1. హరుని ఎరుకలేక ఆకులల్లాడునా?
2. హర్షుణ్ణి నమ్ముకొని, పురుషుణ్ణి పోగొట్టుకొన్నట్లు.
3. హసేను, హుసేను సేద్యంచేస్తే, ముచ్చెలతో పంచుకొన్నారట -పంటను.
4. హస్తా ఆదివారం వచ్చింది, చచ్చితిమయ్యా గొల్లల్లారా! చల్లపిడతల కాసులుతీసి సాలలు వేయించండి.
5. హస్తా ఆదివారం వచ్చింది, చస్తిమోయి గొల్లల్లారా! కాసుకొక దాన్ని కాలు పట్టి ఈద్వండి (అన్నవట గొఱ్ఱెలు).
6. హస్త ఆదివారం వస్తే, చచ్చేటంత వాన.
7. హస్తకార్తెలో చల్లితే అక్షింతలకైనా కావు.
8. హస్తకు అనకు (అణుగు) పొట్ట, చిత్తకు చిఱుపొట్ట.
9. హస్తకు ఆదివంటా, చిత్తకు చివఱి వంటా!
10. హస్తకు ఆరుపాళ్ళు, చిత్తకు మూడుపాళ్ళు.
11. హస్తచిత్తలు వఱవయితే అందఱి సేద్యం ఒకటే.
12. హస్త పోయిన ఆరుదినాలకు అడగకుండా విత్తు.
13. హస్తలో అడ్డెడు చల్లేకంటే, చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
14. హస్తలో ఆకు అల్లాడితే, చిత్తలో చినుకు పడదు.
15. హస్తలో చల్లితే, హస్తంలోకి రావు.
హా
16. హాస్యగాడు బావిలో పడిన తంతు.
17. హాస్యగానికి తేలు కుట్టినట్లు (హాస్యమనుకొని నమ్మరు), కోతికి దయ్యం పట్టినట్లు.
హీ
18. హీనజాతి ఇల్లు జొచ్చినా, ఈగ కడుపు జొచ్చినా నిలవవు.
19. హీనస్వరం పెళ్ళాం ఇంటికి చేటు.
హె
20. హెచ్చుగా పేలున్నవాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురద లేదు.
హే
21. హేమాహేమీలు ఏతివెంత కొట్టుకపోతుంటే, నక్క పాటిరేవు అడిగిందట.
హో
22. హోరుగాలిలో దీపం పెట్టి, ఓరిదేవుడా! నీ మహాత్మ్యమన్నట్లు (మహిమ అన్నట్లు).
క్ష
23. క్షణం చిత్తం - క్షణం మాయ.
క్షే
24. క్షేత్ర మెఱిగి విత్తనము, పాత్ర మెఱిగి దానము.
25. క్షేమంగా పోయి, లాభంగా రమ్మన్నట్లు.
No comments:
Post a Comment