Thursday, November 10, 2011

సామెతలు 78


1. ముసలి ముప్పందాన కుసుమరోగం వచ్చినట్లు.
2. ముసలి ముప్పున తొలిసమర్త.
3. ముసలివాడయినా బసిరెడ్డే మేలు.
4. ముసలివాని మాట, ముళ్ళులేని బాట.
5. ముసుగు మూడువేలు, ముసుగులో బొమ్మ మూడు దుగ్గాళ్ళు (దుగ్గాని= రెండు దమ్మిడీలు (దువ్వలు)).
6. ముసుగులో గుద్దులాట.
7. ముహూర్తం మంచిదైతే, ఎట్లా ముండ మోసెరా? అన్నట్లు.
8. ముళ్ళుండగానే పన్నీరుపువ్వు పనికి రాకుండా పోతుందా? (పువ్వుకు పరువు తగ్గిందా?)


మూ


9. మూగవాని ముందర ముక్కు గోక్కున్నట్లు (గీరుకొన్నట్లు).
10. మూటికి ముడివేస్తే ఏమీలేదు (పెండ్లి అయిన తర్వాత).
11. మూడుకాసుల దానికి ముప్పావులా బాడుగ.
12. మూడుకొప్పులు ఒకటైతే ముల్లోకాలు ఏకమవుతవి.
13. మూడుజన్మల సంగతి చెప్పగలను, పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు, కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు, కనుక ముందు జన్మలో నాకేమీ ఉండదు.
14. మూడుతరాల దరిద్రుడు ముష్టికి వచ్చినట్లు.
15. మూడు దినాలుంటే మురికి చుట్టం.
16. మూడు దుగ్గానులకు మూతిమీసం గొరిగించుకొన్నట్లు.
17. మూడు దుగ్గానుల కోతి, ఆరు దుగ్గానుల బెల్లం తిన్నట్లు.
18. మూడు నాకి, ఆరు అతికినట్లు.
19. మూడునాళ్ళ ముచ్చటకు ఆరుజోళ్ళ చెప్పులా?
20. మూడునాళ్ళ ముచ్చటకు మురిసేవు ముందుగతి కానవు.
21. మూడునాళ్ళ భాగవతానికి మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.
22. మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కాకులు.
23. మూడు నెలలు సాముచేసి, మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు.
24. మూడు పావులాల గుడ్డ, ముప్ఫై రూపాయల కుట్టు.
25. మూడుపుట్ల చెవిటిదానికి ఆరుపుట్ల చెవిటివాడు ఆలోచన చెప్పినట్లు.
26. మూడు బోనాలు సిద్ధమైనవి, దివ్వెకట్టె ముడికి వచ్చినది, దొరగారు సువారునకు రావచ్చును (సువారము= కోటలో కొలువు).
27. మూడు మనువులు వెళ్ళినా, పొయ్యి ఊదమన్నారు.
28. మూడు మాటలలో ఆరు తప్పులు.
29. మూడు మారులు తప్పిన, ఏడు దూరాలు.
30. మూడు మూరా ఒకచుట్టే, ముప్ఫైమూరా ఒకచుట్టే.
31. మూడు మూసి ఆరు అతికినట్లు.
32. మూడువందలు పెట్టి గేదెను కొని, మూడణాలు పెట్టి తాడు కొనలేనట్లు.
33. మూడో తరగతిలో ఎందుకు ప్రయాణం చేసావంటే, నాల్గో తరగతి లేదు కాబట్టి అన్నాడట.
34. మూడో పెండ్లివాడికి ముహూర్తం కావలెనా?
35. మూతి పెట్టినవాడు మేత పెట్టడా?
36. మూతి ముద్దుల కేడిస్తే, వీపు గుద్దుల కేడ్చిందట.
37. మూతులు నాకేవాడికి మీసాలెత్తే వాడొకడా?
38. మూరెడు ఇంట్లో బాఱెడు కఱ్ఱ, ఎట్లా కొడతావో కొట్టరా మొగుడా.
39. మూరెడు పొంగటం ఎందుకు? బారెడు కుంగటం ఎందుకు?
40. మూరె డేక్కే దెందుకు? బారెడు కుంగే(దిగే)దెందుకు?
41. మూరెడు ముందుకు పోనేల? బారెడు వెనక్కు రానేల?
42. మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద.
43. మూర్ఖు డెపుడు గోరు ముదితలతో పొందు.
44. మూర్ఖునకును బుద్ధి ముందుగానే పుట్టు.
45. మూర్తి కొంచమైనా, కీర్తి దొడ్డది (పెద్దది).
46. మూల ఉండే వాళ్ళను ముంగిట్లోకి లాగినట్లు.
47. మూలాకార్తెకు వరి మూల చేరుతుంది.
48. మూలాకార్తెలో కురిస్తే, ముంగారు పాడు.
49. మూల ముంచును, జ్యేష్ట చెరచును (కురిసి).
50. మూలలో చల్లిన ఉలవలు మూడు పువ్వులు ఆరు కాయలు.
51. మూలవాన ముంచక తీరదు.
52. మూలవిగ్రహాలు ముష్టి ఎత్తుకుంటూ ఉంటే, ఉత్సవ విగ్రహాలకు దధ్యోదనమట.
53. మూలవిరాట్టు తిరిపమెత్తుకుంతుంటే, (మొత్తుకుంటుంటే) ఉత్సవ విగ్రహాలకు తెప్పతిరునాళ్ళట.
54. మూలిగిన మూతికేసి రాస్తారు.
55. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు.
56. మూలుగులు మునుపటిలాగే, భోజనాలు మాత్రం ఎప్పటిలాగే.
57. మూసిచూడను కాసులేదు, ముండను చూస్తే ముద్దొస్తుంది.
58. మూసిన ముత్యం, మాయని పగడం.
59. మూసిన ముత్యము, పాసిన పగడము.
60. మూసిన వాయనం ముత్తైదువవలె.
61. మూసిపెట్టితే పాచిపోయిందట.


మృ


62. మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును.
63. మృగశిర కురిస్తే ముసలిఎద్దు ఱంకె వేయును.
64. మృగశిరతో గూడా ముల్లోకాలు చల్లబడును.
65. మృగశిర బిందిస్తే ఇరుకార్తెలు ఎలుగిస్తవి.
66. మృగశిరలో బెట్టిన పైరు, మీసకట్టున బుట్టిన కొడుకు మేలు.
67. మృగశిర వర్షిస్తే, మఖ(ఘ) గర్జిస్తుంది.
68. మృగశిర కురిస్తే, ముంగాలి(రు) పండును.
69. మృతి దగ్గరకు వచ్చినా, సతి దగ్గరకు వచ్చినా మతి ఉండదు.
70. మృత్యువు పంచాంగం చూచి పనిచేయదు.
71. మృదు శబ్దానికి మధుశబ్దానికి భేదమేమిరా? అంటే, వట్లల్లో సుడి (వట్రుసుడి) అన్నాడట.


మె


72. మెచ్చి మేకతోలు, కోరి గొఱ్ఱెతోలు కప్పుతారు.
73. మెట్ట దున్నినవాడు, లొట్టె త్రాగినవాడు ఒకటే.
74. మెట్ట నున్నా ఏనుగే, పల్లాన ఉన్నా ఏనుగే.
75. మెట్టను మాత, పల్లాన భార్య.
76. మెట్టరైతు లొట్టెపిట్ట.
77. మెట్టినిండ్లనుండి కాన్పుకు పుట్టినిండ్లు చేరినట్లు.
78. పెట్ల చప్పుడే గానీ, దోవ జరుగదు.
79. మెడ తడవటం పూసల కొఱకే.
80. మెడనూతు(కు)ల వారింట్లో పిడిగుద్దుల సమారాధన.
81. మెడపూసలకు సమ్మసరిపోయిన బొమ్మలాట ఆడినట్లు.
82. మెడబట్టి నెట్టితే చూరుబట్టుకొని వ్రేళ్ళాడినట్లు.
83. మెడలో రుద్రాక్షలు, మదిలో మదిరాక్షులు.
84. మెతుకుపోతే బ్రతుకుపోతుంది.
85. మెతుకులు చల్లితే కాకులకు కొదువా?
86. మెత్తగా ఉంటే మొత్త బుద్ధివేస్తుంది.
87. మెత్తటి పులి, సాదు పలవ.
88. మెత్తటి పులి ధర్మ సూతి.
89. మెత్తనాళ్లు పోయినవి, చెత్తనాళ్ళు వచ్చినవి.
90. మెత్తని చోటనే గుద్దలి వాడి.
91. మెత్తని మట్టిని మోచేతితో త్రవ్వినట్లు.
92. మెత్తనిమాట లాడరా అంటే, దూది వెన్నపూస అన్నాడట.
93. మెత్తనివాడిని చూస్తే మొత్త బుద్ధివేసినట్లు.
94. మెత్తలు ఎందకువేస్తే, మెడల నొప్పులు పోతాయా?
95. మెఱుగు వేయనిదే మృదువు రాదు (మెఱుగు=చమురు, నెయ్యి).
96. మెఱుగు వేయనిదే మెఱుగు రాదు.
97. మెఱుపుకొద్దీ వర్షము.
98. మెఱుపు దీపంగాదు, మబ్బు గొడుగు కాదు.


మే


99. మేక ఆకులు మేయగానే ఉపవాస మగునా?
100. మేకకు ఙ్ఞాపకముండేది మేత ప్రసంగమే (సంగతే).

No comments: