1. సాతాని గర్భదానం.
2. సాతాని జుట్టుకు, సన్యాసి జంధ్యానికి ముడివేసినట్లు.
3. సాతాని నుదుట విభూదిరాయడం సురభి బదనిక పాముకు చూపినట్లు.
4. సాతుముడికి సత్తువేటు పడితే, సచ్చిన తాతయినా లేచివస్తాడు అన్నట్లు.
5. సాదు పలు(ల)వ.
6. సాదు రేగితే తల పొలానగాని నిలువదు. (తల పొలము=ఊరి పొలిమేర).
7. సాదు రేగినా బూతు రేగినా సవసవ పోవు.
8. సాదెద్దు సీదుకు రేగిన కంచెంత పాడు.
9. సాధ్వి మహిమ నెట్లు స్వైరిణి ఎరుగురా?
10. సానక్రింద దీపము వలె.
11. సానక్రింద వెన్నెల వలె.
12. సానపై యిరవై, సంచికట్నం ముప్ఫై, ఇంటికి యాభై పంపించండి, కరకర ప్రొద్దెక్కేవఱకు కాటిలో పొగలేపుతాను.
13. సానికి ఱంకులు నేర్పాలనా?
14. సానిదాని సళ్ళు సంత సొరకాయలు (గోటగిచ్చి ముదురు లేత చూచిపోతారు).
15. సాని నీతి - సన్నాసి జాతి (తెలియవు).
16. సానులలో సంసారి, సంసారులలో సాని.
17. సామజము చెఱకు మేసిన, దోమలు పదివేలు చేరి తోలంగలవా?
18. సాము నేర్చినవానికే చావు గండం.
19. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు.
20. సాయంకాలం భూపాలరాగం అన్నట్లు (భూపాల=మేలుకొలుపు రాగం).
21. సాయబు సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి.
22. సయబూ! చిక్కిపోయినా వేమంటే? ఇంకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసూవస్తే చచ్చిపోతాం మీకేమి? అన్నాడట.
23. సాలెకు, జంగానికి సాపత్యం కుదురుతుందా?
24. సాలె జాండ్ర సభామధ్యే, సాతానిః పండితోత్తమః
25. సాలెవాని భార్య సరిమీద పడ్డది (సరి=గంజి).
26. సాలెవాని ఎంగిలి ముప్ఫదిమూడుకోత్ల దేవతలు మెచ్చారట (నాకితేగానీ పడుగు అతకలేడు)
27. సాలెవానికి కోతిపిల్ల తగులాట మైనట్లు.
28. సాలోడికి కోడిపుంజు తగలాటం.
29. సావడి (చావడి) కాలెరా సన్నాసీ, అంటే సా(చా)వసింపు నా సంకలోనె ఉన్న దన్నాడట.
30. సావుకారు చతికిలబడితే, పీట వెల్లకిల బడిందట.
31. సాహసంలేని వాడికి కత్తి సరిగా తెగదు.
32. సాహెబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే.
33. సాహెబులా! సెదాములు, సలాము లేవయ్యా? అంటే దొరలు దాతలు పట్టంచు ధోవతు లిచ్చిన ఇనాములేవయ్యా? అన్నాడట.
34. సాహెబ్ కు సాడే తీన్. నాకు మూడున్నర.
35. సాక్షికాళ్ళు పట్టుకోవడం కన్న, వాదికాళ్ళు పట్టుకోవడం మేలు.
సి
36. సింగడికేల పత్తి బేరము? (సింగడు=దిశమొలవాడు; బిత్తలి).
37. సింగన్నా! అద్దంకి పోయినావా? అంటే, పోనూపోయా, రానూవచ్చా అన్నాడట.
38. సింగారం జూడరా బంగారు మొగుడా.
39. సింగి కంటే (నీళ్ళాడితే)- సింగడు పథ్యం చేసినట్లు (ఇంగువ తిన్నట్లు).
40. సింగినాదం, జీలకఱ్ఱ.
41. సింగి నీళ్ళాడితే సింగడు ఇంగువదిన్నట్లు.
42. సింహంగూడ చీమకు భయపడే (తలకే) అదును వస్తుంది.
43. సింహంలో చీరి ఊడ్చడమున్నూ, కన్యలో కంగా పింగా ఊడ్చడమున్నూ.
44. సింహాసనంపై దున్నపోతు, లంజలలో పతివ్రత, ముత్తైదువులలో ముండమోపి.
45. సిగ్గంత పోయె చిన్న పెండ్లామా! పెండ్లికన్న పోదాం పెద్ద పెండ్లామా! అన్నాడట.
46. సిగ్గు చాటెడు, చెప్పులు మూటెడు.
47. సిగ్గు చిన్ననాడే పోయె, పరువు పందిట్లో పోయె, కొరవా సరవా ఉంటే గదిలో పోయె.
48. సిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలును.
49. సిగ్గు తోటకూరవంటిది (చాలా సుకుమారము).
50. సిగ్గు దప్పిన చుట్టం వన్నెచీర కేడ్చిందట.
51. సిగ్గుపడితే సిద్దె కట్టిపడుతుంది.
52. సిగ్గుబోవు వేళ చీర లబ్బినట్లు.
53. సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకించిందట.
54. సిగ్గులేని అత్తకు మోరతోపు అల్లుడు.
55. సిగ్గులేని చిన్నాయనా, విడిచిన చిన్నమ్మను ఇంకా కొడుతావా?
56. సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం.
57. సిగ్గులేని రాత్రికి ఏటా జాగారమే!
58. సిగ్గు విడిస్తే రాయలకూడు, తిరుపతికి పోతే బోడితల.
59. సిగ్గువిడిస్తే శ్రీరంగము, అంతకూ విడిస్తే బోడితల.
60. సిగ్గు సిబ్బిన కొడితే, శరము చేటన కొడుతుంది (శరము=సిగ్గు, షరం)
61. సిగ్గూ, శరము లేనమ్మ మొగుడిపెళ్ళికి పేరంటానికి వెళ్ళి, అడ్డగోడ చాటునుండి అర్ధరూపాయి కట్నం ఇచ్చిందట! (చదివించిందట).
62. సిగ్గెందుకు లేదురా జగ్గా? అంటే నల్లనివానికి నాకేమి సిగ్గన్నాడట.
63. సిగ్గేమే సిగదాకమా అంటే, నాకేమి సిగ్గే తలదారమా అన్నదట.
64. సిగ్గే స్త్రీకి సింగారం.
65. సిడి పడితే మూన్నెల్ల (మూడేండ్ల) వఱపు.
66. సిద్దప్పవంటి శిష్యుడూ లేడు, బ్రహ్మంగారి వంటి గురువూ లేడు, వేమనవంటి యోగీ లేడు.
67. సిద్దారెడ్డోరి చద్దన్నం తిని, శివారెడ్డోరి ఆవులు మేపినట్లు.
68. సిరికొద్ది చిన్నెలు, మగనికొద్ది వన్నెలు.
69. సిరిపంచి కుడువ మేలు.
70. సిరిపోయినా చిన్నెలు పోలేదు.
71. సిరి రా మోకా లొడ్డినట్లు.
72. సిలార్! పిల్లలు, నేను తయార్.
సీ
73. సీతకు వ్రాసింది సీమకు వ్రాయవలెన?
74. సీత పుట్టుక లంక చేటుకే.
75. సీతా పతే సిరిచాపే గతి.
76. సీతారామాబ్యాం నమః అంటే, మా ఇంటాయన ఎదురుకాలేదా? అన్నదట (భిక్షానికి వచ్చిన వానితొ).
77. సీదుకు రేగితే చిచ్చుబుడ్డి, కోపమొస్తే కొరివికట్టె.
78. సీలమందలంవరకు చీర కడితేగానీ, సాలెమిందని కెక్కడ తెచ్చియిచ్చేది?
సు
79. సుంకరమోటుకు మాట నిలకడలేదు.
80. సుంకరివద్ద సుఖదుఃఖాలు చెప్పుకొన్నట్లు.
81. సుండు చూడనీయదు, మండి మాననీయదు (సుండు= చిన్నకురుపు, మండి=పెద్దపుండు).
82. సుకవి తిట్లకు దొరబిడ్డ వెరచు గానీ మోటగాడు వెరచునా?
83. సుఖం మరిగినమ్మ మొగుణ్ణి అమ్ముకుని తినిందట.
84. సుఖం మరిగిన దాసరి పదం మరచినాడట.
85. సుఖమెరుగని బ్రతుకు సున్నమేయని విడెము.
86. సుఖవాసి దేహానికి మెత్తని చెప్పు.
87. సుఖాలు పువ్వుల వంటివి, అనుభవించగానే అంతరించిపోతవి.
88. సుతారం, సూదిలోని దారం.
89. సుతులు లేనివారికి గతులు లేవు.
90. సుధను గోరువాడు సుడిబడి చచ్చునా?
91. సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.
92. సున్నము పుట్టని ఊళ్ళో అన్నము పుట్టునా?
93. సున్నాలో ఉన్నది సూఖం, సూఖంలో ఉన్నది మోక్షం.
94. సుపుత్రా! కొంప తీయకు (పీకకు)రా అన్నట్లు.
95. సుబ్బడిది చుట్టాల రంధి, రాముడిది తామర రంది.
96. సుబ్బు పెళ్ళిలో సూరి సమర్త.
97. సుబ్బు పెళ్ళి వెంకి చావుకు వచ్చింది.
98. సురకు నిచ్చినట్లు, సుధకును నీయరే.
99. సురియ బట్టవచ్చు శూరుండు కాలేదు.
100. సువాసిని కొప్పుకేకాక బొండుమల్లెలు బోడిముండకేల?
No comments:
Post a Comment