుగుచేరిన పన్ను పలవింపజేయదా.
32. పురుషుడు బలుపైన పుత్రుడు బలుడయా.
33. పురుషుని భాగ్యం అనుకూలమైన భార్య.
34. పురుషులందు పుణ్యపురుషులు వేరయా.
35. పురోగమనానికి అత్రుప్తే సోపానం.
36. పుఱ్ఱుకారుతుంటే పోతరాజు సివమాడినట్లు.
37. పుఱ్ఱెకో బుద్ధి, జిహ్వకొక రుచి.
38. పులగము తిన్నవాడు పుణ్యాత్ముడు, పాయసం తాగినవాడు పాపాత్ముడు.
39. పులగము మీద పప్పు.
40. పులి ఆవును చంపడం నక్కను మేపనా?
41. పులి ఎత్తుబడితే నలుగురు నాలుగురాళ్ళు వేస్తారు.
42. పులి కడుపున పిల్లులు (చలిచీమలు) పుడతాయా?
43. పులి కడుపున మేక పుడుతుందా?
44. పులి కడుపున పుట్టి మేక అరుపు అరచినట్లు.
45. పులి కాకలైతే పూరీ తింటుందా?
46. పులికి ఏ అడవైతే నేమి?
47. పులికి తన కాడని, పర కాడని లేదు (కాడు=అడవి).
48. పులికి పారణం, పశువుకు మారణం.
49. పులిగాడికి గిలిగాదు మొగుడు.
50. పులిగాడు కంటే గిలిగాడు గొప్ప.
51. పులిగొన్న మృగము పెట్టున పడుతుందా?
52. పులి గోకటమూ అయ్య బ్రతకటమూనా?
53. పులి చచ్చినా పొడలు మాయవు.
54. పులిచారలు వేశాయి అత్తయ్యా! అంటే, పుడిసెడు వెనక్కుతియ్యవే కోడలా అన్నదట (మబ్బు).
55. పులి దాసర్లకు పెట్టుతుందా?
56. పులినాకి విడుచు దైవము గలవానిని.
57. పులిని కోల వేసినట్లు.
58. పులినిచూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు.
59. పులిని జూచి నక్క పూతలు బూసినయట్లు.
60. పులి నలిబడితే, పుల్;ఇచారలు నలిబడతవా? (నలి=వ్యాధిచే చిక్కుట).
61. పులిపేదవడిన పసులవాండ్రే యెక్కాడిరను కధ.
62. పులి బక్కచిక్కితే చారలు బక్కపడునా?
63. పులి బోను చుట్టు ఉండే కమ్మలు దాని పరిరక్షణకు కాదని అందరికీ తెలిసిందే.
64. పులి మలకు అండ, మల పులికి అండ.
65. పులిమీద పుట్ర.
66. పులిమీసాల నుయ్యాల నూగదగునా?
67. పులి మీసాలు కుందేలు మేసినట్లు.
68. పులివాత పడ్డ మేక, అప్పారావుకిచ్చిన అప్పు తిరిగి రావు.
69. పులుసు వచ్చి మెతుకు కొట్టుకుపోయినట్లు.
70. పుల్ల నీళ్ళకే పుణ్యమనేవాడు (పుల్లనీళ్ళు=కలినీళ్ళు; తరవాణి నీళ్ళు).
71. పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు.
72. పుల్లాకు లెత్తమంటే మందిని లెక్కాడిగినాడట (లెక్కబెట్టినట్లు).
73. పుల్లావు పాలైనా తెల్లగానే ఉంటవి (పుల్లావు=లేత ఎరుపు చాయ ఆవు).
74. పుల్లిశెట్టి పెండ్లి, ఎల్లిశెట్టి చావుకు వచ్చినట్లు.
75. పువ్వు ముడిచిన పురవీధి భూమియందు కట్టె మోవగ వలసె.
76. పువ్వు లమ్మిన అంగటె కట్టెలమ్ముట.
77. పువ్వుల వగరే తేనె అయ్యేది.
78. పువ్వులు వేడుకైన గడివోయిన వాళ్ముడువంగ వచ్చునే.
79. పూశాలలో (పుష్యమీకార్తె) పూరిపిట్ట తడువదు.
80. పుష్యమాసంలో పూసలు గుచ్చ పొద్దుండదు.
81. పుష్యమాసానికి పూసంత వేసంగి.
82. పుష్యమి కురిస్తే పూరిపిట్టకూడా తడువదు.
83. పుసుకుడా పుసుకుడా పువ్వులు తెమ్మంటే, తటకు తటకున పోయి తంగేడు పువ్వులు తెచ్చినాడంట.
84. పుస్తకములు చదువ పొందునా మోక్షంబు.
85. పుస్తె, పూస, పసుపు పునిస్త్రీకి.

పూ

86. పూచింది ఒక ఎత్తు, కాచింది మరొక ఎత్తు.
87. పూచింది పుడమంత, కాచింది గంపంత.
88. పూచిన తంగెడు వేసినా, కాచిన వెంపలి వేసినా, నేను వండుతానన్నదట వరి.
89. పూచిన పూలెల్లా కాయలైతే చెట్టు మనునా?
90. పూచిన వెన్నెలంటే పుప్పొడి వెదకమన్నట్లు.
91. పూచే పూతను బట్టి కాచే కాపుండును.
92. పూజకన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం.
93. పూజకొద్ది పురుషుడు, దానంకొద్ది బిడ్డలు.
94. పూజకొద్ది బిడ్డలు, అదృష్టం కొద్ది ఆలు.
95. పూజ పునస్కారాలు లేక బూజెక్కి ఉన్నానుగానీ, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను.
96. పూజారి బలిసి పోలేరమ్మ చండ్లు పట్టుకొన్నాడట.
97. పూటకూళ్ళకు వచ్చిన వాళ్ళకు పుట్లధర ఎందుకు?
98. పూటకూళ్ళమ్మ పుణ్య మెఱుగదు.
99. పూటకూళ్ళింట పాత్రకు ఎంగిలి లేదు.
100. పూట గడుస్తుంది గానీ, మాట నిలిచిపోతుంది.


No comments: