1. నూతి దరిచేరి, నోట గొణిగితే ఈత వస్తుందా?
2. నూతిలో నీరు తోడుకోవాలి గానీ, తనంతటతానే పైకివస్తుందా?
3. నూతిలో పడబోయి తాప వెదకినట్లు (తాప=తెప్ప).
4. నూనె అన్నంతిని, నూతికి కాళ్ళు జాపిందట.
5. నూనె కొలిచిన గిద్దకు జిడ్డు కాదా?
6. నూనెతో మండే దీపం నువ్వులతో మండునా?
7. నూనెలేని వత్తి ఎగదోస్తే నేమి? దిగదోస్తే నేమి?
8. నూరి భరించలేనమ్మ, తాగి భరిస్తుందా?
9. నూరు అప్పడాలకు ఒకటే సొడ్డు.
10. నూరు ఆవులలో ఒక ఆవు ఈచుకపోతే లెక్కేమిటి? (ఈచుకబోవుట = చచ్చిన దూడను వేయుట).
11. నూరు కల్లలాడి అయినా ఒక ఇల్లు నిలుపమన్నారు.
12. నూరు కాకులలో ఒక కోకిల.
13. నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు.
14. నూరు గుడ్లుతిన్న రాబందుకైనా ఒకతే గాలిపెట్టు.
15. నూరు గుఱ్ఱాలకు అధికారి, ఇంటభార్యకు ఎండుపూరి.
16. నూరు గోవిందలు పెట్టవచ్చు కానీ ఒక్క దాసరికి పెట్టడం కష్టం.
17. నూరు తిట్టినా ఒక గుమ్మడికాయ (బద్ద) ఇస్తే సరి.
18. నూరు నోములు ఒక ఱంకుతో సరి (వ్యర్థమైపోవును).
19. నూరు పూసలకు ఒకే కొలికి.
20. నూరు భక్షణములున్నా నోటి కబ్బినంతే.
21. నూరుమంది గుడ్డివాళ్ళు నూతిన బడితే, కన్నున్న వాడొకడు గడ్డకు ఎత్తును.
22. నూరుమంది మొండిచేతులవాళ్ళు పోగై, గొడ్డూగేదె పాలు పితికినట్లు.
23. నూరుమందిలో నూనెబిడ్ద ముద్దు.
24. నూరుమాటలు ఒకవ్రాతకు ఈడుకావు.
25. నూరు వరహాలకు నూలుపోగన్నట్లు.
26. నూరేండ్లు చింతించినా నొసటి వ్రాలే గతి.
27. నూలుబట్ట నూరేండ్లు కడతామా?
నె
28. నెగడాశే గానీ మగుడాశ లేదు (నెగడు = చలి కాచికొనుటకు వేసిన మంట. ఇది ఆరిపోదు).
29. నెత్తి కాలనిదే జోలె నిండదు.
30. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది.
31. నెత్తిన మూటకు సుంక మడిగినట్లు.
32. నెప్పరగత్తి పప్పులొండితే, వడిగలమ్మ ఒళ్ళో బెట్టుకొని పోయిందట.
33. నెమలికంటి నీరు వేటగానికి ముద్దా?
34. నెమలి కూసినట్లు పికిలి కూయబోయి పిత్తుక చచ్చిందట.
35. నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు.
36. నెయ్యానికైనా, కయ్యానికైనా సమత ఉండాల.
37. నెయ్యి అని అరచి, నూనె అమ్మినట్లు.
38. నెరిధనమును దాయల (దాయాదుల) కిచ్చితే నెనరు మాటలు కలుగునా?
39. నెఱజాణ నేరననును, నేర్తు ననువాడు నింద పాలగును.
40. నెఱ ఱంకులాడికి నిష్ఠ మెండు.
41. నెల తక్కువైనా రాజుఇంట పుట్టమన్నారు (కాపింట; కోమటింట).
42. నెల తక్కువైనా మొగపిల్లవాడే మేలు.
43. నెల బాలుడికి నూలుపోగు.
44. నెలవు దొంగ ప్రాణం చుట్టు.
నే
45. నేటి కవులు సిరాలో ఎక్కువ నీళ్ళు కలిపి వ్రాస్తున్నారు.
46. నేటి బిడ్డే రేపటి తండ్రి.
47. నేటి విత్తే రేపటి చెట్టు.
48. నేడు గంత వేసి, రేపు ఎక్కినట్లు.
49. నేడు నవ్వు, రేపు (మరునాడు) ఏడ్పు.
50. నేడు నిప్పు, రేపు నీఱు (నీఱు= నివురు, బూడిద).
51. నేతికుండ నేలబెట్టి, ఉత్తకుండను ఉట్టిమీద పెట్టినట్లు.
52. నేతిగూన (గిన్నె) చేతబూని, నిచ్చెన ఎక్కినట్లు.
53. నేతిబీరకాయ; విభూతిపండు; జీలకర్ర (సామ్యము; బీరలో నెయ్యి లేనట్లు).
54. నేనాడేదే బండిసిరి ఆట, మా పెదబావ చూస్తాడంటే ఎలా?
55. నేను పుట్టకపోతే నీకు పెండ్లానే లేకపోవునే అంటే, నీవు పుట్టకపోతే నీ తల్లినే పెళ్ళాడి ఉందు నన్నాడట.
56. నేనుపోతే మజ్జిగనీళ్ళకు దోవలేదు గానీ, నా పేర చీటీపోతే పెరుగు పంపుతారు అన్నాడట.
57. నేను మందు తింటా, నీవు పథ్య ముండు మన్నట్లు.
58. నేను లేకపోతే ఎవణ్ణి పెళ్ళాడువంటే, నీ అబ్బంటోడు ఇంకొకడు పుట్టిఉంటా డన్నదట.
59. నేను ఒకపొద్దే, నా మగడు ఒక్క పొద్దే, పిండీ, బియ్యం లేక పిల్లలూ ఇక పొద్దే.
60. నేనూ బండెద్దునని గుద్దకు పేడ రాసుకొన్నట్లు.
61. నేములు కాచిన భూములు పండును.
62. నేయిచెడి నూనెచెడి పొగమాత్రం మిగిలింది (హోమం).
63. నేరక నేరక నేరేళ్ళు తినబోతే, నేరాలు ఒడిగట్టినట్లు.
64. నేరము గలిగినచోటనే కారుణ్యము.
65. నేరేళ్ళు నెగ్గేది, మారేళ్ళు (మామిళ్ళు) మగ్గేదీ- మంచికాలానికి లక్షణం.
66. నేరేళ్ళు పండితే నేలలు పండును.
67. నేర్చి చెప్పిన మాట నెరవాది మాట.
68. నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటుంది.
69. నేర్చిన బుద్ధి ఏర్చినా పోదు.
70. నేర్చి బ్రతికినవాడు, నేర్వక చెడ్డవాడూ లేడు.
71. నేర్పు కలిగినమ్మ చేతితో అతిరసాలు కాలిస్తే, ఓర్పుగలమ్మ ఒడిలో గట్టుకొని పోయిందట.
72. నేర్చుబో చంకల బిడ్డలాడిపడ సారసలోచన మాటలాడగన్.
73. నేర్పులేనివాని నెరయోధుడందురా?
74. నేలది తీసి నెత్తికి రుద్దుకొన్నట్లు.
75. నేలమీద వ్రాసిన బూరెను ఇంత తింటావా? అంత తింటావా? అన్నట్లు.
76. నేలమునగకు నిచ్చెన వేసేవాడు.
77. నేల మెత్తనిదని మోచేత త్రవ్వినట్లు.
78. నేల విడిచిన సాము - తాళం విడిచిన పాట.
79. నేల విడిచిన సాము - నీరు విడచి ఈత.
80. నేల విడిచిన సాము - మతి విడిచిన మాట.
81. నేసేవాణ్ణి నమ్ముకొని పొలిమేర జగడం ఒప్పుకొన్నట్లు.
నై
82. నైజ గుణానికి, గుడ్డికంటికి మందులేదు.
నొ
83. నొచ్చినవాడా నువ్వులు చల్లమన్నట్లు.
84. నొచ్చి నొసట పలుకదు, వచ్చినవాని విడువదు.
85. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు.
86. నొప్పు లెత్తుకున్నప్పుడే మంత్రసానికి దెప్ప సందు.
87. నొయ్యకుండా చేస్తే కొయ్యకుండా పండును.
88. నొసట పళ్ళు లేవు, నోట్లో కళ్ళు లేవు.
89. నొసట నామాలు, నోట బండబూతులు.
90. నొసటమీది వ్రాత నులిమిన పోవునా?
91. నొసట వ్రాసిన వ్రాత నులిమితే చెడదు.
92. నొసట వ్రాసిన వ్రాలు (వ్రాత) చెఱిపేదెవరు?
93. నొసట వ్రాసిన వ్రాలు కన్నా కలదా వెయ్యేళ్ళు చింతించినన్.
94. నొసలు భక్తుడు నోరు తోడేలయా.
నో
95. నోచిన వారి సొమ్ములు నో(య)మనివారికి వచ్చునా?
96. నోటిఆయి రొమ్ముకు తగులుతుంది.
97. నోటికి చేతికి చీకటి లేదు.
98. నోటికి తీపు, ముడ్డికి చేటు.
99. నోటికి మీరిన కడి మింగరాదు.
100. నోటికీ చేతికి ఎంగిలి లేదు.
1. నీ కూడు తిని, నీ బట్టకట్టి, నాకు కాపురం చేయమన్నాడట.
2. నీ చంకనేమిటోయీ? అంటే నాచంక నాకయ్యా (చంకన- ఆకు) అన్నాడట.
3. నీకులానికి సొడ్డంటే, చిన్నప్పుడే వదలివేసినా అన్నదట.
4. నీ చెవులకు రాగిపోగులే అంటే, అవీ నీకు లేవే అన్నట్లు.
5. నీకేమీ తేరగాడవు! నూకేవే గానీ, కడుపు నొప్పెరుగవు. (నూకుట= దొబ్బుట అనుట, నూకులు= ఎత్తులు, ప్రయత్నాలు, పీకెలు అనిగూడా)
6. నీచుకాడ చూడరా పాచుగాడి గుణాం (మంసము, చేపల పంపకంలో పట్టింపులు ఎక్కువ).
7. నీటికాకి మీను మునుగ నిరతము దయ స్నానమగునా?
8. నీటికి కలువ, మాటకు చలువ.
9. నీటికి నాచు తెగులు, నాతికి రంకు తెగులు.
10. నీటికి (నాచు) పాచితెవు(గు)లు, మాటకు మాట తెవులు, కులానికి కులం తెవులు.
11. నీటికొలది తామరతూడు (తామరలకు).
12. నీటిపైన గుండు నిలుచునా మునగక.
13. నీటిలో జాడలు వెదకినట్లు.
14. నీటిలో కప్ప నీరు త్రాగకుంటుందా?
15. నీ తలమీద తేలు ఉన్నదంటే, నీ చేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.
16. నీతిలేనివాడు కోతికంటే బీడు.
17. నీతివర్తనమును, కీర్తి దాని క్రీనీడవలె వెంటాడుచుండును.
18. నీతిహీనులవద్ద నిర్భాగ్యులుందురు.
19. నీదుండే తీరుకు చూపాలనా? బట్ట బాగేసుకో.
20. నీ దున్నడంలో ఏముంది? ఉండేదంతా నా చల్లడంలో ఉంది.
21. నీ పత్తుపణం పాడుగాను, నా ఒరుపణం కుప్పలు పెట్టు (పత్తు=పది, ఒరు=ఒకటి తమిళంలో).
22. నీ పప్పూ, నా పొట్టు కలిపి ఊదుకతిందాం అన్నట్లు.
23. నీ పీకెలు సాగవు.
24. నీ పెండ్లాం ముండమోస్తే, నీకు అన్నం ఎవరు వండిపెడతారు అని అన్నాడట.
25. నీ పెండ్లి పాడాలాఉంది, నా పెండ్లికి వచ్చి కాగడా (మషాల్జి) వెయ్యి అన్నట్లు (మషాల్జి= చాకలి, దివిటీలు పట్టేవాడు).
26. నీ పెండ్లి పాడైయింది, నా పెండ్లికి తాంబూలానికి రమ్మన్నాడట.
27. నీ పెండ్లి పాసుగాల, నాతద్దినం చూదమన్నట్లు (పాసు=ఏపు;దుంపతెగ అన్నట్లు).
28. నీ పెండ్లి పాసుగాలిందిలే, నా పెండ్లికి దివిటీలు పట్టమన్నాడట.
29. నీ పేరంటమే అక్కఱలేదంటే, కరకంచుచీర కట్టుకొని వస్తానందట.
30. నీపై ఎసలేదు, నాపై ఎసలేదు, ఏడుసేర్ల తప్పేలా కెసరుపెట్టమను.
31. నీ బఱ్ఱెగొడ్డును ఎవరు కాస్తారు చూస్తాను అంటే, నా తిత్తిలోని డబ్బే కాస్తుంది అన్నాడట.
32. నీ బిచ్చానికి ఒక దందముకానీ, నీ బేపిని కట్టేయి (బేపి= కుక్క).
33. నీ బిచ్చానికి తోడు ఏడు జోలెలా?
34. నీమం కోసం నామం పెడితే నామం నా కొంప తీసింది (నామంచూసి భోజనం చేసినాడనుకొని అన్నానికి పోతూ పిలువలేదట).
35. నీ మగనికి రాగిపోగులే అంటే, నీమగనికి అవీ లేవే అందట.
36. నీమాలకత్తె నిష్టతో మడిగుడ్డ ఆరవేయబోతే, మడత వీడి మాదిగవాడ (మాదిగాడ) కుక్కమీద పడిందట.
37. నీ ముక్కున చీమిడేమమ్మా అంటే, నీ చేతితోనే అటు తుడిచి పొమ్మన్నదట.
38. నీ మొగాన పొద్దుపొడిచినట్లు నిక్కుతావు.
39. నీర మోటికుండ నిలువని చందాన.
40. నీరధికి నీరు మోసినట్లు.
41. నీరుండేదాకా మీను మిట్టిపడుతుంది
42. నీరు ఉంటే ఊరు లేదు, ఊరు ఉంటే నీరు లేదు.
43. నీరు ఉంటే నారు ఉండవలె.
44. నీరు ఉంటే పల్లె నారి ఉంటే ఇల్లు.
45. నీరు ఉన్నచోటనే బురద.
46. నీరుకట్టువా(గా)డు తన మడి ఎండబెట్టుకోడు.
47. నీరు, నీరువంకకే పాఱునుగానీ మిట్టల కెక్కునా?
48. నీరు నూనె కలుస్తాయా?
49. నీరు పల్ల మెఱుగు, నిజము దేవుడెఱుగు.
50. నీరులేని తావున మెట్ట అని ఇల్లు కట్టుకొన్నట్లు.
51. నీరులేని పైరు, నూనెలేని ఒత్తి (జుట్టు).
52. నీరుల్లి నీటిలో కడుగితే కంపేడ పోతుంది?
53. నీరువిడచిన మొసలి- నీరు విడచిన చేప.
54. నీరు సొరక నికరము తెలియదు.
55. నీరెంతపోసి పెంచినా నేలవేము కూరకాదు.
56. నీఱు గప్పిన నిప్పు (నీఱు= బూడిద, మసి).
57. నీలి నీళ్ళకు పోతే, నీరు లోతుకు పోయింది.
58. నీలి మాటలు, గాలి మూటలు (నీలిమాట = నిందలు).
59. నీళ్ళపట్టున నేయి మందా?
60. నీళ్ళమూట, వంచకుడిమాట ఒకరీతి.
61. నీళ్ళలో నిప్పు పెట్టి కాలకుంటే కడుపు కొట్టుకొన్నట్లు.
62. నీళ్ళలో నిమ్మలు బ్రతికినవి, అడవిలో తుమ్మలు బ్రతికినవి.
63. నీళ్ళలో మునిగి ఉన్నవానికి నిప్పు భయం లేదు.
64. నీళ్ళాటని చేతికి విధానా లాటవు (ఆటు = ఆగు; మాను)
65. నీళ్ళాటని ఇంట నిధానాలాటవు.
66. నీళ్ళూ తాగే వానికి (వాని మాటకు) నిలకడలేదు (నీళ్ళు= కల్లు).
67. నీ వగలమాటలకు నా మగని చంపుకొంటి.
68. నీవు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగుతున్నాను.
69. నీవుకాదు, నీ తల్లో పేనుగూడా మాట వింటుంది.
70. నీవు క్షుద్రకీటకమువలె ప్రవర్తిస్తూ ఇతరులు కాళ్ళక్రింద తొక్కినారనుట ఎందుకు?
71. నీవు చస్తే లోకమంతా ఎముకలా?
72. నీవు దంచు నేను పక్క (రెక్కలు) ఎగురవేస్తాను.
73. నీవునేర్పిన విద్యయే నీరజాక్ష.
74. నీవు పాడినదానికి, నేను విన్నదానికి సరిపోయింది; తలూపినదానికి తంబూరా బెట్టిపో.
75. నీవు పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపు.
76. నీవు వెడితే బూతులు తిట్టివస్తావు, నేను వెడితే అమ్మను ఆలిని తిట్టివస్తాను.
77. నీవెక్కు-నీవెక్కు అన్న మర్యాదలు జరిగేలోపలే బండి వెళ్ళిపోయినదట. (హైదరాబాదు మర్యాదల తీరు).
78. నీసరి వేల్పులు లేరు, నాసరి దాసులు లేరు.
79. నీ సాకు చట్టుబండలు కాను, నాలుగు బేకులు బేక మన్నాడట (అన్నం వడ్డనలో0 ( సాకు = చాలు, బేకు =కావాలి, కన్నడములో)
80. నా సోకే సొఱాకు, నీ ముఖమే బీరాకు, నావంక చూడబోకు, నాకసలే చిరాకు.
ను
81. నుచ్చు గట్టిన రొమ్ము- కంపలో గాచినకాయ ఒకటే (ఉపయోగపడవు; నుచ్చు = గొఱ్ఱెల మేకల పాలు పొలాలలో త్రాగకుండా చన్నులకు కట్టు గుడ్దపీలిక).
82. నుదుట వ్రాయనిదే నోట పలుకదు.
83. నుదురు బత్తుడు, నోరు తోడేలు.
84. నుయ్యి తీయబోతే దెయ్యం బయటపడినట్లు.
85. నుయ్యి దాటేవానికి చింతాకంత ఎడమైనా ఎడమైనట్లే.
86. నువ్వుకు నూరు రోగాలు (తెగుళ్ళు).
87. నువ్వు చస్తే బొబ్బర్లు.
88. నువ్వులకు ఏడు దుక్కులు, ఉలవలకు ఒకే దుక్కి.
89. నువ్వులకు తగిన నూనె.
90. నువ్వులూ నూనె ఒకటి, నూనె (గాండ్ల) గమళ్ళవాడే వేరు.
91. నువ్వులు వేసి ఆవాలు పండమన్నట్లు.
నూ
92. నూకల కేడ్చి యేడ్చి, తవుడు కేడ్చినాడట.
93. నూక సంకటికి నూనెధార.
94. నూటికి నూలుపోగు, కోటికి గోవుతోక.
95. నూటికి పెట్టి, కోటికి గొరిగించినట్లు.
96. నూటిని పొడిచి సెలగ అన్నట్లు.
97. నూటివఱకు నన్ను కాపాడితే, ఆతరువాత నిన్ను కాపాడుతా.
98. నూత పడెదవా, పాతర పడెదవా?
99. నూతి కప్పల విధానం (కూపస్థ మండూకం).
100. నూతి కప్పకు సముద్రం సంగతేమి తెలుసును?
1. నాలుగుకాళ్ళ జీవాలలో మేక మెత్తన, రెండుకాళ్ళ జీవాలలో కోమటి మెత్తన.
2. నాలుగు వర్షాలు కురిస్తే, నత్తకాయ (గుల్ల) నాయకురాలు.
3. నాలుగేళ్ళు నంజుకొని, నడిమేలు గుంజుకో.
4. నాళ్ళలోకెల్ల చిన్ననాడే మేలు.
5. నా వీపు నీవుగీరు, నీ వీపు నేను గీరుతా నన్నట్లు. (ఒకరినొకరు పొగడికొనుట).
6. నా వ్రేలితో నా కన్నే పొడిచాడు.
7. నాశనం - నల్లబొగ్గులు.
8. నా సద్ది తెచ్చి నీ ఇడుపున పెట్టుకొని తినడమెందుకు? (ఈదుపు=పని నడుమ సేదతీర్చుకునే చోటు).
ని
9. నిండా మునిగినవానికి చలి ఏమి? గాలేమి?
10. నిండి దరిచేర నీయదు గండ్లకమ్మ, కలిగి తిననీయదు గంపకమ్మ.
11. నిండిన కడుపుకు అన్నం, బట్టతలకు నూనె
12. నిండిన కడుపు నిక్కి మాట్లాడును.
13. నిండిన కడుపు నీతి వినదు (ఎరుగదు).
14. నిండుకుండ తొణకదు.
15. నిండుటేరు నిలచి పాఱును.
16. నిండుబండికి (పేడ) చేటగూడా బరువే.
17. నింద లేనిదే బొందె పోదు.
18. నిక్కు నీలపల్లెలో, బ్రతుకు మాలపల్లెలో.
19. నిగాదారుని పెళ్ళం నీళ్ళకొస్తుంది, సావిట్లోవాళ్ళు చాటుకు జరగండి అన్నదిట.
20. నిజమాడితే ఉండూరు అచ్చిరాదు.
21. నిజ మాడితే నిష్టూరం.
22. నిజము కుఱచ, బొంకు పొడవు.
23. నిజము చెప్పేది పసిబిడ్డలు, తప్ప తాగినవాళ్ళు.
24. నిజము దేవు డెఱుగు, నీరు పల్ల మెఱుగు.
25. నిజమునకు నింద వచ్చును గానీ, అవమానము రాదు.
26. నిజము నిలకడమీద తెలుస్తుంది.
27. నిజమైన బంగారు నిప్పుకు వెరువదు.
28. నిజమైన ఱంకులాడికి నిష్టలు మెండు.
29. నిట్టలు ద్రొక్కకు పిల్లా! అంటే, నా మగనికి నేను రెండో సంబంధం అన్నదట.
30. నిట్రాళ్ళ యిల్లయినా నిర్వంశంగా ఉండరాదు. (నిర్వంశం=వెదురు లేకుండా, నిస్సంతుగా నని పైకి అర్ధం).
31. నిడదవోలు తీర్పు (రామాయపట్నం మధ్యస్తం).
32. నిత్యకల్యాణం, పచ్చతోరణమన్నట్లు.
33. నిత్య దరిద్రుడు - నిశ్చింత పురుషుడు.
34. నిత్యదుఃఖికి నిమిత్త లుండవు.
35. నిత్యము లేని మగడు నిత్యము బాస చేసాడట.
36. నిత్యమూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు?
37. నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?
38. నిద్రపోయేవాడి గోచి పెట్టుకుంటే, వాడు లేచినంతవరకే దక్కినట్లు.
39. నిద్రపోయేవాడిని లేపవచ్చును గానీ, మేలుకొన్న వాడికి ఏవడు లేపగలడు?
40. నిద్ర పోయేవాడిది కుడిచినంత వరకే దక్కుట.
41. నిద్ర సుఖ మెఱుగదు, ఆకలి రుచి ఎఱుగదు.
42. నిధి అబద్ధం, బుడ్డ నిబద్ధం
43. నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా?
44. నిన్న ఉన్నవాడు నేడు లేడు.
45. నిన్న కుప్పా, నేడు ఆళ్ళు, రేపు కూడు.
46. నిన్న చస్తే రేపటికి మూడు, నేడు చస్తే రేపటికి రెండు.
47. నిన్నటి పరమ మిత్రుడే, నేటి పరమ శత్రువు.
48. నిన్నా మొన్నా వచ్చిన అల్లుని (మగని) తల పగిలినందుకు కాదు, నాళ్ళ నాళ్ళ రోకలి విరిగినందుకు ఏడుస్తున్నాను అన్నదిట.
49. నిన్ను శ్రీవైష్ణవుడు నమిలి తినా!
50. నిప్పుకు నిప్పుకు ఉన్నంత స్నేహం (వాళ్ళిద్దరికి).
51. నిప్పుకు చెదలంటునా?
52. నిప్పుకు నీళ్ళకు ఉన్నంత స్నేహం.
53. నిప్పు త్రొక్కిన కోతివలె.
54. నిప్పుకోడి తల ఇసుకలో దాచి వేటకానికి తాను కనపడ ననుకొన్నట్లు.
55. నిప్పు నడుమ బెట్టిన పూరి కాలకుండునా?
56. నిప్పును కొడీతే రెందగును కానీ నీటిని కొడీతే రెండగునా?
57. నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు.
58. నిప్పు బంగారుని పరీక్షించును, దౌర్భాగ్యము ధీరచిత్తుల పరీక్షించును.
59. నిప్పు రగిలించి నీళ్ళను వెదకినట్లు.
