Thursday, May 5, 2011

సామెతలు 48

1. దున్నిన పొలానికి తాగిన గంజికి సరి.
2. దున్నే అదనులో దూరదేశం పోయి, కోతలకాలంలో కొడవలిపట్ట వచ్చినాడట.
3. దున్నే ఎద్దునే పొడిచేది (ములుకర్రతో).
4. దున్నేవాడు లేక్కచూస్తే నాగలి కూడా మిగలదు.
5. దున్నేవాళ్ళకు వేళ్ళు (లేళ్ళు) చూపించినట్లు.
6. దుప్పి కాలంగాక చిక్కును గానీ కాళ్ళు లేకగాదు.
7. దురదృష్టము ననుభవించ లేనివాడు అదృష్టమును అనుభవించలేడు.
8. దురదృష్టం పదనువాదరగల కత్తివంటిది. పిడిని పట్టుకొనిన ఉపయోగపడును, వాదర పట్టుకొనిన తెగును.
9. దుర్గంధ కుసుమంకంటే, నిర్గంధ కుసుమం మేలు.
10. దువ్వును చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు (దువ్వు=పులి).
11. దుష్టుడు కలహించటమంతా శిష్టులకే మేలు.
12. దుష్టునిచూచి దూరంగా ఉండమన్నారు.
13. దుఃఖమును అణుచుకోగలిగిన వానికంటే సంతోషాన్ని అణచుకోగలిగిన వాడే ఘనుడు.
14. దుఃఖము సుఖమును వెన్నుదన్నే వెన్నాడుచుండును.


దూ


15. దూకుదూకు మనేవాళ్ళేగానీ, దూకే లంజాకొడుకు ఒక్కడూ లేడు.
16. దూ కుడిచినట్టా? దుత్తలో పడ్డట్టా?
17. దూడ కుడిస్తే గానీ ఆవు చేపదు.
18. దూడ కుడిస్తేనే గానీ దుత్త నానదు (తడవదు).
19. దూడ-తల్లి ఉండగా గుంజ అరచిందన్నట్లు.
20. దూడపాలు దుత్తకే సరిపోయె.
21. దూడ పొదుగును కుమ్మితే గానీ ఆవు చేపదు.
22. దూడ మేసి గంటసేపైనా, దురిసెండ్ల నడతమాత్రం పోలేదు.
23. దూడలేని పాడి దుఃఖపు పాడి.
24. దూడ వగచునె భువి తోడేలు చచ్చిన.
25. దూదేకులవాడికి తుంబ తెగులు (తుంబతెగులు=దూది ఏకేటప్పుడు కలిగే చప్పుడు).
26. దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (దూదేకుల సిద్దప్ప= బ్రహ్మంగారి శిష్యులలో మహాజ్ఞాని).
27. దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు.
28. దూబరతిండికి దూండ్లు బతకవు, ఆణి మొద్దుకు ఆండ్లు బతకవు.
29. దూరం గుడికట్టితే (చంద్రుని చుట్టు) దగ్గరవాన, దగ్గర కడితే దూరపువాన.
30. దూరదర్శనితో చూచినకొండ చిన్నదిగా కంపించును, భూతద్దములో చూచిన పెద్దదిగా కంపించును.
31. దూరపు కొండలు నునుపు.
32. దూరపు దండం కోటి లాభం.
33. దూల పెట్టేచోట దుడ్డుకోల పెట్టినట్లు.
34. దూస్తే దోసెడు, ఊడితే హుళక్కి.


దె


35. దెప్పె ఎక్కినట్లు, దేవుడికి మొక్కినట్లు.
36. దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.
37. దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంది.
38. దెసబత్తెలవానికి బరిబత్తలవాడు బావమరిది (దెసెబత్తలు=దిసమొల).


దే


39. దేవతలకు దుమ్ము, రాక్షసులకు మన్ను.
40. దేవతలు నాశంచెయ్యాలనుకున్న వానికి ముందు పిచ్చి పట్టిస్తారు.
41. దేవర చిత్తం, దాసుడి భాగ్యం.
42. దేవర చిత్తం, దీనుడి భాగ్యం.
43. దేవర సవాసేరు, లింగం సేరు.
44. దేవళం మింగేవాడికి ధ్వజస్తంభం లొటలొట.
45. దేవాంగులలో వా దించరాదు (వా అనే అక్షరం కొట్టివేయరాదు).
46. దేవియున్న గృహము దేవార్చన గృహము.
47. దేవుడని మొక్కితే, దెయ్యమై పట్టుకొన్నట్లు.
48. దేవుడికి ముడుపు, దెయ్యానికి మంత్రం.
49. దేవుడి పట్టుకంటే, దెయ్యపుపట్టు ఎక్కువ.
50. దేవుడీ పెళ్ళికందరూ పెత్తనగండ్లే (పెద్దలే).
51. దేవుడిస్తాడు గానీ వండి వార్చి వాత కొడతాడా?
52. దేవుడు కూరగాయలిస్తే దెయ్యం వంటవాని నిచ్చింది.
53. దేవుడు చెఱుపని ఇల్లు దేవాంగి చెరుపుతాడు.
54. దేవుడు తలిస్తే దెబ్బలకు కొదువా?
55. దేవుడులేని ఊళ్ళో మంచపుకోడే పోతురాజు.
56. దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు.
57. దేవునికి చూపులు, మనకు మేపులు.
58. దేవునితేరు ఈడ్వలేకున్న ధర్మకర్త-నంబినాయాలు బరువైనాడుగానీ దేవుడే అయితే నా వెంట్రుకకు కట్టి లాగనా అన్నడట.
59. దేశమెవ్వరు ఏలుతున్నా, ధాన్యం దంచితేనే బియ్యం అవుతాయి.
60. దేసూరురెడ్ల పొందు (పొత్తు) దయ్యపుపొందు (పొత్తు) (దేసూరు రెడ్లు=రెడ్లలో ఒక శాఖ).
61. దేహము గొడవల కాపురము.


దై


62. దైవబలము కలుగని వేళ కలహించి గొఱ్ఱెకరచు.


దొ


63. దొంగ అండీ అంటే, ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నట్లు.
64. దొంగకుక్కను పుట్టించినవాడే యతిమతం ముండను పుట్టించినాడు.
65. దొంగకు చేను వచ్చి అయితేమాత్రమేమి?
66. దొంగకు తలుపుతీసి, గొరను లేపినట్లు.
67. దొంగకు తేలు కుట్టినట్లు.
68. దొంగకు తోడు, దొరకు సాక్షి.
69. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి.
70. దొంగకు దొరికిందే చాలు.
71. దొంగకు భయము, లంజకు సిగ్గు పనికిరావు.
72. దొంగగొడ్డుకు గుడి కట్టినట్లు.
73. దొంగగొడ్డు మెడను దుడ్డుగట్టినయట్లు.
74. దొంగగొడ్లకు గుదికఱ్ఱలు (కట్లు) కట్టినట్లు.
75. దొంగచేతికి తాళమిచ్చినట్లు (తాళంచెవి).
76. దొంగచేయి దోపన బెడితే, అమావాస్యనాడు అల్లల లాడినట్లు.
77. దొంగతనానికి పోతూ, డోలు చంకన బెట్టుకొని పోయినట్లు.
78. దొంగ(వాని) తల్లికి ఏడువ భయం.
79. దొంగతో కూడా దయ్యం వెంబడే వచ్చును.
80. దొంగను దోస్తే దాదులేదు, ఫిర్యాదు లేదు.
81. దొంగపోటు కంటే, లింగపోటు ఎక్కువ.
82. దొంగపోయి తలారివాని ఎదుట దాగినట్లు.
83. దొంగ మగని భక్తిమీర పూజించగానే మంచిత్రోవ చూపగలడా?
84. దొంగల సొమ్ము దొరలపాలు.
85. దొంగలు తోలిన గొడ్డూ ఏరేవు దాటినా ఒకటే.
86. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినవట.
87. దొంగలూ, దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్లు.
88. దొంగ వస్తాడని ముందు చెప్పిఉంటే సాక్షులను సంపాదించి ఉందునే అన్నాడట.
89. దొంగ వాకిట మంచం వేసినట్లు.
90. దొంగవాడి దృష్టి మూట మీదనే.
91. దొంగవాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే.
92. దొంగ సంగతి దొంగ ఎఱుగును.
93. దొంగిలబోటే మంగలం దొరికిందట.
94. దొంగిలించేంత దొరతనముండగా, అడుక్కతినేటంత అదవతన మేల?
95. దొంతుల కోపని గుదియలుండునా?
96. దొంతులజేరి నాయి దోర్చుగానీ కూర్చునా? (నాయి=కుక్క, దోర్చు=త్రోయు)
97. దొడ్డికిపోయే వాని కొఱకై ఒడ్డుకు పడవ పట్టించినట్లు.
98. దొడ్డినిండా గొడ్లు,ఇంటినిండా బిడ్డలు! ఇంకేమికావాలి ఇరకటానికి?
99. దొడ్డిలో కామధేనువుంటే, గొడ్డును పితుకను కుండను గొంపోయినట్లు.
100. దొడ్డివాకిట, దెయ్యాన్ని తరిమేస్తే, తలవాకిట వచ్చి నిలబడిందట.

1 comment:

Unknown said...

mee prayatnam chaala bavundi.All the best.
http:/kallurisailabala.blogspot.com