Sunday, February 13, 2011

సామెతలు 381. జనుములో పాము పోతే పాతిక నష్టం.
2. జన్మానికంతా శివరాత్రి అన్నట్లు.
3. జన్నెరోగికి బఱ్ఱెజున్ను పెట్టినట్లు, పిల్లి నెత్తిన వెన్న పెట్టినట్లు.
4. జపం వదిలి లొట్టల్లో పడినట్లు.
5. జబ్బబలిమి మీద బలాత్కార గానవినోదమన్నట్లు.
6. జమ్మి ఆకుతో విస్తర కుట్టినట్లు.
7. జనముండేవరకూ భయము లేదు.
8. జయాపజయంబు లెవరి సొమ్ము?
9. జరిగితే జల్లెడతో నీళ్ళు మోస్తారు.
10. జరిగేమటుకు జయభేరి, జరక్కపోతే రణభేరి.
11. జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు.
12. జరుగుబాటు తక్కువ, అదరి(రు)పాటు ఎక్కువ.
13. జలుబు మందుతింటే వారం దినాలుంటుంది, తినకపోతే ఏడుదినాలుంటుంది.
14. జలుబు విచారణ లేని జబ్బు.
15. జవ్వాది పూసుకొని చంక లెత్తినట్లు.
16. జ్వర జిహ్వకు పంచదార లేదు.


జా


17. జాణకు మూడుతావు లంటును.
18. జాణలకు పురాణాగమశాస్త్రవేదజప ప్రసంగ త్రాణకల్గి ప్రయోజనమేమి?
19. జాతికొద్దీ బుద్ధి, కులంకొద్దీ ఆచారం.
20. జాతినాగుల చంపుతూ, ప్రతిమనాగులకు పాలుపోసినట్లు. 
21. జాబు వ్రాసిపెట్టమంటే, కాళ్ళు నొప్పులంటే, వాటితో పనేమంటే, నేను రాసింది నేనే చదవాలన్నాడట.
22. జామాతా దశమగ్రహం.
23. జారతోడి పొందు చావునకే యగు.
24. జారితే పడమన్నారు, జరిగితే (సాగితే) పడమన్నారు.


జి


25. జింక కన్నీరు వేటగానికి ముద్దా?
26. జింకకు కొమ్ములు బరువా?
27. జిలిబిలి పలుకుల వెలది నకారగుళ్ళ పాలైనట్లు (నకారగుళ్ళు=నియోగులు).
28. జిల్లేడు పూలకు తుమ్మెద లాశించినట్లు.
29. జిల్లేళ్ళకు మల్లెలు పూయునా?
30. జివ తక్కువ, జీత మెక్కువ.
31. జిహ్వ కొక రుచి, పుఱ్ఱె కొక బుద్ధి.
32. జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా.


జీ


33. జీతంబెత్తం లేకుండా తోడేలు గొఱ్ఱెలను కాస్తానన్నదిట.
34. జీతంలేని నౌకరు, కోపంలేని దొర.
35. జీతగాడికి, నేతగాడికి చావులేదు.
36. జీతగాడు అతగాడైనట్లు.
37. జీలకఱ్ఱా సింగినాదం.
38. జీలుగు (జీలగ) పెఱిగిన మాలెకు కంబము కాదు.
39. జీలగ బెండ్లు చెవుల పెంచుతాయిగానీ కుండలాలిస్తాయా?
40. జీవరత్నాన్ని ఇత్తడిలో పొదిగితే రత్నానికేమి లోటు?
41. జీవితమొక వ్యాధి, నిద్రావస్థ ఉపశమనము, మరణమే ఆరోగ్యము.


జు


42. జుట్టుంటే ఎన్ని జడలైనా వెయ్యవచ్చు.
43. జుట్టుకాలి ఏదుస్తుంటే, చుట్ట నిప్పడిగినట్లు.
44. జుట్టు ఉన్న అమ్మ ఏకొప్పయినా పెట్టవచ్చు.
45. జున్ను రుచి వెన్నకబ్బునా?


జె


46. జెముడుకు కాయలూ లేవు నిలువ నీడాలేదు.
47. జెముడు కంచెకు శ్రేష్టం, రేగడ చేనికి శ్రేష్టం.


జే


48. జేనెడు ఇంట్లో మూరెడు కఱ్ఱ.
49. జేనెడు దొరకు మూరెడు బంటు.
50. జేనెడు పిట్టకు మూరెడు తోక.
51. జ్యేష్ట చెడకురియును, మూల మురుగ కురియును.


జై


52. జైనవాని చేతి పేనువలె. (చంపడనుట).


జొ


53. జొన్న పెరిగితే జాడు, వరిపెరిగితే వడ్లు.


జో


54. జోగీ జోగీ రాసుకుంటే, బూడిద రాలిందట.
55. జోడులేని బ్రతుకు, త్రాడులేని బొంగరం.
56. జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు.
57. జోలి పల్కులు తీసేలోగా బిక్షపు వేళ పోయిందట.
58. టంకం పెట్టిన గుడిసె దెబ్బ కొడితే వడిసె.
59. టంగుటూరు పెద్దమాలను తగవుతీర్చమంటే, తనకు ఇద్దరున్నారన్నాడట.


టా


60. టాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రుడికి సద్దెన్నం.


టె


61. టెంకాయ చెట్టెందుకు ఎక్కినావురా అంటే దూడగడ్డి కన్నాడట, గడ్డి చెట్టుపైన ఉంటుందా? అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నా అన్నాడుట కాయలదొంగ.
62. టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే దొంగ కడ్డమా?
63. డంబము ఎప్పుడూ పూవులు పూయుచుండునే గానీ కాయలు కాయదు.
64. డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
65. డబ్బిచ్చి తేలు కుట్టించుకొన్నట్లు.
66. డబ్బు ఇవ్వనివాడు పడవ ముందర ఎక్కును.
67. డబ్బు ఉంటే, కొండమీద కోతికూడా దిగివస్తుంది.
68. డబ్బుకు ప్రాణానికి లంకె.
69. డబ్బుకు వచ్చిన చెయ్యే వరహాకు వస్తుంది.
70. డబ్బు (దస్తు) దస్కం లేదుగానీ, దవాలు బంట్రోతు.
71. డబ్బు పాపిష్టిది.
72. డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు.
73. డబ్బురాని విద్య దరిద్రానికే.
74. డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు.
75. డబ్బు లేనివానికి బోగముది తల్లివరుస.
76. డబ్బు సభ కట్టును, ముద్ద నోరు కట్టును.
77. డఱ్ఱుబుఱ్ఱు డాలుకత్తి, చూరులోన చురుకత్తి.


డా


78. డాగుపడిన పండు బాగులేదందురు.
79. డాబుసరి బావా! అంటే డబ్బులేదు మరదలా అన్నాడట.


డి


80. డిందుపడినవాని నెందునూ లెక్కింపరు.


డూ


81. డూడూ బసవన్నా అంటే తలూపినట్లు.


డొం


82. డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా?
83. డొంకలో షరాబున్నాడు, నాణెము చూపుకోవచ్చును అన్నాడట దొంగలచేజిక్కిన వాడు.


డౌ


84. డౌలు దస్తు పెండ్లాము పస్తు (డౌలు=భూమి సిస్తు, దస్తు=వసూలు చేసిన పైకము ఖజానాకు చెల్లించుట).
85. డౌలు చూపితే దరిద్రం పోతుందా? (డౌలు=డంభము, డాబు).


ఢి


86. ఢిల్లీకి ఢిల్లే, పల్లెకు పల్లే.
87. ఢిల్లీపాచ్చా కూతురైనా పెండ్లికొడుకుకు లోకువే.
88. ఢిల్లీకి పోయి ఉల్లిగడ్డ తెచ్చినట్లు.
89. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.
90. తంగేటి జుంటిని దాప ఎందుకు? (దాచుటెందుకు?)(జున్ను= తేనెతుట్టె).
91. తంగేడు పూచినట్లు.
92. తంటాలమారి గుఱ్ఱానికి తాటిపట్ట గోఱపము (గోఱపము=కోకుడు దువ్వెన).
93. తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది.
94. తండ్రికదా అని తలాటి కీడ్చినట్లు.
95. తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది, తల్లి చస్తే కాపురం తెలుస్తుంది.
96. తండ్రి తవ్విన నుయ్యి అని దానిలో దూకవచ్చునా?
97. తండ్రిని చంపబోయిన పాపం, అత్తవారింటికి పోయి, అంబటికట్ట తెగేవఱకు ఉంటే పోవును.
98. తండ్రి వంకవారు దాయాది వర్గమే.
99. తండ్రి సేద్యం కొడుకు వైద్యం కూడు మధ్యం.
100. తంతే దూదిపరుపు మీద పడ్డట్లు.

No comments: