Tuesday, March 29, 2011

సామెతలు 43


1. తిండికి ముందు కోపు, పనికి వెనుక కోపు (కోపు=పార్శ్వము, ప్రవేశము).
2. తిండికి ముండు, దండుకు వెనుక.
3. తిండికి ముందెత్తు, పనికి వెనకెత్తు.
4. తిండికి లేకపోయినా తిక్కకేమి లోటు?
5. తిండికి వచ్చినట్లా? తీర్ధానికి వచ్చినట్లా?
6. తిండి చింత, దండి చింత.
7. తిండిబోతు సంగతి పెండ్లామేరుగు.
8. తింత్రిణీక మహిమ తినువా డెరుంగును.
9. తిండిలేనమ్మ తిరనాళ్ళకు పోతే ఎక్కా దిగా సరిపోయింది.
10. తిక్కపిల్ల తీర్ధంపోతూ, అక్కమొగుడిని వెంటబెట్టుకు పోయిందట.
11. తిక్కప్ల్లా! తిక్కపిల్లా! మా అక్కపిల్లను చూస్తివా అంటే, చూస్తి- శుక్రవారమని కావలించుకొంటి, మాటలాడుదామంటే మఱచిపోతి అన్నదిట.
12. తిక్కలవాడు తిరనాళకు పోతే, ఎక్కాదిగా ఏడునాళ్ళు పట్టిందట.
13. తిట్టకురా తత్తుకొడుకా అన్నట్లు.
14. తిట్టబోతే అక్కబొడ్డ, కొట్టాబోతే వేకటి మనిషి (వేకటి మనిషి=గర్భిణి).
15. తిట్టితే చచ్చినవాడు లేడు, దీవించితే బ్రతికినవాడు లేడు.
16. తిట్టితే కోపం, కొట్టితే నొప్పి.
17. తిట్టితే గాలికి పోతవి, తింటే లోనికి పోతవి.
18. తిట్టుకొక శృంగారమా?
19. తిట్టే నోరు కొ(కు)ట్టినా ఊరకుండదు.
20. తిట్టె నోరు, తినే నోరు, తిరిగే కాలు ఊరకుండవు.
21. తిత్తికాసులు జెల్లె, తిడునాళ్ళ జెల్లె.
22. తినక చవి, చోరక లోతు తెలియవు.
23. తినకుండా రుచులు, దిగకుండా లోతులు తెలియవు.
24. తిన కూటికి దారిలేదు కానీ,; తనవారికి తద్దినాలట.
25. తినగతినగ వేము తియ్యనై యుండును.
26. తినగల అమ్మ తిండి తీర్ధాలలో బయటపడుతుంది.
27. తినగా తినగా గారెలు చేదు.
28. తినబెట్తమంటే, వినబెట్ట మన్నట్లు.
29. తినబోతూ రుచులడిగినట్లు.
30. తిననేర్చినమ్మ పెట్టనేరుస్తుంది.
31. తిమమంటే పులివల్లదు.
32. తినమరిగిన కుక్క రేవు కాసిందట.
33. తినమరిగిన కుక్క అలమరిగి చచ్చిందట.
34. తినమరిగిన కోడి అలమరిగినదట. (అలమరుగు= అలమటించు)
35. తిమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట.
36. తినమరిగిన ప్రాణం అల్లాడి చచ్చిందట.
37. తిమమరిగినమ్మ వరిమడి దోవ పట్టినట్లు.
38. తినా కుడువా తీర్ధం పోవాలి, తిండికి మాడ పెండ్లికి పోవాలి.
39. తినాలేదు పట్టాలేదు బొట్టైనా పెట్టుకో.
40. తిని ఉండలేను, తీసి బొందవెట్టు.
41. తిని ఉండలేక, తాగి బొందను పడినట్లు.
42. తిని కుడువ వలె, ఋణాలు పోవలె, పనిజేయి పెండ్లికి పోవలె.
43. తినేకూటిలో మన్ను పోసుకొన్నట్లు.
44. తినేది కుడుచేది తిమ్మక్క, మోసుకు తిరిగేది మొఱ్ఱెక్క.
45. తినేది కుడిచేది (పెట్టేది) రెడ్డిసాని, (కనేది) కట్టేది గుడ్డిపోలి (కట్టుట= పశువుల గర్భధారణ).
46. తినేది గొడ్డుమాంసం, చేసేది దేవతార్చన.
47. తినేవరకు ఆకలికుట్టు, తిన్నతర్వాత దండికుట్టు.
48. తినేవి తిప్పకాయలు, వెళ్ళగ్రక్కేవి వెలగకాయలు.
49. తిన్న ఇంటి వాసాలు (లెక్కపెట్టు) ఎంచుతావేమిరా? అంటే పొరుగింటి సంగతి నాకేమి తెలుసు అన్నాడట.
50. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
51. తిన్న ఇల్లు గుద్దలించా వేమిరా? అంటే, తినని ఇంట్లోకి రానిస్తారా అన్నాడట.
52. తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కను కట్టేసినారంట.
53  తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కకు కాలు విరిగకొట్టినట్లు.
54. తిన్నవాడే మన్నవాడు, మన్నవాడే మహరాజు.
55. తిన్నోడికి తిండిబెట్టడాం, బోడిగుండోడికి తలకుబోయడం సులభం.
56. తిప్పులాడీ! మా అవ్వను చూచినావా? అంటే, తీర్ధంలో మా బావను చూచినావా అన్నదిట.
57. తిమ్మన బంతికి తియ్యని చారు-అన్నము (తిమ్మన్న=తిరుమల అన్న, వేకటేశ్వరుడు; కోతి).
58. తిమ్మన్న బంతికి రమ్మంటారు కాబోలు.
59. తిమ్మన్న! తిమ్మన్న! నమస్కారమంటే, నా పేరు నీకెలా తెలిసింది అంటే, నీ ముఖం చూడగానే తెలిసింది అన్నాడట.
60. తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు.
61. తియ్యగా తియ్యగా రాగం, మూల్గగా మూల్గగా రోగం.
62. తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెతీగ కుట్టేది.
63. తిరిగి ఆడుది, తిరుగక మగవారు చెడుదురు.
64. తిరిగితే వరిపొలం, తిరుగకపోతే అడవిపొలం.
65. తిరిగి రైతు, తిరుగక బైరాగి చెడుదురు.
66. తిరిగివచ్చిన భార్య, తిరుగబోత (తిరుగమూత) వేసిన కూర బహురుచి (తిరుగబోత=తిరుగమాత=పోపు).
67. తిరిగేకాలు తిట్టె నోరు ఊరుకోవు.
68. తిరిపం పెట్టె అమ్మను మగనితోపాటు పెట్టమన్నట్లు.
69. తిరివపుకూడు బర్కతు లేదు, తిన్నవఱకు నమ్మిక లేదు (బర్కతు=క;అసివచ్చుట).
70. తిరివపు మజ్జిగకు వచ్చి, పాడిగేదెను బేరమాడినట్లు.
71. తిరిప మెత్తేవానికి పెఱుగన్నం కరవా?
72. తిరిపెపు అనుభవం తమి దీరదు.
73. తిరిపెపు తిండి తింటే, మిట్టచేనుకు ఒడ్డువేసినట్లుండాల (ఎగదన్ని ఉండును).
74. తిరిపెమున లేమి తీరుతుందా?
75. తిరునాళ్ళకు (తీర్ధం) పోతూ తీసిపొమ్మన్నారు. పెండ్లికిపోతూ పెట్టుకో పొమ్మన్నారు.
76. తిరుగనేర్చినవాడు ధీరుడై యుండురా.
77. తిరుగ మరిగిన కాలు, తినమరిగిన నోరు ఊరుకోవు.
78. తిరునాళ్లకు పోయివచ్చిన మొగం మాదిరి (అలసి సొలసి వచ్చును).
79. తిరుపతి పోగానే తురక దాసరి కాడు.
80. తిరుపతిలో పుట్టగానే దున్న గోవిందా అంటుందా?
81. తిరుమణి పెట్టనేరిస్తే తీర్థాలు గడచినట్లు.
82. తిరుమల్లయ్య సలహా, తిరుపతి వెంకన్న మ్రొక్కు.
83. తిలాపాపం తలో పిడికెడు.


తీ


84. తీగంటి (తీగవంటి) బిడ్డంటే, తెగ తెమ్మని ఏడ్చినదట.
85. తీగ కదిలిస్తే, పొదంతా కదులుతింది.
86. తీగకు కాయ బరువా?
87. తీగ పెట్టినమ్మ మాట తియ్యగా, కమ్మపెట్టినమ్మ మాట కమ్మగా, విచ్చుటాకులున్నమ్మా! నీమాట విన సహించదు అన్నదట.
88. తీగై వంగంది, మానై వంగుతుందా?
89. తీటగలదానికి, తోటగలవానికి తీరిక ఉండదు.
90. తీటబుట్టినవాడే గోక్కుంటాడు.
91. తీటమ్మా! తీటమ్మా! నీ నొసలేమయ్యింది అంటే, తిరుమణి పెడితే పొక్కింది అందిట.
92. తీట సిగ్గెరుగదు.
93. తీతువపిట్ట కాళ్ళు తలక్రిందులుగా పెట్టి ఆకాశం పడకుండా చూస్తానన్నదిట (పట్టుకున్నానందట).
94. తీతువపిట్ట రాయబారం (దుశ్శకునం).
95. తీపి ఏదంటే- ప్రాణం.
96. తీపునంటి ఈగ తెగువతో నీల్గును.
97. తీపుల మాటలకు వీపులు గుంజుతవి.
98. తీయడం పెట్తడం తీపులచేటు కనటం, కూచోవటం నొప్పులచేటు.
99. తియ్యని నోర చేదు మేసినట్లు.
100. తీరుతీరు గుడ్డలు కట్టుకొని తిరునాళ్ళకుబోతే, ఊరికొక గుడ్డ ఊసిపోయిందట.

Friday, March 11, 2011

సామెతలు 42


1. తాటంత వానిని తలదన్ను వాడుంటాడు
2. తాటాకు చప్పుళ్ళకు కుండేళ్ళూ బెదరునా?
3. తాటికాయ తింటావా? తలకొట్లు పడాతావా?
4. తాటికాయ వన్నె తప్పుడిది.
5. తాటిచెట్టు ఎక్కలేవు, తాటిగెల కోయాలేవు. తాతా నీకెందుకోయ్ పెండ్లాము.
6. తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.
7. తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్న ముండా పెండ్లాం కాదు.
8. తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్నవాడు మొగుడూ కాదు.
9. తాటిచెట్లకు గంధం పూసినట్లు.
10. తాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రునికి గంజన్నము (గంజికూడు).
11. తాటిఎత్తు ఎగిరినానంటే తారాజు(చు)వెత్తు ఎగురు అన్నట్లు.
12. తాడినెక్కేవాడిని ఎంతదాకా ఎగసనదోత్తారు?
13. తాడికి తలబంటి అయితే (వె)ఎంపలికి ఎంతబంటి? అన్నట్లు.
14. తాడి తన్నివానిని తలతన్నే వాడుకూడా ఉంటాడు.
15. తాడు అని ఎత్తిపారేయకూడాదు, పాము అని దాటనూకూడదు.
16. తాడుకు పట్టలేదు, తలుగుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజలాత?
17. తాడుతెంచను ముహూర్తమెందుకు?
18. తాడుతో దబ్బనము.
19. తాడూలేదు, బొంగరమూ లేదు.
20. తాడులేకుండా బొంగరం తిప్పేవారు.
21. తాత కట్టిన చెరువని దూకుతారా?
22. తాతకు దగ్గులు నేర్పినట్లు.
23. తాతా తాత! తంగెడుపుల్ల, ధు(ద)సినీ యక్క, కుందేలుపిల్ల.
24. తాతదిన్న బొచ్చె తరతరా లుంతురా?
25. తాతపోతే బొంత నాది.
26. తాడుతెగిన గాలిపటం.
27. తాడులేకుండా బొంగరం ఆడించేవాడు.
28. తాతను చూపుతావా? తద్దినం పెడతావా?
29. తాతలనాటి బొచ్చె తరతరాలకు.
30. తాతలనాటి మూకుడు తరతరాలు మనాలన్నట్లు.
31. తాతలనాడు నేతులుతాగాం, మూతులు వాసన చూడు.
32. తాతాచార్ల తద్దినానికి, పీర్లపండుగకు ఏమి సంభందం?
33. తాతాచార్యులవారి ముద్ర భుజంతప్పినా వీపు తప్పదు.
34. తాతాచార్యు లేం జేస్తున్నారంటే, తప్పులు (వ్రాసి0 చేసి దిద్దుకుంటున్నారు.
35. తాతా పెండ్లాడుతావా అంటే, నా కెవరిస్తారురా అబ్బాయి అన్నాడట.
36. తాతా సంక్రంతి పట్టు పట్టు.
37. తాతా సంధ్య వచ్చునా? అంటే, ఇప్పుడు చదువుకొన్న నీకే రాకపోతే అరవైఏళ్ళక్రితం చదువుకొన్న నాకు వచ్చునా అన్నాడట.
38. తా త్రవ్విన గోతిలో తానే పడతాడు.
39. తా దిన తవుడులేదు, వారాంగనకు వడియాలట.
40. తాదూర సందులేదు, మెడకొక డోలు అన్నట్లు.
41. తాను ఆడుదై గూడ నానబ్రాల కేడ్చిందట (నానబ్రాలు=బియ్యం నానబెట్టి బెల్లం, కొబ్బెర కలిపి తిను తినుబండారం)
42. తాను ఆడుదై నానబ్రాల కేడ్వవలెనా?
43. తాను ఉండేది దాలిగుంట పట్టు, తలచేవి మేడమాళిగలు.
44. తాను ఎఱుగని కల్ల లేదు, తల్లి ఎఱుగని కులం లేదు.
45. తాని ఒకటి తలిస్తే దైవ మింకొకటి తలచినట్లు.
46. తానుగాక పిల్లి కూడానా?
47. తాను చావడం జగం క్రుంగడ మనుకున్నదట ఒకనక్క.
48. తాను చేసిన పాపం తనువుతో, తల్లి చేసినపాపం ధరణితో.
49. తాను చొక్కమైనట్లు, తడక భద్రమైనట్లు.
50. తాను దూరనే కంత లేదు, మెడకొక డోలా?
51. తాను దొంగై, ఇంటిపై అనుమానపడినట్లు.
52. తను దొంగైతే, ఇరుగు పొరుగును నమ్మడు.
53. తాను పతివ్రత అయితే, సాని ఇంత కాపురముంటే మాత్రమేమి?
54. తాను పెంచిన పొట్టేలు తనచేతనే చచ్చినట్లు.
55. తాను పెంచిన పొట్టేలు తన్నే తఱిమి పొడిచినట్లు.
56. తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.
57. తాను మింగేదాన్ని, తన్ను మింగేదాన్ని చూచుకోవలె.
58. తాను మెచ్చ తినాలి, ఒకరు మెచ్చ నడవాలి.
59. తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ.
60. తానే తుమ్మి, తానే దీవించుకొన్నట్లు.
61. తానే తుమ్మి, తానే శతాయుస్సు అనుకొన్నట్లు.
62. తానే శెట్టి అంటే, మూడే గిద్దలంటాడు.
63. తానే సెట్టి అంటే, మూడే సోలలు అమ్మినాడట.
64. తానై మాగని కాయ, తంతే మాగునా?
65. తానొకటి తలచిన దైవమొకటి తలచు.
66. తాపుల గొడ్డుకు రోలడ్డమా?
67. తా బెట్టుకోనిది భిక్షమా?
68. తా బోతూ బొల్లెద్దుకు కుడితి అన్నట్లు.
69. తా బోతే తాడు దొరకదుగానీ రాయరా సన్నాలకు చీటీ అన్నాడట.
70. తా బోతే మజ్జిగ చుక్కకు గతిలేదు, చీటీవస్తే పెరుగు పంపుతారన్నట్లు.
71. తామరాకుపై నీటిబొట్టు వలె
72. తామసంబు నెంచు ధరలోన నధముండు.
73. తాయిత్తులకే పిల్లలు పుడితే తా నెందుకు?
74. తార్చినదానికి టంకము, వెళ్ళినదానికి ఏగాని.
75. తాలిమి తన్ను కాచును, ఎదరినీ కాచును.
76. తాలుకంకి గింజలోయి దాసరీ ! అంటే రాలినవఱకే గోవిందా ! అన్నాడట (తాలు=నీళ్ళులేక ఎండిపోయిన వరి కర్ర, అదివేయి తరకగింజల వెన్ను).
77. తాలువడ్లకు నీళ్ళ కల్లుకు సరి.
78. తాళపుచెవి లేక తలుపెట్టు లూడురా?
79. తాళము నీవద్ద, చెవి నావద్ద.
80. తాళ(చెవి)ము పోయినంత మాత్రాన పెట్టి తెరువలేమా?
81. తాళిదెంచను శుభలగ్నము కావలెనా?
82. తాళిబొట్టు బలంవలన తలంబ్రాలవరకు బ్రతికినాడు.
83. తాళ్ళకు తలబంటి అంటే, వెంపలికి ఎంతబంటి అన్నాడట.
84. తాళ్ళకు తలను చండ్లు, మేకలకు మెడను చండ్లు.
85. తాళ్ళపాక చిన్నన్న రోమములు కాగానే తంబూరా దండెకు తంతులగునా?
86. తాళ్ళపాకవారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత.


తి


87. తింటే ఆయాసం, తినకుంటే నీరసం.
88. తింటే కదలలేను, తినకుంటే మెదలలేను.
89. తింటేగానీ రుచి తెలియదు, దిగితేగానీ లోతు తెలియదు.
90. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి.
91. తింటే బఠాణ, వింటే అఠాణ (రాగం).
92. తింటే భుక్తాయాసం, నడీస్తే మార్గాయాసం.
93. తింటే నారసం, తినకపోతే నీరసం.
94. తింటే మీగడ తినాల, వింటే బేగడ వినాల (రాగం).
95. తిండికి ఏనుగు, పనికి పీనుగు.
96. తిండికి చేటు, నేలకు బరువు.
97. తిండికి ఠికాణా లేదు, ముండకు బులాకి అట.
98. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.
99. తిండికి తీటకు మేరలేదు.
100. తిండికి పిడుగు, పనికి బుడుగు.

Saturday, March 5, 2011

సామెతలు 41

1. తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?
2. తల్లి కడుపు చూచును, పెళ్ళాం వీపు(జేబు) చూచును.
3. తల్లి కడుపులోచోరక ముందు దెయ్యాల దేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత.
4. తల్లి కాకపోతే తిళ్ళికకు దణ్ణం పెట్టమన్నారు.
5. తల్లికి కానినాడు దాదికవునా?
6. తల్లికి కూడుపెట్టనివాడు తగుదునని తగవు తీర్చవచ్చాడట.
7. తల్లికి కూడు పెట్టనివాడు తగవు చెప్పేడు (చెప్పును), పెళ్ళానికి చాలనివాడు పెత్తనం చేసేడు (చేయును).
8. తల్లికి కూడు పెట్టనివాడు పినతల్లికి చీరపెట్టాడుట.
9. తల్లిని కొట్టరా వసంతం అన్నట్లు.
10. తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి.
11. తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్పసమానం(శష్ప మర్యాద).
12. తల్లికి బొల్లి ఉంటే, పిల్లకు చుక్కయినా ఉంటుంది.
13. తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?
14. తల్లికి వంచగలిగిన పిల్లకు బొక్క కలుగుతుంది (బొక్క=మూలుగ ఎముక).
15. తల్లి కొద్ది బొల్లి కోడె.
16. తల్లిగండం, పిల్లగండం ఉన్నదికానీ, మధ్యన మంత్రసాని గండమున్నదా?
17. తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా.
18. తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?
19. తల్లి గూనిదయితే తల్లిప్రేమ గూనిదవుతుందా?
20. తల్లిగుణము కూతురే బయటపెడుతుంది.
21. తల్లి చచ్చినా మేనమాముంటే చాలు.
22. తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానము.
23. తల్లిచస్తే కడుపు పెద్ద, తలలు మాస్తే కొప్పు పెద్ద.
24. తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణంబాసె.
25. తల్లి చస్తే నాలిక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళుపోయినట్లు.
26. తల్లి చాలి పిల్లకు తప్పుతుందా?
27. తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు).
28. తల్లి చెవులు తెంపినవానికి, పినతల్లి చెవులు బీరపువ్వులు.
29. తల్లి చేను మేస్తే, పిల్ల మేర మేస్తుందా?
30. తల్లి చేల్లో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా?
31. తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండప్రదానమట.
32. తల్లితండ్రీ లేని బాల తననాధునే కోరును.
33. తల్లితండ్రులు, అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొదవే.
34. తల్లిదే సంరక్షణ, ధరణిదే వలపక్షం.
35. తల్లి దైవము, తండ్రి ధనము.
36. తల్లిని చూచి పిల్లను, పల్లును చూచి పశువును కొనవలె.
37. తల్లిని చూచి పిల్లను, తరిని జూచి బఱ్ఱెను (తరి= వెన్న ఎక్కువగా కలిగిన పాలు).
38. తల్లిని చూచి పిల్లను, పాడిని (పొదుగును) జూచి బఱ్ఱెను.
39. తల్లిని తిట్టకురా నీయమ్మనాయాల అన్నట్లు.
40. తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు.
41. తల్లిబట్టి పిల్ల, విత్తునిబట్టి పంట.
42. తల్లిబట్టి పిల్ల, నూలునుబట్టి గుడ్డ.
43. తల్లిపాలు దూడ చెప్పును.
44. తల్లి పిత్తి పిల్లమీద పెట్టిందట.
45. తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్ట దిక్కులేదు.
46. తల్లి పుట్టిల్లు మేనమామ వద్ద పొగడినట్లు.
47. తల్లి పుస్తి బంగారమైనా అగసాలి దొంగిలించకుండా ఉండలేడు.
48. తల్లి పెంచవలె, ధరణి పెంచవలె గానీ పెరవారు పెంచుతారా?
49. తల్లి పైచేయిజూచు తగు పంటలల్లూరు.
50. తల్లిమాటలే గానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది).
51. తల్లి ముఖం చూడని బిడ్డ, వానముఖం చూడని పైరు.
52. తల్లిమీది కోపం పిల్లమీద పోతుంది.
53. తల్లిలేక పెరిగి ధాత్రి నెట్లేఎరా?
54. తల్లిలేని పిల్ల - ఉల్లి లేని కూర.
55. తల్లిలేని పిల్లలు, అల్లులేని తీగలు.
56. తల్లిలేని పుట్టిల్లు, ఉల్లిలేని కూర.
57. తల్లి విషం, పెండ్లాం బెల్లం.
58. తల్లి వెనుక మేనమామ అన్నారు.
59. తల్లి సారం పిల్ల, దాకసారం సక్కు.
60. తల్లిలేని పిల్ల దెయ్యాల పాలు.
61. తల్లీ, బిడ్డా ఒకటైనా, నోరు కడుపు వేరు.
62. తల్లె కొట్టినా పెండ్లే, తప్పెట కొట్టినా పెండ్లే.
63. తల్లే రోసిన దాది రోయదా?
64. తవిటికి వచ్చిన చెయ్యే ధనానికి వస్తుంది.
65. తవుటికి ఱంకాడబోగా కూటితపిలె కోతిగొంపోయినట్లు.
66. తవుడు తాతా! అంటే, నూకలా ముసలమ్మా? అన్నట్లు.
67. తవుడు తింటూ ఒయ్యారమా?
68. తవుడుతిని చచ్చేవానికి విషంపెట్టేవాడు వెఱ్ఱి.
69. తవుడు నోముపట్టిన అమ్మకు తరగని ఐదవతనము.
70. తవుడూబొక్క తహసిల్దారుడు, మీసాలెగబెట్ట మాసూలుదారుడు (మాసూలు దారుడు= రైతుల దగ్గర ధాన్యరూపకంగా శిస్తు వసూలుచేయు ఉద్యోగి).
71. తవుడు బొక్కినంతవరకే దక్కినట్లు.
72. తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుంది.
73. తవ్వి మీద తోసుకున్నట్లు.


తా


74. తాకట్ల మొగుడా! తంటాల మొగుడా! నీ తనువుండగానే నన్ను మనువిచ్చి పోరా.
75. తాకబోతే తగులుకున్నట్లు.
76. తాకున కాలికే బుడుసు(పు), తెగిన తాటికే ముడుసు (బుడుసు=బొబ్బ, ముడుసు=ముడి).
77. తాకిన వేలికే తట్టు తగులుతుంది.
78. తాకితే తగరు, ఈనితే గొఱ్ఱె.
79. తాకి నేలకు తడిబ(బొ)ట్టు కానీదు, వంగి నేలకు ఇంగువ కానీదు.
80. తాకి మొగ్గి తడిసి గుడిసె కప్పు (తాకి=అనుభవం కలిగి).
81. తాకి మ్రొగ్గిన తనువంత ఒకటి, దీపము నులిపిన దినుసంత ఒకటి.
82. తాగటానికి దప్పిక (గంజి) లేదుగానీ గుంటడికి గుండుజోడు.
83. తాగనేరని పిల్లి బోర్ల పోసుకొన్నట్లు.
84. తాగబోతే దప్పికకు లేదుకానీ, తలకు అటకలి (అటకలి=తలస్నానానికి మేలైన చమురు).
85. తాగబోతే మజ్జిగలేదంటే, పెరుగుకు చిట్టి వ్రాయమన్నాడట.
86. తాగితేగానీ మొగ్గడు, తడిస్తేగానీ కప్పడు.
87. తాగిన దుక్కి తప్పక పండును (తాగిన=నీరుబాగా పీల్చిన)
88. తాగినవాడి తప్పుకు తగవు లేదు.
89. తాగినవాడు తప్పినవాడు ఒకటే.
90. తాగినవానిదే పాట, సాగినవానిదే ఆట.
91. తాగినవానిమాట దబ్బరగాదు.
92. తాగిన రొమ్మే గుద్దినట్టు.
93. తాగుటకు ముందు, వ్రాతకు వెనుక చూడవలె.
94. తాగుబోతు తోడు కోరతాడు.
95. తాగేది దమ్మిడి గంజాయి, ఇల్లంతా చెడ ఉమ్ములు.
96. తాగేవాడే తాళ్ళపన్ను కట్టుతాడు.
97. తాగేది గంజైనా స్నానమాడి తాగు; కట్టేది చింపైనా ఉతికికట్టు.
98. తాచుపాము తామసము, జఱ్ఱిపోతు పిరికితనము కలవాడు.
99. తాచెడ్డకోతి వనమెల్లా చెరిచె.
100. తాచెడ్డ ధర్మం, మొదలుచెడ్డ బేరం.