Friday, May 30, 2008

సామెతలు 3

1. అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
2. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
3. అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
4. అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
5. అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?
6. అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.
7. అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.
8. అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.
9. అబ్బాయి పోతురాజు, అమ్మయి గంగానమ్మ.
10. అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.
11. అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.
12. అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
13. అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
14. అభ్యాసం కూసువిద్య.
15. అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.
16. అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
17. అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
18. అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
19. అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
20. అమ్మతాపెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
21. అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
22. అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.

23. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
24. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు.
25. అమ్మ పెట్టేవి నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
26. అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
27. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
28. అమ్మయినా అడగందే పెట్టదు.
29. అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
30. అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
31. అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
32. అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
33. అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
34. అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
35. అయితే అమీరు, కాకుంటే గరీబు.
36. అయిన పెండ్లికి మేళమా?
37. అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
38. అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
39. అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.
40. అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.
41. అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.
42. అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.
43. అయినవాళ్ళను అవతలకి నెట్టి కానివాళ్ళ కాళ్ళు పట్టుకొన్నట్లు.
44. ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
45. అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
46. అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
47. అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
48. అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
49. అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
50. అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
51. అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
52. అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
53. అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం.
54. అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
55. అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
56. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
57. అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
58. అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
59. అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
60. అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
61. అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
62. అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
63. అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
64. అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
65. అరిచే కుక్క కరవదు.
66. అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
67. అరచేతిలో వైకుంఠం చూపినట్లు.
68. అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు.
69. అరటికాయ ఆరునెలల రోగం.
70. అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
71. అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
72. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
73. అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
74. అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
75. అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
76. అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
77. అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
78. అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
79. అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
80. అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
81. అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
82. అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
83. అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.
84. ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.
85. అలంకారం కంటె, అయిదవతనం మేలు.
86. అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
87. అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
88. అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.
89. అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
90. అలవి మీరితే అమృతం అయినా విషమే.
91. అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.
92. అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.
93. అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.
94. అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి.
95. అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
96. అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.
97. అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
98. అల్పనరులకెల్ల నతివలపై చింత.
99. అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
100. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.

2 comments:

Unknown said...

మీ సామెతలు-3 చూసాను.సామెతలు ముఖ్యంగా ఆడవారి ద్వారా వ్యాప్తి చెందు తుంటాయి.అన్నమయ్య కూడా తన కీర్తనలలో ఎన్నో వందల,వేల సామెతలనీ,జాతీయాలను ఎన్నో సందర్భాలకి అనువుగా వ్రాసారు.వాటిలో చాలా వాటిని ఒక చోటికి చేర్చి కూర్చాలని అన్నమయ్య పలుకు బడులు పేరుతో బ్లాగు ప్రారంభం చేసాను.వీలైతే చూడగలరు.

Rathnashikamani said...

తెలుగు సామెతల సంకలనంలో మీ కృషి మెచ్చుకోతగ్గది.

ఒక సలహా ...

సామెతల వరుసక్రమం , జాబితాలో ఏరోజుకారోజు ఒకటినుండి కాకుండా, మొదటి పేజీనుండే ఆరోహణ క్రమంలో ఉంచితే ఎప్పటికప్పుడు మొత్తం ఎన్ని సామెతలో తెలిసేది.