Thursday, December 30, 2010

సామెతలు 29

1. గాలిలో మేడలు కట్టినట్లు.
2. గాలీవానా కలిస్తే కధ మాసింది.


గి


3. గిరిపూను భారము కరిపూన గలదా?
4. గిరాకి కొననివ్వదు, మందం అమ్మనివ్వదు.
5. గిరాకి కోమట్ల పాలు, మందం మూలల (మాలల) పాలు.


గు


6. గుంటక పురాణం, గంప శతకం.
7. గూంతకాకి వింటి దెబ్బ ఎరుగదు.
8. గుంటలో బిడ్డా, కడుపులో బిడ్డ.
9. గుంటూరు పొగాకు గుట్లో ఉన్నా ఒకటె, నోట్లో ఉన్నా ఒకటె.
10. గుండి (గుండ్రాయి) మింగేవాడికి తలుపులు అప్పడాలు.
11. గుండ్రాయి దాస్తే కూతురి పెండ్లి అగునా?
12. గుండ్లకమ్మ నిండి దరిచేరనీయదు, గంపకమ్మ కలిగి తిననీయదు.
13. గుండ్లు తేలి, బెండ్లు మునిగినట్లు.
14. గుంతకు వస్తే మరదలి, మెట్టకు వస్తే వదిన.
15. గుగ్గిలం వెయ్యకపోతే పోయినావుగానీ గుళ్ళో పిత్తవద్దు.
16. గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?
17. గుగ్గిళ్ళకు నోరు తెరిచి, కళ్ళానికి నోరు మూసినట్లు.
18. గుట్టకు మొరిగిన కుక్క గ్రుడ్లువెళ్ళి చచ్చిందట.
19. గుట్టు మీరువారు గురువునకు గురువురా.
20. గుడగుడ ఆలోచన గుడిశకు చేటు.
21. గుడగుడ శబ్ధం కుండకు నష్టం (మోసం).
22. గుడారంలో గూని బతుకు.
23. గుడి అంతా దేముడైతే గుదమెక్కడ పెట్టేది?
24. గుడి ఉమ్మడి గంతలకు గుట్టు ఉంటుందా?
25. గుడీ కట్టేవాడొకడు, గుళ్ళో దీపం పెట్టేవాడొకడు.
26. గుడికొట్టి ఇటికల తులసి తిన్నెలు గట్టిన ధర్మాత్ముడగునా?
27. గుడి చిన్నదైనా గుళ్ళో దేవుని మహిమ మిన్న.
28. గుడి చుట్టూ తిరిగి బొడ్డులో వేలు పెట్టుకొన్నట్లు.
29. గుడి దెగ్గరైతే గురుత్వం దూరమౌతుంది.
30. గుడి నుండి గుడిరాళ్ళు తీసేవారు.
31. గుడీరాళ్ళు కరచినట్లు, గంగిగోవు పొడిచినట్లు.
32. గుడి మింగేవానికి గుడిలో లింగం ఉట్రవడియం.
33. గుడీ మింగేవాడొకడైతే, గుడీని లింగాన్ని మింగేవాడింకొకడు, గుడీని గోపురాన్ని మింగేది మరిఒకడు.
34. గుడి మింగేవానికి నంది పిండి మిరియం.
35. గుడిమీదనుండి పడినా, గుండాములో పడినా ఒకతే.
36. గుడి ముఖం ఎరుగని దాసరి గుడివెనుక దండం పెట్టినాడట.
37. గుడీమేళం కాదు గుద్ద త్రిప్పను, ఇది నగరిమేళం నడుము విరుగుతుంది.
38. గుడీలో ఉండి, గుడీరాళ్ళు తీసిందట.
39. గుడిలో దేవునికి గుడ్డ లేకుంటే, వాకిట్లో దేవునికి వన్నెచీర అట.
40. గుడీలో లింగంపోతే, నంబి శఠం పోయినట్లు.
41. గుడిలో లింగంపోతే నడుమ నంబికేం నష్టం?
42. గుడిసెకు చందిని, గుడ్డికి అద్దము ఏల?
43. గుడిసేటికి ఇల్లాలు, గుత్త లంజ.
44. గుడ్డకు జాడింపు, కూరకు తాలింపు, కోడలికి సాధింపులేకున్న ఇంపులేదు.
45. గుడ్లమీద కోడిపెట్ట వలె.
46. గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్లు.
47. గుడ్డికంటికి కాటుక పెట్టినట్లు.
48. గుడ్డికంటికి కుంచెడు కాటుకా?
49. గుడ్డికంటికి గుదంచూపినా ఒకటే, అద్దంచూపినా ఒకటే.
50. గుడ్డికంటికి పగలైతేనేమి? రాత్రైతేనేమి?
51. గుడ్డికంటికి రెండు గూటాలు, మెల్లకంటికి రెండు మేళాలు.
52. గుడ్డికన్నా మెల్ల మేలు.
53. గుడ్డికన్ను చారడైతేనేమి? చిన్నదైతేనేమి?
54. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.
55. గుడ్డికేమి కుందనపు చాయ?
56. గుడ్డి గుణమెరుగదు, వడ్డి మొదలెరుగదు.
57. గుడ్డి గుఱ్ఱము తట్ట గుగ్గిళ్ళు తిన పెద్ద.
58. గుడ్డి గుఱ్ఱమెక్కి గుడి చుట్టనగునా?
59. గుడ్డి గుఱ్ఱానికి గుగ్గిళ్ళు చేటు.
60. గుడ్డి గుఱ్ఱానికి దారి ఒకటే.
61. గుడ్డిగేదెలలో గూనిగేదె శ్రీమహాలక్ష్మి.
62. గుడ్డిదానితో పోతే గుడిసెదాకా సాగనంపాల.
63. గుడ్డిది బెదిరిస్తే, బిత్తరపోయి బావిలో పడినాడంట.
64. గుడ్డిది నీళ్ళకుపోతే ముగ్గురికి చేటు.
65. గుడ్డినక్క ఊరినపడినట్లు.
66. గుడ్డి పెండ్లానికి చెవిటి మగడైనట్లు.
67. గుడ్డి మామగారు! నమస్కారమయ్యా అంటే రంధికి మూలమా ఱంకు కోడలా అన్నాడట.
68. గుడ్డి మొగుడికి రేజీకటి పెండ్లం.
69. గుడ్డివాడెరుగునా గురుతైన రత్నంబు.
70. గుడ్డివాడి ఉపాయం గుడ్డివానిది, గూనివాని ఉపాయం గూనివానిది.
71. గుడ్డివాని కన్ను రాగోరునా? పోగోరునా?
72. గుడ్డివాని కాలు కుంతివాని కాధారమైనట్లు.
73. గుడ్డివాడి చేతినూలు కదుట్లో పడుతుందో దిండులో పడుతుందో?
74. గుడ్డివాడు అలావు తొక్కినట్లు.
75. గుడ్డివాడు ఎటు రువ్వినా గురే.
76. గుడ్డివాడు కోట కోల్పోయినట్లు.
77. గుడ్డివాళ్ళ రాజ్యంలో ఒంటికన్నువాడే రాజు.
78. గుడ్డివాళ్ళు ఏనుగు అంగాన్ని పట్టూకొని ఒక్కొక్క విధంగా వర్ణించినట్లు.
79. గుడ్డివేటు గువ్వకి తగిలినట్లు.
80. గుడ్డీ! రావే గుడీకిపోదామూ అన్నట్లు.
81. గుడ్డుపెట్టబోయే కోడి కేరినట్లు.
82. గుడ్డు పెట్టలేక పెట్ట చస్తుంటే, తొక్కను పుంజు చూస్తుండినట్లు.
83. గుడ్డువచ్చి పెట్టను గోరడాలాడిన విధము.
84. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
85. గుడ్డేద్దు చేల్లో(గడ్డిలో) పడినట్లు.
86. గుడ్లగూబను చంకలోబెట్టుకొని బయలుదేరినట్లు.
87. గుడ్లు తిన్నదికాక గూడెక్కి అరచినట్లు.
88. గుణముమానవే గూటాలపోలీ అంటే, నా మనువైనా మానుతాను గానీ నాగుణం మాననన్నదట.
89. గుణము కొఱకా గునుగు కొఱకా వచ్చింది.
90. గుణములేకయున్న గుణహీనురాలయా.
91. గుణములేకయున్న కుదురునా యూహలు?
92. గుణమేమి చేసిందే గునక కడ్డీ? అంటే, ఎప్పటి నాపేరు పంగలకడ్డీ అందట.
93. గుత్తికి పోయి గూటాం తెచ్చుకున్నట్లు.
94. గుద్ద ఒక్కటి గూటాలు పది.
95. గుద్ద నొప్పి గుడ్డుపెట్టే పెట్టకి తెలుసు.
96. గుద్దకు కళ్ళెం పెట్టినట్లు.
97. గుద్దులాడిన ఇంట్లో గుప్పెడు గింజలు నిలువవు.
98. గుప్పిలి మూసి ఉన్నంతవరకే, తెరిస్తే అంతా హుళక్కి.
99. గుబలకమ్మ చళ్ళుచూసి సన్యసిగాడు సంబరపడినాడు.
100. గుమ్మగట్టు జోగులు అమ్మకి ఇల్లు కట్టినట్లు.

Sunday, December 26, 2010

సామెతలు 28

1. గతజల సేతు బంధనం.
2. గతికితే అతకదు.
3. గతి చెడినా మతి చెడరాదు.
4. గతిమాలిన వాడికి కుతి(క) లావు.
5. గతిలేనమ్మకు గంజే పాయసం.
6. గతిలేనమ్మకు మతిలేని మొగుడు.
7. గతిలేని ఊరికి మతిలేని గంగానమ్మ.
8. గతిలేని వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.
9. గతిలేనివాడికి కనపడిందే కూడు.
10. గతుకులకు పోతే బతుకులు పోయినవి.
11. గదరింటిలో పెండ్లి, గడియకింత తిండి.
12. గదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు.
13. గద్దకు సంక్రంతి ముందు సంకెళ్ళు.
14. గద్దించే అత్త, మర్ధించే మామ.
15. గద్దెకు పోయిన సుద్దులు తక్కువా?
16. గప్పాల పోతిరెడ్డికి ముప్పైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.
17. గబగబా అరిచేవాడి పంచ చేరవచ్చును గానీ, నేలముచ్చోడి కడప తొక్కరాదు.
18. గబ్బరీడు కార్తె వర్షాలకు దిబ్బలు కూడా కరుగుతాయి.
19. గబ్బిలము ఆకాశాన్ని పడకుండా పట్టుకుని ఉన్నానన్నట్లు.
20. గబ్బిలం వలే అటు పక్షి కాదు ఇటు జంతువూ కాదు.
21. గబ్బిలాయి మొగం నవ్వినా ఒకటే, ఏడ్చినా ఒకటే.
22. గబ్బుకు గంపెడు ఈగలు.
23. గబ్బువాడూ, గదరువాడు వియ్యమందితే, మురికివాడు వచ్చి ముద్దాడినాడట.
24. గయ్యాళి, గచ్చపొద ఒకటి.
25. గయ్యాళి రచ్చకెక్కితే, సంసారి దొంతుల సందున దాక్కుంది.
26. గరిసె విత్తనాలు పోసి, గంపెడు విత్తనాలు తెచ్చుకొన్నట్లు.
27. గఱిక చేను గాడిద పాలు.
28. గఱిక మేసిన గాడిద చస్తుందిగానీ గఱిక చావదు.
29. గరుడాయ లెస్సా? అంటే శేషాయ లెస్సా అన్నాడట.
30. గరుత్మంతుడిని చూసిన పాము వలె.
31. గర్భదానం అంటే వడలు తినటమనుకున్నానే, గుద్దదిరే పనే అన్నదిట కొత్త పెండ్లికూతురు.
32. గర్భదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు.
33. గర్భదానానికి రమ్మని జాబు రాస్తే, రాను తీరికలేదు, నేనున్నట్లే పనిజరిపించండి అని వ్రాసినాడట.
34. గవ్వన్నరకు గడ్డం గొరుగుతా అంటే, వెంట్రుకున్నరకు ఎంతా? అన్నాడట


గా


35. గాజుకుప్పెలో దీపంవలె.
36. గాజుపూసల గనిలో మణి దొరకునా?
37. గాజులబేరం భోజనానికి సరి.
38. గాజుల చెయ్యి గల గలలాడితే, ఇల్లు కలకల లాడుతుంది.
39. గాటాలు తిన్న కోడె గాటికి రానట్లు (గాటాలు=కష్టాలు).
40. గాటి పిచ్చి గూటి పిచ్చి లేగితే అణిగేది కష్టం.
41. గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు.
42. గాడి తప్పిన బండి వలె.
43. గాడిదకు గడ్డివేసి ఆవును పాలివ్వమన్నట్లు.
44. గాడిదకు తనకూత కమ్మగానే ఉంటుంది.
45. గాడిదకు పులితోలు కప్పితే కఱవ గలదా?
46. గాడిదకు భోగి నీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట.
47. గాడిద కేమితెలుసు గంధపు పొడి వాసన.
48. గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు మేము బిడ్డలము అన్నాడట.
49. గాడిద గుడ్డు కప్ప తలకాయ
50. గాడిద గుడ్డు, గరుడ భంగం.
51. గాడిద గుడ్డు గంధపు సాన.
52. గాడిద చంటిలో కడివెడు పాలు.
53. గాడిదలతో సేద్యం చేస్తూ, కాలి తన్నులకు దడిస్తే ఎలా?
54. గాడిదతో స్నేహం కాలి తన్నులకే.
55. గాడిద పిల్ల కోమలం.
56. గాడిద పుండుకు బూడిద మందు.
57. గాడిద పూర్వ వంశగౌరవం గానీ, భవిష్యత్సంతతిపై గానీ ఆశలేని జీవి.
58. గాడీద ముండా ! ఏటేటా కంటావేమిటే? అంటే నాకు కోపం వస్తే నడుంగల కూడా కంటా అన్నదిట.
59. గాడిద మోయదా గంధపు చెక్కలు.
60. గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్.
61. గాడిదల మోత గుఱ్ఱాల మేత
62. గాడిదలెన్ని మేసినా గరిక తరుగుతుందా?
63. గాడిదలే దున్నితే, దొమ్మరులు పంత కాపులు కారా?
64. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
65. గాడిదలా పరుగెత్తినావేమంటే, గుంపులో చేరబట్టి బెదురు తీరిందన్నాడట.
66. గాడుపట్టిన గంగానమ్మ పూజారితో పోయినట్లు.
67. గాఢాలింగన సౌఖ్యం ప్రౌఢాంగన ఎరుగుగాక బాలేమెరుగున్?
68. గాడుపుకు గడ్డపార కొట్టుకపోగా, ఉల్లిపొట్టు నాగతి ఏమీ? అన్నదిట.
69. గాదెకింద ఎలుక గాదెకిందే బతకాలి.
70. గాదెకింద పందికొక్కు వెలె.
71. గాదెడు కొఱ్ఱులు తిన్నా, కౌజు మూడేకాసులు (కానులు).
72. గాదెడు దోసకాయలలో చేటడు కొఱ్ఱలు పట్టవా?
73. గాదెనిండా బియ్యముంటే, కఱువునా, కాలనా నా భార్యను పిల్లలను నేనే రక్షిస్తాను అన్నాడట.
74. గాదెలో గింజలు గాదెలోనే ఉండాలి, బిడ్డలు గారకాయలులా ఉండాలి.
75. గానుగెద్దు ఒక్కసారిగా దిక్కిటెద్దు అవుతుందా?
76. గానుగరోట్లో చెయ్యిపెట్టి పెరుమాళ్ళ కృప అన్నట్లు.
77. గానుగ రోలు సెద్దె కుడుపేడయింది.
78. గానుగల(లో) నూ(పు)గులుపోసి గానుగకింద సిద్ది పెట్టిందట.
79. గానుగాపే, గానుగాపే, నీవు కూర్చున్న పనేగా నూనెపోయటం.
80. గాము సోకినట్లు.
81. గారాబం గంజికేడిస్తే, ముసలివాడు ముండ కేడ్చాడట.
82. గారాబం గారెలకేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.
83. గారాము గుర్రాని కేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.
84. గారాల బిడ్డపుడితే, గడ్డపారతో చెవులు కుట్టినట్లు.
85. గారువాల బిడ్డకు గడ్డపారతో చెవులుకుట్టి సలికెపారలు తీగలేసిందట. (సలికెపార=మన్ను చెలిగే పార).
86. గారెలు వండాలే పెళ్ళామా అంటే, వేలు చూపించినట్లు.
87. గాలి ఇరవు గాలికే తెలుసు.
88. గాలి ఉన్నప్పుడే తూర్పాన పట్టాల.
89. గాలి చిన్నదీపాన్ని ఆర్పి, మంతను పెద్ద చేస్తుంది.
90. గాలికి పుట్టి, (దుమ్ముకు) ధూళికి పెరిగినట్లు.
91. గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు.
92. గాలికి పోయిన పేలాలు కృష్ణార్పణం.
93. గాలికి పోయిన పేలాలు రామార్పణం (కృష్ణార్పణం) అన్నట్లు.
94. గాలికి పోయేదానిని కాలిమీదకు దోచుకొన్నట్లు.
95. గాలితో తాడు పేనినట్లు.
96. గాలిని మూట కట్టీనా, గయ్యాళి నోరు కట్టలేడు.
97. గాలిపాటు, కలిమి తేట.
98. గాలిమేడలు గురివింద సామ్యం.
99. గాలి లేనిదే దుమారం లేచునా?
100. గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు.

Tuesday, December 21, 2010

సామెతలు 27

1. కోమటి వైష్ణవము, ఉప్పర సన్యాసము.
2. కోమట్ల కోట్లాట, గోచీల ఊగులాట.
3. కోమలి విశ్వాసము పాములతో చెలిమి వంటిది.
4. కోరి అడిగితే కొమ్మెక్కుతారు.
5. కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టాలు అడుగంటుతుంటవి.
6. కోరికోరి బావతో పోతే కుంటివాడు పుట్టాడట.
7. కోరినంత పెట్టెనమ్మా కోతికి శివుడు.
8. కోరి పిల్ల ఇస్తామంటే, కులం తక్కువ అన్నట్లు.
9. కోరి, వీగీ కొడుకును కంటే, మూగ చెవుడు ముంచుకు వచ్చినవట.
10. కోరుకున్న కోడలు వస్తే కొప్పులో చెప్పు పెడుతుంది.
11. కోరుకొండ తీర్ధానికి కోడిగుడ్డంత మామిడిపండ్లగును.
12. కోరు గింజలు కొంగులోకే సరి.
13. కోల ఆడితే కోతి ఆడును.
14. కోలలేని పెట్టు, తాడులేని కట్టు.
15. కోళ్ళను తింటారా? అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు.
16. కోళ్ళ బేరానికి వెళ్ళి కోటలో కబుర్లడిగినట్లు.
17. కోళ్ళు కూయగా లేచినా, కాళ్ళు కాలేవఱకే అవుతుంది.
18. కోళ్ళుసాకిన పొంతలో రెట్టవేసినట్లు.
19. కోర్టుకెక్కి గెలిచినవాడు ఇంట్లో ఏడిస్తే, ఓడినవాడు వీధుల్లో ఏడుస్తాడు.
20. కోర్టుకెక్కిన వారు, ఒకరు ఆవుకొమ్మును, ఇంకొకరు తోకను పట్టుకుంటే, మధ్య వకీలు పొదుగు దగ్గర కూర్చుంటాడు.


ఖా


21. ఖాజా (ఖొజ్జా) మొగుడు ఒడిలో ఉంటేనేమి, దడిలో ఉంటే నేమి?
22. ఖాజీని ఫాజీ గానూ, ఫాజీని ఖాజీగాను మార్చినట్లు.
23. ఖానాకు నహీ, ఎల్లీకి బులావ్ అన్నట్లు.




24. గంగ ఈతకు, గరిక మేతకు సరి.
25. గంగ కిద్దరి మేలు, అద్దరి కీడునుం గలదే?
26. గంగకు, సొంగకు, పంగకు తప్పులేదు.
27. గంగిగోవు పాలు గంటెడైన చాలు, కడివడైననేమి ఖరము పాలు?
28. గంగను పడ్డ కాపురం గట్టున పడుతుందా?
29. గంగమ్మ గయ్యాళైతే, సింగరాజేమి చేస్తాడు?
30. గంగలోని ఓడను నమ్మితే భవసాగరమీదవచ్చునా?
31. గంగలో మునిగినా కాకి హంస అవుతుందా?
32. గంగానమ్మ తెత్తిమీద తురకాడు కాలుపెడితే, కాపువాణ్ణి తీయమన్నదట.
33. గంగా స్నానం, తుంగాపానం.
34. గంగిరెద్దును బండికి కడితే వాడవాడ, గంగిరావును బండికి కడితే ఇల్లిల్లూ.
35. గంజాయి తోటలో తులసి మొక్కవలె.
36. గంజాయి పీకకు, కల్లు రేకకు అంటులేదు (ఎంగిలి లేదు).
37. గంజి తాగినా లంజ కావాలి.
38. గంజి తాగేవానికి మీసాలెగపెట్టె వాడొకడు.
39. గంజిలోకి ఉప్పులేకుంటే పాలలోకి పంచదారట.
40. గంటెలు పండిన ఇంట, కణుజు పండిన ఇంట కఱవులేదు.
41. గంటైనా బలవాలి, గాదైనా తిరగాలి.
42. గండం గడిచి పిండం బయటపడినట్లు.
43. గంత కట్టేదా? బసవన్నా అంటే, ఊహూ అని, గుగ్గిళ్ళు తింటావా అంటే, అహా అన్నదిట.
44. గంతకు తగిన బొంత దొరకనే దొరుకుతుంది.
45. గంతకు పడాలని ఉంది, ఎద్దుకు తూలాలనీ (తోయాలనీ) ఉంది.
46. గంతలో బావ ఉన్నాడని, సంతలో కాల్మడిచిందట. (కాల్మడుచు=ఒంటికి పోవు).
47. గంత బొంత కలిసి గాడిద మోతైనట్లు.
48. గంధపు చెక్కలు మోసిన గాడిద వాటి వాసన అనుభవించలేదు.
49. గంధం అమ్మినచోటే కట్టెలమ్ముట.
50. గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదే.
51. గంధంలో కూసు కల్పినట్లు.
52. గంధం సమర్పయామీ అంటే, గొడ్డలి నూరరా అన్నాడట.
53. గంధపు పొడిలో బూరగ పట్టినట్లు (ఊదినట్లు).
54. గంధమలద మేని కంపు తగ్గినయట్లు.
55. గంపదింపుడు ఘనమాయె, పూర్వపు బుద్ధులు పోవాయె.
56. గంపదింపులు ఘనమాయే, పూర్వాలు బుగ్గాయె.
57. గంపలాభం చిల్లి తీసినట్లు.
58. గంప సిడి (సిరి) కాదు, గాలపు సిడి (సిడి=వేదన).
59. గచ్చకాయంత బెల్లానికైనా గానుగ కట్టాలి.
60. గచ్చకాయల కుండ వలె.
61. గచ్చకాయలకు కొన్న గుఱ్ఱం కందకం దాటునా?
62. గచ్చపొద పట్టుకొన్నట్లు.
63. గచ్చపొద మీద ఇసుకవేసి కయ్యానికి పిలిచినట్లు.
64. గచ్చముండ్ల మీద తగులుకొన్న బట్ట గ్రక్కున తీయ వశమా?
65. గజముపై చౌడోలు గాడిదకెత్తిన కూయునేగానీ మోయదు.
66. గజమూ మిథ్య, పలాయనమూ మిథ్య అన్నట్లు.
67. గజశాస్త్రవేత్తలకు గజారోహణం వస్తుందా?
68. గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు.
69. గట్టిగా ఆయూష్యముంటే గఱిక నూరిపోసినా బతుకుతాడు.
70. గట్టీగా తిట్టినా గాలికి పోవును.
71. గట్టిని విడిచి పొట్టుకు పోరాడినట్లు.
72. గట్టి గింజలు విడిచి పొట్టుకు పోరాడినట్లు.
73. గట్టు చేరిన వెనుక పుట్టివానితో పోట్లాడినట్లు.
74. గట్టు మీదవానికి గప్పాలెక్కువ.
75. గట్టెక్కితి, పుట్టెక్కితి, మేటి మెట్టెక్కితి అన్నట్లు.
76. గడేక్కు తిమ్మన్నా! గంతులు వేయి తిమ్మన్నా!
77. గడనుడుగు మగని జూచిన నడపీనుగ వచ్చినట్లు నగుదురు.
78. గడించేది ఒకడు, అనుభవించే దింకొకడు.
79. గడించే వాడొకడు, గుణించే వాడొకడు.
80. గడీ ఎక్కా నేనే, గంతులు వేయా నేనే.
81. గడియ పురుసత్తూ లేదు, గవ్వ ఆదాయం లేదు.
82. గడియారం చూచి గడాలు కట్టిస్తారా? (గడాలు= అరకలు, నాగళ్ళు).
83. గడుసురాలు మగని గంపతో నమ్మురా!
84. గడుసువాడు మూడందాల చెడును.
85. గడ్డెము కట్టిన గొడ్డెము విడుస్తుంది.
86. గడ్డం కాలి ఏడుస్తుంటే, చుట్టకు నిప్పివ్వమని వెంట పడ్డాడుట.
87. గడ్డ గడ్డకూ గ్రుక్కెడు నీళ్ళు తాగినా రెడ్డే వ్యవసాయం చెయ్యాల.
88. గడ్డ తిన్నా కంపే, (ఉల్లి) పాయ తిన్నా కంపే.
89. గడ్డపలుగు మింగి, శొంఠికషాయం తాగినట్లు.
90. గడ్డపార గాలికి పోతుంటే ఉల్లిపాయనా జంబులీకం చూడమన్నదిట.
91. గడ్డపార తినేవానికి శొంఠికషాయం ఏమి చేస్తుంది?
92. గడ్డపారలు గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా గతి ఏమీ అన్నదిట.
93. గడ్డపారలకు పగులని బండలు, చెట్ల వేళ్ళకు చెప్పకుండా పగులుతాయి.
94. గడ్డింత లేక ముడ్డింత ఎండి, వేంచేసెనే గుఱ్ఱం దేవలోకము?
95. గడ్డివామిలో సూది వెతికినట్లు.
96. గడ్డివెంటిబట్టి కట్టరే ఏనుంగు.
97. గడ్డివేయ పోట్ల గొడ్డు తలాడిస్తుంది.
98. గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా?
99. గణనాయకుని చేయకోరగా, కడు వానరుడైన తీరు.
100. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.

Saturday, December 18, 2010

సామెతలు 26

1. కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనా మునుగుతుంది.
2. కొల్లేటి పంట కూటికే చాలదు.
3. కొల్లేటి బ్రహ్మహత్య కాపు మీదుగా కొట్టుకపోయినట్లు.
4. కొల్లేటిలో పండే పంట పంటలో లెక్కేకానీ, చచ్చే దున్నపోతులకు లెక్కేలేదు.
5. కొల్లేటి వ్యవసాయానికి కోతకూలి దండుగ.
6. కొల్లేటి వ్యవసాయం గొడ్ల వినాశం.
7. కొవ్విన ఎండ్రకాయ కలుగులో నిలువనట్లు.
8. కొసరిన కూరలోగానీ పస ఉండదు.

కో

9. "కో" అంటే కోటిమంది.
10. కోకకు పెట్టిన గంజి కూడి రాదు.
11. కోకడాపుతో కోరికలీడేరేనా?
12. కోకలు వెయ్యున్నా కట్టుకొనుట ఒకటే.
13. కోటగోడల ఇల్లు, తాటాకుల పందిరి.
14. కోటచక్కదనము గమిడి చెప్పినట్లు.
15. కోటలో పాగా వేసినట్లు.
16. కోటవరకు, ఏటివరకు సాగనంపవలె.
17. కోటికి పడగలెత్తినవాణ్ణి పదివేల కాపవై బ్రతుకమన్నట్లు.
18. కోటికి లాగితే బిళ్ళకు, బిళ్ళకు లాగితే కోటికి.
19. కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టించారో తెలియదుకానీ, అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు అన్నాడట.
20. కోటివిద్యల కంటే కోరుకు పొలం దున్నటం మేలు.
21. కోటివిద్యలు కూటికొరకే.
22. కోతివిద్యలు కొండ్రకు లోకువ.
23. కోటివిద్యలు వచ్చినా కొల అచ్చితే కొలవలె కాదు.
24. కోడలా! కోడలా! కొడుకు కోడూరు పోయెనే, నీకు కోకెక్కడిదే? అంటే, అత్తా! అత్తా! మామ మడమనూరు పోయెనే, నీకు మట్టెలెక్కడివే అన్నదిట.
25. కోడలా నీ భోగం ఎంతసేపే? అంటే, మా అత్త మాలవాడకు పోయి వచ్చేదాకా అన్నదిట.
26. కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిందట.
27. కోడలికి బుద్ధిచెప్పి అత్తే ఱంకు పోయిందట.
28. కోడలిదాని మొగుడు కొట్టం పట్టుకొని ఏడ్చాడట.
29. కోడలి కొట్టిన కుండ కొత్తకుండ, అత్త కొట్టిన కుండ అడుగోడు(టి) కుండ.
30. కోడలి కొడుకును కంటాను అంటే వద్దనే అత్త ఉన్నదా?
31. కోడలు గృహప్రవేశం, అత్త గంగా (అగ్ని) ప్రవేశం.
32. కోడలి నలుపైతే కులమంతా నలుపగునా?
33. కోడలు వచ్చినవేళ, కోడెలు వచ్చినవేళ.
34. కోడి అడుగులో కోటివర్ణాల భూమి.
35. కోడికి ఉన్న కోర్కెలతో పిల్లికేమి అక్కఱ?
36. కోడికి కులాసం లేదు, కోమటికి విశ్వాసం లేదు.
37. కోడికి గజ్జలు కడితే కుప్ప కుళ్ళగించదా?
38. కోడికి పుట్టిన పిల్ల కొక్కొరొక్కో అనక ఏమంటుంది?
39. కోడి కుళ్ళగించేదంతా (గెలికేదంతా) పెంటకుప్పలే.
40. కోడి, కుంపటి లేకపోతే తెల్లవారదా?
41. కోడి కూతా, కాడి పూత.
42. కోడి కొత్త అప్పులు, పండి పాత అప్పులు తీర్చును.
43. కోడిగుడ్డంత సంసారంలో కోరికలేలా?
44. కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు.
45. కోడిగుడ్డును కొట్టను గుండ్రాయి కావాలా?
46. కోడిగుడ్డుతో కొండలు బద్దలు కొట్టగలమా?
47. కోడితొక్కుడు, గాడిద ఎక్కుడు.
48. కోడి నలుపైనా గుడ్డు తెలుపే.
49. కోడిపియ్యి మందంటే కొఱ్ఱెక్కి ఏరిగిందిట.
50. కోడిని అడిగి మసాలా నూరుతారా?
51. కోడిని కోసి, గోత్రానికంతా పగ ఐనట్లు.
52. కోడిని కోసే ఇంట్లో కొరకొర తప్పదు.
53. కోడిని తిట్టిన తిట్టు కోడలి కెఱుక.
54. కోడిపిల్లకు గొఱ్ఱెపిల్లను బలాదూరు (దిష్టి) తీసినట్లు.
55. కోడిపెట్ట ఎక్కడున్నా మనసు గుడ్లమీదే.
56. కోడి ఱెక్కారవేస్తే గొప్పవాన కురుస్తుంది.
57. కోడు ఒకడు తీస్తే, కొమ్ము ఒకడు తీస్తాడు.
58. కోడెల పోట్లాట మధ్య లేగల కాళ్ళు విరిగినట్లు.
59. కోతల కాలంలో ఎలకన్నకు ఏడుపెళ్ళాలుంటే మాత్రం ఏమీ?
60. కోడెలు కోడెలు పోట్లాడి, దూడల కాళ్ళు విరగకొట్టినట్లు.
61. కోతలకు ఉత్తరకుమారుడు.
62. కోతలున్నన్నాళ్ళూ కోతీ బతికింది, తరువాత బతికిందే బతుకు.
63. కోతల్లో కునికిపాట్లు పడి, కొత్త అమావాశ్యకు కొంపగోడి అనుకున్నట్లు.
64. కోతల్లో కూడదీసుకుంటే, కూటికి కొరత ఉండదు.
65. కోతికి అద్దం చూపినట్లు.
66. కోతికి కల్లు తాగించినట్లు.
67. కోతికి టెంకాయ దొరికినట్లు.
68. కోతి చస్తే గోడవతల పారేసినట్లు.
69. కోతికి తేలు కుట్టినట్లు.
70. కోతికి జల్తారు కులాయి పెట్టినట్లు.
71. కోతికి పుండైతే, గోకా, నాకా.
72. కోతికి పెత్తనమిస్తే, గోదావరి కడ్డంగా ఈదిందట.
73. కోతికి పెత్తనమిస్తే, తలంతా చెడ గొరిగిందట.
74. కోతికి బెల్లం చూపరాదు, కోమటికి ధనం చూపరాదు.
75. కోతి గెంతడం, సాయబు సంపాదించడం.
76. కోతిగుంపుల పాడు కొడవలూరు.
77. కోతి చావు, కోమటి ఱంకు.
78. కోతిచేతి పాము వలె.
79. కోతిచేతి పూలదండ.
80. కోతి టెంకాయ తుంచగలదు కానీ నీరు తాగగలదా?
81. కోతి పంచాయతి కొంపలారుస్తుంది.
82. కోతి పిల్లలకు రొట్టె పంచినట్లు.
83. కోతిపుండు బ్రహ్మండమైనట్లు.
84. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లు.
85. కోతి పులి కాదు, కోమటి దొర కాడు.
86. కోతిముండకైనా గీత బాగుండవలె.
87. కోపం గొప్పకు ముప్పు, అల్లరికి హంగు ముప్పు.
88. కోపం పాపమునకు పొత్తు.
89. కోపం పొంగు క్రుంగు కొన్నాళ్ళే.
90. కోపం రాను కారం తిన్నట్లు.
91. కోపము ఎదుటు గొప్పగొద్దు లెరుగదు.
92. కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు.
93. కోమటి ఇల్లు కాలినట్లు.
94. కోమటి ఏవేళా క్షేమామే కోరును, ధరణీపతి ధనము కోరు.
95. కోమటికి, కోతికి ముల్లెచూపరాదు.
96. కోమటితో మాట, కోతితో సయ్యాట.
97. కోమటిని చూచి నక్క శొంఠి అడిగిందట.
98. కోమటి భక్తుడు కాడు, తగరం కత్తి కాదు.
99. కోమటి లేమి, కంసాలి కలిమి ఉండవు.
100. కోమటి సాక్ష్యం, బాపన వ్యవసాయం.

Monday, December 13, 2010

సామెతలు 25

1. కొండకు కట్టెలు, కోనేటికి నీళ్ళు మోసినట్లు.
2. కొండకింద మెరక, తూము కింద మెరక మంచిది.
3. కొండకు వెంట్రుక ముడీవేస్తే, వస్తే కొండే వస్తుంది, పోతే వెంట్రుకే పోతుంది.
4. కొండతో తగరు ఢీ కొన్నట్లు.
5. కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక కాస్తా ఊడి (ఊడ్చుకొని) పోయిందట.
6. కొండను చదరపెట్టి, ఉలవ చల్లినట్లు.
7. కొండను తలకింద పెట్టుకొని రాళ్ళను వెతికినట్లు.
8. కొండను తవ్వి ఎలకను పట్టినట్లు.
9. కొండమంగలి గొరిగినట్లు.
10. కొండలు మింగేవానికి గోపురాలడ్డమా? గుడి మింగేవానికి లింగమడ్డమా?
11. కొండమిరపకాయ కారం జాస్తీ, పొట్టివానికి బుద్దులు జాస్తి.
12. కొండమీద గోల ఏమంటే కోమట్ల గుసగుసలన్నట్లు.
13. కొందమీంచి పడ్డవానికి గాయాలెన్ని- అన్నట్లు.
14. కొండమీదికి భక్ష్యాలకి పోతే కొండకింద పాయసం పోయిందట.
15. కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు.
16. కొండలు పడ్డ కొన్నాళ్ళకి కోనలూ పడూను.
17. కొండలు పిండి కొట్టినట్లు.
18. కొండవలేవచ్చి మంచువలే తేలినట్లు.
19. కొండవలే వచ్చి బెండువలే తేలినట్లు.
20. కొండవీటి చేంతాడు.
21. కొండవీటి దండుముండా, కుండలిటు తేవే.
22. కొండీ! కొండీ ! కుండలిటు తేవే అంటే, చస్తి నీ కాళ్ళకు మొక్కుతా, దీపమిటుతే అందిట.
23. కొండూరు జంగాలు, తరుణాయి సన్నాసులు.
24. కోండ్రను నమ్మిన వారికి కొదువలేదు.
25. కొందరిని కొంతకాలం ఏమార్చవచ్చునుగానీ, అందరినీ అంతకాలమూ ఏమార్చలేము.
26. కొంప అంటుకపోతూ ఉంటే నీళ్ళబాన నిప్పు దగ్గర పెట్టిందట.
27. కొంపచెరుపకురా సుపుత్రా!
28. కొక్కిరాయీ! కొక్కిరాయీ ! ఎందుకు పుట్టావే ? అంటే చక్కని వాళ్ళని వెక్కిరించటానికి అన్నదట.
29. కొక్కిరాయుళ్ళలో కొంగ ఘనము.
30. కొక్కొరొక్కో అనగానే తెల్లవారినట్లా?
31. కొక్కు బోనులోన చిక్కి చచ్చినరీతి.
32. కొట్టకముందే ఏడుస్తావేంటే? అంటే, ముందు కొట్టబోతావని ఏడుస్తున్నా అన్నట్లు.
33. కొట్టావద్దు తిట్టావద్దు వట్టలు పిసికితే వాడే చస్తాడు.
34. కొట్టినా వంగని కొడుకు, తిప్పినా తిరగని మీసం.
35. కొడితే కొట్టాడు కానీ కొత్త కోక పెట్టాడు.
36. కొడుకు ఏడ్చిన ఏడ్పుకు అబ్బ బందరాకు మోయలేక చచ్చాడుట.
37. కొడుకు కలిగినంత కులముద్దరించునా?
38. కొడుకు పెళ్ళిసంగతి యోచించేప్పుడు మనమళ్ళ మనవర్తి సంగతిగూడా మనసులో పెట్టుకోవాల.
39. కొడూకు బాగుండాల (చల్లంగుండాల) కోడలు ముండమోయాల.
40. కొడుకు బిడ్డకు, కూతురు బిడ్డకు తాత ఒకడే.
41. కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?
42. కొడుకు మర్మం కన్నతల్లి కెరుకగాక, అడవిలోతిరిగే అయ్యకేమి తెలుసు?
43. కొడుకు ముద్దు, కోడలు మొద్దు.
44. కొత్త అప్పుకుపోతే పాత అప్పు పైనపడ్డదట.
45. కొత్త ఆవకాయ, కొత్తపెళ్ళాము రుచి.
46. కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాది ఎత్తినట్లు.
47. కొత్త ఒక వింత, పాత ఒక రోత.
48. కొత్త కలిమి సేవ కత్తిమీద సాము.
49. కొత్త కృషికి పాత తరినేల.
50. కొత్త కదరా కొమ్మా ! అంటే, మరగనీరా ఇరగ (విరగ) తందాం అన్నట్లు.
51. కొత్తగా సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
52. కొత్తగుడ్డకు రంగు పట్టినట్లు పాతగుడ్డకు పట్టదు.
53. కొత్త చింతకాయతొక్కు, కొత్త చుట్టరికం రుచి.
54. కొత్త చీపురు బాగుగా ఊడ్చు. (చిమ్మునట్లు).
55. కొత్త జవ్వనమునకు గురుతలేదు.
56. కొత్తది గొఱ్ఱెల మడుగు (ఉచ్చగుంత), పాతది బఱ్ఱెల మడుగు.
57. కొత్తది నేర్వలేదు, పాతది మరువలేదు.
58. కొత్తదొక వింత, కోడీకల బొంత.
59. కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకపోయినట్లు.
60. కొత్తనీళ్ళకు చేప లెదురెక్కినట్లు.
61. కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు.
62. కొత్త భక్తురాలు ఉడుకు ఊబిది పూసుకొని, నొసలు కాలెనే పేరమ్మా అన్నదట.
63. కొత్త మురిపెము కొమ్మన్నా ! తెల్లగా కొట్టరా మడేలా (మడేలు=చాకలి).
64. కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు.
65. కొత్త సేద్యగాడు పొద్దెరుగడు.
66. కొద్ది కొద్దిగా తీస్తే కొండయినా కరిగి (తరిగి) పోతుంది.
67. కొద్ది వానలకే రెక్కల పురుగులు.
68. కొనగా తీరనిది కొసరితే తీరునా?
69. కొనజాలకు కోతిపుడితే కులమువాళంతా కుంటికుక్క అని పేరు పెట్టారు.
70. కొనలేదు, అనలేదు, కొడుకుపేరు సోమలింగం.
71. కొని తింటూ ఉంటే కోమటి నేస్తం, ఇచ్చి తీసుకుంటా ఉంటే ఈడిగ నేస్తం.
72. కొనేది కొయ్యగూర, తినేది చెంచలకూర.
73. కొనేవాడికి కోటి కళ్ళయితే అమ్మేవాడీ అవిటిదొక్కటే చాలు.
74. కొనైనా కొసకు నూనె రాయాలి.
75. కొన్న అంగడిలోనే మారు బేరమా?
76. కొన్న కాంతలు, వన్నె చీరలు, దైవలోక మగునా?
77. కొన్న దగ్గర కొసరుకానీ, కోరిన దగ్గర కొసరా?
78. కొన్నది వంకాయ, కొసరింది గుమ్మడికాయ.
79. కొన్నవాడికన్నా తిన్నవాడే మేలు.
80. కొన్నాక తినక మానదు.
81. కొన్నాళ్ళు చీకటి , కొన్నాళ్ళు వెన్నెల.
82. కొప్పుకు సగరం (సవరం) అందం, చెప్పుకు తగులం అందం.
83. కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే.
84. కొమ్ము మాడ కూలుస్తుంది.
85. కొమ్ములు చూసి బేరమాడినట్లు (నీటనున్న పశువును).
86. కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా?
87. కొయ్యరా కొయ్యరా కోటిగాడా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నాడుట.
88. కొఱకబోతే పడికట్లు ఉరికి మీద పడినట్లు.
89. కొఱతనపడేవాడు ఒకడు, కూర్పులు లెక్కపెట్టెవాడొకడు.
90. కొఱివితో తల గోక్కున్నట్లు.
91. కొఱివి పెట్టెవాడు కొడుకు, కూడుపెట్టేది కూతురు.
92. కొఱ్ఱకు నక్క కొఱ్ఱ.
93. కొఱ్ఱగింజంత కోడలిని చూస్తే కొండంత జ్వరం వచ్చిందట.
94. కొఱ్ఱల సేవ్యం (సేద్యం) కూటికైనా రాదు.
95. కొఱ్ఱు ఇంటికంబమగునా?
96. కొలని హంసలకడ కొక్కెరలుండునా?
97. కొలిమి వీధిలో సూదులమ్మినట్లు.
98. కొలుచు దంచుట పొట్టకొరకా? (కొలుచు=ధాన్యము).
99. కొలువు కన్నా గోపాలనే నయం.
100. కొల్లకు పోయి పైచీర కోల్పోయినట్లు.

Saturday, December 4, 2010

సామెతలు 24

1. కూడా తిని కులమెంచినట్లు.
2. కూడినకొద్దీ కుండలమ్ముకొని తినినట్లు.
3. కూడి యాడెడువాడె పో గోవిందుడు.
4. కూడుండగానే కులాలవాళ్ళ కుడిపైట మారదు.
5. కూడు ఐతే కద్దుగానీ కులస్థులకు వెరచి వచ్చినాను.
6. కూడు ఉంటే కులగోత్రాలెందుకు?
7. కూడు ఉడకలేదని కుండట్టుక కొట్టాడట.
8. కూడు ఉడీకిన వెనుక పొయ్యి మండును, కులం చెడ్డవెనుక బుద్ధి వచ్చును.
9. కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ (కువ్వాడం=ఓర్వలేనితనం).
10. కూడు ఒల్లనమ్మను కఱవేమి చేస్తుంది?
11. కూడు గుడ్డ తానుగోరునా దైవంబు.
12. కూడు కలుగగానే కులం మరచిపోతారు.
13. కూడు గుండెకాయ, మెతుకు మేనమామ.
14. కూడు చీర లేని చోటు కొరగానిది.
15. కూడు పారవేసి కొప్పెర నాకినట్లు.
16. కూడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, నామీద ప్రాణమే అన్నట్లు.
17. కూడు పెట్టినామెను తొడవిందు అడిగినట్లు.
18. కూడులేక కూరదిన్న ఆకలి తీరునా?
19. కూడు లేనమ్మకు గుడ్డలేని వాడు జత పడ్డట్లు.
20. కూడు వండని ఆడది, మంచం అల్లని మగవాడూ ఉండరు.
21. కూడూవండుట గంజి కొరకా?
22. కూడు వేడైతే కూరాకు నంజినట్లు.
23. కూడూ, గుడ్డా అడక్కపోతే, బిడ్డని సాకినట్లు సాకుతా అన్నాడట.
24. కూడేకూడే కాపురం తియ్యకపోతే నీ ఱంకు మొగుణ్ణి కాదన్నాడట.
25. కూతలార్భాటమే కానీ కుప్పలో ఇత్తులు లేవు.
26. కూతును గుత్తరూకలమ్మేవాడు అల్లునికి అరణమిచ్చునా?
27. కూతురికి దొరికేదంతా కుళాయి మిండగాళ్ళే.
28. కూతురుకి మంగళవారం, శుక్రవారం కోడలికి దివ్వెలు దివ్వెలు.
29. కూతురి పురుడు కుండల్లో, కోడలి పురుడు కొందల్లో.
30. కూతురు అని కుంచడిస్తే, కన్న తల్లి అని కంచెడు పెట్టిందట.
31. కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.
32. కూతురు చెడితే తప్పు తల్లిది.
33. కూతురు బిడ్డవని కోరితెచ్చుకుంటే కానే కొరివైనావా నా మనమరాలా?
34. కూతుళ్ళ కన్నమ్మకు కుర్చీపీటలు, కొడుకులు కన్నమ్మకు గోడపంచలు.
35. కూతుళ్ళుకన్నమ్మ కుశలేసులలో, కొడుకులు కన్నమ్మ లబ్బీసులో.
36. కూనపులికి లేడి దేటా?
37. కూనలమ్మ సంగీతం వింటే పుణ్యమూలేదు, వినకపోతే పాపమూ లేదు.
38. కూనలు కూటికేడుస్తుంటే, అవ్వ ఱంకు మొగుడికేడ్చిందట.
39. కూర ఎంతైనా కూడు కాదు.
40. కూరకుండ మొదలుంటే, కూసుముండైనా చేస్తుంది కాపురం.
41. కూరకు తాళింపు, చీరకు జాడింపు.
42. కూరగాయలు చెడిపోయినవంటే, బఱ్ఱెలకు వేయమన్నాడట, అవి తినవంటే, పిలిచి బ్రాహ్మడి కివ్వమన్నాడట.
43. కూరలేని తిండి కుక్క తిండి.
44. కూరలో కసవేరినట్లు.
45. కూరిమి కలిగిన దినములలో నేరములెన్నడును కలుగ నేరవు.
46. కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు.
47. కూర్చుంటే కుంటి, లేస్తే లేడి.
48. కూర్చుంటే కుక్కైనా కఱవదు.
49. కూర్చుండి కూర వందలేను, వంగుండి తీర్ధం వస్తాను అన్నట్లు.
50. కూర్చుండి చేసినపాపం గుడి కట్టినా పోదు.
51. కూర్చుండి తింటూ ఉంటే కొండయినా కరిగిపోతుంది.
52. కూర్చుండి తింటే, గుళ్ళుగోపురాలు ఆగవు.
53. కూర్చుండి లేవలేని వాడు, ఎగసి తాటికాయ తంతానంటాడు.
54. కూర్చుండి లేవలేనమ్మ వంగుని శివరాత్రికి వస్తానన్నదిట.
55. కూర్చున్నవానికి కుప్పలు, తిరిగిన వానికి తిప్పలు.
56. కూర్చోమంటే గుద్దకు, తినమంటే నోటికి తెగులు.
57. కూలబడీన కుండా కుదురుట అరుదయా.
58. కూటికి ఏడిస్తే కొలుకులు తడౌతవా?
59. కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు.
60. కూలి కుండకు రాదు, ఱంకు పన్నుకు రాదు.
61. కూలి కూటికి రాదు, లేకి చేతికి రాడు.
62. కూలి చేస్తే కుండకాలె, లేకుంటే పొట్టకాలె.
63. కూలికి వచ్చినవాడు పనిగొనక మానునా?
64. కూలిబంటు కొక మాలబంటు, మాలబంటు కొక మద్దెలకాడు.
65. కూలీనాలీ చేసి కుదురాల ఉండక, మొగుణ్ణి కట్టుకొని సగమై పోతినే అందిట.
66. కూలివాడి ప్రొద్దా, క్రుంకవే పొద్దా.
67. కూశమ్మ కూడబెడితే మాశమ్మ మాయం చేసిందట.
68. కూసుముండ నొరు కుట్టిపెట్టితే అయ్యవారా ఏం టెంకాయకు పసుపు పూయలేదు అన్నదిట.
69. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెఱచిందట (చెఱచినట్లు).
70. కూసీకూసీ గుంటనక్క గూదెల్లి చచ్చిందట.


కృ


71 కృతఘ్నత ప్రతిదేశంలో ప్రతివాతావరణంలో మొలిచే కలుపుమొక్క.
72. కృతమెఱుంగని వానికి మిత్రద్రోహ మెంత?
73. కృత్తికలో కుతికె పిసుకుడు.
74. కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు.


కె


75. కెంపు నేనెఱుగనా? (కుంపటివలె) కోతికివలె రెండు కొమ్ములుండు.


కై


76. కైకపుట్టి చెరచెగా రాము(ని) పట్టంబు.


కొ


77. కొంగ కన్నులు మూసుకోగానే దేవతల ధ్యానమగునా?
78. కొంగకొక చెఱువనీ లేదు, కోమటికొక ఊరనీ లేదు.
79. కొంగ జపము చేపల కొఱకే.
80. కొంగలు గుమికూడి కొరకవా బోదెలు.
81. కొంగ వంటి ధ్యానముచే తన కోర్కెలు నెరవేరునా?
82. కొంగు తగిలినా కొంత మేలే.
83. కొంగు తాకితే కోటివరహాలు.
84. కొంచెమైనను పంచి కుడువ మేలు.
85. కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే ఏంచలి?
86. కొంగు తడీస్తే వగకానీ, కోకంతా తడిస్తే వగపేమి?
87. కొంటిమి, తింటిమి, కోలాటమెందుకు?
88. కొంటే రానిది కొసరితే వస్తుందా?
89. కొండంత తనతప్పు గోరంత, గోరంత ఒరుతప్పు కొండంత.
90. కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు.
91. కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?
92. కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టగలమా?
93. కొండంత దేవునికి గోరంత బెల్లం నైవేద్యం.
94. కొండంత మదపుటెనుగకి తొండము లేకపోతే జంత్రము కీలూడినట్లు.
95. కొండంత రాగంతీసి పిచ్చికుంట్ల పాట పాడినట్లు.
96. కొండంత రెడ్డి కొంగుపట్టుకుంటే లేదనేదెట్లా అన్నదిట.
97. కొండంత మొగుడేపోగా పిడికెడు బొచ్చుకెందుకు ఏడ్పు?
98. కొండ అద్దమందు కొంచమై ఉండదా?
99. కొండ ఎక్కేవాని ముడ్డీలో కొడవలి చెక్కినట్లు.
100. కొండ ఎక్కేవాని ముడ్డిలో (గుద్దలో) కొడవలి చెక్కి వచ్చేటప్పుడు పచ్చిగడ్డి తెమ్మన్నట్లు.

Thursday, December 2, 2010

సామెతలు 23

1. కుడిచెయ్యి చేసే దానం ఎడమచెయ్యి ఎఱుగరాదు.
2. కుడీచేతికున్న మన్నన ఎడమచెయ్యి కేది?
3. కుడి చేతితో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లు.
4. కుడితి కుండలో (తొట్టిలో) పడ్డ ఎలుకవలె.
5. కుడితి పులుపే బఱ్ఱె బలుపు.
6. కుడితి మరుగు బఱ్ఱె కూసిన చేపునా?
7. కుడితి మరుగు బఱ్ఱె విడినీరు త్రాగునా?
8. కుడుపు మంచిదైనా కడుపు మంచిది కాదు.
9. కుడుము చేతికిస్తే పండుగనే వాడు. (అల్పసంతోషి)
10. కుడుము మింగేవానికి అప్పడాలొక లెక్కా?
11. కుడుములు వండని ఆడుదీ, కూనిరాగం తీయని మగవాడూ ఉండరు.
12. కుడువబెట్ట కంచ మారడి గొనినట్లు.
13. కుడువబోతూ కూరల రుచి అడగడమెందుకు?
14. కుడువబోతూ కూరాకు రుచి అడిగినట్లు.
15. కుడువ మంటే, పొడవ వచ్చినట్లు.
16. కుత్సితునకు నేల గురు దేవతా భక్తి.
17. కుదిర్చినదే వైద్యం, మాన్పినదే మందు.
18. కుదిరెకు గుర్రమంటే, పూనెకు పుఱ్ఱమన్నాడట(కుదిరై=తమిళంలో గుఱ్ఱం).
19. కుదువ సొమ్ముకు కొంత హాని.
20. కుదురు (కుదుట) పడ్డ కాపురం కూలగొట్టకపోతే నీకు ఱంకు మొగుడినే కాదన్నాడట.
21. కనప్పండగనాడు కంచంలో ఎముక ఘల్లుమంటే కాశీలో గంట మ్రోగించినంత పుణ్యం.
22. కునికిపాట్లు పడేవానికి కూలబడి తన్నేవాడే తండ్రి.
23. కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకొన్నట్లు.
24. కుప్ప పీకే దొంగ పరిగ ఏరుకొనేవానిని బెదిరించినట్లు.
25. కుప్పపై పండుకొని ఉప్పరిగా కలగన్నట్లు.
26. కుప్పలో కేడిగింజ, కులంలో కులాల కోడలు.
27. కుప్పలో ధాన్యమున్నట్లు.
28. కుప్ప విత్తనాలు-చప్పనారు.
29. కుమ్మక్కు నాది, ఫజీతు నీది. (ఫజీతు=అవమానము).
30. కుమ్మరపురుగుకు మన్ను ఒంటబట్టునా?
31. కుమ్మర వీధిలో కుండలమ్మినట్లు.
32. కుమ్మరావంలో గచ్చకాయ వేసినట్లు.
33. కుమ్మరావంలో రాగిముంతలేరగలమా?
34. కుమ్మరికి ఒక ఏడు, గుదియకు ఒకఏటు (దెబ్బ).
35. కుమ్మరికి కుండ కఱవా? కమ్మరికి తెడ్డు కఱవా?
36. కుమ్మరికి కుండ కఱవు, సాలెకు బట్ట కఱవు ఉండునా?
37. కుమ్మరికి కుండల కఱవు, మాదిగకు చెప్పుల కఱవు ఉండవు.
38. కుమ్మరిలేకుండా కుండ పుట్టునా?
39. కుమ్మరివారి కోడలు ఆవం దగ్గరైనా కనుపించదా?
40. కుమ్మరివారింటి కోడలు ఆవంకట్టకు రాకుండా ఎక్కడీకిపోతుంది?
41. కుమ్మకాదా కూతురా? అంటే ముసలి మొగుడే అమ్మా అన్నదిట.
42. కుమ్ము చెప్పుకొనేదానికి గూడూరుపోతే, ఏడూళ్ళ కుమ్ము ఎదురుగా వచ్చిందట.
43. కుమ్మెతక్క పూలుగుచ్చితే, కురిమెళ్ళ కామాక్షమ్మ కులికి వస్తుంది.
44. కుమ్మేమిటే కూతురా? అంటే, అవ్వకు ఱంకుమొగుడే అన్నదిట.
45. కురవోళ్ళ పిల్ల బాయిలో పడితే ఎలిగోళ్ళ పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చిందట (కురవళ్ళ పిల్ల=గొల్ల కురవజాతి పిల్ల).
46. కురూపి పొత్తు కంటే, సురూపి తిట్టు మేలు.
47. కురూపీ ఏంచేస్తున్నావంటే, సురూపాల వెక్కిరిస్తున్నాను అన్నట్లు.
48. కుఱ్ఱవాడి గుణగణాలు తెలుసుగానీ, చెవులకమ్మల సంగతి మాత్రం తెలీదు అన్నట్లు.
49. కులం కన్నా గుణం ప్రధానం.
50. కులం కొద్ది గుణం.
51. కులంగాదు, తలంగాదు, కురవోళ్ళపిల్ల దెయ్యమై పట్టిందట.
52. కులంలో ఒద్దికుండి, నిరుడురోగం లేకుంటే, కుక్క ఆమడదూరం పోయివస్తా అన్నదిట.
53. కులటబిడ్డ కొడూకగునా? మెఱపు దీపమగునా?
54. కులనాశకుడైన కొడుకు దీర్ఘాయువైన నేమి లేకున్న నేమి?
55. కులమింతి కోతి అయినా మేలు.
56. కులముకన్నా నెన్న కలిమి ప్రధానంబు.
57. కులము కాదు, స్ఠలము కాదు, కుమ్మరివారిపిల్ల కోరి దెయ్యమై పట్టిందట.
58. కులము చెడ్డా సుఖం దక్కవలె.
59. కులము చెఱిచేవారే గానీ కూడు పెట్టేవారు లేరు.
60. కులము తక్కువ వాడు కూటికి ముందు.
61. కులము తక్కువదానికి నీటు (టెక్కులు) ఎక్కువ.
62. కులము తప్పిన వాడు బంతికి ముందు, కూరగాయలవాడు సంతకు ముందు.
63. కులము వాళ్ళను చూస్తే కుక్కకు కోపం గుఱ్ఱానికి సంతోషం (కుక్క మొరుగుతుంది, గుఱ్ఱం సకిలిస్తుంది).
64. కులమెఱిగి కోడలినీ, ఆణెమెరిగి ఆవును తీసుకోవాలి (ఆణెము=మంచి జాతి).
65. కులమెఱిగి చుట్టము స్ఠలమెఱిగి వాసము.
66. కులవిద్యకు సాటిరావు గువ్వల చెన్నా.
67. కులహీనం ఐనా వరహీనం కారాదు.
68. కులానికి ఇంత అంటే, తలా గోరంత అన్నట్లు.
69. కులానికి కులం తెగులు. నీటికి పాచి తెగులు.
70. కులానికి సొడ్డు అంటే, చిన్నప్పుడే వేఱుపడ్డాను అన్నట్లు.
71. కులికే దాన్ని ఒలికిలో పెడితే, ఒలికంతా చెడ కులికిందట.
72. కుళ్ళి కుళ్ళి కాయనష్టి, కాలి కాలి కట్టెనష్టి.
73. కుళ్ళుబోతువాడు గుడిసె కడితే, కూలినదాకా ఒకటే పోరు.
74. కుళ్ళుముండకి అల్లంపచ్చడి అన్నట్లు.
75. కుళ్ళేవాని ముందు గునిసినట్లు.
76. కుళ్ళేవాళ్ళ ముందే కులకమన్నారు.
77. కుసివెళ్ళి గొడ్డలిలో దూరి కులానికే చేటు తెచ్చినట్లు.


కూ


78. కూకున్న కూతురు కూలిపోయింది, చేసిన కోడలు చేవదేలింది.
79. కూచం ఇంటికి బరువైతే, మీసం రోషానికి బరువౌతుందా?
80. కూచమ్మ కూడబెడితే, మాచమ్మ మాయం చేసిందట.
81. కూచిపూడి దొంగతనానికి కఱ్ఱ చెప్పులు కావలెనా?
82. కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే.
83. కూచుంటే లేవలేడు, కూరకట్టలమ్మ లేడు, కొట్టొస్తాడమ్మా! నాకు నవ్వొస్తాది.
84. కూచుంటే లేవలేడు, కూరకచట్టి దించలేడు, మా బావ కొట్టొస్తాడే! నాకు నవ్వొస్తాదే.
85. కూటికి గతిలేదుకానీ కుంటెనలకు ముత్యాలు.
86. కూటికి గింజలు, పనికి కొరముట్లు లేక చేసే సేద్యం రోత.
87. కూటికి జరిగితే కోటికి జరిగినట్లు.
88. కూటికి తక్కువైతే కులానికి తక్కువా?
89. కూటికి పేదైతే కులానికి పేదా?
90. కూటికియ్యని విటకాని పోటు మెండు.
91. కూటికి లేకున్నా కాటుక చుక్క మానదు.
92. కూటికి లేని నాబట్టా, గుడ్డకులేని నా బిడ్డ వెంటబడ్డావా?
93. కూటికుంటే కోటికున్నట్లు.
94. కూటికుండ కుక్క ముట్టినట్లు.
95. కూటిపేద తోడు పోగొట్టుకుంటాడు.
96. కూటిమీదా ఆశ, మీసం మీదా ఆశ.
97. కూటిలోని రాయి తీయలేనివాడు ఏటిలోని రాయి తియ్యగలడా?
98. కూడబెట్టినవాడు కుడువ నేర్చునా?
99. కూడబెట్టిన సొమ్ము కుడూవను రాదు.
100. కూడలి కాపురం కుతకుతలు, వేరడి కాపురం వెతవెతలు.