Friday, March 23, 2012

చిన్నమాట

ఇప్పటికి నేను 9325 తెలుగు సామెతలను బ్లాగులో పోష్టు చేసాను. దీనితో నేను మొదలెట్టిన కార్యక్రమం చాలావరకు పూర్తి అయ్యింది. చాలావరకు అని ఎందుకన్నానంటే ఇంకా కొన్ని సామెతలు మిగిలిపోయాయి. వాటిని కూడా త్వరలో మీ ముందుకు తెస్తాను. 


ముఖ్యంగా చెప్పదలచు కున్నది ఏమిటంటే, ఈ సామెతల సంపాదించటంలో ముఖ్యంగా నేను తెలుగు విశ్వవిద్యాలయం వారి ' తెలుగు సామెతలు ' (మూడవ కూర్పు) ఉపయోగించాను. ఈపుస్తకం ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతొందో లేదో తెలియదు కానీ అంతర్జాలంలో దొరుకుతోంది. ఇవికాక అనేకమంది మిత్రులు తాము సేకరించుకున్న సామెతలను నాతో పంచుకొన్నారు. వారందరికి ధన్యవాదములు.
నా ఈ ప్రయత్నంలో అడుగడుగునా వారి కామెంట్లతో ప్రోత్సాహించిన మిత్రులందరికి పేరు పేరునా ధన్యవాదములు. మీ ప్రోత్సాహం లేకపోతే ఈ పని పూర్తి చేయ్య గలిగేవాడిని కానేమో!!

నా తదుపరి కార్యక్రమం అదే. రెండోవది, మిగిలిపోయిన మిత్రులు పంపిన సామెతలను పోష్టుచేయటం. మూడవది కొందరు మిత్రులు సూచించిన విధంగా బ్లాగు డిజైన్ లో మార్పులు తెచ్చి browsing ఇంకా సులభతరం చేయటం.


నా పని ఇక్కడితో పూర్తి కాలేదు. చాలాచోట్ల ఎంత జాగ్రత్తగా చూసినా ముద్రారాక్షసాలు అనేకం దొర్లాయి. వాటినన్నిటిని ముందుగా, ముఖ్యంగా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇలా కొన్ని పనులు మిగిలాయి. నా యీ బ్లాగును వికీలో చేర్చటానికి ఎలా సాధ్యమో చూడాలి. ఇప్పటికే నా బ్లాగుని కొంతమంది మిత్రులు తమ సైట్లలో అనుసంధించారు. వారికి కూడా నా ధన్యవాదములు.


చివరగా మీత్రులందరికి విన్నపం. మీవద్ద ఏమైనా సామెతలు ఉంటే దయచేసి నాతో పంచుకోగలరు. ఇప్పటికి ఈమాట చాలనుకుంటాను. 

మరొక్కమారు అందరికి ధన్యవాదములు


సుబ్రహ్మణ్యం.

Wednesday, March 21, 2012

సామెతలు 94


1. హరుని ఎరుకలేక ఆకులల్లాడునా?
2. హర్షుణ్ణి నమ్ముకొని, పురుషుణ్ణి పోగొట్టుకొన్నట్లు.
3. హసేను, హుసేను సేద్యంచేస్తే, ముచ్చెలతో పంచుకొన్నారట -పంటను.
4. హస్తా ఆదివారం వచ్చింది, చచ్చితిమయ్యా గొల్లల్లారా! చల్లపిడతల కాసులుతీసి సాలలు వేయించండి.
5. హస్తా ఆదివారం వచ్చింది, చస్తిమోయి గొల్లల్లారా! కాసుకొక దాన్ని కాలు పట్టి ఈద్వండి (అన్నవట గొఱ్ఱెలు).
6. హస్త ఆదివారం వస్తే, చచ్చేటంత వాన.
7. హస్తకార్తెలో చల్లితే అక్షింతలకైనా కావు.
8. హస్తకు అనకు (అణుగు) పొట్ట, చిత్తకు చిఱుపొట్ట.
9. హస్తకు ఆదివంటా, చిత్తకు చివఱి వంటా!
10. హస్తకు ఆరుపాళ్ళు, చిత్తకు మూడుపాళ్ళు.
11. హస్తచిత్తలు వఱవయితే అందఱి సేద్యం ఒకటే.
12. హస్త పోయిన ఆరుదినాలకు అడగకుండా విత్తు.
13. హస్తలో అడ్డెడు చల్లేకంటే, చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
14. హస్తలో ఆకు అల్లాడితే, చిత్తలో చినుకు పడదు.
15. హస్తలో చల్లితే, హస్తంలోకి రావు.


హా


16. హాస్యగాడు బావిలో పడిన తంతు.
17. హాస్యగానికి తేలు కుట్టినట్లు (హాస్యమనుకొని నమ్మరు), కోతికి దయ్యం పట్టినట్లు.


హీ


18. హీనజాతి ఇల్లు జొచ్చినా, ఈగ కడుపు జొచ్చినా నిలవవు.
19. హీనస్వరం పెళ్ళాం ఇంటికి చేటు.


హె


20. హెచ్చుగా పేలున్నవాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురద లేదు.


హే


21. హేమాహేమీలు ఏతివెంత కొట్టుకపోతుంటే, నక్క పాటిరేవు అడిగిందట.


హో


22. హోరుగాలిలో దీపం పెట్టి, ఓరిదేవుడా! నీ మహాత్మ్యమన్నట్లు (మహిమ అన్నట్లు).


క్ష


23. క్షణం చిత్తం - క్షణం మాయ.


క్షే


24. క్షేత్ర మెఱిగి విత్తనము, పాత్ర మెఱిగి దానము.
25. క్షేమంగా పోయి, లాభంగా రమ్మన్నట్లు.

Wednesday, March 14, 2012

సామెతలు 93


1. సువ్వి అంటే తెలియదా? రోకలిపోటు.
2. సుళ్ళు చూడమంటే గుద్దలో వేలుబెట్టినాడంట.


సూ


3. సూతిగల జంత రోటివద్ద మాతు పెట్టెనట.
4. సూడిద బూడిద పాలు, యిల్లాలు ఇతరుల పాలు.
5. సూత్ర మెఱుగని మైథునశూరులు.
6. సూదికి రెండుమొనలు గలవా?
7. సూది కుతికె, దయ్య పాకలు.
8. సూదికోసం దూలం మోసినట్లు (పరమానందయ్య శిష్యులు).
9. సూదికోసం సోదెకు పోతే, పాతఱంకులు బయట పడ్డాయి.
10. సూదికోసం సోదెకు వెడితే, కుంచెడు బియ్యం కుక్క ముట్టుకుందట.
11. సూది గొంతు, బాన కడుపు.
12. సుది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా?
13. సూదిబెజ్జంలో ఒంటె దూరవచ్చును గానీ భాగ్యవంతుడు స్వర్గం చేరలేడు.
14. సూదిబెజ్జం చూచి జల్లెడ వెక్కిరించినట్లు.
15. సూదిని మూత గట్టినట్లు.
16. సూదిలావచ్చి గడ్డపారలా తేలినట్లు.
17. సూదివలే వచ్చి, దబ్బనం మాదిరి తేలినట్లు.
18. సూదేటువాణ్ణి, సుత్తేటువాణ్ణి, కండేటువాణ్ణి నమ్మరాదు (కుట్టె జంగం, కంసాలి, సాలి).
19. సూరన్న చిన్నవాడు, పేరన్న పెద్దవాడు, అయ్య కెత్తర కోళ్ళగంప.
20. సూర్యడు తనోడైతే, చుక్కలన్ని తన కక్కలంట.
21. సూర్యుని మొగాన దుమ్ము చల్లితే, ఎవరి కంట బడుతుంది?
22. సూర్యుని మొగాన ఉమ్మేస్తే తనమీదనే పడుతుంది.
23. సూక్షంలో మోక్షం.


సె


24. సెంటుభూమి లేని వాని కెందుకు సెంటువాసన లన్నట్లు.
25. సెగలేనిదే కూడుండదు.
26. సెగలేనిదే పొగ రాదు.
27. సెట్టి బ్రతుకు గిట్టినగాని తెలియదు.
28. సెట్టి సేరు, బుడ్డ సవాసేరు.
29. సెట్టి సింగారించుకొనేలోపల ఊరు కొల్లబోయిందట.
30. సెనగల గాదెమీద కుక్క పండుకొన్నట్లు (గాటిలో కుక్క)
31. సెంగలు తిని, చెయ్యి కడుకున్నట్లు.
32. సెభాష్ మద్దెలగాడా! అంటే, ఐదువేళ్ళు పగలగొట్టు కున్నాడట.


సే


33. సేరుకాయ నీటాయె, ఉల్లెం గడ్డ మోటాయె.
34. సేరుకు సవాసేరు (వడ్డించినాడన్నట్లు) అన్నట్లు.
35. సేరు దొరకు మణుగు బంటు.
36. సేవకునిలాగా చెయ్యాలి, రాజులాగా అనుభవించాలి.


సై


37. సైంధవుడు అడ్డు పడినట్లు.
38. సై అనే కలువాయి, అవిశలగల యిల్లు జూపే కలువాయి, బిళ్ళకుడుము మాదిరి రూపాయి తట్టేసి బిగిసికునే కలువాయి. (కలువాయి గ్రామంలో ఱంకుటాలు చేసిన మోసము గురించి).
39. సైదాపురం రాచ్చిప్ప (రాతిచిప్పవలె మొద్దు అనుట)
40. సైవలేని వాడు నెయ్యి నాకినట్లు.
41. సైరా మాలోడా అంటే, పరమెత్తి పైన వేసుకున్నాడట (సై అను=ఉబ్బించు; పరము=బండిపై చట్టములో ఇరుప్రక్కల ఉండే పొడుగు నిలువు కొయ్యలు).


సొ


42. సొంతానికి ఏనుగు, ఉమ్మడికి పీనుగు.
43. సొంతానికి పిడుగు, ఉమ్మడికి బడుగు.
44. సొగసుగానికి (షోగ్గానికి) మూడుచోట్ల అంతు.
45. సొగసు సోమవారం పోతే, మొగుడు ఆయవారం పోయాడట.
46. సొగసైన బూరుగను పెంచితే సురస ఫలముల నిచ్చునా?
47. సొగసైన లేమకు సెగరోగ మున్నట్లు.
48. సొమ్ము ఒకచోట, అపనమ్మిక ఇంకొకచోట.
49. సొమ్ము ఒకదిది సోకు ఇంకొడిది.
50. సొమ్మొకడిది, సోకొకడిది.
51. సొమ్ము పోగా దిమ్ము పట్టినట్లు.
52. సొమ్ము పోయేటప్పుడు, తట్టు తగిలేటప్పుడు మతి ఉండదు.
53. సొమ్ము సొమ్ములోనే ఉండె, సోమయ్య మందిలోనే ఉండె.


సో


54. సోదించడ మెందుకు. సొడు పెట్టడమెందుకు?
55. సోమరితనం, చిగిర్చని పూయని కాయని చెట్టువంటిది.
56. సోమర్లకు స్వయంపాకం చేసిపెట్టి, పందులకు పక్క వేసినట్లు.
57. సోమరికి షోకు లెక్కువ.
58. సోమిదమ్మ సొగసుకాంద్ర కోరితే, సోమయాజి స్వర్గార్హు డగునా?
59. సోయిదప్పిన వాడా? సొంగ ఎక్కడ పెట్టినావురా? అంటే, త్రాగి తమ్మళ్ళ బాలమ్మ గుడిసెకు చెక్కినా నన్నాడట.


సౌ


60. సౌందర్యమే శాశ్వతానందం.


స్త


61. స్తంభం చాటున ఏంది? అంటే, కుంభ మన్నారట! అయితే నాకేనా మూడు మెతుకులు?
62. స్తంభం చాటుగాడు ఒకడు, అదే పోతగాడు ఇంకొకడు, పోతే రానివాడు మరియొకడు.
63. స్తనశల్య పరిక్ష చేసినట్లు.


స్త్రీ


64. స్త్రీలనేర్పు మగల చీకాకు పరచురా!


స్థా


65. స్థాన బలిమి కానీ తన బలిమి కాదు.


స్థి


66. స్థిరాస్తి ఆయన, చరాస్థి ఆయన గుడ్డలు.


స్థూ


67. స్థూలం కనుగుడ్డు, సూక్షం కనుపాప.


స్నా


68. స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.
69. స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు.


స్నే


70. స్నేహితునకు అప్పు ఇస్తే రెండూ పోతవి.


స్వ


71. స్వకుచమర్ధనం (తన్ను తాను పొగడుకొనుట)
72. స్వకుచమర్ధనంవల్ల రంభకైనా సుఖంలేదు.
73. స్వధనంబులకై బండపంచాంగమేల? (బండపంచాంగం=రచ్చబండ దగ్గర చెప్పే పంచాంగం).
74. స్వయం రాజా, స్వయం మంత్రి, స్వయం చాకలి, స్వయం మంగలి.
75. స్వర్గానికి పోతూ, చంకన ఏకులరాట్నం ఎందుకు?
76. స్వర్గానికి పోయినా విడాకులు తప్పలేదట.
77. స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పిందికాదు అన్నట్లు.


స్వా


78. స్వాతంత్ర్యం స్వర్గం, పరతంత్ర్యం ప్రాణసంకటం
79. స్వాతి కురిస్తే  చట్రాయిగూడా పండును.
80. స్వాతి కురిస్తే, చల్ల పిడతలోకిరావు - జొన్నలు.
81. స్వాతి కురిస్తే భీతి కలుగుతుంది.
82. స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
83. స్వాతికొంగ, పంతకాపు, నీళ్ళున్నచోటే ఉంటారు.
84. స్వాతికొంగల మీదికి సాళువం పోయినట్లు.
85. స్వాతి వర్షం చేనుకు హర్షం.
86. స్వాతివానకు సముద్రాలు నిండును.
87. స్వాతివాన ముత్యపు చిప్పకుగానీ నత్తగుల్ల కేల?
88. స్వాతివిత్తనం, స్వాతి కోపులు (కోపు=సరియైన అదను, నివదల్ల ఏర్పడే ఏపు).
89. స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
90. స్వాతీ! నేను జవురు కొస్తాను, విశాఖా! నీవు విసురుకురా.
91. స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు.




92. హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె.
93. హక్కు హనుమంతరాయనిది, అనుభవం చెన్నారాయనిది.
94. హద్దులో ఉంటే ఆడుది, హద్దు దాటితే గాడిది.
95. హనుమంతుడు సువేలాంద్రినిం కనిదాఇపైనెక్కి, అని సాతాని పురాణం చదివితే, సాతానిదానిపై ఎందుకు ఎక్కకూడదు? అన్నాడట సభలో ఉన్న కనివాడు. (కనివాడు=భత్రాజు, సువేలాంద్రి కని-చూచి అని).
96. హనుమంతుని ముందు కుప్పిగంతులా?
97. హనుమంతుని మోర ఉంటే అదృష్టవంతుడు.
98. హరిదాసుకు అమరావతి అడ్డమా?
99. హరిదాసున కందరూ తనవారే.
100. హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు, నా నోట నిజం రాదు.

Sunday, March 4, 2012

సామెతలు 92


1. సాతాని గర్భదానం.
2. సాతాని జుట్టుకు, సన్యాసి జంధ్యానికి ముడివేసినట్లు.
3. సాతాని నుదుట విభూదిరాయడం సురభి బదనిక పాముకు చూపినట్లు.
4. సాతుముడికి సత్తువేటు పడితే, సచ్చిన తాతయినా లేచివస్తాడు అన్నట్లు.
5. సాదు పలు(ల)వ.
6. సాదు రేగితే తల పొలానగాని నిలువదు. (తల పొలము=ఊరి పొలిమేర).
7. సాదు రేగినా బూతు రేగినా సవసవ పోవు.
8. సాదెద్దు సీదుకు రేగిన కంచెంత పాడు.
9. సాధ్వి మహిమ నెట్లు స్వైరిణి ఎరుగురా?
10. సానక్రింద దీపము వలె.
11. సానక్రింద వెన్నెల వలె.
12. సానపై యిరవై, సంచికట్నం ముప్ఫై, ఇంటికి యాభై పంపించండి, కరకర ప్రొద్దెక్కేవఱకు కాటిలో పొగలేపుతాను.
13. సానికి ఱంకులు నేర్పాలనా?
14. సానిదాని సళ్ళు సంత సొరకాయలు (గోటగిచ్చి ముదురు లేత చూచిపోతారు).
15. సాని నీతి - సన్నాసి జాతి (తెలియవు).
16. సానులలో సంసారి, సంసారులలో సాని.
17. సామజము చెఱకు మేసిన, దోమలు పదివేలు చేరి తోలంగలవా?
18. సాము నేర్చినవానికే చావు గండం.
19. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు.
20. సాయంకాలం భూపాలరాగం అన్నట్లు (భూపాల=మేలుకొలుపు రాగం).
21. సాయబు సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి.
22. సయబూ! చిక్కిపోయినా వేమంటే? ఇంకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసూవస్తే చచ్చిపోతాం మీకేమి? అన్నాడట.
23. సాలెకు, జంగానికి సాపత్యం కుదురుతుందా?
24. సాలె జాండ్ర సభామధ్యే, సాతానిః పండితోత్తమః
25. సాలెవాని భార్య సరిమీద పడ్డది (సరి=గంజి).
26. సాలెవాని ఎంగిలి ముప్ఫదిమూడుకోత్ల దేవతలు మెచ్చారట (నాకితేగానీ పడుగు అతకలేడు)
27. సాలెవానికి కోతిపిల్ల తగులాట మైనట్లు.
28. సాలోడికి కోడిపుంజు తగలాటం.
29. సావడి (చావడి) కాలెరా సన్నాసీ, అంటే సా(చా)వసింపు నా సంకలోనె ఉన్న దన్నాడట.
30. సావుకారు చతికిలబడితే, పీట వెల్లకిల బడిందట.
31. సాహసంలేని వాడికి కత్తి సరిగా తెగదు.
32. సాహెబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే.
33. సాహెబులా! సెదాములు, సలాము లేవయ్యా? అంటే దొరలు దాతలు పట్టంచు ధోవతు లిచ్చిన ఇనాములేవయ్యా? అన్నాడట.
34. సాహెబ్ కు సాడే తీన్. నాకు మూడున్నర.
35. సాక్షికాళ్ళు పట్టుకోవడం కన్న, వాదికాళ్ళు పట్టుకోవడం మేలు.


సి


36. సింగడికేల పత్తి బేరము? (సింగడు=దిశమొలవాడు; బిత్తలి).
37. సింగన్నా! అద్దంకి పోయినావా? అంటే, పోనూపోయా, రానూవచ్చా అన్నాడట.
38. సింగారం జూడరా బంగారు మొగుడా.
39. సింగి కంటే (నీళ్ళాడితే)- సింగడు పథ్యం చేసినట్లు (ఇంగువ తిన్నట్లు).
40. సింగినాదం, జీలకఱ్ఱ.
41. సింగి నీళ్ళాడితే సింగడు ఇంగువదిన్నట్లు.
42. సింహంగూడ చీమకు భయపడే (తలకే) అదును వస్తుంది.
43. సింహంలో చీరి ఊడ్చడమున్నూ, కన్యలో కంగా పింగా ఊడ్చడమున్నూ.
44. సింహాసనంపై దున్నపోతు, లంజలలో పతివ్రత, ముత్తైదువులలో ముండమోపి.
45. సిగ్గంత పోయె చిన్న పెండ్లామా! పెండ్లికన్న పోదాం పెద్ద పెండ్లామా! అన్నాడట.
46. సిగ్గు చాటెడు, చెప్పులు మూటెడు.
47. సిగ్గు చిన్ననాడే పోయె, పరువు పందిట్లో పోయె, కొరవా సరవా ఉంటే గదిలో పోయె.
48. సిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలును.
49. సిగ్గు తోటకూరవంటిది (చాలా సుకుమారము).
50. సిగ్గు దప్పిన చుట్టం వన్నెచీర కేడ్చిందట.
51. సిగ్గుపడితే సిద్దె కట్టిపడుతుంది.
52. సిగ్గుబోవు వేళ చీర లబ్బినట్లు.
53. సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకించిందట.
54. సిగ్గులేని అత్తకు మోరతోపు అల్లుడు.
55. సిగ్గులేని చిన్నాయనా, విడిచిన చిన్నమ్మను ఇంకా కొడుతావా?
56. సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం.
57. సిగ్గులేని రాత్రికి ఏటా జాగారమే!
58. సిగ్గు విడిస్తే రాయలకూడు, తిరుపతికి పోతే బోడితల.
59. సిగ్గువిడిస్తే శ్రీరంగము, అంతకూ విడిస్తే బోడితల.
60. సిగ్గు సిబ్బిన కొడితే, శరము చేటన కొడుతుంది (శరము=సిగ్గు, షరం)
61. సిగ్గూ, శరము లేనమ్మ మొగుడిపెళ్ళికి పేరంటానికి వెళ్ళి, అడ్డగోడ చాటునుండి అర్ధరూపాయి కట్నం ఇచ్చిందట! (చదివించిందట).
62. సిగ్గెందుకు లేదురా జగ్గా? అంటే నల్లనివానికి నాకేమి సిగ్గన్నాడట.
63. సిగ్గేమే సిగదాకమా అంటే, నాకేమి సిగ్గే తలదారమా అన్నదట.
64. సిగ్గే స్త్రీకి సింగారం.
65. సిడి పడితే మూన్నెల్ల (మూడేండ్ల) వఱపు.
66. సిద్దప్పవంటి శిష్యుడూ లేడు, బ్రహ్మంగారి వంటి గురువూ లేడు, వేమనవంటి యోగీ లేడు.
67. సిద్దారెడ్డోరి చద్దన్నం తిని, శివారెడ్డోరి ఆవులు మేపినట్లు.
68. సిరికొద్ది చిన్నెలు, మగనికొద్ది వన్నెలు.
69. సిరిపంచి కుడువ మేలు.
70. సిరిపోయినా చిన్నెలు పోలేదు.
71. సిరి రా మోకా లొడ్డినట్లు.
72. సిలార్! పిల్లలు, నేను తయార్.


సీ


73. సీతకు వ్రాసింది సీమకు వ్రాయవలెన?
74. సీత పుట్టుక లంక చేటుకే.
75. సీతా పతే సిరిచాపే గతి.
76. సీతారామాబ్యాం నమః అంటే, మా ఇంటాయన ఎదురుకాలేదా? అన్నదట (భిక్షానికి వచ్చిన వానితొ).
77. సీదుకు రేగితే చిచ్చుబుడ్డి, కోపమొస్తే కొరివికట్టె.
78. సీలమందలంవరకు చీర కడితేగానీ, సాలెమిందని కెక్కడ తెచ్చియిచ్చేది?


సు


79. సుంకరమోటుకు మాట నిలకడలేదు.
80. సుంకరివద్ద సుఖదుఃఖాలు చెప్పుకొన్నట్లు.
81. సుండు చూడనీయదు, మండి మాననీయదు (సుండు= చిన్నకురుపు, మండి=పెద్దపుండు).
82. సుకవి తిట్లకు దొరబిడ్డ వెరచు గానీ మోటగాడు వెరచునా?
83. సుఖం మరిగినమ్మ మొగుణ్ణి అమ్ముకుని తినిందట.
84. సుఖం మరిగిన దాసరి పదం మరచినాడట.
85. సుఖమెరుగని బ్రతుకు సున్నమేయని విడెము.
86. సుఖవాసి దేహానికి మెత్తని చెప్పు.
87. సుఖాలు పువ్వుల వంటివి, అనుభవించగానే అంతరించిపోతవి.
88. సుతారం, సూదిలోని దారం.
89. సుతులు లేనివారికి గతులు లేవు.
90. సుధను గోరువాడు సుడిబడి చచ్చునా?
91. సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.
92. సున్నము పుట్టని ఊళ్ళో అన్నము పుట్టునా?
93. సున్నాలో ఉన్నది సూఖం, సూఖంలో ఉన్నది మోక్షం.
94. సుపుత్రా! కొంప తీయకు (పీకకు)రా అన్నట్లు.
95. సుబ్బడిది చుట్టాల రంధి, రాముడిది తామర రంది.
96. సుబ్బు పెళ్ళిలో సూరి సమర్త.
97. సుబ్బు పెళ్ళి వెంకి చావుకు వచ్చింది.
98. సురకు నిచ్చినట్లు, సుధకును నీయరే.
99. సురియ బట్టవచ్చు శూరుండు కాలేదు.
100. సువాసిని కొప్పుకేకాక బొండుమల్లెలు బోడిముండకేల?

Thursday, February 23, 2012

సామెతలు 91


1. సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టువంటిది
2. సకలశాస్త్రాలు, నిలబడి మూత్రాలు.
3. సకలసబ్బండు గోత్రానాం, పుల్లమ్మ పుత్రానాం.
4. సక్కీలు పలికెవానికి సేలు(రు), మొద్దుగొట్టేవానికి దుడ్డు.
5. సగం ఈడుకు సమర్తకట్నాలు.
6. సగం చచ్చి పురాణం, అంతాచచ్చి సంగీతం.
7. సగం పెట్టి, మేనత్త అన్నట్లు.
8. సగం సాలె నేత, సగం మాల నెత.
9. సజ్జనుండు తిట్ట శపంబదేను.
10. సద్దంత ఊర్రగాయ; ఇల్లంత పందిలి, తల్లంత పిల్ల.
11. సతాకోటి (శతకోటి) జంగాలలో, నాబోడిలింగ మెక్కడన్నాడట.
12. సతిపతులు చక్కగాఉంటే, సంతలో పిల్లచింత లేదు.
13. సత్కార్యాలకు కార్యరంగం అంతరాత్మ.
14. సత్యము నావద్ద చాలా ఉన్నది. చెప్పులుతేరా మగడా! నిప్పులో దూకుతాను.
15. సత్యములు పొత్తు కుడుచునా? బాసలు కలసివచ్చునా?
16. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన మరునాడు పుట్టినా డన్నట్లు.
17. సత్రం కూటికి అయ్యగారి ఆఙ్ఞా?
18. సత్రం కూటికి అయ్యగారి సెలవెందుకు?
19. సత్రంలో ఉచ్చబోస్తున్నవేమిరా? అంటే - దేవాలయం అనుకొన్నలే అన్నాడట.
20. సత్రా భోజనం - మఠా నిద్ర
21. సత్యాఢ్యులమీదబోవు జడమూర్తులు గెల్పువాటింతురే?
22. సదా కపటమతిన్ దొరంగు మహికాంతులకేడ పరోపకారముల్.
23. సద్దలు(సజ్జలు) వండితే సుద్దు లెక్కువ.
24. సద్దిబువ్వపై వెన్నపూస బెట్టినట్లు.
25. సన్నపని చేయబోతే సున్నం సున్నం అయ్యిందట.
26. సన్నబియ్యం, చాయపప్పు.
27. సన్నబువ్వ చిన్నచేపలు, కొఱ్ఱబువ్వ గోడిచారు.
28. సన్నమో, ముతకో, సంతలో తేలిపోతుంది.
29. సన్న సన్నంగా కాపుతనం వచ్చింది, సన్నబియ్యం వండవే అన్నాడట.
30. సన్నెక(లు)ల్లు కడుగరా సయ్యదాలీ! అంటే, కడగినట్లే నాకినా, ఖుదా తోడు; అన్నాడట.
31. సన్నెకల్లు దాచితే పెండ్లికాదా?
32. సన్యాసం చివర కష్టం, సంసారం మధ్య కష్టం.
33. సన్యాసం పుచ్చుకున్నా, కావడిబరువు తప్పలేదు.
34. సన్యాసికి దొంగల భయమేమి?
35. సన్యాసి పెళ్ళాం అటు విధవా కాదు, ఇటు పునిస్త్రీ కాదు.
36. సన్యాసి పెళ్ళికి జుట్టుదగ్గరనుంచి ఎరవే (అరవె).
37. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట.
38. సన్యాసులమధ్య కల్లుకుండలు మాయమైనట్లు.
39. సభమధ్య సాలె చాకలి, పండితులమధ్య పాగదాసరి.
40. సభాపిరికిదానా! యింతిలో లేడనిచెప్పవే!
41. సమయంతప్పితే కాళ్ళు, సమయంవస్తే రాళ్ళు.
42. సమయము కాదనుట జరుపు నేర్పు.
43. సమయమెరుగ(ని) నతడు సరసుండుకాడయా.
44. సమయానికి లేనిది చంకనాకనా?
45. సమయానికి లేని పాక చచ్చినాకా?
46. సమర్తయీడు చాకలిదాన్ని కొట్టింది.
47. సముద్రం నడుమ ఉన్నా, త్రాగునీటికి కరవే.
48. సముద్రంపై ఉఱిమితే, వన తప్పదు (గాలివాన).
49. సముద్రమయినా ఈదవచ్చుగానీ, సంసారం ఈదలేము.
50. సముద్రము చంకలో ఓట్టుకొని, చెలమకు చేయి చాచినట్లు.
51. సముద్రములో ఇంగువ కలిపినట్లు.
52. సముద్రంలో పెట్ట రెట్ట వేసినట్లు.
53. సముద్రములో కెరటాలు అణిగిన తరువాత స్నానం చేదామనుకున్నాడట.
54. సముద్రములో కొఱవి అద్దినట్లు.
55. సముద్రములో వాన పడినట్లు.
56. సముద్రములో వేసిన కాకిరెట్ట వలె.
57. సముద్రానికి ఏతాము వేసినట్లు.
58. సముద్రానికి లవణదర్శనమన్నట్లు.
59. సముద్రాన్ని బయటనుంచే పొగుడుతాము.
60. సమ్ముఖానికి రాయబార మేల?
61. సరదాకి సమర్తాడితే చాకలిది కోక దొబ్బింది.
62. సరసమాడుటెల్ల చావుకు మూలంబు.
63. సరసము విరసము కొరకే, పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబు అధిక భాధల కొరకే.
64. సరసానికైనా సమయ ముండాలి.
65. సరిపడనివారు చచ్చినవారితో సమానం.
66. సరివీ, పిల్లలూ లేస్తే సహస్త్రంమంది లేచినట్లు.
67. సరువ తప్పేల పోయె, బరువు అలకనాయె.
68. సరసమునందు, సమరమునందు సర్వము న్యాయసమ్మతమే.
69. సర్వరోగాలకు సారాయి మందు.
70. సర్కారుకు చాటుగా ఉండాలి, సావుకారి కెదురుగా ఉండాలి.
71. సర్రాజు పెళ్ళిలో గుర్రాజుకో పోచ.
72. సర్వజనీనమైన భాష సంగీతము.
73. సర్వవిషయములలో మానవుడుగా మనుము.
74. సర్వేజనా స్సుఖినోభవంతు అంటే, సర్వేవాళ్ళేనా? మనసంగతేమి? అన్నారట - రెవెన్యూ వాళ్ళు.
75. సలిలం కమ్మ లంజలం (సలిలం-కం-లం-జలం) అని, అమరం చదివితే, కమ్మలంజలేం? కాపులంజ లెందుకు కాకూడదు? అన్నాడట.
76. సవతాలి కుండనైనా ఉడుకుతానన్నది గాని, తోడికోడలి కుండను ఉడుకనన్నదిట.
77. సవతితల్లికి బిడ్డలు పోతేనేమి? సొమ్ముల కాపువానికి బక్కలు (బక్కగొడ్లు) పోతేనేమి?
78. సవతికి సంకెళ్ళు, నాకు పిల్లెండ్లు.(పిల్లెండ్లు=ఆభరణాలు, కాలివేళ్ళను పెట్టుకొనేవి).
79. సవతి సాగనీయదు, ఏరా లెచ్చనీయదు.
80. సవరణ సంతకుపోతే, ఏకులబుట్ట ఎదురుగా పోయిందట.
81. సవరదీసినకొద్దీ నిక్కినట్లు.
82. సవాసేరులో బోడిపరాచకమా?
83. సస్యాధిపతివా? సామ్రాజ్యాధిపతివా?
84. సహనముంటే పశ్చాత్తాపానికి చోటులేదు.


సా


85. సాకు (సాకులు) మేకవుతుంది.
86. సాకులు చెప్పినవానికి కాసు, ఇల్లుకప్పిన వానికి దుగ్గాని.
87. సాగింది నిజము, సాగనిది దబ్బఱ (కల్ల).
88. సాగితే చాపకిందికి ఆరు కుంపట్లు, తొమ్మిది నెగళ్ళు.
89. సాగితే నియోగం, సాగకపోతే చచ్చేయోగం.
90. సాగితే పాకనాటివారు, సాగకున్న మోటాటివారు.
91. సాగితే బండి, సాగకపోతే మొండి.
92. సాగితే బొంకు, సాగకపోతే రంకు.
93. సాగితే సాగించుకోమన్నారు, జారితే పడమన్నారు.
94. సాగినప్పుడు పడుదునా? త్రాగినప్పుడు పడుదునా?
95. సాగినమ్మ చాకలితో సరసం ఆడితే తప్పులేదు, సాగనమ్మ సంసారితో మాట్లాడినా తప్పే.
96. సాగినమ్మ చాకలివాడితో పోతే అది వ్రతమేమో అనుకున్నారట.
97. సాగువాటు చాలనాళ్ళాయె, గొగుకూర తెండమ్మా గోక్కు తిందామన్నదిట.
98. సాటీమ్మ సరిగా పెట్టుకుంటే, ఊరి అమ్మ ఉరిపెట్టుకున్నదట.
99. సాటివారితో సరిగంగ స్నానాలు చేస్తుంటే, ముసలి మొగుణ్ణి కాస్తా మొసలెత్తుక పోయిందట.
100. సాతానికీ, జంగానికీ సయ్యోధ్యత కుదురుతుందా?

Saturday, February 11, 2012

సామెతలు 90


1. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ.
2. శివరాత్రికి శివలింగాలంత మామిడికాయలు.
3. శివరాత్రి వాడింటికి ఏకాదశి వాడొచ్చినట్లు.
4. శివు డియ్యకున్న సిద్ధలింగ మిచ్చునా?
5. శివిడు పురుషుడైన శ్రీలకు జిక్కునా?
6. శివిని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.
7. శిశువుకు దక్కని స్తన్యం వలె.
8. శిష్యా! శిష్యా! నా కాళ్ళకు చెప్పులున్నవా? అంటే, నక్ష్త్ర మందలం మధ్య ఎక్కడా కనపడలేదు అన్నాడట. (బిఱ్ఱుగా తిని తల వంచలేక).
9. శిష్యా వెనుక గుద్దరా అంటే, వెనుక గుద్దగాక మొగముంటుందా? స్వామీ అన్నాడట శిష్యుడు.
10. శిష్యున కెక్కడ సందేహమో, గురువు కక్కడే అనుమానం.


శీ

11. శీలములేని సౌందర్యము తావిలేని పువ్వు వంటిది.


శు


12. శుద్ధ మనసులేక పూజసేయుటే సూకరవేత్తి.
13. శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే పెళ్ళికూతురుముండ ఎక్కడున్నదన్నాడట.
14. శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే - పెండ్లికి వచ్చిన ముత్తైదువలంతా నా పెద్దపెండ్లాలు అన్నాడట.
15. శుభం పలకరా మంకెన్నా అంటే, పెండ్లికూతురుముండ ఎక్కడ చచ్చింది అన్నాడట.
16. శుభం పలకరా మంకెన్నా అంటే, ఎవడాలితాడు తెగితే నాకేమి? నాకువేసే పిండాకుడు నాకేస్తే, అయిరేని కుండలకాడ చచ్చినట్టే తొంగుంటా నన్నాడట.
17. శుభం పలకరా మంకెన్నా అంటే, చెల్లిముండకు పెళ్ళెప్పుడు అన్నాడట.
18. శుభాలు ముంచి, దీపాలు ఆర్పినట్లు.
19. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు.


శూ


20. శూద్రపొట్టా తాములపాకుకట్టా, పొగాకుపట్టా, ఎప్పుడు తడుపుతూ ఉండాలి.
21. శూద్ర సంతర్పణ, బ్రహ్మణ సేద్యము.


శె


22. శెట్టిగారు సింగారించుకునే లోపల ఊరంతా కొల్లబోయిందట.
23. శెట్టిగారూ, తుమ్మితే ఏమనుకుంటారు? అని త్రిమూర్తులు మారు వేశంలో వచ్చి అడిగితే, జలుబు చేసిందని అనుకుంటాను-అన్నాడట.
24. శెట్టిగారూ, మాలో ఎవరు బాగుంటారు? అని లక్ష్మీదేవి, దరిద్రదేవి వచ్చి అడిగితే, చినక్క లోపలికి వస్తే బాగుంటుంది, పెద్దక్క బయటకిపోతే బాగుంటుంది - అన్నాడట.


శే


25. శేరుదొరకు మణువుబంతు.
26. శేషాయలెస్స అంటే, గరుడాయలెస్స అన్నట్లు.


శొ


27. శొంఠి లేని కషాయమా?


శో


28. శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు తలచినట్లు.


శ్మ


29. శ్మశానానికి పోయిన శవం తిరిగిరాదు.


శ్యా


30. శ్యామలాకారుడమ్మా! ఈ బిడ్డ శానాళ్ళు బతుకడమ్మా.
31. శ్యామలకోరల పున్నానికి కోటొక్కపుఱ్ఱె బొట్టి నోముతుండట.


శ్రా


32. శ్రార్ధానికి అంటు లేదు, యఙ్ఞానికి ఎంగిలి లేదు.
33. శ్రావణంలో శనగల జోరు, భాద్రపదంలో బాధలపోరు.


శ్రీ


34. శ్రీవైష్ణవుడు ముడ్డి చెరువులో కడగగానే అది సదాచారమగునా?
35. శ్రీయుతులు నన్నూట యిరవై (420) (420=భారత శిక్షాస్మృతిలో 420-వ నిబంధన మోసమునకు శిక్ష విధించునది. అంటే మోసగాడు.
36. శ్రీరంగం రోకలి చేతులమీద నిలువదు.
37. శ్రీరంగంలో పుట్టిన బిడ్డకు తిరువాయిమొళి నేర్పాలా? (తిరువాయిమోళి = నాలాయిరం (నాలుగువేలు) అను ద్రావిడ ప్రభందంలోని పాచురములు (పద్యములు)).
38. శ్రీరంగనీతులు చెప్పేవారేగానీ, చేసేవారు లేరు.
39. శ్రీరామరక్ష నూరేండ్లాయస్సు.
40. శ్రీరామ లంకలో బోడికోతి.
41. శ్రీరాముడు మానవాడైతే, చీడపురుగు లేమిచేస్తవి?
42. శ్రీవైష్ణవుడు ముడ్డి కడిగితే, రెండుచేతులకూ పని. ( కుడిచేతితో నీళ్ళు ఎడమచేతిలో పోసుకొని కడుగుకొందురు, పురచేయి నీళ్ళను తాకి మయిల చేయరాదని).


శ్రు


43. శ్రుతిమించి రాగాన పడినట్లు.
44. శ్రుతిలేని పాట, సమ్మతిలేని మాట.
45. శ్రుతిలేని పాట, మతిలేని మాట.


శ్వా


46. శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.




47. షండున కబ్బిన చాన వలె.
48. షండునికి రంభ దొరకినట్లు.(నపుంసకునికి)




49. సంకటాల విత్తు - సానిదాని పొత్తు.
50. సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏమవుతుంది?
51. సంక నాకేవాణ్ణి సంభావన అడిగితే, పొర్లించి పొర్లించి ముడ్డి నాకినాడట.
52. సంకురాత్రి మబ్బులు మాలవాళ్ళ ఉబ్బులు.
53. సంక్రాంతికి చంకలెత్తకుండా చలి.
54. సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోని వాళ్ళూ వస్తారు.
55. సంగాం కొమ్మ చక్కగా ఎత్తినట్లు. (సంగాం కొమ్మ= సంగములో పెద్దరాతి స్థంభమును ఎత్తి తిరునాళ్ళ ప్రారంభింతురు. పెన్నలో బొగ్గారు, బీరావుటెరు కలిసే సంగమం ఇది).
56. సంగీతం, పురుషుని హృదయంలో అగ్నిని రగుల్కొల్పాల - స్త్రీనేత్రంలో భాష్పముల నింపాల.
57. సంగీతము చేత సెట్టి బేరసారము లుడిగెన్ (బంగారువంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్).
58. సంగీత విద్యకు చాకలెల్లి.
59. సంచిలాభం చిల్లి కూదతీసినది.
60. సంచీ విప్పేవఱకు చల్లబడితే, మూత విప్పేవఱకు మాటలు పోతవి.
61. సంజకు, లంజకు రాగము నిలకడగా నిల్చునా? (రాగము=ఎరుపు, ప్రేమ).
62. సంతకు దొంగయితే చీరలమ్మే దెక్కడ?
63. సంతకు దొంగలయితే, చోళ్ళెక్కడ అమ్ముకోను?
64. సంతకు పోయివచ్చిన ముఖం మాదిరి (వాడిపోయి వత్తురు - తిరునాళ్ళకు పోయి వచ్చినట్లు).
65. సంతన లేని ఇల్లు చావడికొట్టం.
66. సంత పాతతొత్తు సన్యాసి నెఱుగునా?
67. సంత మెఱ్గు సాని ఎఱుగును.
68. సంతలో కొడితే సాక్షులెవరు?
69. సంతళొ బేరము లచ్చికి గాజులకు సరి.
70. సంతానానికని సప్తసాగరయాత్ర వెడితే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడ్చుక పోయిందట.
71. సంతోషం సగం సత్తువ
72. సంతోషము సగం బలం.
73. సంతోషానికి సాకు లేదు, ఆలోచన కంతులేదు.
74. సందడిలో సడేమియా, నీకూ నాకూ లడేమియా.
75. సందడిలో సమారాధన! (చేసినట్లు).
76. సందాయ సందాయ అంటే చిచ్చాయ చిచ్చాయ అన్నదట.
77. సందుజూచి పెట్టెలు దించినట్లు (పీర్ల పెట్టెలు).
78. సందు దొరికితే, చావడికొట్టం చంక బెట్టినట్లు.
79. సంధ్య వార్చినావురా? అంటే, ఊరివెలుపల గుంటలో వార్చినా నన్నాడట. అయితే ఆ గుంటలో నీళ్ళు లేవే? అంటే, చాకలి సుబ్బుడు ఉన్నవని చెప్పినాడు నాయనా! అన్నాడట.
80. సంపద గలదేని సన్నిపాతము పూను.
81. సంపదగలిగినవాని సన్నిపాతం వలె.
82. సంపదగలిగిన్ తల్లికి వేకటిగాని తీరదు.
83. సంపదలున్న నాడే బంధువుల రాక, చెరువు నిండినవాడే కప్పల చేరిక.
84. సంపదలో మరపులు, ఆపదలఓ అఱపులు.
85. సంపద స్నేహితులను కల్పించును, దరిద్రము వారిని ఒకటిగా బంధించును.
86. సంపద ఒకరిది, అనుభవం ఇంకొరరిది.
87. సంబరపు చలిగాలికి ఎదురువాకిలి వలె.
88. సంబరానికి సోకి పోసికుంటే, కిక్క జమిడికే ఏనుకపోయిందట (జమిడికే=జంటాయికే).
89. సంభావనలో వచ్చిన పావలా లోటు, నేతిలో తీస్తా నన్నట్టు.
90. సంసారం గట్టి, మెడ ఒట్టి.
91. సంసారం గుట్టు, వ్యాధి రట్టు.
92. సంసారం జానెడు, ఖర్చు బారెడు.
93. సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే, బూడిద బుఱ్ఱకాయ గాడిద బరువైనాయట.
94. సంసారం లేనివారికి సరసాలెక్కువ.
95. సంసారం సాగనిది ఆడదాని వ్రాత, పిల్లలు బ్రతకనిది మొగవాని వ్రాత.
96. సంసారికి సాగు వాటు, సన్యాసికి జోగు వాటు.
97. సంసారి తిరిగి చెడును, సన్యాసి (జోగి) తిరుగక చెడును.
98. సంసారి దుఃఖి, సన్యాసి సుఖి.
99. సంసారి బీద గానీ చేను బీద గాదు.
100. సంసారి సైయ్ - సన్యాసి సైయ్ అన్నాడట చలికిచచ్చే సన్యాసి.

Tuesday, February 7, 2012

సామెతలు 89


1. వెలుగు నీడ, గ్రామం తోడు.
2. వెలుగు లేకున్న చీకటి లేదు, చీకటి లేకున్న వెలుగు లేదు.
3. వెలుగే చేనుమేస్తే కాచేవా రెవరు? (వెలుగు=కంచె, కర)
4. వెలుతురుకట్టెల (పుల్లల) వెలుగని వెలిగించు కొంటారా? (వెలుతురుకట్టె= ఒక అడవిచెట్టు పుల్లలు, బెరడుతీసి వెలిగించిన చమురుబోసిన దివిటీవలె వెలుగుచుండును).
5. వెలుపల వేడుక, లోపల కసపు.
6. వెల్లకిత్తలా పడుకుని ఉమ్మివేస్తే (ముఖం)మీద పడుతుంది.
7. వెల్లకిలా వేసి పొడిస్తే ఒక్క దెబ్బకే చస్తున్నదని సన్యాసుల మయిన మేమెందుకు చెప్పడం.
8. వెల్లటూరిలో ఎద్దును, పరుచూరులో పడుచును ఇవ్వకూడదు.
9. వెల్లుల్లి వనానికి జోరీగ, పాడూరికి దరిబేసి రాజులు (దరిబేసి= దర్ వేష్ అను ముస్లిం సన్న్యాసి గణము; నలుచదరపు రంగురంగుల పేలికలతో బొంత కుట్టుకొందురు. భిక్షగాడు లేక దరిద్రుడని భావము).
10. వెళ్ళిపొమ్మంటే, పెళ్ళికి వెళ్ళుదా మన్నట్లు.
11. వెళ్ళిపొమ్మంటే చూరుపట్టుకొని వ్రేళ్ళాడినట్లు.


వే


12. వేగీవేగనమ్మ వేకువజామున ముట్టయితే, తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట.
13. వేగీవేగని పెసరపప్పు, వెనుకవచ్చిన పెండ్లాము రుచి.
14. వేగుకు ముందు చీకట్లు దట్టమైనట్లు.
15. వేటకాని ఇల్లు వెఱవక కుందేలు సొచ్చినట్లు.
16. వేచని కందిపప్పు, అవివేకుని మెప్పు.
17. వేటుకు వేటు, మాటకు మాట.
18. వేడికోర్వలేనమ్మ సహగమనం చేస్తానన్నదిట.
19. వేడినీళ్ళకు ఇల్లు కాలునా?
20. వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్లు.
21. వేసేవి పులిగురకలు, మేసేవి గడ్డిపరకలు.
22. వేస్తివిరా కన్నం అంటే, చేస్తివిలే కాపురం అన్నట్లు.
23. వేస్తే మునగకొయ్య, తీస్తే చండ్రకొయ్య (చండ్ర=చాలా బాగ కాలేకొయ్య).
24. వేళ్ళపై నీళ్ళుపోసినా కొసలకే (చెట్లకు).


వై


25. వైదీకపు పిల్లీ! వ్రత్తిపలకవే అంటే, మ్ర్యావ్ మ్ర్యావ్ అన్నదట.
26. వైదీకుని చేతి విడిమాయె వనిత బ్రతుకు.
27. వైదీకి వైద్యంలో చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే.
28. వైద్యం నేర్వనివాడు, వానకు తడియనివాడు లేడు.
29. వైద్యుడా! నీ సంచీలో వేడినీళ్ళు ఉన్నవా అన్నట్లు.
30. వైద్యుడి పెండ్లాముగూడా ముండమోసేదే అన్నాడట.
31. వైద్యుడు మొదట తన వ్యాధిని పోగొట్టుకోవాల.
32. వైద్యుడు రోగాలు కోరు, వైశ్యుడు కరువు కోరు.
33. వైద్యుని పేరుచెప్పితే వ్యాధిపోవునా?
34. వైద్యుని భార్యకే భగంధర రోగము.
35. వైరాగ్యం ముదిరితే, వారవనితకూడా తల్లితో సమానం.
36. వైరికి గానీ వడ్లు మొదగవు.
37. వైష్ణవుని మెడలో రుద్రాక్షలు కట్టినట్లు.
38. వైశ్యుల పెండ్లిలో వితరణలేదు.
39. వైష్ణవులలో రామభద్రయ్య, శైవులలో వీరభద్రయ్య, స్మార్తులలో వట్టి భద్రయ్య.
40. వైష్ణవులలో లింగయ్య ఉండడుగానీ, శైవులలో రామలింగయ్య ఉంటాడు (పేర్లు).


వ్య


41. వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల చేరురా.
42. వ్యవసాయం వెఱ్ఱివాని (గుడ్డివాని) చేతి రాయి.
43. వ్యవసాయం ఏలిననాటి శని, భార్య జన్మశని.


వ్యా


44. వ్యాది దెలియలేని వైద్యుడేరికినేల?
45. వ్యాధి పీడితుడు దైవచింతనచేయు.
46. వ్యాధి రట్టు సంసారం గుట్టు.
47. వ్యాధి వచ్చినవాడు వెఱ్ఱిబట్టినవాడు ఒకటి.
48. వ్యాపారం చమురు వంటిది, కాబట్టే దాంట్లో మరేదీ ఇమడదు.
49. వ్యాధికి మందుగానీ విధికి మందా?
50. వ్యాధిహీనునికి పరవైద్యుని చెలిమేల?
51. వ్యాపారం జోరుగా సాగిపోతున్నది, రెండోబఱ్ఱెను అమ్మి డబ్బు పంపమన్నట్లు.
52. వ్యాపారి విత్తంబు వారకాంతలపాలు, కల్జువిత్తము రుంజుకాని పాలు (రుంజు=చర్మ వ్యాపారి).
53. వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోకతమా? అన్నట్లు.


వ్ర


54. వ్రతం చెడ్డా సుఖం (ఫలం) దక్కవలె.


వ్రా


55. వ్రాత కరణమా? మేత కరణమా?
56. వ్రాతగదే కూతురా! అంటే, కోతిమొగుడే అమ్మా అన్నట్లు.
56. వ్రాత దైవమండ్రు, చేత పౌరుషమండ్రు.
57. వ్రాత బలి గోరును.
58. వ్రాత రాజ్యమేలాలని ఉంటే, గ్రహచారం (కర్మం) గాడిదల నేలమన్నదట (మేపమన్నదట).
59. వ్రాత రానివాడు కోత (స)కరణం, వ్రాతా కోతా రానివాడు మేతకరణం.
60. వ్రాత వెంతగాని వరమీదు దైవంబు.
61. వ్రాసే వాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.




62. శంకులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు.
63. శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థం కాదు.
64. శకునంవేళ ఎక్కడికని అడుగకూడదు గానీ ఎక్కడికో చెప్పిపో అన్నట్లు.
65. శక్తి ఎవరిసొమ్ము యుక్తిచే సాధింప.
66. శక్తిచాలనివాడు సాధుత్వము వహించు.
67. శఠగోపం లేకుంటే నా శంఠంపోయేగానీ ఇంట్Yఇకిపోయి గంటె బోర్లించుకుంటాను.
68. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
69. శతాపరాధములకు సహస్త్రదండనములు లేవు.
70. శనగలు తిని చేయి కడుగుకొన్నట్లు.
71. శని పట్టితే ఏడేళ్ళు, నేను పట్టితే పద్నాలుగేళ్ళు.
72. శనిపీనుగా తనిగా పోదు (తనిగా=ఒంటరిగా)
73. శనివారం వాన శనివారమే విడుచును.
74. శని విఱగడ, పని ఒబ్బిడి.
75. శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలెక్కువ.
76. శయనైకాదశి తెలిసినవాడే శాస్త్రకారుడు.
77. శరణార్థిని లింగప్పా! అంటే, కందులు మూడుమాడలు అన్నాడట; చిన్నాపెద్దా బాగున్నారా? అంటే, పప్పు లక్కవలే ఉడుకుతుంది అన్నాడట.
78. శరత్కాలవర్షం, గృపణుని ఔదార్యం వంటిది.
79. శరము చాటేడు, చెప్పులు మూటెడు.
80. శరము తప్పిన చెవులు వినరావు, గుణము తప్పిన కళ్ళు కానరావు.
81. శల్య సారథ్యం.
82. శవం బరువని శష్పాలు బెరికి వేసినట్లు.
83. శవానికి చేసిన అలంకారం వలె.


శా


84. శాంతము లేక సౌఖ్యము లేదు, దాందునికైనా, వేదాంతునికైనా.
85. శాగరోకలి యిరుగు పెట్టినట్లు.
86. శాపాలకు చచ్చినవాడు, దీవనలకు బ్రతికినవాడు లేడు.
87. శాఫాళు ఊత్సవాలవంటివి, అవి ఊరేగి ఊరేగి బయలుదేరిన చోటుకే వచ్చిచేరును.
88. శాస్త్రం తప్పు, చచ్చేది నిజం.
89. శాస్త్రప్రకారం విషయిస్తే కుక్కమూతి బిడ్డలు పుట్టినట్లు.
90. శాస్త్రులవారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడరేణమని (పేడని) ఎఱుగనా? అన్నదట.
91. శాస్త్రులవారు కొడుకు బ్రతికి నిర్వాహకుడే, చచ్చీ నిర్వాహకుడే (నిర్వాహకుడు= మోసెవారు లేరని, బాగా నిర్వహించుకొనేవాడని అర్ధాంతరము).


శి


92. శింగిడి లేస్తే పదిహేనుదినాల వర్షం (శింగిడి= ఇంద్రధనుస్సు).
93. శుఖి శిఖిల మీద మిడతలు చెనసి(గి)నట్లు.
94. శిర సుందగ మోకాటికి సేనలు బోసినట్లు.
95. శిలాభోగం, స్థలభోగం, నరా(ర)భోగం అన్నారు.
96. శివరాత్రికి చలి శివశివా! అనిపోతుంది.
97. శివరాత్రికి చంక లెత్తనీయదు (చలి).
98. శివరాత్రికి చింతగింజలంత చలి.
99. శివరాత్రికి చింతాకంత వెట్ట.
100. శివరాత్రికి జీడిపిందె, ఊగాదికి ఊరుగాయ.

Wednesday, February 1, 2012

సామెతలు 88


1. వీసం గల రెడ్డికి విడువా, ముడువా సరిపోయింది.
2. వీసానికి వాసిన్నర అయితే, దూలన్నర ఎంత?
3. వీసెడు చింతపండు పాసంగానికే సరిపోయింది. (పాసంగం=పడికట్టుట, దాళా,తక్కెడ తూకం మొదట సరిచేయుట).


వృ


4. వృథా బోడ (సన్నాసి) వైతివి, పొందవైతివి.
5. వృధనారి పతివ్రత.
6. వృధ వైద్యం - బాల జోస్యం.
7. వృష్టికి ప్రమాణం ఉత్తరహస్తలు (కార్తెలు).


వె


8. వెంకటరెడ్డే కంకి కొరికితే, వెంటవచ్చినవాండ్లూ రకుంటారా?
9. వెంకన్న తిండి జూచిన అంకాళ్ళమ్మకును సైతమరగుండె పడున్.
10. వెంకయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు, రానూ వచ్చాడు.
11. వెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది.
12. వెంట పోయినా వెనుక పోరాదు.
13. వెంటపోయైనా చూడాలి, యింట ఉండైనా చూడాలి.
14. వెంట రావద్దంటే, ఎత్తుకోమని ఏడ్చాడట (బిడ్డ).
15. వెంట్రుకకన్నా ఏడుపాళ్ళు సన్నం, రోకలికన్నా ఏడుపాళ్ళు లావు.
16. వెంట్రుక పట్టుకొని ప్రాకులాడినట్లు.
17. వెంట్రుకలు పెరికివేయగానే పీనుగు తేలిక అవుతుందా?
18. వెంట్రుక లున్నమ్మ ఏకొప్పైనా పెట్టుతుంది.
19. వెండి బేరమాడుతూ బంగారు కొసరినట్లు.
20. వెంపలి పూస్తేనేమి, కాస్తేనేమి?
21. వెంపలి చెట్లకు దోట్లు వేసినట్లు.
22. వెక్కిరించబోయి బోర్లపడినట్లు.
23. వెచ్చంగా ఉంటే ఏరుకతింటారు, పచ్చంగా ఉంటే పారిపోతారు.
24. వెట్టికి కని వెలుగులో పాఱవేసినట్లు.
25. వెట్టికి గదరా పోలా! అంటే, ఏడవక తప్పడే అయ్యా! అన్నట్లు.
26. వెట్టికి చెపితే వేగుదాకా చెప్పమన్నట్లు.
27. వెట్టికి పుట్టినబిడ్డ నెత్తికి లేక ఏడ్చిందట.
28. వెట్టి గుఱ్ఱం, తంగెడు బఱ్ఱె.
29. వెట్టి గొలువరాదు విభుడెంత ఘనుడైన.
30. వెట్టి మూటకీ, పంక్తి భోజనానికి ముందుగా వెళ్ళాలి.
31. వెట్టికి వెల ఏది?
32. వెతకివెతకి వెయ్యి బళ్ళమీద వంటలక్కను తెస్తే, తగిలేని మిగిలేని తోటకూరకి తొడలోతు ఎసరు పెట్టిందట.
33. వెదకి వెదకి యతడు వెఱ్ఱియై చెడిపోయె.
34. వెదకు అదను అయితే, వెలుగులో చల్లినా మంచిదే (వెద=విత్తనము చల్లుట).
35. వెదుక బోయిన తీగ కాలికి తగిలినట్లు.
36. వెదుక బోయిన తీర్థ మెదురైనట్లు.
37. వెధవ ముండకైనా వేవిళ్ళు తప్పవు.
38. వెధవముండా! వేరుంద మన్నట్లు.
39. వెనుక గుద్దరా శిష్యా! అంటే, వెనుక గుద్దగాక మొగం ఉంటుందా స్వామి- అన్నాడట.
40. వెనుక తుమ్ము ముందుకు మంచిది.
41. వెన్నకు పండిచ్చి, దూలాలు కంకిననాడు.
42. వెన్నకు కళ్ళువచ్చి, ఏకులు కమికిన నాటికిగద!
43. వెన్న కత్తి దెబ్బకోర్చునా?
44. వెన్న కొద్దీ నెయ్యి.
45. వెన్న చేతబట్టుకొని నేతికి వెదకినట్లు.
46. వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే, చల్ల దాగినవాని చావమోదినట్లు.
47. వెన్నతో కొట్టిన వానిని రాయితో కొట్టినట్లు.
48. వెన్న దగ్గఱ ఉంచుకొని, నేతికి తడుముకొన్నట్లు.
49. వెన్నను సన్నగా నూరినట్లు.
50. వెన్న పెట్టితే మింగలేడు, వేలు పెడితే కఱవలేడు (కొఱకలేడు).
51. వెన్నబడే సమయానికి బాన పగిలినట్లు (బాన=తరికుండ).
52. వెన్నముద్ద కేల వేడినీరపు పొందు?
53. వెన్నముద్ద పారవేసి వేళ్ళు నాకినట్లు.
54. వెన్నయుండ నేతికెవరైన వ్యసనపడుదురా?
55. వెన్నలా దున్నితే వెన్నులకేమి కొదువ? (వెన్నులు కొండలాది).
56. వెన్నలో వెంట్రుక తీసినట్లు.
57. వెన్ను మీద గువ్వ (గూబ; అరిష్టము) (వెన్ను=ఇంటివెన్నుగాడి).
58. వెన్ను ముదిరి పొర్లిన గొడ్డు ఎక్కువ పాలిస్తుంది.
59. వెన్ను మూరెడు, దంటు బారెడు.
60. వెన్నెల దినాల్లోనే అల్లో(ల్ల)నేరేడి పళ్ళు.
61. వెయ్యి ఆవులు కలవానికి ఒకటి (పాలి ఇవ్వక) తన్నిననేమి?
62. వెయ్యి ఆవు లున్నవానికి ఒకటి ఎగజేసితే నేమి?
63. వెయ్యి ఇండ్ల పూజారి వెతికినా దొరకడు.
64. వెయ్యి కన్నులు రేయికుంటే, పగటికేమో ఒకతే (చుక్కలు, సూర్యుడు).
65. వెయ్యి కాకుల కొకే రాయి.
66. వెయ్యి పుట్ల వడ్లకు ఒక చిలుకపురుగు చాలు.
67. వెయ్యి మోపులు వేకువజాము కట్టకు లోకువే.
68. వెయ్యి మోపులు మంచుమోపుకు లోకువే.
69. వెయ్యి రూపాయిలు కావలెనా? వెధవ తోడబుట్టువు కావలెనా?
70. వెయ్యి రూపాయలు పెట్టి ఎద్దును కొన్నా, ముల్లుకఱ్ఱ ఉండాల.
71. వెయ్యి రూపాయిలు పెట్టి ఏనుగును కొని, అరవీసం అంకుశానికి పాలు మాలినట్లు.
72. వెరపింపగాబోయి వెరచినట్లు.
73. వెఱ్ఱి కుక్కను బట్టి వేటాడవచ్చునా?
74. వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
75. వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, దూడా బఱ్ఱె దూసుక తిన్నవట.
76. వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, ఊరి బఱ్ఱెగొడ్లన్ని వెంటబడినవట.
77. వెఱ్ఱిది వెంకటమ్మ మనువుపోయి మళ్ళీ వచ్చింది.
78. వెఱ్ఱిదైన కుక్క వేసారి దిరుగురా.
79. వెఱ్ఱిపెయ్యకు తొఱ్ఱిపెయ్య తోడు.
80. వెఱ్ఱిముండ వేడుక చూడబోతే, వెతక నిద్దరు, ఏడువ నిద్దరు.
81. వెఱ్ఱిమొద్దుకేల వేదశాస్త్రాలు?
82. వెఱ్ఱివాడి పెళ్ళాం వాడకల్లా వదినే.
83. వెఱ్ఱివాడు ఏతాం తొక్కినట్లు.
84. వెఱ్ఱివాడు వెఱ్ఱివాడు అంటే, వెక్కి వెక్కి ఏడ్చినాడట.
85. వెఱ్ఱివాని చేతిరాయి తగిలెనా తగులును, తప్పెనా తప్పును.
86. వెఱ్ఱి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.
87. వెలమ నీల్గు, బరపట గంజి, తెడ్డు తేరా దేవుకతిందాం.
88. వెలమ మెచ్చిన ముచ్చట జెప్పు - అలిగిన ప్రాణహాని దెచ్చు.
89. వెలమ చెలిమి కలలోకన్నా కలిమి వంటిది.
90. వెలమ పొందు వెయ్యేండ్లు చేసినా కాసు వీసమైనా కానరాదు.
91. వెలమల వితరణ, సాతాని శాస్త్రవాదము.
92. వెలమలున్న ఊరు - కొంగలున్న మఱ్ఱి - ఒకటి.
93. వెలమవారి పెండ్లికొడుకు మారడుగానేరడు, ఉన్నదంతా ఊడ్చిపెట్టు.
94. వెలయాలి మాట - కలలోని మూట.
95. వెల సులభం, ఫల మధికం.
96. వెలిగొండవంటి తండ్రికంటే, ఏకులబుట్టవంటి తల్లిమేలు.
97. వెలిచవుల్ గొనుకాంత వెరువదు నిందుకు.
98. వెలిపొలమును, వెధవపిల్లను వదలకూడదు.
99. వెలుగుకన్న దిక్కు వేరెవరున్నారు?
100. వెలివాడలో వేదఘోష ఉంటుందా?

Saturday, January 7, 2012

సామెతలు 87


1. విత్తంకొద్దీ విభవము! విద్య కొద్ది వినయము.
2. విత్తకుండానే కోస్తా మన్నట్లు.
3. విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?
4. విత్తనం మళ్ళితే, విడవకుండా ఏడేండ్లు సేద్యం చెయ్యమన్నారు.
5. విత్తనముకొద్ది మొక్క.
6. విత్తనములో లేనిది విశ్వంలో లేదు.
7. విత్తనము వేసి, పొత్తు కలిపినట్లు.
8. విత్తనానికి దాపరికం (గుట్టు), విద్యకు వెల్లడి (రట్టూ) అవసరం.
9. విత్తనాలకు పోయిన రెడ్డి, ఓదెలెత్తగా వచ్చినాడట (ఓదె=పైరుకోసి ఎండుతకు కయ్యలో బారులు బారులుగా వేసినవి).
10. విత్తనాల సంచులు మంచివయితే, విత్తపుసంచులు నిండును.
11. విత్తనా లుంటేనే పెత్తనాలు.
12. విత్తహీనుడు ధర్మవృత్తి దలచు.
13. విత్తిన కొలది పైరు.
14. విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకొకటి మొలచునా?
15. విత్తుకన్నా క్షేత్రం మెరుగు.
16. విత్తుకు వేయి విత్తులు.
17. విత్తుటకు శుక్రవారం, కోతకు గురువారం.
18. విత్తు మంచిదయితే కాయా మంచిదగును.
19. విత్తు మంచిదయితే రైతుకు మంచిదగును.
20. విత్తు ముందా? చెట్టు ముందా?
21. విత్తులు దీసిన కోడె - యీకలు పెరికిన కోడి.
22. విత్తే చెట్టయ్యేది.
23. విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తనకు తానే కనబడతాడు.
24. విద్యాప్రసంగముల్విన రసఙ్ఞతలేని రసికుల సభ, సభగాదు గ్రామరచ్చ గాని.
25. విధవకు తలసుళ్ళు వెదకినట్లు.
26. విధవకు మ్రొక్కితే ' నావలనే వెయ్యేళ్ళు వర్థిల్ల ' మన్నది, రెండోసారి దండం బెట్టితే, 'నా మొగుడు మాదిరే బ్రతుక ' మన్నదిట.
27. విధవకు విరజాజి పూదండ కావలెనా? (లేల?)
28. విధవైన మేలు, మగనికి తిథిబెట్టును, కథలు వినును, తీర్థము లాడున్.
29. విధి వస్తే పొదలడ్డమా?
30. వినకు, అనకు, కనకు (చెడ్డవి).
31. వినయోక్తులు లేని ఈవి వ్యర్థము.
32. వినరాదు, కనరాదు, అనరాదు (చెడ్డ).
33. వినని బంటుకు వెన్నపూస కూడానా?
34. వినను కనను రెండేసి ఇచ్చి, అనను ఒకటే ఇచ్చినాడు - దేవుడు (చెవులు, కన్నులు, నాలుక; అంటే ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాల అనుట).
35. వినయం లోకవశీకరం, విద్య రాజవశీకరం.
36. వినాయకుడిమీద భక్తా, ఉండ్రాళ్ళమీది భక్తా?
37. వినాయకుని చేసియిస్తావా కుమ్మరీ అంటే, వాడి అబ్బను చేసిస్తానని లింగం చేసి యిచ్చినాడట.
38. విని రమ్మంటే తిని వచ్చినట్లు.
39. వినేవాటికి (చెవులకు) కనేవాటికి (కంద్లకు) బెత్తెడే దూరం.
40. విన్న మాటకంటే చెప్పుడు మాటలు చెడ్డవి.
41. విన్నమాట కన్నంత నమ్మదగింది కాదు.
42. విన్నమ్మ వీపు కాలింది, కన్నమ్మ కడుపు కాలింది.
43. విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించినవన్నీ వెలిబుచ్చవద్దు.
44. విప్రహస్తము వేదాండ హస్తము ఊరుకోవు.
45. వీభూది పట్టెలు పెట్టుకుంటే, విష్ణుమూర్తి వనుకున్నానే, ఆంజనేయుడివటోయ్! వెంకటేశ్వర్లు.
46. వియ్యంకునికి వీపుదెబ్బలు, వియ్యపురాలికి వీపుదెబ్బలు.
47. వియ్యపురాలికి వీపుదెబ్బ, నాకు తోపుదెబ్బ.
48. వియ్యపురాలి పేరు విసరమ్మ, నాపేరు దంచమ్మ (విసరు+అమ్మ; దంచు+అమ్మ).
49. వియ్యపువారింట జాడ్యాలు ఇకిలించినా పోవు.
50. వియ్యానికి కయ్యం తోబుట్టువు.
51. వియ్యానికయినా, కయ్యానికయినా సాటి ఉండాల.
52. వియ్యానికి కయ్యానికి సమతవలయు.
53. వియ్యాలందితే కయ్యా లందుతవి.
54. వియ్యాలవారింటికి పోతే వీపులమీదనే వస్తుంది (స్పొటకం).
55. విరచుకొని విరచుకొని వియ్యపురాలింటికి పోతే, పలుగురాళ్ళతో నలుగు పెట్టిందట.
56. విరామం లేని పశువుకు ఊరట లావు.
57. విరాలికి ఆమనివంటి చుట్టము లేదు.
58. విరిగిన వేలుమీద ఉచ్చ పోయనివాడు, వినాయకుడికి టెంకాయ కొడతాడా?
59. విరిగేదాని కంటే వంగేదే మేలు.
60. విరజాజి పూదంద విధవకేల?
61. విరి దాస్తే తావి దాగుతుందా?
62. విరుగుబాటు పైని నూనెబొట్టు, విరచికట్లపైని పెరుగుబొట్టు.
63. విరోధికి అపశకునం కలిగించను, తనముక్కు కోసుకొని ఎదురుపడినాడట.
64. విలుచుటకు ముందే విక్రయించే సులువు చూడాలి.
65. విల్లమ్ములు కలవారికి చల్లకడవలవారు తోడా?
66. విశాఖ (కార్తె) కురిసిన, విషము పెట్టినట్లు.
67. విశాఖ చూచి విడువర కొంప (ఉత్తరజూచి ఎత్తర గంప).
68. విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లు.
69. విశాఖ్స్యో మబ్బులు, మజ్జిగతో భోజనం సరి.
70. విశాఖతో మేఘాలు, ప్రసూతితో యవ్వనము సరి.
71. విశాఖ వరదలు - సంక్రాంతి మబ్బులు.
72. విశేషము లేనిది వింతెలా పుడుతుంది?
73. విశ్వాసం తప్పిన పీనుగు మోసినవాడిని పట్టిందట.
74. విషపాళపు విత్తు, నేపాళపు గింజ.
75. విషములో పుట్టిన పురుగుకు విషమే ఆహారం.
76. విషములో పుట్టిన పురుగు విషములోనే జీవిస్తుంది.
77. విషయం లేని వక్తకు వాగాడంబరం ఎక్కువ.
78. విషానికి విషమే విరుగుడు.
79. విసరగా, విసరగా ఒక రాయి, తిట్టగా తిట్టగా ఒక తిట్టు తగులును.
80. విసిరిన రాయి గాలికి పోయినట్లు.
81. విసరురాయి గాలికికొట్టుకపోతే, విస్తరాకు సంగతి చెప్పాలనా?
82. విస్తరి(ర) కొదవా, సంసారపు కొదవా తీర్చేవారెవరు?
83. విస్తరి చిన్నది, వీరమ్మ చెయ్యి పెద్దది.
84. విస్తళ్ళు ఎత్తమంటే, భోంచేసిన వారెందరని లెక్కబెట్టినాడట.
85. విస్సన్న చెప్పినదే వేదం.


వీ


86. వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకొన్నట్లు.
87. వీధిలోన దిరుగ వెలది పురుషుడౌనె?
88. వీపు గుద్దరా శిష్యా అంటే, నీకంటే తక్కువ తిన్నదెవరు అన్నాడట.
89. వీపు తోమరా! అంటే, ఇక్కడొక బొక్క ఉన్నదే అన్నాడట.
90. వీపున తన్నుతుంటే, యింటివెనుక చప్పుడన్నట్లు.
91. వీపుమీద కొట్టవచ్చును గానీ, కడుపుమీద కొట్టరాదు.
92. వీరక్క పెండ్లిలో పేరక్క శోభనం.
93. వీరన్న ముందు బసవన్న, గౌరి ముందు గణేశుడు.
94. వీరభద్రపళ్ళెమునకు హనుమ త్పళ్ళెము.
95. వీరభోగ్య వసుంధర.
96. వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.
97. వీలెరిగి మాట, కీలెరిగి వాత.
98. వీసం ఇచ్చి, వాసానికి ఒడ్డినట్లు.
99. వీసం ఖర్చు లేకుండా నోము నోముతాను, ఆశపడకండి అడవ నా బిడ్డల్లారా!
100. వీసం గల అమ్మి విడువా ముడువా, కాసుగల అమ్మి కట్టా, పెట్టా.

Sunday, January 1, 2012

సామెతలు 86


1. వల్లకాటి వైరాగ్యం, పురిటాలి వైరాగ్యం (స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం).
2. వసుక వేయబోయిన, వాతప్పులవాడు తగిలినాడు.
3. వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట (చాలని కాలానికి).
4. వస్తా ఏమి తెస్తావు, పోతా ఏమి ఇచ్చి పోతావు?
5. వస్తా నన్నదాన్ని, ఇస్తానన్న వాణ్ణి నమ్మరాదు.
6. వస్తానయ్యా! బాపనయ్యా! అంటే, వద్దే! ముండా! వర్జముంది అన్నాడట.
7. వస్తావు పోతావు నా కొఱకు, వచ్చి కూర్చున్నాడు నీకొఱకు.
8. వస్తుగుణం తెలియనివాడు వైద్యంలో మొనగాడే.
9. వస్తూ ఇళ్ళు నింపుతుంది, పోతూ పెరళ్ళు నింపుతుంది (అరికె).
10. వస్త్రహీనము విస్తరహీనము పనికిరావు.
11. వసిష్టుని వాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవలె.


వా


12. వాంతి వస్తే పెదవు అడ్డమా?
13. వాకిలి దాటగానే వారణాసి ఎంతదూర మన్నట్లు.
14. వాక్చాతుర్యములేని వేశ్య, గుణకారము లేని లెక్క.
15. వాగార్త చేలకు సొనలే వరవలు (వాగార్త=సముద్రతీరము).
16. వాగు నీళ్ళు, వనం పత్రి.
17. వాగులో పోతున్నావే సెట్టి? అంటే, లాభం లేందే పోతానా అన్నట్లు.
18. వాగ్దానం ఎందరు అవివేకులనో తృప్తి పరుస్తుంది.
19. వాగ్దానం చేసేవాడు వాటిని మరచిపోవడం గూడా నేర్చుకొని ఉంటాడు.
20. వాచినమ్మకు పాచి(సి)నకూడు పెడితే, మాఅత్త పరమాన్నం పెట్టిందని ఇరుగింట పొరుగింట చెప్పుకున్నదట.
21. వాడవదిన కేల వావివరుసలు?
22. వాడికి నలభై జరిగింది (నలభై=40వ సంవత్సరం పరాభవ అంటే అవమానం జరిగింది).
23. వాడికి వీడికి నిప్పుకు ఉప్పుకు (వలె ఉన్నది).
24. వాడి కేడట్ఠాలే గ్రంథమయింది గానీ, మనకి పై అట్ఠలు కూడావచ్చు.
25. వాడి తండ్రి, మాతండ్రి సయాం మగవాళ్ళు-అన్నట్లు.
26. వాడిపోయిన పూవులు ముడుచువారుందురా?
27. వాడు వట్టి ఇరవై ఐదు ఇరవైఆరు ( ఇరవై ఐదు =25వ సంవత్సరం ఖర, 26వది నందన, గాడిదకొడుకని).
28. వాతికి వెరతునా, పీతికి వెరతునా అన్నట్లు.
29. వాతాపి జీర్ణం - వజ్రశరీరం.
30. వాద బ్రష్టుడు, వైద్య శ్రేష్టుడు (వాద= రసవాదం చేసినవాడు).
31. వాది నాశం, ప్రతివాది మృతనష్టం, ప్లీడర్ల అదృష్టం, కోర్టువారి ఇష్టం.
32. వాదు తెచ్చుకోవాలంటే, అప్పు ఇవ్వమన్నారు.
33. వాదులేక ప్రాణం, దాదిలేక రాణి పోరు.
34. వాదులేక వల్లూరికి పోతున్నాను, ఇరుగుపొరుగు నాసవతుల్లారా! ఇల్లు భద్రం (గంప ఎత్తండి) అన్నదట .
35. వాదు సుమీ! అప్పిచ్చుట.
36. వాన ఉంటే కఱవు, పెనిమిటి ఉంటే పేదరికం లేదు.
37. వాన ఎక్కువైతే రొంపికరువు, వాన తక్కువైతే వరపు కరువు.
38. వానకన్నా ముందే వరదనా?
39. వానకు ఎచ్చయిన తేగి వెరచుగానీ ఎనుబోతు వెరచునా?
40. వానకు ముందు ఉఱిమినా, మాటకు ముందు ఏడ్చినా తుదముట్టదు.
41. వాన కురుస్తున్నది నాయనా, అంటే కురవనీలే అనగా, అట్లానే కురవనిస్తాలే అన్నాడట.
42. వానతోడ వచ్చు వడగండ్లు నిలుచునా?
43. వాననాటి వరద, పెళ్ళినాటి పప్పుకూడు.
44. వానపొటుకుకంటే మ్రానుపొటుకు ఎక్కువ (పొటుకు అనే శబ్దంతో చినుకు పడుట).
45. వాన బడాయి చవిటిమీద, మాల బడాయి పాటిమీద, మొగుడి బడాయి ఆలిమీద.
46. వానరాకడ, ప్రాణం పోకడ ఎవఱెరుగుదురు?
47. వానలకు మఖ(కార్తె) కుక్కలకు చిత్త(కార్తె).
48. వానలుంటే పంటలు, లేకుంటే మంటలు.
49. వానలు కురిస్తే వసుంధర.
50. వానలు కురిస్తే వాతలు మాసిపోవు, బిడ్డలు పుడితే ఱంకులు మఱచిపోరు.
51. వానలు ముంచతవోయ్ ! ముంచతవోయ్! అన్నాడట జ్యోతీష్కుడు (ఎగగొట్టినా ముంచుటే, ఎక్కువైనా ముంచుటే).
52. వాన లెక్కడా? అంటే దానధర్మాలున్న ధరణిలో అన్నట్లు.
53. వానలేని వట్టి పిడుగు వలె.
54. వానవచ్చినందుకు వంక పారిందే గుర్తు.
55. వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు (ఆడేవాళ్ళందరూ మారి మారి వాయించుచుందురు).
56. వాపును చూచి బలుపను కొన్నట్లు.
57. వాపు బలుపు గాదు - వాత అందము గాదు.
58. వాపు మానునుగాని వాతలు మానునా?
59. వాములు మింగే స్వాములవారికి పచ్చిగడ్డిమోపులు పలహారము (బరోబరు).
60. వామ్ము తింటావా, మామా? అంటే, వామ్ముపోసకు సందుంటే ఒక వడతునకే తిననా అన్నాడట.
61. వాయిపట్టే సందే ఉన్న, ఒక భక్ష్యమైనా తినేవాడిని.
62. వారకాంత జనంబులకు వావి గలదె?
63. వారకాంతలేల వలచెదూరక?
64. వారవనిత ధనికు చేరదీయగోరును.
65. వారాశి దాటినను శని మారకుడై పట్టి చంపు.
66. వాలుపై (వాదరపై) నడిచినట్లు (సాము).
67. వాళ్ళు పిల్లనివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.
68. వావివరుసదప్పి వర్తించి చెడుదురు.
69. వాసానికి తగ్గ కూసం.
70. వాసి తరిగితే, వన్నె తరుగుతుంది.
71. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల కామక్క వంకాయలభారం తూగిందట.
72. వాస్తుగలవారి కోడలు వరహా ఇచ్చి క్షవరం చేయించుకుందట.


వి


73. వింటే బేగడ (రాగం) వినాల, తింటే మీగడ తినాల.
74. వింటే భారతం వినాల, తింటే వడలు (గారెలు) తినాల.
75. వింతలమారికి చండ్లు వస్తే మేనమామకు కండ్లు పోయినవట.
76. వింతలేనిదే ఆవులింత పుట్టదు.
77. విందు అయినా మున్నాళ్ళు, మందు అయినా మున్నాళ్ళు (మూడ్నాళ్ళు).
78. విందు భోజనం చేస్తే, మిట్టచేనుకు ఒడ్డు (మడవ) వేసినట్లుండాల (బిఱ్ఱుగా ఉబ్బిపారును).
79. విందు మర్నాడు మందు (కుందు).
80. వికారంవాడు దుకాణం పెడితే, వచ్చే గిరాకీ అట్టే మరలిపోయిందట.
81. వికిరాలలో లేడు, పిండాలలో లేడు (వికిర=పక్షి).
82. విక్రమార్కునివంటి రాజు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు.
83. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి.
84. విఘ్నేశ్వరుని పెండ్లికి వేయి విఘ్నాలు.
85. విచిత్రపు పచ్చిపులుసు ఈగలగొట్టి, తాలింపుపెట్టి ఇద్దరిని రమ్మంటే ముగ్గురు వచ్చారట.
86. విచిత్రం, విన బూటకం! ఆలుగొట్ట మగడేడువ.
87. విచిత్రపు పులుసుకూర విస్తరను మింగిందట.
88. విజయుం డనువుదప్పి విరటుని గొలువడా.
89. విజరానికి తగవు లేదు.
90. విటుని పచ్చ జూచి తాళలేక తానిటు నిలను దిరుగుట. (పచ్చ=బంగారు).
91. విడిచిన ఎద్దు కొట్టందారి చూచును.
92. విడిచిన గుద్ద వీధికి పెద్ద.
93. విడిచినది వీధికి పెద్ద, బరితెగించినది (విడిచినది) బజారుకు పెద్ద.
94. విడిచిన ముండకు వీరేశలింగం, తెగించినవాడికి తెడ్డే లింగం.
95. విడిచిన ముండలకు విడవలూరు (విడవలూరు=నెల్లూరు జిల్లాలో ఒక సంపన్న గ్రామం).
96. విడిచిన ముండ వీధికి పెద్ద, బడివిడిచినముండ బజారుకు పెద్ద.
97. విడిచిన లంజ వీధికెక్కితే, చావిట్లోవాళ్ళు చాటుకు పోయినారట.
98. విడిచిపెట్టిన ఇంటిలో మఱచిన మంగలు (మంగ=అలమేలుమంగ)
99. విడిపించబోయిన పాముకు పగ, విడిపించకున్న కప్పకు పగ (వగ).
100. విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానం.