Saturday, January 7, 2012

సామెతలు 87


1. విత్తంకొద్దీ విభవము! విద్య కొద్ది వినయము.
2. విత్తకుండానే కోస్తా మన్నట్లు.
3. విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?
4. విత్తనం మళ్ళితే, విడవకుండా ఏడేండ్లు సేద్యం చెయ్యమన్నారు.
5. విత్తనముకొద్ది మొక్క.
6. విత్తనములో లేనిది విశ్వంలో లేదు.
7. విత్తనము వేసి, పొత్తు కలిపినట్లు.
8. విత్తనానికి దాపరికం (గుట్టు), విద్యకు వెల్లడి (రట్టూ) అవసరం.
9. విత్తనాలకు పోయిన రెడ్డి, ఓదెలెత్తగా వచ్చినాడట (ఓదె=పైరుకోసి ఎండుతకు కయ్యలో బారులు బారులుగా వేసినవి).
10. విత్తనాల సంచులు మంచివయితే, విత్తపుసంచులు నిండును.
11. విత్తనా లుంటేనే పెత్తనాలు.
12. విత్తహీనుడు ధర్మవృత్తి దలచు.
13. విత్తిన కొలది పైరు.
14. విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకొకటి మొలచునా?
15. విత్తుకన్నా క్షేత్రం మెరుగు.
16. విత్తుకు వేయి విత్తులు.
17. విత్తుటకు శుక్రవారం, కోతకు గురువారం.
18. విత్తు మంచిదయితే కాయా మంచిదగును.
19. విత్తు మంచిదయితే రైతుకు మంచిదగును.
20. విత్తు ముందా? చెట్టు ముందా?
21. విత్తులు దీసిన కోడె - యీకలు పెరికిన కోడి.
22. విత్తే చెట్టయ్యేది.
23. విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తనకు తానే కనబడతాడు.
24. విద్యాప్రసంగముల్విన రసఙ్ఞతలేని రసికుల సభ, సభగాదు గ్రామరచ్చ గాని.
25. విధవకు తలసుళ్ళు వెదకినట్లు.
26. విధవకు మ్రొక్కితే ' నావలనే వెయ్యేళ్ళు వర్థిల్ల ' మన్నది, రెండోసారి దండం బెట్టితే, 'నా మొగుడు మాదిరే బ్రతుక ' మన్నదిట.
27. విధవకు విరజాజి పూదండ కావలెనా? (లేల?)
28. విధవైన మేలు, మగనికి తిథిబెట్టును, కథలు వినును, తీర్థము లాడున్.
29. విధి వస్తే పొదలడ్డమా?
30. వినకు, అనకు, కనకు (చెడ్డవి).
31. వినయోక్తులు లేని ఈవి వ్యర్థము.
32. వినరాదు, కనరాదు, అనరాదు (చెడ్డ).
33. వినని బంటుకు వెన్నపూస కూడానా?
34. వినను కనను రెండేసి ఇచ్చి, అనను ఒకటే ఇచ్చినాడు - దేవుడు (చెవులు, కన్నులు, నాలుక; అంటే ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాల అనుట).
35. వినయం లోకవశీకరం, విద్య రాజవశీకరం.
36. వినాయకుడిమీద భక్తా, ఉండ్రాళ్ళమీది భక్తా?
37. వినాయకుని చేసియిస్తావా కుమ్మరీ అంటే, వాడి అబ్బను చేసిస్తానని లింగం చేసి యిచ్చినాడట.
38. విని రమ్మంటే తిని వచ్చినట్లు.
39. వినేవాటికి (చెవులకు) కనేవాటికి (కంద్లకు) బెత్తెడే దూరం.
40. విన్న మాటకంటే చెప్పుడు మాటలు చెడ్డవి.
41. విన్నమాట కన్నంత నమ్మదగింది కాదు.
