Monday, August 15, 2011

సామెతలు 64


1. పెద్దక్క ఓలి తెగితే, చిన్నక్క ఓలి తెగుతుంది. (తెగితే=నిర్ణయమయితే).
2. పెద్దకోడలికి పెత్తనమిస్తే ముడ్డి కడుక్కోకుండా (పీతిగుద్దతో) ఇంట్లోకి వచ్చిందట.
3. పెద్దచెట్టుకు సుడిగాలి పెనుభూతం వంటిది.
4. పెద్దతల లేకుంటే పెద్దరికం చాలదు.
5. పెద్దతల లేకపోతే పొట్టేలు (ఎద్దు) తలన్నా తెచ్చి పెట్టుకోమన్నారు.
6. పెద్దపులి ఎదుటయినా పడవచ్చునుగాని, నగరివారి ఎదుట పడరాదు.
7. పెద్దపులి చాటుకు చేరిన ఎలుకకు, నమిలే గండుపిల్లి నల్లితో సమానం.
8. పెద్దపులి తరుముకువచ్చినా కంసాలి అంగడిలోకి పోరాదు (దూరరాదు).
9. పెద్దపులి తరిమినా, దేవిడిముందుకు పోరాదు.
10. పెద్దపులి పేరంటం పెట్టునా?
11. పెద్దపులిమీద స్వారీ చేసేవాడు భూమిమీద నడవలేడు అన్నట్లు.
12. పెద్దమనిషిని పేరంటానికి పిలిస్తే అర్థసేరు పసుపు ముడ్డికే సరిపెట్టినాడంట.
13. పెద్దమనిషి, ప్రజాపతి పనికిముందు విజృంభించి పనికాగానే శాంతిస్తారు.
14. పెద్దముత్తైదువు సద్దుచేయదు, చిన్నపిల్లే చిందులుతొక్కేది.
15. పెద్దమ్మా! నీవెక్కడికంటే, చిన్నమ్మా నీవెనుకే ఉంటానన్నదట.
16. పెద్దరికానికి పెద్దబావ చస్తే, ఇంటిల్లిపాది ఈడ్వలేక చచ్చిందట.
17. పెద్దరెడ్డి కొంగు పట్టుకుంటే, కాదనేదెట్లా? అన్నదట.
18. పెద్దల ఉసురు పెనుబామై తగులును.
19. పెద్దలకు పెట్టరా పేచీల తలపాగ.
20. పెద్దలతో వాదు, పితరులతో పోరు.
21. పెద్దలమాట చద్దిమూట.
22. పెద్దలమాట పెన్నిధిమూత.
23. పెద్దలమాట పెఱుగుకూటి మూట.
24. పెద్దలు లేని ఇల్లు, ఎద్దుల కొటిక.
25. పెద్దలు లేని ఇల్లు, సిద్ధులులేని మఠము.
26. పెద్దలేకపోతే గొఱ్ఱె (దున్నపోతు) తలనైనా తెచ్చుకోమన్నారు.
27. పెద్దలేని ఊరుకి పోతురాజే పెద్ద.
28. పెద్దవాన పెళపెలా పడితే, చిన్నవాన నానుడు పడుతుంది.
29. పెద్దుభోట్లూ, పెద్దుభోట్లూ! సన్యాసంతీసుకుంటావా? అంటే, పెండ్లాము చెప్పుతో మాడున కొడితే తీసుకోక తప్పుతుందా? అన్నాడట.
30. పెనములోనుంచి పొయ్యిలో పడినట్లు.
31. పెన మే మెఱుగును పెసరట్టు రుచి.
32. పెనుగాలికి, కాచినమాను వెరచునుగానీ పెనుమొద్దు వెరచునా?
33. పెనుగొండకు పిల్లనివ్వరాదు, రోద్దానికి ఎద్దునివ్వరాదు (రోద్దం=అనంతపురం జిల్లాలో ఒక ఊరు).
34. పెను రంకుబోతు కూతురుతో బాటు దుందుడుకు కొడుకు బుట్టినట్లు.
35. పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ.
36. పెన్నరావడం వెన్న కరిగే లోపలనె.
37. పెన్నలో మాన్యం కాశీలో దానం చేసినట్లు.
38. పెన్నీరు జిల (గిల)క్కొట్టి వెన్న దీసినట్లు, ఆకాశాన్ని పిడికిట బట్టినట్లు.
39. పెమ్మకట్లవారి మంత్రం దెబ్బ అంటే, కమ్మకట్ల పాముకాటైనా పోతుంది.
40. పెయ్యను కాపాడమని (కాచమని) పెద్దపులికి అప్పచెప్పినట్లు.
41. పెయ్యను పెంచితే పేదరికంలేదు.
42. పెరటికి పోయినవానిని తన్నలేక పెంటను తన్నినట్లు.
43. పెరటిచెట్టు ముందుకు రాదు.
44. పెరుగగా పెరుగగా పెదబావగారు కోతి అయినట్లు.
45. పెరుగగా పెరుగగా పెదబావ గుఱ్ఱం గాడిదయినట్లు అయునాడట.
46. పెరుమాళ్ళకైనా పెట్టువాడే చుట్టం.
47. పెఱుగుట విఱుగుట కొఱకే, ధర తగ్గుట హెచ్చుట కొరకే.
48. పెఱుగుకు పులికడుగుకు పెనకువ అయినట్లు.
49. పెఱుగు పెత్తనం చెఱచును.
50. పెఱుగూ వడ్లు కలిపినట్లు.
51. పెళ్ళాం పోతే పెళ్ళికొడుకు అయినట్లు.
52. పెళ్ళాం బెల్లం ముక్క, తల్లి మట్టిబె(గ)డ్డ.
53. పెళ్ళి కెళ్ళిన యింటిన వలసవెళ్ళ బుద్ధయినదట.
54. పెళ్ళికిపోతూ పిల్లిని చంకలో బెట్టుకొని పోయినట్లు.
55. పెళ్ళికిముందు కండ్లు బాగా తెరచుకొని ఉండి, పెండ్లికాగానే సగం మూసుకోవాల.
56. పెళ్ళే బాగుంది, పప్పువండితే మరీ బాగుంటుంది.
57. పెసరకు పైరుగాలి, పసరానికి నోటిగాలి ప్రమాదం (పైరు(ర)గాలి=దక్షిణపు గాలి; నోటిగాలి= పశువులనోటికి తగులు పుండ్లవ్యాధి).


పే


58. పేగు చుట్టమా? పెట్టు చుట్టమా?
59. పేచీకి పెదబాబు.
60. పేడకుప్పకు దిష్టి (దృష్టి) దీయాలనా?
61. పేడదిన్న పురుగు బెల్లమే మెరుగురా.
62. పేడలో పొదిగిన ఉల్లిగడ్డవలె.
63. పేడా, బెల్లం ఒకటి చేసినట్లు.
64. పేడు ముదిరి పెండ్లికొడుకగు.
65. పేద కడుపు నింపను అన్నం వెదకును, మహారాజు అన్నం నింపను కడుపు వెదకును.
66. పేదకు తగిలే బ్రహ్మహత్య అన్నట్లు.
67. పేదకు పెన్నిధి దొరికినట్లు.
68. పేదపేద గూడి పెనగొనియుందురు.
69. పేదతెవులు అంగడి బెట్టకున్న తీరదు.
70. పేదబడ్డవెనుక పెండ్లము మతిచూడు.
71. పేదలకు చేతనయినది కలలు గనుట మాత్రమే.
72. పేదల కోపం పెదవికి చేటు.
73. పేదల బిగువు, సాధుల తగవు.
74. పేదయింటగానీ రాచయింటగానీ ఎద్దు తినేది గడ్డే.
75. పేదవాడు పెంత తింటే ఆకలికని, మారాజు తింటే మందుకని.
76. పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి.
77. పేదవానికి పెండ్లామే ఆస్తి.
78. పేదవాని యింట పెండ్లయిన ఎరుగరు.
79. పేదవానికి పెండ్లామే లంజ.
80. పేదవాని పెళ్ళాం వాడకెల్ల వదిన.
81. పేదవానిపైనే పడెరా పెద్దపిడుగు.
82. పేదవానివెంట పడెనమ్మా జోరీగ.
83. పేదవాని స్నేహం, మహారాజువిరోధం సహింపరానివి.
84. పేను కుక్కమంటే చెవి కరచినట్లు.
85. పేనుకు పెత్తనమిస్తే, ఈపిని యిరవైచోట్ల యీనిందట.
86. పేనుకు పెత్తనమిస్తే, తలంతా తెగకొరికి పెట్టిందట.
87. పేనేమెఱుగును పెడతల కండూతి?
88. పేరంటానికి వచ్చి, పెండ్లికొడుకు వరస ఏమన్నట్లు.
89. పేరంట్రాండ్లు పదిమందిచేరి పాకం చెడగొట్టినట్లు.
90. పేరితే పాలే పెరుగు.
91. పేరిశాస్త్రికి కలిగెరా పెదవిపాటు.
92. పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిది.
93. పేరు ఒకరిది, నోరు ఇంకొకరిది.
94. పేరు కమలాక్షి, కండ్లేమో చీపురివి.
95. పేరు కమలాక్షి, చూపులు కాకి చూపులు.
96. పేరుకు మోపూరు, పెనులోభులు వారు.
97. పేరు గంగాభవాని, తాగబోతే నీటిచుక్క లేదు.
98. పేరు గురులింగ మంటే, ఉండే మూడులింగాలు (పురుషాది) గాక ఇదెక్కడ దన్నాడట.
99. పేరు జీలకఱ్ఱ, చూడబోతే కఱ్ఱ లేదు.
100. పేరు ధర్మరాజు, పెనువేప విత్తయా.

No comments: