Thursday, November 11, 2010

సామెతలు-16

ఓ


1. ఓంకారములేని మంత్రం, అదికారములేని ప్రఙ్ఞ
2. ఓ కన్ను పువ్వుకన్ను ఇంకోకన్ను కాయకన్ను.
3. ' ఓ ' కు ఎన్ని వంకరలో తెలియని వానికే వయ్యారం.
4. ఓనామాలు రానివాడు వడ్డీలు (వడ్లు) గుణించినట్లు.
5. ఓగల ముసలిది దొంగనుకట్టుకు ఏడ్చిందట.
6. ఓగు కడుపున వజ్రం పుట్టినట్లు.
7. ఓగును ఓగే మెచ్చును, అఙ్ఙానిని అఙ్ఞానే మెచ్చును.
8. ఓటికుండలో నీరుపోసినట్లు.
9. ఓటికుండలోన ఉండునా నీరంబు.
10. ఓటి తెప్పను నమ్ముకొని నీట్లో దిగినట్లు.
11. ఓడేక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగగానే బోడిమల్లయ్య.
12. ఓడలు బండ్లవచ్చు, బండ్లు ఓడలవొచ్చు.
13. ఓడిన గుఱ్ఱం జీనుపై సొడ్డుబెట్టిందట.
14. ఓడుఓడు అంటే, కంచమంతా ఓడనట్లు.
15. ఓదార్చే కొద్ది ఏడ్చే బిడ్డవంటివి కష్టాలు.
16. ఓనామాలు చదివారేకానీ ఆనవాలు చూపించలేరు.
17. ఓనామాలే ఋక్కులు, ఒకరెండే లెక్కలు.
18. ఓవనివాడు కోరనిది, ఒల్లనివాడు ఆడనిది లేదు.
19. ఓవనివానికి ఒద్దన్నవారే తల్లితండ్రులు.
20. ఓవలేని అత్త, వంగలేని కోడలు.
21. ఓబీ! ఓబీ! నీవు వడ్లుదంచు నేను పక్కలెగరేస్తా అన్నట్లు.
22. ఓరీ రజక చక్రవర్తీ అంటే, ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా! మీకే ఉండనీయండి అన్నడట.
23. ఓర్చలేనమ్మ ఒడిని నిప్పులు కట్టుకుంటే, ఒడీ, దడీ కాలిందట.
24. ఓర్చలేని రెడ్డి ఉండీ చెఱచెను, చచ్చీ చెఱచెను.
25. ఓలి ఇచ్చిన మొగుడికంటే, కూలి ఇచ్చిన మొగుడెక్కువ (ఓలి=కన్యాశుల్కం).
26. ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, దొంతి కుండలన్ని పగులకొట్టినట్లు.
27. ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, నెలకు ముఫై కుండలు నీళ్ళాడుతాయి.


ఔ


28. ఔననటానికి కాదనటానికి అత్తకధికారం గానీ, కోడలికేముంది?
29. ఔను-కాదు అనే మాటలెంత చిన్నవో, వాటిని అనటం అంత కష్టం.
30. ఔషధం కానిది అవనిలో లేదు.
31. ఔషధానికి అపధ్యానికి చెల్లు, రోగం పైపెచ్చు.


క


32. కంకణాల చెయ్యి ఆడితే, కడియాల చెయ్యీ ఆడుతుంది.
33. కంకి ఎఱ్ఱనయితే, కన్నెఱ్ఱనవుతుంది.
34. కంచం అమ్మి మట్టెలు (మెట్టెలు) చేయించినట్లు.
35. కంచం ఇచ్చి మెట్టె పెట్టించుకున్నా కానలేడు మొగుడు.
36. కంచం చెంబు బయటపారవేసి రాయి రప్ప లోన వేసుకునంట్లు.
37. కంచంత (కంచి+అంత) బలగమున్నా, కంచంలో కూడు వేసే దిక్కులేదు.
38. కంచం పొత్తేగానీ, మంచంపొత్తు లేదు.
39. కంచంలో కూడూ కుడువనే గానీ కాలదన్నను కాదు.
40. కంచరి దానింటి పిల్లలు తాటాకు చప్పుళ్ళకి బెదరరు.
41. కంచానికి ఒకడు, మంచానికి ఇద్దరు.
42. కంచి అంత కాపురం గడ్డలైనట్లు.
43. కంచి మేకకువలే కడుపెడు బిడ్డలు.
44. కంచిలో దొంగిలించేదానికి, కాళహస్తి నుంచి వంగిపోయినట్లు.
45. కంచు మట్టే, మంటిగాజు ఉంటే కావలిసినదేముంది?
46. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
47. కంచువట్టల ఆడుది. (గయ్యాళి ఆడుది అనుట).
48. కంచె మంచిదికాకపోతే కొయ్య కొల్లబోతుంది.
49. కంచలేని చేను, కన్నతల్లి లేని బిడ్డవంటిది.
50. కంచ వేసినదే కమతము.
51. కంచే చేను మేస్తే, కాపేమి చేయగలడు?
52. కంటికి ఇంపైతే, కడుపుకూ ఇంపు.
53. కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగమన్నారు.
54. కంటికి రెప్పా, కాలికి చెప్పు.
55. కంటికి రెప్ప ఆసరా, పులికి మల (కొండ) ఆసర.
56. కంటి రెప్పలుపోయాక, కాటుక, పూలు ఉంటే ఏమాయె?
57. కంటివంటి ప్రకాశంలేదు, మంటివంటి ఆధారంలేదు.
58. కంటే సుంకం, కానకుంటే బింకం.
59. కండ్లు ఆర్చినమ్మ ఇండ్లు ఆర్చును.
60. కండ్లు ఉంటేనే కాటుక.
61. కండ్లు కావాలంటవి, కడుపు వద్దంటుంది.
62. కండ్లు చెడిపిన దేవుడు మతిని ఇచ్చినట్లు.
63. కండ్లు పెద్దవి, కడుపు చిన్నది.
64. కండ్లు పోగొట్టిన దేవుడు ఇండ్లు చూపక మానడు.
65. కండ్లు పోయినతరువాత సూర్యనమస్కారాలు.
66. కండ్లు మూయించవచ్చును గానీ, కలలు కనేటట్లు చేయగలమా?
67. కంతి (కణిత) బలుపు కాదు, చింత తిరిక గాదు.
68. కంతి తలగడకాదు, కల నిజంకాదు.
69. కందం చెప్పిన వాడు కవి, పందిని పొడిచినవాడు బంటు.
70. కందకు లేదు, చేమకు లేదు, తోటకూరకు దురద ఎందుకు?
71. కందకు లేని దురద కత్తిపీటకా?
72. కందకు లేని దూల చేమకెందుకు?
73. కందకు లేని నస బచ్చలికేల?
74. కందిగింజను, కాపువానిని వేచనిదే చవిగావు.
75. కందిచేల్లో కర్రు పోగొట్టుకొని, పప్పు పెట్టిలో వెతికినట్లు.
76. కంది పండితే కఱవు తీరును.
77. కందెన పెట్టనిదే పరమేశ్వరు బండియైనా పారదు.
78. కందెన వేయని బండికి కావలసినంత సంగీతం.
79. కంప తొడుగు ఈడ్చినట్టు.
80. కంపలో పడ్డ ఈగవలె.
81. కంపుచూడను పువ్వు నలుపవలెనా?
82. కంపునోటికి అల్లం పచ్చడా?
83. కంపునోటివాడు కూడబెడితే, మంచినోటివాడు మాయం చేసినట్లు.
84. కంపు పెట్టుకొని, గంపెడు తిన్నట్లు.
85. కంబళిలో తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.
86. కంబారీ పశువులుపోయినా, మారటతల్లికి బిడ్డలు పోయినా బాధలేదు.
87. కంభం చెరువు చూసి, దున్నపోతు ఆ నీళ్ళన్నీ తానేదున్నాలనుకొని గుండెపగిలి చచ్చిందట.
88. కంసాలివాని ఇంటికి వెళితే బంగారం అంతదుగానీ, కుమ్మరి వాని ఇంటికి వెళితే మాత్రం మట్టి అంటుకుంటుంది.
89. కంసాలి కూడు కాకులు కూడా ముట్టవు.
90. కంసాలి గోటు, కరణం తేటు.
91. కంసాలి పెళ్ళికి ఇల్లంతా పొయ్యిలే.
92. కంసాలి బఱ్ఱె నమ్ముతున్నాడు, లోపల లక్క లేకుండా చూడరా అన్నాడట.
93. కంసాలి మాయ కంసాలికి గానీ తెలియదు.
94. కంసాలి లేకుండా చూసి కధ చెప్పమన్నారు.
95. కంసాలి వద్దనైనా ఉండాలి, కుంపటిలోనైనా ఉండాలి (తగ్గిన బంగారం).
96. కంసాలి వారు కాలానికి పెళ్ళికొడుకులు, కరువుకు కాటిపీనుగలు.
97. కక్కదింటే (కక్కేదాకా తింటే) గారెలు చేదంట.
98. కక్కిన కుక్కవద్దకు, కన్న కుక్కవద్దకు కానివాణ్ణయినా పంపరాదు.
99. కక్కిన కూటికి ఆశించినట్లు.
100. కక్కిన బిడ్డ దక్కుతుంది.

Monday, November 8, 2010

సామెతలు-15

1. ఏ రోటి దగ్గర ఆపాట పాడాలి.
2. ఏరు ఏడామడ లుండగానే చీరవిప్పి చంకనేట్టు కుందిట.
3. ఏరు నిండిపారినా పాత్రకు తగురీతి నీరువచ్చు.
4. ఏరుదాటి తెప్ప తగుల బెట్టినట్లు.
5. ఏరుదాటే వరకు ఎంకన్న, ఏరు దాటినాక సింగన్న.
6. ఏరు పోయిందే పోక, ఏలిక చెప్పిందే తీర్పు.
7. ఏలడానికి ఊళ్ళు లేకపోవుగానీ, ఎత్తుకతినడానికి (అడుక్కతినను)ఊళ్ళు లేవా?
8. ఏలి మీద గోరు మొలిచింది ఏంజేతు మొగుడా అన్నదట.
9. ఏలేటి పురుషునికి ఏడ్గురు భార్యలు.
10. ఏలేవానికి ఎద్దుపోతేనేమి? కాచేవానికి కన్ను పోతేనేమి?
11. ఏవాడ చిలుక ఆ వాడ పలుకు పలుకుతుంది.
12. ఏ వన్నె సులోచనం పెట్టుకుంటే ఆవన్నే కనిపించేది.
13. ఏ వేషం వచ్చినా దివిటివానికే చేటు. (వీధిభాగవతాలలో)


ఐ


14. ఐదు శిఖలకంటే మూడు కొప్పులు చేరితేనే మోసం.
15. ఐశ్వర్యదేవత హలంలోనే ఉంది.
16. ఐశ్వర్యానికి అంతంలేదు, దారిద్ర్యానికి మొదలు లేదు.


ఒ


17. ఒంటరివాని పాటు ఇంటికి రాదు.
18. ఒంటి కంటే జంట మేలు.
19. ఒంటికి ఓర్వలేనమ్మ, రెంటికి ఓర్చునా?
20. ఒంటి చేతి దాహం, ఒకనాలి పొందు తనివి తీరవు.
21. ఒంటెలుకు పోతే రెండేళ్ళకు వచ్చిందట.
22. ఒంటేలుకు పోయి ఇంతసేపేమిటిరా అంటే రెండేళ్ళకు వచ్చింది అన్నడుట.
23. ఒక ఈగ బండి చక్రం మీదవాలి ' నేనెంతదుమ్ము రేగకొడుతున్నానబ్బా' అని మురిసిపోయిందట.
24. ఒక ఊరికాపు ఇంకొక ఊరి మాల.
25. ఒక ఊరి రాజు, ఇంకొక ఊరికి రైతు.
26. ఒక ఒరలో రెండు కత్తులిముడునా?
27. ఒక కంటిలో సున్నం, ఇంకో కంటిలో వెన్న.
28. ఒక కన్ను కన్నూ కాదు, ఒక కొడుకు కొడుకూ కాదు.
29. ఒక కల కనగానే తెల్లారుతుందా?
30. ఒక కొడుకు కొడుకూ కాదు, ఒక చెట్టు తోపూ కాదు.
31. ఒక చంట పాలు, ఒక చంట నెత్తురు.
32. ఒక చెంపకొడితే పాలు, ఇంకొక చెంప కొడితే తేనె.
33. ఒక చెయ్యి తట్టితే చప్పుడగునా?
34. ఒక చేత పసుపు, ఇంకోచేత ముసుగు.
35. ఒక చేతి వేళ్ళే ఇకలా ఉందవు.
36. ఒకటె దెబ్బతో రెండు కాయలు కొట్టినట్లు.
37. ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకొడిని చూస్తే మొట్టబుద్ధి.
38. ఒకడి పాటు, పదిమంది సాపాటు.
39. ఒకడు అగ్గిరాముడు, ఇంకొకడు మైరవణుడు.
40. ఒకడు అహిరాముడు, ఇంకొకడు మహిరావణుడు.
41. ఒకడు తిమి. ఇంకొకడు తిమింగలం.
42. ఒకడూ పినతల్లికి తప్పినవాడూ, ఇంకొకడు తల్లికి తప్పినవాడు.
43. ఇక తీగలాగితే పొదంతా కదిలినట్లు.
44. ఒక దొడ్డి గొడ్లు పొడుచుకోవా?
45. ఒకనాటి అదను, ఏడాది బ్రతుకు.
46. ఒకనాటి పెళ్ళికి ముఖమంతా కాటుక.
47. ఒకనాటి భోగం, ఆరునెలల రోగం.
48. ఒకనాటి విందు, మరునాటి కుందు (మందు).
49. ఒకనాటి వేషానికి (భోగతానికి) మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.
50. ఒకనాటి సుఖం ఆరునెలల కష్టం.
51. ఒకనాతి సుఖం, ఒక ఏటి కష్టం.
52. ఒకనాడు ధారణ, ఒకనాడు పారణ
53. ఒకని ఆలి, ఒకని కన్నతల్లి.
54. ఒకనికి ఇగురుకూర ఇష్టం, ఇంకొకనికి పులుపు కూర ఇష్టం.
55. ఒకని సంపాదన పదిమంది పాలు.
56. ఒక పాము చేత రెండుసార్లు కరిపించుకుంటామా?
57. ఒకపూట తిన్నమ్మ ఓర్చుకుంటే, ముప్పూట తిన్నమ్మ మూర్చ (శోష) పోయిందట.
58. ఒకరి అమృతం ఇంకొరికి హాలాహలం.
59. ఒకరి కలిమి ఇంకొకరి ఏడ్పుకు కారణం.
60. ఓకరి కలిమికి ఏడిస్తే ఒక కన్ను పోయింది, తనలేమికి ఏడిస్తే రెండో కన్ను పోయింది.
61. ఒకరితో ఊరు పావనం, ఒకరితో గౌరి పావనం.
62. ఒకరిదైతే ఓపినంత, తనదైతే తగరమంత.
63. ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడుకాడు.
64. ఒకరిని కోస్తే పాలు, ఇంకొకరిని కోస్తే నెత్తురు వస్తుందా?
65. ఒకరు ఏటికి తీస్తే, ఒకరు కాటికి తీసినట్లు.
66. ఒక వ్యక్తి క్రీనీడే ఒక సంస్థ.
67. ఒకూరికి వెయ్యి దోవలు.
68. ఒకే కోకిల వసంతాన్ని కొనిరాదు.
69. ఒకే చెప్పులజోడు అందరికీ సరిపోతుందా?
70. ఒకే తొడిమకు రెండు కాయలు.
71. ఒకే చెట్టుకాయలే ఒకలా ఉందవు.
72. ఒకే మద్దెలను చెరి కాసేపూ వాయించుకొన్నట్టు.
73. ఒకే మద్దెలను చెరిఒకప్రక్క వాయించుకొన్నట్లు.
74. ఒక్క గుడ్డు మురిగిపోగానే పొరుగు గుడ్లన్ని పాడగునా?
75. ఒకే కొడుకని వరికూడు పెడితే మీట్రిచ్చి మిండగాడయినాడట.
76. ఒక్కతే కూతురని వరి అన్నంపెడితే, మిద్దెనెక్కి మిండల పిలిచిందిట.
77. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
78. ఒక్క పుస్తె తెగితే వేయిపుస్తె లల్లాడతవి.
79. ఒక్క ప్రొద్దుమాట కుక్క ఎరుగునా?
80. ఒకరున్న దెవులాట, ఇద్దరున్న తన్నులాట.
81. ఒక్కక్క చినుకే వాన అవుతుంది.
82. ఒక్కక్క రాయి తీస్తుంటే కొండైనా తరుగుతుంది.
83. ఒగిచేవారే గానీ ఓదార్చే వారుండరు.
84. ఒజ్జలే కంకులతో కాలం గడుపుతూ ఉంటే శిశ్యులకు ఊచబియ్యమా?
85. ఒట్టుపోయి గట్టెక్కే, తానుపోయి చెట్టెక్కే.
86. ఒడిలో బెట్టుదునా? బడిలో బెట్టుదునా? అన్నట్లు.
87. ఒడుపుచేత కడుపు చేసికొన్నట్లు. (ఒడుపు=తొందరపాటు, లాఘవము).
88. ఒడ్డున నిలబడే సముద్రాన్ని పొగడాల.
89. ఒత్తిపలకవే వసనాభ్పిల్లి అంటే మ్రావ్ మ్రావ్ అన్నదిట.
90. ఒత్తు పొత్తును చెరచును.
91. ఒరపు కోరుస్తారుగానీ, తడుపుకోర్వరు.
92. ఒల్లని మగనికి తలంబ్రాలు పోసినట్లు.
93. ఒల్లని వనికి పెరుగులో రాయి.
94. ఒల్లీఒల్లని చుట్టం వచ్చాడు, ఉడుకే ఉలవపప్పా ఉగాదిదాకా.
95. ఒళ్ళంతా తడిసినవెనుక ఓపలేనివారికైనా చలిలేదు.
96. ఒళ్ళెరుగని శివము, మనసెరుగని కల్ల ఉందా?
97. ఒళ్ళుబలిసిన గంగానమ్మ పేడకుడుములు అడిగిందట.
98. ఒళ్ళు వంగనమ్మ కాలి మట్టెలకు కందిపోయిందట.
99. ఒళ్ళువంగని వాడు దొంగలతో కలిసినాడట.
100. ఒళ్ళో గింజలు ఉన్నా, వద్ద భార్య ఉన్నా ఊరుకో బుద్ధి కాదు.

Friday, November 5, 2010

సామెతలు-14

1. ఏడుపులో ఏడుపు ఎడమచేయి చూపెట్టు అన్నట్లు.
2. ఏడుమనువులు పెళ్ళైనా ఏకులరాట్నం తప్పలేదు.
3. ఏడుమాటలు మాట్లాడినా, ఏడు అడుగులు నడిచినా గుణం తెలుస్తుంది.
4. ఏడు మారినా, ఈడు ముదిరినా ఏమీమారదు ఈ లోకంలో.
5. ఏడుమాసికాల చీర, ఎదురు బాసింగాల రవిక, జరుగుతూ జరుగుతూ నేను సారె కట్టుక వచ్చినాను.
6. ఏడుమెతుకులు తింటే ఏనుగంత సత్తువ.
7. ఏడుసార్లు పాసిన చేల్లో పండిన కంకితో ఏడుగుర్ని చంపవచ్చు.
8. ఏడుస్తావు ఏమి ఎలుకా? అంటే నా బాధ నీకే మెఱుక అన్నదిట.
9. ఏడుస్తున్న వాణ్ణి దాని(న)మ్మకాయలు కావాలా అంటే, దానికాయలే కావాలి అన్నాడుట.
10. ఏడుస్తూన్నావెందుకు బ్రాహ్మడా? అంటే ఒకనాడు నామొగం నవ్వి చచ్చిందా అన్నాడట.
11. ఏడుస్తూ ఏరువాక సాగిస్తే, కాడిమోకు దొంగలు దోచుకుపోయారుట.
12. ఏడూళ్ళు తిరిగినా, ఎఱ్ఱకఱ్ఱిదాన్ని కొనమన్నారు.
13. ఏడ్చి ఎంకటసామీ అనిపించుకొన్నట్లు.
14. ఏడ్చి మొహం కడుకున్నట్లు.
15. ఏడ్చేదాని ఎడమచేతి కిందా కుట్టెవాని కుడిచేతికిందా కూర్చోరాదు.
16. ఏడ్చేదాని బిడ్డకు అరటిపండ్లు చూపినట్లు.
17. ఏడ్చేదాని బిడ్డను ఆమే కనవలెను అన్నట్లు.
18. ఏడ్చేదాని మొగుడు వస్తే, ఏకు వడికే దాని మొగుడూ వస్తాడు.
19. ఏడ్చేదాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు.
20. ఏతానులో పీలిక ఆ తానుకు చెందినట్లు.
21. ఏతాము ఎంతవంగినా తిరిగి లేచేదానికే కదా.
22. ఏతాము పాటకు ఎదురులేదు.
23. ఏదారి అంటే గోదారి అన్నట్లు.
24. ఏది పట్టినా దెయ్యం పట్టినట్లు.
25. ఏదీకాని వేళ గేదె ఈనినట్లు.
26. ఏ దేముడు వరమిచ్చినా పెనిమిటిలేనిదే పిల్లలు పుట్టరు.
27. ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి ఉండేది మేలు.
28. ఏనుగ ఎక్కినవాడు, దొడ్డికంత దూరగలడా?
29. ఏనుగు ఎత్తిపడితే (చతికిలపడితే) ఏనుగే లేవాలికానీ ఎవరు లేవతీయగలరు?
30. ఏనుగు ఎత్తుబడినా గుఱ్ఱమంత ఎత్తు.
31. ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు, చీమ ఒళ్ళు చీమకు బరువు.
32. ఏనుగకు ఎలక్కాయలు లొటలొట.
33. ఏనుగకు ఒక సీమ, గుఱ్ఱానికొక ఊరు, బఱ్ఱెకొక బానిస.
34. ఏనుగకు కాలువిరగటం, దోమకు రెక్కవిరగటం సమము.
35. ఏనుగకు సీళ్ళు చూపినట్లు (సిడి=అంకుశం).
36. ఏనుగ తన నెత్తిన తానే మన్ను పోసుకున్నట్లు.
37. ఏనుగ తొండము, యావ బట్టిన ముండ ఊరుకోవు.
38. ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
39. ఏనుగుది ఎందరు కుడిస్తే తరుగుతుంది?
40. ఏనుగునైనా ఎంటితో కట్తవచ్చు (ఎంటి=గడ్డిపరకలతో నేసిన త్రాడు).
41. ఏనుగును ఇచ్చి అంకుశం దాచినట్లు.
42. ఏనుగును ఎక్కినవాడు, కుక్క కూతకు జడియడు.
43. ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు.
44. ఏనుగును తెచ్చి ఏకులబుట్టలోపెట్టి అది తన నెత్తిన పెట్టి, తనను ఎత్తుకోమన్నట్లు.
45. ఏనుగునేక్కి రంకుకు పోయినట్లు.
46. ఏనుగు పురుడోసుకొన్నట్లు.
47. ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటవి.
48. ఏనుగు పోయేదారి ఎరుగడుగానీ, దోమలు పోయేదారిలో తొంగున్నాడు.
49. ఏనుగు బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి.
50. ఏనుగు మదిస్తే నెత్తిన మన్ను పోసుకుంటుంది.
51. ఏనుగు మింగిన వెలగపండువలె (కరిమింగిన వెలగపండు).
52. ఏనుగు మీద ఎండ కాసినట్లు.
53. ఏనుగుమీద దోమ (ఈగ) వాలినట్లు.
54. ఏనుగుమీద పొయేవాణ్ణి సున్నమడిగినట్లు.
55. ఏనుగు మోత, ఏనుగు మేత.
56. ఏనుగు రొంపిలో కూరుకుపోతే కాకికి కూడా లోకువే.
57. ఏనుగులను అప్పుగా ఇస్తున్నారంటే, రెండు తోలుకొని వచ్చి కట్టివేయమన్నాడట.
58. ఏనుగులెగిరిపోతుంటే దోమలొక లెక్కా?
59. ఏనుగులు ఏట కొట్టుకొనిపోతుంటే, పిల్లి పాటి రేవడిగిందట.
60. ఏనుగులు ఏట గ్రుంకితే నక్క పాటిరేవడగ వచ్చిందట.
61. ఏనుగులు మింగిన ఎల్లమ్మకు పీనుగలు పిప్పళ్ళు.
62. ఏపట్లా చావకపోతే బాపట్లకు పంపండి.
63. ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.
64. ఏపుట్టలో ఏ పామో? ఏ గుళ్ళో ఏ మహత్యమో.
65. ఏ పూజ తప్పినా పొట్ట[పూజ తప్పదు.
66. ఏబ్రాసికి పని ఎక్కువ, లోభికి ఖర్చెక్కువ.
67. ఏబ్రాసి పెళ్ళికెడుతూ ఉంటే ఏకులరాట్నం ఎదురయిందట.
68. ఏమండీ కరణం గారు గోతిలో పడ్డారే? అంటే, కాదు మషాకత్తు చేస్తున్నా అన్నాడట.
69. ఏమందలో కట్టినా మన మందలో ఈనితే సరి.
70. ఏమయ్యా మా వారు బాగున్నారా? అంటే, అమ్మా బాగానే ఉన్నారు; విత్తనాలు వడ్లు తింటున్నారు, దాపుడు బట్టలు కడుతున్నారు ఆన్నడట.
71. ఏమి అప్పాజీ అంటే కాలం కొద్ది రాయాజీ అన్నట్లు.
72. ఏమిచేసి బ్రతుకుతున్నావమ్మా? అంటే నోరుచేసుకు బ్రతుకుతున్నా బిడ్డా అన్నదిట.
73. ఏంచేస్తున్నావురా? అంటే ఒలకపోసి ఎత్తుకుంటున్నా అన్నట్లు.
74. ఏమిట్రా మేనమామ ముడ్డిలో కట్టె పెడతావు? అంటే, చిన్నాయన అనుకున్నాను అన్నడట.
75. ఏమిపెట్టుక తిన్నావు? అంటే, ఆకలెట్టుక తిన్నానందిట.
76. ఏమిరా వెఱ్ఱిమొగమా? అంటే, ఏమి చిన్నాయనా అన్నాడట.
77. ఏమి పోలిసెట్టి? అంటే, ఎప్పటి మొత్తుకోళ్ళే అన్నడట.
78. ఏమిరా కోటా? అంటే, ఎప్పటిదే ఆట అన్నడట.
79. ఏమీ ఎరుగనోడు ఏకాశిన చస్తే అన్నీ తెలిసినోడు అమావాశ్యనాడు చచ్చాడట.
80. ఏమీ ఎరుగని ఎల్లి పాయె, దొంతులేస్తే దొల్లిపోయె.
81. ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట.
82. ఏమీ తోచకపోతే ఎక్కిరించాడట.
83. ఏమీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట.
84. ఏమీ లేదంటగానీ ఎల్లుండి పెండ్లంట.
85. ఏమీ దొరకనమ్మకు ఏగాణి దొరికితే ఎందులో పెట్టనే ఎంకాయమ్మా అన్నదిట.
86. ఏమీలేనమ్మకు ఏడ్పులు శృంగారం.
87. ఏమీ లేనమ్మకు ఏతులు లావు, ఉన్నమ్మకు ఆశలు లావు (ఏతులు=ఎచ్చులు, డంబాలు).
88. ఏమీ లేనిదానికి ఏతులు లావు, స్వాములవారికి జడలు లావు.
89. ఏమే వాడి దగ్గర పడుకున్నావు? అంటే, అంత పెద్దమనిషి చెయ్యిపట్టుకుంటే కాదనే దెట్లా? అన్నదిట.
90. ఏమోయి నీకూతురలా తిరుగుతున్నది? అంటే, అలవాటుపడిన ముండను అట్లానే పోనీస్తూ అన్నాడట.
91. ఏమోయి సెట్టి ఏట్లో కొట్టుకుపోతున్నావు? అంటే గడ్డిమోపు అమ్మటానికి అన్నాడట.
92. ఏమోయి నారాయణా, విధవగమనా అంటే, అది చిన్ననాటి మాట ఊరుకో అన్నాడట. (వి=పక్షి, ధవుడు=భర్త, విధవగమన=పక్షిపై పయనించేవాడు, నారాయణుడు).
93. ఏ యీకలపక్షి ఆ గుంపులో చేరుతుంది.
94. ఏ ఎండ కా గొడుగు పట్టినట్లు.
95. ఏ రాజ్యానికి ఏ రాజో అన్నట్లు.
96. ఏ రాయి ఐతేనేమి పండ్లు ఊడగొట్టుకోవటానికి.
97. ఏరుక తినే వాడి వెంబడి గీరుక తినేవాడు పడ్డాడుట.
98. ఏరుకుని తినే పక్షికి ముక్కున ముల్లు విరిగినట్లు.
99. ఏరూరి వ్యవసాయం ఊండూరి వైద్యం.
100. ఏరువస్తే వాన వెలుస్తుంది.

Wednesday, November 3, 2010

సామెతలు-13

1. ఎలుక తోలు ఎంత తోమినా నలుపే.
2. ఎలుక నోట్లో నుంచి ఏనుగు దంతాలు రావు.
3. ఎలుకమీద కోపంతో ఇంటికి చిచ్చుపెట్టుకొన్నట్లు.
4. ఎలుక సంసారం చూసి పిల్లి మూర్చపోయిందిట.
5. ఎల్లపాములు తలెత్తితే, ఎలికపామూ తలెత్తిందిట.
6. ఎల్లమ్మ పెళ్ళిలో పులమ్మ శోభనం.
7. ఎల్లమ్మ బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది.
8. ఎల్లయ్యకు ఎడ్లులేవు, మల్లయ్యకు మనుష్యులు లేరు.
9. ఎల్లయ్యకెడ్లు లేవు, మల్లయ్యకు బండిలేదు, తెల్లవార్లు బాడుగే.
10. ఎల్లవారమ్మల బ్రతుకు తెల్లారితే తెలుస్తుంది.
11. ఎల్లినదానికి ఏగాని తార్చినదానికి టంకం.
12. ఎల్లిని మల్లి చేయి, మల్లిని ఎల్లి చేయు.
13. ఎల్లి మీద పుల్లి, పుల్లి మిద ఎల్లి
14. ఎల్లిసెట్టి లెక్క ఏకలెక్క.
15. ఎవడబ్బ సొమ్మని వెక్కి వెక్కి ఏడవటం.
16. ఎవడికంపు వాడికి ఇంపు.
17. ఎవడి జందెం వాడికి ముప్పు.
18. ఎవడి నోటికంపు వాడికి తెలియదు.
19. ఎవడు తవ్వుకొన్న గోతిలో వాడే పడతాడు.
20. ఎవరి ఇంటి దోసెకైనా తూట్లే.
21. ఎవరి ఏడుపు వాళ్ళకే ఎదురు తగులుతుంది.
22. ఎవరి కంతికోస్తే వారికే నొప్పి.
23. ఎవరి పిచ్చి వారికి ఆనందం.
24. ఎవరికి పుట్టిన బిడ్దవురా ఎక్కి ఎక్కి ఏడ్చేవు?
25. ఎవరికి పెట్టావే దండము? అంటే మీలో బుద్దిహీనుడికి అన్నదిట సాని.
26. ఎవరికి వారే యమునా తీరే.
27. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని ఎగిరెగిరి ముద్దుపెట్టుకున్నట్లు.
28. ఎవరి జానతో వారు ఏడు జానల బెత్తెడే (పొడవు).
29. ఎవరి నీళ్ళలో వారు మునగాలి.
30. ఎవరి పాపాన వాళ్ళు పోతారు.
31. ఎవరిపిచ్చి వాళ్లకు ఆనందం
32. ఎవరి ప్రాణం వాళ్ళకు తీపి.
33. ఎవరి బిడ్డ వారికి ముద్దు.
34. ఎవరి ముడ్డికిందికి నీళ్ళు వస్తే వాళ్ళే చేస్తారు.
35. ఎవరివల్ల చెడ్డవోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డానోయి పేరన్నా అన్నాడుట.
36. ఎవరు ఇచ్చింది ఈ మాన్యం అంటే, నేనే ఇచ్చుకున్నాను అన్నాడట.
37. ఎవరు ఎంతచేసినా ఇంటికి ఆలు అవుతుందా? దొంతికి కడవ అవుతుందా?
38. ఎసటిలో మెతుకులన్ని పట్టిచూడాలా?


ఏ


39. ఏ అన్నమైతే ఏం? వరి అన్నమే వడ్డించమన్నాడుట.
40. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.
41. ఏవూరు ఏతామా? అంటే దూవూరే దూలామా అన్నదిట.
42. ఏవూరు రెడ్డీ అంటే ఏట్లో మోకాలిలోతు అన్నాడట.
43. ఏ ఎండకా గొడుగు పట్టినట్లు.
44. ఏకచక్రంగా ఏలిన రాజైనా కడకు ఏడు జానల కాటికే.
45. ఏకదంతుండిచ్చు నీకింత బొచ్చు.
46. ఏ కఱ్ఱన నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.
47. ఏకాదశి ఇంటికి శివరాత్రి పోయినట్లు.
48. ఏకాదశినాడు తల అంటుకుంటున్నావేమీటీ అంటే అది నిత్యవ్రతం, నేడే ఆరంభించాను అన్నాడట; మర్నాడు తల ఎందుకు అంతుకోలేదంటే, నిన్నటితో వ్రతం సమాప్తి అయినది అన్నాడుట.
49. ఏకాదశినాడు పేలపిండి తినకపోతే రాక్షసులై పుడతారు.
50. ఏకాదశి మరణమని ఈతకొయ్యలలో పడతానా?
51. ఏకాల వచ్చి, మేకాల తేలినట్లు.
52. ఏకాలు జారినా పిఱ్ఱకే మోసం.
53. ఏకాలు జారినా మోపుకే మోసం.
54. ఏకుతో తాకితే మోకుతో మోదుతారు.
55. ఏకు దారము, ఏగాని పుస్తె.
56. ఏకులు పెడితే బుట్టలు చిరుగునా?
57. ఏకులు లేని రాటము, మొగుడులేని పోరాటము.
58. ఏకులు వడికినట్టూ కాదు, మొగుడి దగ్గర తొంగునట్టూ కాదు.
59. ఏకైకరధులు ప్రత్యేక పాలెగాండ్రు.
60. ఏగాని ముండకు డబ్బున్నర క్షౌరం.
61. ఏగాలి కాఊపు ఊగినట్లు.
62. ఏగాలి కాచాప ఎత్తినట్లు (పడవ తెరచాప).
63. ఏగిలి (దుక్కి బాగా ఎండుట) చేస్తే ఏలనివానికైనా పండుతుంది.
64. ఏగిలి దున్నితే, వెఱ్ఱిమాలకైనా పండుతుంది.
65. ఏ గుంటలో నీరు ఆ గుంటలోనే ఇంకుతుంది.
66. ఏ గుఱ్ఱానికి తోక ఉంటే, ఆ గుఱ్ఱమే ఊపుకుంటుంది.
67. ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకు.
68. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరును.
69. ఏ గ్రహము పట్టినా ఆగ్రహము పట్తరాదు.
70. ఏ చంకనాకినా ఏమీ లేదుగానీ, ఏకు చంకనాకితే ఏగాని ఉంది.
71. ఏ చెట్టులేని చోట వెంపలి చెట్టు (ఆముదపు చెట్టు) మహావృక్షం.
72. ఏటికవతల ఇచ్చేకన్నా ఏట్లో పడేస్తే నయం.
73. ఏటి అవుతలు మిరియాలు మా తాటికాయంతేసి అంటే, మా ఇడుమాకులే పట్టలేదన్నదిట. (ఇడుమాకులు= ఇంటి ముందరి ప్రాంగణము).
74. ఏటి ఈతకు బీటి మేతకు సరి.
75. ఏటి ఒడ్డు చేను ఏరు వస్తే నిలుస్తుందా?
76. ఏటి కాడ నక్కకు పాటి రేవేమి తెలుసు.
77. ఏటికి ఎప్పుడు పోయినావు? ఇసుక తెచ్చావు? అంటే ఆడవారు తలిస్తే అదెంత సేపు అన్నదిట; మొగవారు తలిస్తే ఇదెంతసేపు అని నాలుగు బాదినాడుట.
78. ఏటి కాల్వ జూడ ఎక్కి తగ్గిన రీతి.
79. ఏటికి ఎదురీదినట్లు.
80. ఏటికి ఎన్ని నీళ్ళూ వచ్చినా, కుక్కకు గతుకు నీళ్ళే.
81. ఏటికి పోయి జారిపడి ఊరు అచ్చిరాలేదన్నాడుట.
82. ఏటికి లాగితే కోటికి, కోటికి లాగితే ఏటికి అన్నట్లు.
83. ఏటి కట్టున కూటి గట్టున ఓపిక పట్టలేరు.
84. ఏటిదరి మ్రానుకు ఎప్పుడూ గండమే.
85. ఏటిమీద దేవరకు కూటిమీదే చింత.
86. ఏటివంక లెవరు తీస్తారు, కుక్కతోక ఎవరు సరిచేస్తారు?
87. ఏటి వరద, నోటి దురద.
88. ఏటుకు ఏటు, మాటకు మాట.
89. ఏట్లో కలిసిన చింతపండు లాగా.
90. ఏట్లో పడ్డవానికి ఎన్నో ఎన్నికలు.
91. ఏట్లో పారేనీరు ఎవరు తాగితేనేమీ?
92. ఏట్లో వేసినా ఎంచి వేయవలెను.
93. ఏడవ గలిగితే ఏడ్చినకొద్ది వ్యవసాయం.
94. ఏడాటం (ఇబ్బంది) మొగుడికి ఎత్తుభారం పెళ్ళాం.
95. ఏడు ఎందల విన్ననాలు ఎంతవరకైనా ఆగుతాయి.
96. ఏడు కరువులు వస్తున్నాయిరా అంటే, తొలి కరువులోనే పోతే మిగతా ఆరు ఎంచేస్తాయి అన్నాడుట.
97. ఏడుకాంపులమ్మకు మూడు కాంపులమ్మ ముక్క నేర్పినట్లు.
98. ఏడుగురిని మారిస్తే పెద్ద గౌడసాని.
99. ఏడునెలలకు ఎందుకు నడకాలు అన్నట్లు.
100. ఏడుపు ఏడింటి కనర్ధం.

Monday, November 1, 2010

సామెతలు-12

1. ఎదురింటి పొయ్యిమండితే, తన పొయ్యిలో నీళ్ళుపోసుకొన్నట్లు.
2. ఎదుటివారి సొమ్ము ఎల్లవారికీ తీపు.
3. ఎదురుగుండా అద్దముంటే ఎక్కిరించుకో బుద్దవుతుంది.
4. ఎదురు తిరిగిన కుక్కను ఏదీ కరువలేదు.
5. ఎదురు తిరిగిన కుక్కా ఏదుపంది ఒకటే.
6. ఎదురుపడినవాడే నా మొగుడన్నట్లు.
7. ఎదురుపెట్టి కుదురు కొట్టించుకొన్నట్లు.
8. ఎదురుపెట్టి చదరంగ మాడినట్లు.
9. ఎద్దు అంత కుప్పయితే ఏడు పుట్ల చోళ్ళు (సజ్జలు, రాగులు).
10. ఎద్దు అడుగులో ఏడు గింజలుపడితే పైరు పలుచన.
11. ఎద్దు (దున్న) ఈనిందంటే గాటా కట్టేయమన్నట్లు.
12. ఎద్దు ఉన్నవాడికి బుద్ది ఉండదు, బుద్ది ఉన్నవాడికి ఎద్దు ఉండదు.
13. ఎద్దు ఎండకులాగా, దున్నపోదు నీడకు లాగా.
14. ఎద్దునెక్కున తీరుకాదు, సద్ది తిన్న నోరు కాదు.
15. ఎద్దునెక్కున వాడే లింగడు, గద్దెనెక్కిన వాడే రంగడు.
16. ఎద్దు ఏమెరుగురా అటుకుల రుచి, గాడిదేమెరుగురా గంధపు పొడి వాసన.
17. ఎద్దుకాలిలో ముల్లంత లేకపోయినా, ఏడూళ్ళ పెత్తనానికి తక్కువ లేదు.
18. ఎద్దుకు ఎనుబోతుకు లంకె వేసినట్లు.
19. ఎద్దుకు కొబ్బరికాయ ఇస్తే ఏమి చేస్తుంది?
20. ఎద్దుకు చొప్పవేసి ఆవుని పాలివ్వ మన్నట్లు.
21. ఎద్దుకు తూలాలని ఉంది, గంతకు పడాలనీ ఉంది.
22. ఎద్దుకెగవేయ, బఱ్ఱెకు సగవేయ.
23. ఎద్దుకేమి తెలుసు అటుకుల చవి (రుచి).
24. ఎద్దుకొద్ది సేద్యం, సద్ది కొద్దీ పయనం.
25. ఎద్దు కొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు.
26. ఎద్దుగా ఏడది బ్రతికేకంటే ఆబోతుగా (ఇరు) ఆరునెలలే చాలు.
27. ఎద్దు చచ్చినా వాత బాగా పడింది.
28. ఎద్దు చేనుమేసిపోతే గాడిదకు చెవులుకోసినట్లు.
29. ఎద్దు తన్నుతుందని గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.
30. ఎద్దు తన్నుతుందని గుఱ్ఱంచాటు చేరినట్లు.
31. ఎద్దుతో వ్యవసాయం, ఆలితో సంసారం.
32. ఎద్దుని అడిగా గంత కట్టేది?
33. ఎద్దును కొద్దిలో కొనరాదు, బట్టను భారీలో కొనరాదు.
34. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడ్పుచూస్తే ఏడ్పు వస్తుంది.
35. ఎద్దును ముద్దుపెట్టబోతే, ఎడమకాలితో తన్నింది.
36. ఎద్దునోటికి చొప్ప అందించినట్లు.
37. ఎద్దున్న వాడి వ్యవసాయం చూడు, మంది ఉన్నవాడి మారుబలం చూడు.
38. ఎద్దు పుండు కాకికి ముద్దా?
39. ఎద్దుపుండు కాకికి రుచి.
40. ఎద్దు పొడుస్తుందని తన్నే గుర్రం చాటున చేరినట్లు.
41. ఎద్దు బీదదయితే చేను బీద.
42. ఎద్దు మంచిదైతే వేరూరికి పోతుందా?
43. ఎద్దు మోసినంత, గోనె పట్తినంత.
44. ఎద్దురొమ్ములో ముల్లుకఱ్ఱ పొడిచినట్లు.
45. ఎద్దులవెంటనే తాళ్ళు.
46. ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.
47. ఎద్దులు కాసినందుకు, ముద్దలు మింగినందుకు సరిపోయిందిపో అన్నాడట.
48. ఎద్దులు చేయును, గుఱ్ఱాలు మొయ్యను (మేయును).
49. ఎద్దులెప్పటివేగానీ గోనెలుమాత్రం కొత్తవి.
50. ఎద్దువలే ఉన్నావే తేలుమంత్రం తెలియదా?
51. ఎద్దువలే కుక్కనుపెంచి రెడ్డి తానే (ఆలుమొగలు తామే) మొరిగినాడ(ర)ట.
52. ఎద్దువలే తిని మొద్దువలే నిద్రపోయినట్లు.
53. ఎద్దయినా ఏడాదికి నేర్చును, మొద్దు ముప్పై ఏళ్ళయినా నేర్వడు.
54. ఎనుబోతు పేదల యశముగోరు.
55. ఎనుబోతు బలిసి ఏనుగవలెనున్న భ్రమరములకు మదప్రాప్తి లేదు.
56. ఎనుబోతుమీద వానకురిసినట్లు.
57. ఎనుము గొప్పదయినా ఏనుగును బోలునా?
58. ఎనుము ముసలి, ఏనాది ముసలి లేవు.
59. ఎనుముకు మేతవేసి ఆవుని పితికినట్లు.
60. ఎన్నడూ గానని మొగానికి ఇప్పపూత బెల్లమంట.
61. ఎన్నడులేని కల్మి కల్గెనా వెన్నున కద్దమడుగు, కొనవేళ్ళకు ముచ్చెలు తొడుగు.
62. ఎన్నడూ ఎక్కని రెడ్డి గుఱ్ఱమెక్కితే వెనుక ముందయిందట.
63. ఎన్నడూ ఎఱుగని వానిని ఎద్దుల బేరానికి పంపితే ఎఱ్ఱెద్దుకు ఎనభై, నల్లెద్దుకు నలభై అన్నడట.
64. ఎన్నడు దొరకనమ్మకు ఏగాణి దొరికితే, ఏడు ముళ్ళు వేసిందట.
65. ఎన్నడూ నా మొగుడు 'ఎల్లి, ఎల్లి,' అనలేదుగానీ ఇల్లు కాలిననాడు ఎల్లి ఎల్లి అన్నాడు.
66. ఎన్ని పూటులేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.
67. ఎన్నిబూతులైనా పిడికెడు కొఱ్ఱలతో సరికావు.
68. ఎన్ని ముట్టుపాతలైతే ఒక కట్టుకోక అవుతుంది?
69. ఎన్ని విద్యలైనా కులవిద్యకు సాటిరావు.
70. ఎన్ని సూదులైతే ఒక గడ్డపారగానూ?
71. ఎన్నో వ్రణాలు కొసానుగానీ నా వ్రణమంత తీపులేదు అన్నాడుట.
72. ఎప్పుడూ ఎరగనోడు ఏతాము తొక్కితే ఏటా ఆరుబారల అప్పు.
73. ఎప్పుడూ పెట్టే నాలుగూపెట్టి (చీవాట్లు)కొఱ్ఱలచేట బయటపెట్టు అన్నాడుట.
74. ఎప్పుడూ యోచిస్తుండేవాడు అభాగ్యుడు, ఎన్నడూ యోచించనివాడు అవివేకి.
75. ఎప్పటి అమ్మకు నిప్పటే గతి. (నిప్పటి=అరిసె).
76. ఎముక కొరికే కుక్క ఇనుము కొరుకునా?
77. ఎముకలేని నాలుక ఎత్లాతిప్పినా తిరుగుతుంది.
78. ఎరవుల కంచమని ఎదో పెట్టుకు తిన్నట్లు.
79. ఎరువుల సొమ్ములు బరువుచేటు, తియ్యను పెట్టను తీపులచేటు, దానిలో ఒకటిపోతే అప్పుల చేటు.
80. ఎరువు ఉంటే, వెఱ్ఱివాడూ సేద్యగాడే.
81. ఎరువును నమ్మి బొంతను పొయ్యిలో పెట్టుకున్నట్లు.
82. ఎరువుపెట్టిన పొలము, ఏలుబడి అయిన కోడలు.
83. ఎరువులేని పైరు, పరువులేని రైతు.
84. ఎరువులేని పొలము, వేగంలేని ఏరు.
85. ఎరువులేని సేద్యం కరువుదేవతకు వాద్యం.
86. ఎరువు వేయగానే (ఊసర) క్షేత్రం ఫలించునా?
87. ఎరువు స్థిరం కాదు బరువు తేలిక కాదు.
88. ఎరువూ వెంపలిస్తే ఎదిగిందే పైరు.
89. ఎఱిగి ఎఱిగి చేసిన పాపం, ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవలె.
90. ఎఱుక తేలిన (ఏలిన) ఏడుఘడియలకు వాన.
91. ఎఱ్ఱకోమటిని, నల్ల బ్రాహ్మణుడిని నమ్మరాదు.
92. ఎఱ్ఱమాదిగను, నల్ల బాపని నమ్మరాదు.
93. ఎఱ్ఱని ఆకాశానికి బఱ్ఱున వానలు.
94. ఎఱ్ఱనేలవంట ఒకనాటి వంట.
95. ఎలమఱ్ఱుకు ఎద్దునివ్వరాదు, పామఱ్ఱుకు పడుచునివ్వరాదు.
96. ఎలుక ఎప్పుడూ తన దిక్కుకే తవ్వుకుంటుంది.
97. ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి కనికరిస్తుందా?
98. ఎలుక ఏట్లోపోతేనేమి? పులి బోనున పడితేనేమి.
99. ఎలుకకు పిల్లి సాక్షి (సాక్ష్యం).
100. ఎలుక చావుకు పిల్లి మూర్చ పోతుందా?