42. విన్నమ్మ వీపు కాలింది, కన్నమ్మ కడుపు కాలింది.
43. విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించినవన్నీ వెలిబుచ్చవద్దు.
44. విప్రహస్తము వేదాండ హస్తము ఊరుకోవు.
45. వీభూది పట్టెలు పెట్టుకుంటే, విష్ణుమూర్తి వనుకున్నానే, ఆంజనేయుడివటోయ్! వెంకటేశ్వర్లు.
46. వియ్యంకునికి వీపుదెబ్బలు, వియ్యపురాలికి వీపుదెబ్బలు.
47. వియ్యపురాలికి వీపుదెబ్బ, నాకు తోపుదెబ్బ.
48. వియ్యపురాలి పేరు విసరమ్మ, నాపేరు దంచమ్మ (విసరు+అమ్మ; దంచు+అమ్మ).
49. వియ్యపువారింట జాడ్యాలు ఇకిలించినా పోవు.
50. వియ్యానికి కయ్యం తోబుట్టువు.
51. వియ్యానికయినా, కయ్యానికయినా సాటి ఉండాల.
52. వియ్యానికి కయ్యానికి సమతవలయు.
53. వియ్యాలందితే కయ్యా లందుతవి.
54. వియ్యాలవారింటికి పోతే వీపులమీదనే వస్తుంది (స్పొటకం).
55. విరచుకొని విరచుకొని వియ్యపురాలింటికి పోతే, పలుగురాళ్ళతో నలుగు పెట్టిందట.
56. విరామం లేని పశువుకు ఊరట లావు.
57. విరాలికి ఆమనివంటి చుట్టము లేదు.
58. విరిగిన వేలుమీద ఉచ్చ పోయనివాడు, వినాయకుడికి టెంకాయ కొడతాడా?
59. విరిగేదాని కంటే వంగేదే మేలు.
60. విరజాజి పూదంద విధవకేల?
61. విరి దాస్తే తావి దాగుతుందా?
62. విరుగుబాటు పైని నూనెబొట్టు, విరచికట్లపైని పెరుగుబొట్టు.
63. విరోధికి అపశకునం కలిగించను, తనముక్కు కోసుకొని ఎదురుపడినాడట.
64. విలుచుటకు ముందే విక్రయించే సులువు చూడాలి.
65. విల్లమ్ములు కలవారికి చల్లకడవలవారు తోడా?
66. విశాఖ (కార్తె) కురిసిన, విషము పెట్టినట్లు.
67. విశాఖ చూచి విడువర కొంప (ఉత్తరజూచి ఎత్తర గంప).
68. విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లు.
69. విశాఖ్స్యో మబ్బులు, మజ్జిగతో భోజనం సరి.
70. విశాఖతో మేఘాలు, ప్రసూతితో యవ్వనము సరి.
71. విశాఖ వరదలు - సంక్రాంతి మబ్బులు.
72. విశేషము లేనిది వింతెలా పుడుతుంది?
73. విశ్వాసం తప్పిన పీనుగు మోసినవాడిని పట్టిందట.
74. విషపాళపు విత్తు, నేపాళపు గింజ.
75. విషములో పుట్టిన పురుగుకు విషమే ఆహారం.
76. విషములో పుట్టిన పురుగు విషములోనే జీవిస్తుంది.
77. విషయం లేని వక్తకు వాగాడంబరం ఎక్కువ.
78. విషానికి విషమే విరుగుడు.
79. విసరగా, విసరగా ఒక రాయి, తిట్టగా తిట్టగా ఒక తిట్టు తగులును.
80. విసిరిన రాయి గాలికి పోయినట్లు.
81. విసరురాయి గాలికికొట్టుకపోతే, విస్తరాకు సంగతి చెప్పాలనా?
82. విస్తరి(ర) కొదవా, సంసారపు కొదవా తీర్చేవారెవరు?
83. విస్తరి చిన్నది, వీరమ్మ చెయ్యి పెద్దది.
84. విస్తళ్ళు ఎత్తమంటే, భోంచేసిన వారెందరని లెక్కబెట్టినాడట.
85. విస్సన్న చెప్పినదే వేదం.


వీ


86. వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకొన్నట్లు.
87. వీధిలోన దిరుగ వెలది పురుషుడౌనె?
88. వీపు గుద్దరా శిష్యా అంటే, నీకంటే తక్కువ తిన్నదెవరు అన్నాడట.
89. వీపు తోమరా! అంటే, ఇక్కడొక బొక్క ఉన్నదే అన్నాడట.
90. వీపున తన్నుతుంటే, యింటివెనుక చప్పుడన్నట్లు.
91. వీపుమీద కొట్టవచ్చును గానీ, కడుపుమీద కొట్టరాదు.
92. వీరక్క పెండ్లిలో పేరక్క శోభనం.
93. వీరన్న ముందు బసవన్న, గౌరి ముందు గణేశుడు.
94. వీరభద్రపళ్ళెమునకు హనుమ త్పళ్ళెము.
95. వీరభోగ్య వసుంధర.
96. వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.
97. వీలెరిగి మాట, కీలెరిగి వాత.
98. వీసం ఇచ్చి, వాసానికి ఒడ్డినట్లు.
99. వీసం ఖర్చు లేకుండా నోము నోముతాను, ఆశపడకండి అడవ నా బిడ్డల్లారా!
100. వీసం గల అమ్మి విడువా ముడువా, కాసుగల అమ్మి కట్టా, పెట్టా.

Sunday, January 1, 2012

సామెతలు 86


1. వల్లకాటి వైరాగ్యం, పురిటాలి వైరాగ్యం (స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం).
2. వసుక వేయబోయిన, వాతప్పులవాడు తగిలినాడు.
3. వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట (చాలని కాలానికి).
4. వస్తా ఏమి తెస్తావు, పోతా ఏమి ఇచ్చి పోతావు?
5. వస్తా నన్నదాన్ని, ఇస్తానన్న వాణ్ణి నమ్మరాదు.
6. వస్తానయ్యా! బాపనయ్యా! అంటే, వద్దే! ముండా! వర్జముంది అన్నాడట.
7. వస్తావు పోతావు నా కొఱకు, వచ్చి కూర్చున్నాడు నీకొఱకు.
8. వస్తుగుణం తెలియనివాడు వైద్యంలో మొనగాడే.
9. వస్తూ ఇళ్ళు నింపుతుంది, పోతూ పెరళ్ళు నింపుతుంది (అరికె).
10. వస్త్రహీనము విస్తరహీనము పనికిరావు.
11. వసిష్టుని వాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవలె.


వా


12. వాంతి వస్తే పెదవు అడ్డమా?
13. వాకిలి దాటగానే వారణాసి ఎంతదూర మన్నట్లు.
14. వాక్చాతుర్యములేని వేశ్య, గుణకారము లేని లెక్క.
15. వాగార్త చేలకు సొనలే వరవలు (వాగార్త=సముద్రతీరము).
16. వాగు నీళ్ళు, వనం పత్రి.
17. వాగులో పోతున్నావే సెట్టి? అంటే, లాభం లేందే పోతానా అన్నట్లు.
18. వాగ్దానం ఎందరు అవివేకులనో తృప్తి పరుస్తుంది.
19. వాగ్దానం చేసేవాడు వాటిని మరచిపోవడం గూడా నేర్చుకొని ఉంటాడు.
20. వాచినమ్మకు పాచి(సి)నకూడు పెడితే, మాఅత్త పరమాన్నం పెట్టిందని ఇరుగింట పొరుగింట చెప్పుకున్నదట.
21. వాడవదిన కేల వావివరుసలు?
22. వాడికి నలభై జరిగింది (నలభై=40వ సంవత్సరం పరాభవ అంటే అవమానం జరిగింది).
23. వాడికి వీడికి నిప్పుకు ఉప్పుకు (వలె ఉన్నది).
24. వాడి కేడట్ఠాలే గ్రంథమయింది గానీ, మనకి పై అట్ఠలు కూడావచ్చు.
25. వాడి తండ్రి, మాతండ్రి సయాం మగవాళ్ళు-అన్నట్లు.
26. వాడిపోయిన పూవులు ముడుచువారుందురా?
27. వాడు వట్టి ఇరవై ఐదు ఇరవైఆరు ( ఇరవై ఐదు =25వ సంవత్సరం ఖర, 26వది నందన, గాడిదకొడుకని).
28. వాతికి వెరతునా, పీతికి వెరతునా అన్నట్లు.
29. వాతాపి జీర్ణం - వజ్రశరీరం.
30. వాద బ్రష్టుడు, వైద్య శ్రేష్టుడు (వాద= రసవాదం చేసినవాడు).
31. వాది నాశం, ప్రతివాది మృతనష్టం, ప్లీడర్ల అదృష్టం, కోర్టువారి ఇష్టం.
32. వాదు తెచ్చుకోవాలంటే, అప్పు ఇవ్వమన్నారు.
33. వాదులేక ప్రాణం, దాదిలేక రాణి పోరు.
34. వాదులేక వల్లూరికి పోతున్నాను, ఇరుగుపొరుగు నాసవతుల్లారా! ఇల్లు భద్రం (గంప ఎత్తండి) అన్నదట .
35. వాదు సుమీ! అప్పిచ్చుట.
36. వాన ఉంటే కఱవు, పెనిమిటి ఉంటే పేదరికం లేదు.
37. వాన ఎక్కువైతే రొంపికరువు, వాన తక్కువైతే వరపు కరువు.
38. వానకన్నా ముందే వరదనా?
39. వానకు ఎచ్చయిన తేగి వెరచుగానీ ఎనుబోతు వెరచునా?
40. వానకు ముందు ఉఱిమినా, మాటకు ముందు ఏడ్చినా తుదముట్టదు.
41. వాన కురుస్తున్నది నాయనా, అంటే కురవనీలే అనగా, అట్లానే కురవనిస్తాలే అన్నాడట.
42. వానతోడ వచ్చు వడగండ్లు నిలుచునా?
43. వాననాటి వరద, పెళ్ళినాటి పప్పుకూడు.
44. వానపొటుకుకంటే మ్రానుపొటుకు ఎక్కువ (పొటుకు అనే శబ్దంతో చినుకు పడుట).
45. వాన బడాయి చవిటిమీద, మాల బడాయి పాటిమీద, మొగుడి బడాయి ఆలిమీద.
46. వానరాకడ, ప్రాణం పోకడ ఎవఱెరుగుదురు?
47. వానలకు మఖ(కార్తె) కుక్కలకు చిత్త(కార్తె).
48. వానలుంటే పంటలు, లేకుంటే మంటలు.
49. వానలు కురిస్తే వసుంధర.
50. వానలు కురిస్తే వాతలు మాసిపోవు, బిడ్డలు పుడితే ఱంకులు మఱచిపోరు.
51. వానలు ముంచతవోయ్ ! ముంచతవోయ్! అన్నాడట జ్యోతీష్కుడు (ఎగగొట్టినా ముంచుటే, ఎక్కువైనా ముంచుటే).
52. వాన లెక్కడా? అంటే దానధర్మాలున్న ధరణిలో అన్నట్లు.
53. వానలేని వట్టి పిడుగు వలె.
54. వానవచ్చినందుకు వంక పారిందే గుర్తు.
55. వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు (ఆడేవాళ్ళందరూ మారి మారి వాయించుచుందురు).
56. వాపును చూచి బలుపను కొన్నట్లు.
57. వాపు బలుపు గాదు - వాత అందము గాదు.
58. వాపు మానునుగాని వాతలు మానునా?
59. వాములు మింగే స్వాములవారికి పచ్చిగడ్డిమోపులు పలహారము (బరోబరు).
60. వామ్ము తింటావా, మామా? అంటే, వామ్ముపోసకు సందుంటే ఒక వడతునకే తిననా అన్నాడట.
61. వాయిపట్టే సందే ఉన్న, ఒక భక్ష్యమైనా తినేవాడిని.
62. వారకాంత జనంబులకు వావి గలదె?
63. వారకాంతలేల వలచెదూరక?
64. వారవనిత ధనికు చేరదీయగోరును.
65. వారాశి దాటినను శని మారకుడై పట్టి చంపు.
66. వాలుపై (వాదరపై) నడిచినట్లు (సాము).
67. వాళ్ళు పిల్లనివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.
68. వావివరుసదప్పి వర్తించి చెడుదురు.
69. వాసానికి తగ్గ కూసం.
70. వాసి తరిగితే, వన్నె తరుగుతుంది.
71. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల కామక్క వంకాయలభారం తూగిందట.
72. వాస్తుగలవారి కోడలు వరహా ఇచ్చి క్షవరం చేయించుకుందట.


వి


73. వింటే బేగడ (రాగం) వినాల, తింటే మీగడ తినాల.
74. వింటే భారతం వినాల, తింటే వడలు (గారెలు) తినాల.
75. వింతలమారికి చండ్లు వస్తే మేనమామకు కండ్లు పోయినవట.
76. వింతలేనిదే ఆవులింత పుట్టదు.
77. విందు అయినా మున్నాళ్ళు, మందు అయినా మున్నాళ్ళు (మూడ్నాళ్ళు).
78. విందు భోజనం చేస్తే, మిట్టచేనుకు ఒడ్డు (మడవ) వేసినట్లుండాల (బిఱ్ఱుగా ఉబ్బిపారును).
79. విందు మర్నాడు మందు (కుందు).
80. వికారంవాడు దుకాణం పెడితే, వచ్చే గిరాకీ అట్టే మరలిపోయిందట.
81. వికిరాలలో లేడు, పిండాలలో లేడు (వికిర=పక్షి).
82. విక్రమార్కునివంటి రాజు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు.
83. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి.
84. విఘ్నేశ్వరుని పెండ్లికి వేయి విఘ్నాలు.
85. విచిత్రపు పచ్చిపులుసు ఈగలగొట్టి, తాలింపుపెట్టి ఇద్దరిని రమ్మంటే ముగ్గురు వచ్చారట.
86. విచిత్రం, విన బూటకం! ఆలుగొట్ట మగడేడువ.
87. విచిత్రపు పులుసుకూర విస్తరను మింగిందట.
88. విజయుం డనువుదప్పి విరటుని గొలువడా.
89. విజరానికి తగవు లేదు.
90. విటుని పచ్చ జూచి తాళలేక తానిటు నిలను దిరుగుట. (పచ్చ=బంగారు).
91. విడిచిన ఎద్దు కొట్టందారి చూచును.
92. విడిచిన గుద్ద వీధికి పెద్ద.
93. విడిచినది వీధికి పెద్ద, బరితెగించినది (విడిచినది) బజారుకు పెద్ద.
94. విడిచిన ముండకు వీరేశలింగం, తెగించినవాడికి తెడ్డే లింగం.
95. విడిచిన ముండలకు విడవలూరు (విడవలూరు=నెల్లూరు జిల్లాలో ఒక సంపన్న గ్రామం).
96. విడిచిన ముండ వీధికి పెద్ద, బడివిడిచినముండ బజారుకు పెద్ద.
97. విడిచిన లంజ వీధికెక్కితే, చావిట్లోవాళ్ళు చాటుకు పోయినారట.
98. విడిచిపెట్టిన ఇంటిలో మఱచిన మంగలు (మంగ=అలమేలుమంగ)
99. విడిపించబోయిన పాముకు పగ, విడిపించకున్న కప్పకు పగ (వగ).
100. విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానం.