1. రామునివంటి రాజుంటే, హనుమంతునివంటి బంటూ ఉంటాడు.
2. రామునివంటి రాజు, రావణుని వంటి వైరి లేరు.
3. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు (వదలలేదు).
4. రామేశ్వర వెళ్ళినా ఱంకుమగడు తప్పలేదట.
5. రాయలవారి ఏనుగు పిత్తుతుంది అని మూటకూళ్ళు కట్టుకొనిపోతే, అది తుస్సున పోయిందట.
6. రాయంగ రాయంగ కరణం - దగ్గంగ దగ్గంగ మరణం.
7. రాయుడిది తలది, చాకలిది మొలది.
8. రాల రువ్వదగినవాని పూల రువ్వరు.
9. రాలిన పూవు రెమ్మకు అతుక్కుంటుందా?
10. రాళ్ళకోపని గుద్దలిని వాడిచేసే వాళ్ళుందురా?
11. రాళ్ళ చెలుక - రండబిడ్ద, కాపువానికి కలిసివస్తాయట.
12. రాళ్ళచేను రత్నాలు పండుతుంది.
13. రాళ్ళచేల్లో గుంటక తోలినట్లు (గుంటక=చదునుచేయు సాధనం).
14. రాళ్ళు తినే పక్షి రాళ్ళు తింటుంది, రత్నాలు తినే పక్షి రత్నాలు తింటుంది.
15. రావణాసురుడి కాష్టం వెలె (ఎడతెగనిది).
16. రావేమయ్యా తిండివేమయ్యా! అంటే వెన్నక్కే పోయానన్నాడట.
17. రాష్ట్రం దాగినా (దాటినా) రంకు దాగదు.
రి
18. రిక్తమనసు కోర్కెలకు పెద్ద.
రీ
19. రీతికి వస్తే కదా రంగానికి వచ్చేది?
రు
20. రుచిమరిగిన పిల్లి ఉట్టిమీదకు ఎగిరినట్లు.
21. రుచీపచీలేని కూర కంచానికి చేటు, అందం చందంలేని పెళ్ళాం మంచానికి చేటు.
22. రుద్రాక్షిపిల్లి (వంటివాడు, కపటసన్యాసి).
రూ
23. రూక యివ్వని విటకాని పోటు మెండు.
24. రూకలు పదివేలున్నా చారెడు నూకలే గతి.
25. రూకలేని వాడు పోక చేయలేడు.
26. రూపంచేత స్త్రీలు, పరాక్రమంచేత పురుషులు రాణింతురు.
27. రూపాన పాపిష్టి, గుణాన పాపిష్టి.
రె
28. రెంటికి చెడ్డ రేవడు వలె (రేవడు=చాకలి).
29. రెండావుల పాలు తాగిన దూడ.
30. రెండావుల పాలు దాగేవాడు (కుడిచేవాడు) (ఉభయపక్షాలకు చెందినవాడు అనుట).
31. రెండు ఊళ్ళ వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం.
32. రెండు ఏండ్లవరపు, మూడు ఏండ్ల మురుగు ఉండదు.
33. రెండుచేతులు కలిస్తేనే చప్పుడు అయ్యేది.
34. రెండు తప్పులెప్పుడూ ఒక ఒప్పు కాలేవు.
35. రెండు నలుపులు కలిసి ఒక తెలుపు కానేరదు.
36. రెండు నాలుకలవాడు. (మాట నిలకడ లేనివాడు).
37. రెండు పడవలలో కాళ్ళు బెట్టినట్లు (పెట్టినవాడు). (ఉభయపక్షాలకు ప్రీతిపాత్రుడు కాదలచువాడు).
38. రెండ్ వేదంతయుక్తులు వాగగానే రాజయొగి కాడు.
39. రెండువేళ్ళతో నాటవచ్చునుగానీ, అయిదువేళ్ళతో పెరకరాదు.
40. రెండూ రెండే, కొండప్పా.
41. రెడ్డి కరణం లేని ఊళ్ళో, చాకలివాడే పిన్నా పెద్ద.
42. రెడ్డి మడ్డి రోమాల ముడ్డి.
43. రెడ్డి మడ్డి బంగారు కడ్డి.
44. రెడ్డి వచ్చాడు మొదలెత్తుకో (పురాణం).
45. రెడ్డివారి ఆబోతు (రెడ్డోళ్ళ)తా ఎక్కదు ఇంకొకదానిని ఎక్కనియ్యదు.
46. రెడ్డేమి చేస్తున్నాడురా, అంటే - పైన పండుకొను ఉన్నాడు: అమ్మో - క్రింద పండుకొని ఉన్నది; ఎప్పుడూ ఇంతేనా? అప్పుడప్పుడు అమ్మగూడా పైన పండుకొంటుంది అన్నాడట.
47. రెడ్లకు -వడ్లకు పేర్లు చెప్పలేము.
48. రెడ్లలో తెగలకు, వడ్లలో తెగలకు లెక్కలేదు.
49. రెడ్లున్న ఊరిలో, రేచులున్న కొండలో ఏమీ బతకవు.
50. రెప్పలార్చేవాళ్ళు కొంపలారుస్తారు.
రే
51. రేగడి భూమిని, రెడ్డినీ చేవిడువరాదు.
52. రేగుకంపపై గుడ్డవేసి తీసుకొన్నట్లు.
53. రేగుచెట్టు కింద గుడ్డివాని సామ్యము.
54. రేగుచెట్టు కింద ముసలామెవలె.
55. రేగుపండ్లకు ముత్యాలమ్ముకొన్నట్లు.
56. రేజీకటి మొగుడికి గుడ్డి పెండ్లాము.
57. రేపటికి కూటికిలేదని రేయింబవలు వ్యసనమందనేల?
58. రేపటి నెమలికంటే, ఈనాటి కాకి మేలు.
59. రేపల్లెవాడలో పాలమ్మినట్లు.
60. రేపు అనే మాటకు రూపులేదు
61. రేవతి వర్షం రమణీయం.
62. రేవులోని తాడి అడ్డుచేటు.
రై
63. రైతు పాడు, చేను బీడు.
64. రైతు బీద గానీ, చేను బీద గాదు.
65. రైతు లెక్క చూస్తే, నాగలి కూడా మిగలదు.
66. రైతు క్షేమం రాజు భాగ్యం.
రొ
67. రొండూ రొండే, ఱొంటికి పుండ్లే (ఱొంటికి=నడుముకు).
68. రొంపికఱువు రోతబుట్టించి, వరపుకఱవు ఒరగబెట్టుతుందా?
69. రొక్క మిచ్చినవాడే రేవెలదికి మన్మధుడు.
70. రొట్ట కట్టె దేశంలో పుట్టగోచీవాడే భాగ్యవంతుడు (రొట్ట=పచ్చిఆకు ఎరువు).
71. రొట్టెకు ఏరేవైతేనేమి? (కొరకను).
72. రొట్టె తిని, రోసినావుకానీ, నానివంకచూడు నా తమాషా.
73. రొట్టెలవాడి పనికంటే, ముక్కలవాడి పని మేలు.
74. రొట్టెలేదు గానీ, నెయ్యిఉంటే అద్దుకు తిందును- అన్నాడట.
75. రొట్టె విఱిగి నేతిలో పడ్డట్టు.
76. రొయ్యకు లేదా బారెడు మీసం.
రో
77. రోకట చిగుళులు కోసినట్లు.
78. రోకలి చిగురు పెట్టినట్లు.
79. రోకలి తూలితే చుట్టాలు వస్తారు.
80. రోకలి పోటు - దాసరి పాట.
81. రోగమంటే వచ్చింది గానీ, పాలు ఎక్కడనుంచి వస్తవి?
82. రోగము ఒకటి, మందు ఇంకొకటి.
83. రోగానికి మందుగానీ, ఆయుర్దాయానికి మందులా?
84. రోగాలలో గురక ప్రమాదం (గురక=పశువ్యాధి).
85. రోగాలు మనుషులకు గాక మాకులకు వస్తవా?
86. రోగికి కోప మెక్కువ.
87. రోగికోరింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే.
88. రోగిష్టికి పాపిష్టి కావాలి.
89. రోజులు మంచివని పగలే దొంగతనానికి బయలుదేరినట్లు.
90. రోటిని చూచి పాట పాడాలి.
91. రోటి పాట రోకటి పాట (మార్పు లేని వనుట).
92. రోటిలో తలదూర్చి, రోకటిపోటుకు వెఱచినట్లు.
93. రోతలకు రోత ముదిమి.
94. రోలు కఱ వెఱుగదు.
95. రోలుకు ఒకవైపు, మద్దెల కిరువైపుల దెబ్బలు.
96. రోలు పగిలినా లిద్దె బాగా బిగిసినది అన్నట్లు.
97. రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లు.
98. రోళ్ళు పాడినట్లా? రోకళ్ళు పాడినట్లా?
99. రోసంలేని బంటుకు మోసం లేదు.
100. రోసంలేని మూతికి మీసం ఎందుకు?
No comments:
Post a Comment