60. నిప్పు రాజినా, మొగము రాజినా మండక మానవు.
61. నిప్పుల బుఱ్ఱకు నీళ్ళ బుఱ్ఱ.
62. నిప్పు లేనిదే పొగ రాజదు (ఉండదు).
63. నిప్పులో ఉప్పు వేసినట్లు (నిప్పుకు ఉప్పు).
64. నిప్పులో నెయ్యి పోసినట్లు.
65. నిప్పులో మొలిచింది ఎండకు చస్తుందా?
66. నిమ్మకు నీరెత్తినట్లు (ఎప్పుడూ మొదలంటా నెమ్ము ఆరరాదు).
67. నియోగిజాతి నిమ్మ కొయ్య జాతి.
68. నియోగి నిక్కులు.
69. నియోగి ముష్టికి బెనారసు సంచి.
70. నియ్యతెంతో బర్కతంత. (నియ్యతి= నడవడి, బర్కతు=కలసివచ్చుట).
71. నియ్యోగిలేని చావడి దయ్యాల కిరవుగాక దాతల కిరవా?
72. నిరక్షరకుక్షి విరూపాక్ష దీక్షితులవారికి, ఇరువదియొక్క భక్ష్యమొక లక్ష్యమా?
73. నిర్ధనుడు మనుపీనుగ.
74. నిర్భాగ్య దామోదరుడికి, అభాగ్యపు అల్లుడు.
75. నిర్భాగ్యునకు నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
76. నిర్వాహకానికి నిముషాలు చాలవుహానీ, చెర్వాకమునకు క్షణం పట్టదు.
77. నిలబడ్డమ్మా! నీకేమమ్మ, కుందనపు బొమ్మ! కూర్చోవమ్మ!
78. నిలకడ నీళ్ళకే నాచు పట్టేది.
79. నిలకడ లేని మాట, నీళ్ళ మూట.
80. నిలకడలేని లింగారెడ్డి పెళ్ళా, కొప్పులో నిప్పుబెట్టుకొని కొరివి పెల్లి అంగడికి వెళ్ళిందట.
81. నిలువడానికి చోటుదొరికితే కూర్చోను దొరికినట్లే.
82. నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు.
83. నిలువ నీడలేదు, పట్ట కొమ్మా లేదు.
84. నివాళిపళ్ళాలు పట్టేవాళ్ళంతా నిషేక ముహూర్తపు పెండ్లికూతుళ్లవుతారా?
85. నివురుకప్పిన నిప్పు వలె (నీఱు గప్పిన నిప్పువలె).
86. నిశ్చితార్ధము నాడే నీలగవలసింది, నాగవల్లి దాకా ఉండటం నా అదృష్టం కాదా అన్నదట (నా మహిమ అన్నదట).
87. నిష్ఠ నీళ్ళపాలు, మంత్రం మాలపాలు.
నీ
88. నీ ఎడమచెయ్యి తియ్యి నా పుఱ్ఱచెయ్యి పెడతాను అన్నట్లు.
89. నీ కంటి నుండే దూలంమరచి ఎదుటివాని కంట నలుసు ఎన్నకు.
90. నీకత్తికి రెండుపక్కలా పదును (రెండువాదరులు).
91. నీకు ఆయన ఏమికావలె? అని అడిగితే, త్రోవలో పోతే " వారు " కావలె అన్నదట.
92. నీకెక్కడ అనుమానమో నాకూ అక్కడనే సందేహం.
93. నీకెక్కడ సంశయమో నాకూ అక్కడనే సందేహం.
94. నీకు ఒక దండం, నీ బువ్వ కొకదండం.
95. నీకు ఓపిక ఉండాలేగానీ నేను కనలేకపోతానా అన్నదట.
96. నీకు నాకు పడదు, రోలెక్కి తలంబ్రాలు పోయి.
97. నీకు బెబ్బెబ్బే, నీయబ్బకూ బెబ్బెబ్బే.
98. నీకు మూతికి మీసాలుంటే నాకు ముంజేతికి వెంట్రుకలున్నవన్నదట (పల్నాటి నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయకునితో).
99. నీకు రానిది, నేను విననిది, లోకములో లేనిది చెప్పమన్నట్లు.
100. నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గు లేదు, ఎప్పటిమాదిరే వచ్చిపోతుండ మన్నదిట (మిండని).